ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్‌లో ‘భారత్-జర్మనీ సీఈఓ ఫోరమ్‌’ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 12 JAN 2026 9:17PM by PIB Hyderabad

మాననీయ ఛాన్సలర్ మెర్జ్, రెండు దేశాల వాణిజ్య ప్రముఖులారా..

అందరికీ నమస్కారం!

భారత్‌-జర్మనీ ‘సీఈఓ’ల ఫోరం సమావేశంలో పాలుపంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండగా, ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అటు వజ్రోత్సవం (ప్లాటినం జూబ్లీ), ఇటు రజతోత్సవం (సిల్వర్‌ జూబ్లీ) కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జంట విశేషాల కీలక సందర్భంలో ఏర్పాటైన ఈ సమావేశం ప్లాటినం మెరుపులకు వెండి అంచు తొడిగినట్టుగా ఉంది.

మిత్రులారా!

భారత్‌-జర్మనీల భాగస్వామ్యం ఉమ్మడి విలువలు-పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా పెనవేసుకున్న బంధం. రెండు దేశాల్లోని ప్రతి రంగంలోనూ పరస్పర ప్రయోజనకర అవకాశాలెన్నో ఉన్నాయి. మా ‘ఎంఎస్‌ఎంఈ’లు, జర్మనీ ‘మిట్టెల్‌స్టాండ్’ల మధ్య తయారీలోనే కాకుండా సమాచార సాంకేతికత, సేవా రంగాల్లో సహకారం వేగంగా విస్తరిస్తోంది. అలాగే ఆటోమోటివ్, ఇంధనం, యంత్రాలు, రసాయన రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాలు సహా పరిశోధన రంగంలో సహకారం సరికొత్త సాంకేతికతలకు రూపమిస్తున్నాయి. బలమైన మన సంబంధాలు వాణిజ్య రంగాన ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తున్న నేపథ్యంలో దీని పరిమాణం నేడు దాదాపు 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించింది.

మిత్రులారా!

ప్రపంచం వేగంగా మారిపోతున్న నేపథ్యంలో కీలక సాంకేతికతలు, మూలధన యంత్ర సామాగ్రిపై పరాధీనత నేడు ఒక ఆయుధంగా మారిపోతుండటం కూడా మనం చూస్తున్నాం. అయితే, స్వామి వివేకానంద జయంతి శుభ సందర్భంలో మనం ఆయన ఆలోచనా దృక్పథం, సందేశాల నుంచి స్ఫూర్తి పొందడం అవశ్యం. ఆయన సందేశం ఎంత స్పష్టమైనదో చూడండి: ఆత్మవిశ్వాసం, స్వావలంబన, కర్తవ్య నిబద్ధత జీవన సూత్రాలుగా ప్రపంచంతో అనుసంధానం కాగలిగేదే బలమైన దేశం. నేటి ప్రపంచ పరిస్థితులలో ఈ సందేశానికి ఎంతో ఔచిత్యం ఉంది. ఈ ఆలోచన ధోరణికి అనుగుణంగా ప్రపంచం కోసం విశ్వసనీయ, పునరుత్థాన సరఫరా వ్యవస్థల బలోపేతం మన ఉమ్మడి బాధ్యత. ఈ కృషిలో భారత్‌-జర్మనీ వంటి విశ్వసనీయ మిత్రుల భాగస్వామ్యం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.

మిత్రులారా!

ఛాన్సలర్ మెర్జ్ తన తొలి ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌ను ఎంచుకోవడం ముదావహం. జర్మనీ వైవిధ్యీకరణ వ్యూహంలో భారత్‌ కీలక పాత్రకు ఇది నిదర్శనం మాత్రమే కాదు... ఈ దేశంపై జర్మనీ నమ్మకానికి విస్పష్ట సంకేతం. ఈ విశ్వసనీయతకు అనుగుణంగా మేమివాళ అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. తొలుత మా నిత్యనూతన ఆర్థిక భాగస్వామ్యాన్ని అనంతంగా విస్తరించాలని తీర్మానించాం. అంటే- సంప్రదాయ ఆర్థిక రంగాలు సహా వ్యూహాత్మక రంగాల పరంగానూ సహకారం మరింత విస్తృతమవుతుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఉమ్మడి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన చేశాం. ఈ రంగంలో సహ-ఆవిష్కరణ, ఉత్పత్తి దిశగా ఉభయ దేశాల కంపెనీలకు విధానపరంగా ఇది స్పష్టమైన మద్దతిస్తుంది. అలాగే అంతరిక్ష రంగంలో సహకారానికి కూడా కొత్త అవకాశాలు కల్పిస్తాం. రెండోది... విశ్వసనీయ భాగస్వామ్యాన్ని సాంకేతిక భాగస్వామ్యంగా రూపొందించేందుకు మేం అంగీకారానికి వచ్చాం. ప్రపంచంలోని రెండు ప్రధాన ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థల నడుమ కీలక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేస్తాం. సెమీకండక్టర్ల రంగంలో ఇప్పటికే పరస్పర భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో పవర్ ఎలక్ట్రానిక్స్, బయోటెక్, ఫిన్‌టెక్, ఫార్మా, క్వాంటం, సైబర్‌ రంగాల్లోనూ అపార అవకాశాలు ఉన్నాయి. మూడోది... భారత్‌-జర్మనీ భాగస్వామ్యం పరస్పర ప్రయోజనకరమేగాక, ప్రపంచానికీ ఉపయోగకరమనే అంశంపై మనందరికీ పూర్తి స్పష్టత ఉంది. ఆ మేరకు గ్రీన్ హైడ్రోజన్, సౌర, పవన, జీవ-ఇంధనం వగైరాల్లోనూ ప్రపంచంలో అగ్రస్థానానికి భారత్‌ చేరువలో ఉంది. కాబట్టి- సౌర ఘటాలు, ఎలక్ట్రోలైజర్లు, బ్యాటరీలు, విండ్ టర్బైన్ల తయారీలో జర్మన్ కంపెనీలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇ-మొబిలిటీ నుంచి ఆహారం, ఆరోగ్య భద్రత వరకూ ప్రపంచం కోసం మనం సంయుక్తంగా పరిష్కారాలను రూపొందించవచ్చు. ఇక కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో భారత్‌ దృక్కోణం ఎంతో సమగ్రమైనది. దీన్ని జర్మనీ ‘ఏఐ’ వ్యవస్థతో అనుసంధానిస్తే మానవాళి-కేంద్రక డిజిటల్ భవితకు మనం భరోసా ఇవ్వగలం.

మిత్రులారా!

జర్మనీ పారిశ్రామిక రంగంలో ఆవిష్కరణ-ఉత్పాదకతలను భారత ప్రతిభా నిధి కొత్త మలుపు తిప్పగలదు. ఇటీవల... ముఖ్యంగా హైటెక్ రంగంలో నైపుణ్య చైతన్యం వేగంగా విస్తరిస్తోంది. అందువల్ల భారత ప్రతిభను సద్వినియోగం చేసుకోవడంతోపాటు నైపుణ్యం, ఆవిష్కరణ, పారిశ్రామిక సంబంధాల బలోపేతం దిశగా జర్మనీ కంపెనీలను మేం ప్రోత్సహిస్తాం.

మిత్రులారా!

ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేటి పరిస్థితులలో భారత్‌ 8 శాతానికిపైగా వృద్ధితో దూసుకెళ్తోంది. ఇందుకు ఏదో ఒకటి కారణం కాదు... దీని వెనుక నిరంతర, సమగ్ర సంస్కరణలు ఉన్నాయి. రక్షణ, అంతరిక్షం, మైనింగ్ లేదా అణుశక్తి వగైరా ప్రతి రంగంలో ప్రైవేట్ రంగానికీ ప్రోత్సాహం లభిస్తోంది. నిబంధనల అనుసరణ భారం నిరంతరం తగ్గుతూ.. వాణిజ్య సౌలభ్యం మెరుగవుతోంది. ఈ దిశగా సాగుతున్న కృషి ప్రపంచంలో ఇవాళ భారత్‌ను వృద్ధి, ఆశావాదానికి ప్రతీకగా మార్చింది. భారత్‌-ఐరోపా యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా త్వరలో సాకారమవుతుంది. తద్వారా మన రెండు దేశాల వాణిజ్యం, పెట్టుబడి, భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం ఆరంభమవుతుంది. అంటే- మీ ముందున్న మార్గం స్పష్టమైనది గనుక భారత్‌ స్థాయి, వేగంతో సంధానం దిశగా జర్మనీ కచ్చితత్వం-ఆవిష్కరణలకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీరు భారత్‌లో ఉత్పత్తి చేయడంతోపాటు దేశీయ డిమాండ్‌ను పూర్తిగా వాడుకుంటూనే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎగుమతులు చేసుకోవచ్చు.

మిత్రులారా!

సుస్థిర విధానాలు, పరస్పర విశ్వాసం, దీర్ఘకాలిక దృక్పథం ఆలంబనగా జర్మనీతో సహకారాన్ని భారత్‌ విస్తృతం చేస్తుందని మా ప్రభుత్వం తరపున మీకు హామీ ఇస్తున్నాను. సంక్షిప్తంగా నా సందేశం ఏమిటంటే- భారత్‌ సంకల్పం.. సామర్థ్యాలతో సంసిద్ధంగా ఉంది. కాబట్టి, మనం నవ్యావిష్కరణలకు కృషి చేద్దాం.. పెట్టుబడులు పెడదాం... ఉమ్మడిగా ముందుకెళ్దాం. అంతేకాదు... భారత్‌, జర్మనీ దేశాలకు మాత్రమేగాక ప్రపంచ భవిష్యత్తుకు తగిన సుస్థిర పరిష్కారాలను రూపొందిద్దాం!

డంకే షాన్‌!

అనేకానేక ధన్యవాదాలు


(रिलीज़ आईडी: 2215017) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada