మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్-2026లో పీఎం-యువ 3.0 రచయితలతో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాటామంతీ
प्रविष्टि तिथि:
12 JAN 2026 9:17AM by PIB Hyderabad
పీఎం-యువ 3.0 (ప్రధానమంత్రి యువ రచయితల మార్గదర్శకత్వ పథకం)లో భాగంగా ఎంపిక చేసిన 43 మంది రచయితలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయంలో సమావేశమయ్యారు.
ఎంపిక చేసిన రచయితలు ఆరు నెలల మార్గదర్శకత్వ కార్యక్రమంలో భాగంగా తాము త్వరలో తీసుకురానున్న పుస్తకాలకు సంబంధించిన అంశాల్ని ఈ సమావేశంలో క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, ఎంచుకున్న అంశాలను తెలుసుకుని యువ రచయితలను ఆయన అభినందించారు. ఈ పుస్తకాలను కూడా ఇతరులు చదవాలనీ, లోతైన అవగాహనను ఏర్పరుచుకొని, వారు కూడా పుస్తకాలు రాయాలని, ఇందుకోసం ప్రధాని అందిస్తున్న మార్గదర్శకత్వ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాల్సిందిగా ఔత్సాహిక రచయితలను ఉత్సాహపరిచారు.
పరిశోధన సామగ్రిని అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ఆయన స్పష్టం చేశారు. పుస్తకాల్నీ, డిజిటల్ సేవల్నీ నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) ద్వారా అందించాలని ఆయన ఆదేశించారు. ‘వన్ నేషన్, వన్ సబ్‌స్క్రిప్షన్’ (ఓఎన్ఓఎస్) కార్యక్రమంలో భాగంగా రచయితలకు వారికి అవసరమైనవి అందించాలని కూడా ఆయన చెప్పారు. వారు విద్యా సంబంధిత, పరిశోధన సంబంధిత సహకారాన్ని పటిష్ఠపరుచుకోవడానికి, ఎంపిక చేసిన రచయితలకు వారికి సంబంధించిన రంగాలకు చెందిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో అనుబంధాన్ని ఏర్పరచాలనీ, దీని ద్వారా వారి చేతిరాత పుస్తకాలకు మెరుగులు దిద్దొచ్చనీ ఆయన సూచించారు.
యువ రచయితలతో చర్చించడం సంతోషాన్ని కలిగించిందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పీఎం-యువ 3.0 కింద ఎంపిక చేసిన వర్ధమాన రచయితలతో భేటీ కావడంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సమావేశ గదిలో గుమికూడిన రచయితలు భారత్‌లోని వైవిధ్యానికి ప్రతిబింబాలుగా ఉన్నారన్నారు. దేశ నిర్మాణంలో భారతీయ ప్రవాసులు అందిస్తున్న తోడ్పాటు, భారతీయ జ్ఞాన వ్యవస్థ, ఆధునిక భారత రూపకర్తలు వంటి అంశాలపై యువ రచయితలు పుస్తకాలు రాస్తున్నారని ఆయన తెలిపారు. సంస్కృతి, సాంకేతికత, జ్ఞానాన్వేషణతో పాటు జాతీయ దృష్టికోణంపై ఈ కార్యక్రమంలో అరమరికలు లేకుండా చర్చించామనీ, యువ రచయితల్లోని శక్తీ, వారిలో ఉట్టిపడుతున్న ఆత్మవిశ్వాసం, వెల్లివిరుస్తున్న వారి ఆకాంక్షలూ ‘వికసిత్ భారత్’ విషయంలో వారి దృక్పథంపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలపరిచాయన్నారు.
న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్-2026లో భాగంగా జనవరి 10 నుంచి 18 వరకూ భారత్ మండపంలో నిర్వహిస్తున్న జాతీయ శిబిరంలో పీఎం-యువ 3.0 పథకంలో భాగంగా ఎంపిక చేసిన 43 మంది రచయితలు పాల్గొంటున్నారు. ఈ ఫేర్‌ను నేషనల్ బుక్ ట్రస్టుతో కలిసి విద్యా శాఖ నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ 2026 జనవరి 10న ప్రారంభించారు.
భారత్‌లో మేధోపరమైన, సాంస్కృతిక భిన్నత్వానికి అద్దం పడుతూనే యువ రచయితలను తీర్చిదిద్దడంతో పాటు చదవడం, రాయడం, సదవగాహనను కల్పించడం అనే అలవాట్లను ప్రోత్సహించాలనే లక్ష్యాలతో పీఎం-యువ 3.0 పథకాన్ని అమలుచేస్తున్నారు.
కార్యక్రమంలో ఉన్నత విద్య కార్యదర్శి శ్రీ వినీత్ జోషీ, ఎన్బీటీ-ఇండియా డైరెక్టరు శ్రీ యువ్‌రాజ్ మాలిక్, ప్రధాన్‌మంత్రీ సంగ్రహాలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ప్రియాంక మిశ్ర, ఎన్బీటీ-ఇండియా ముఖ్య సంపాదకుడు, జాయింట్ డైరెక్టరు శ్రీ కుమార్ విక్రమ్, ప్రధాన్‌మంత్రీ సంగ్రహాలయ జాయింట్ డైరెక్టరు శ్రీ రవి కె. మిశ్ర పాల్గొన్నారు.
(रिलीज़ आईडी: 2215034)
आगंतुक पटल : 3