రాష్ట్రపతి సచివాలయం
అమృత్ ఉద్యాన్‌ను ఫిబ్రవరి 3 నుంచి ప్రజలు చూడవచ్చు
प्रविष्टि तिथि:
21 JAN 2026 11:02AM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్‌లో భాగంగా ఉన్న అమృత్ ఉద్యాన్‌ను 2026 ఫిబ్రవరి 3 నుంచి మార్చి నెల 31 మధ్య ప్రజలు చూసి రావచ్చు. వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 10 గంటల మొదలు సాయంత్రం 6 గంటల మధ్య ఈ ఉద్యానవనాన్ని చూడొచ్చు. సోమవారాల్లో ఉద్యానాన్ని మూసివేస్తారు. ప్రతి సోమవారం ఉద్యానంలో నిర్వహణ సంబంధిత పనులు చేపడుతూ ఉండటమే దీనికి కారణం. మార్చి నెల 4న హోలీ కావడంతో, ఉద్యానవనాన్ని మూసి ఉంచుతారు.
ఈ తోట లోపలికి వెళ్లడానికి బుకింగ్ పూర్తి చేసుకోవడం, ప్రవేశించడం ఉచితమే. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా https://visit.rashtrapatibhavan.gov.in/ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా తరలివచ్చే సందర్శకుల కోసం ప్రవేశ స్థానం సమీపంలో సర్వీస్ విజిటర్స్ రిజిస్ట్రేషన్ కియోస్క్‌లను అందుబాటులో ఉంచుతారు.
ఉద్యానాన్ని చూడటానికి వచ్చే వారందరూ నార్త్ అవెన్యూ మార్గం రాష్ట్రపతి భవన్‌కు చేరే చోటుకు దగ్గరగా ఉండే ప్రెసిడెంట్స్ ఎస్టేట్ లో 35 వ నెంబరు గేటు నుంచి లోపలికి వెళ్లి, మళ్లీ అదే గేటు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సందర్శకుల సౌకర్యార్థం, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి 35 వ నెంబరు గేటు వరకు షటిల్ బస్సు సేవలు ఉదయం 9.30 గంటల మొదలు సాయంత్రం 6 గంటల మధ్య ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున అందుబాటులో ఉంటాయి. ‘అమృత్ ఉద్యాన్‌కు షటిల్ సర్వీసు’ అని రాసి ఉన్న బ్యానర్ కలిగి ఉండే బస్సులే షటిల్ బస్సులు అని గుర్తుపట్టవచ్చు.
***
(रिलीज़ आईडी: 2216723)
आगंतुक पटल : 14