సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ‘‘ఇన్‌స్పైరింగ్ ఇన్నోవేటర్స్’’ పై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా, నైపుణ్యం పెంచే కార్యక్రమంలో భాగంగా దేశంలో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణల వ్యవస్థపై రూపొందించిన ఎనిమిది లఘు చిత్రాలు
प्रविष्टि तिथि:
13 JAN 2026 5:49PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సంయుక్తంగా చేపట్టిన ‘ఇన్‌స్పైరింగ్ ఇన్నోవేటర్స్- నయే భారత్ కి నయీ పెహచాన్’ అనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నేడు విజయవంతంగా ముగిసింది. నెట్‌ఫ్లిక్స్ సహకారంతో గ్రాఫిటీ స్టూడియోస్ భాగస్వామ్యంతో అమలు చేసిన ఈ కార్యక్రమం.. దేశంలోని ఆవిష్కరణ రంగం, సృజనాత్మక రంగాలను ఒకే వేదికపైకి చేర్చింది. సామాజిక ప్రాధాన్యత గల ఆవిష్కరణలను కథలు చెప్పడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విద్యార్థులకు క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.
సామాజిక ప్రభావాన్ని సృష్టించే ఆవిష్కరణలకు కృషి చేసినందుకు ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం గుర్తించిన ఎనిమిది భారతీయ అంకుర సంస్థల సహకారాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, చిత్కారా యూనివర్సిటీ, సత్యజిత్ రే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ తదితర ఎనిమిది విశ్వవిద్యాలయాల విద్యార్థులు రూపొందించిన ఎనిమిది లఘు యానిమేటెడ్ చిత్రాల ద్వారా ఈ స్టార్టప్‌లను పరిచయం చేశారు. నెట్‌ఫ్లిక్స్, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థతో (ఎన్‌ఎఫ్‌డీసీ)కలిసి నిర్వహిస్తున్న ‘వాయిస్‌బాక్స్’ అనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ చిత్రాలకు సంబంధించిన వాయిస్ ఓవర్‌ను రికార్డ్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ ఆధ్వర్యంలో కథనశైల, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా రూపొందించిన ఈ కార్యక్రమం.. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన 26 మంది విద్యార్థులకు ప్రత్యక్ష సృజనాత్మక అనుభవాన్ని అందించింది. ఇందులో పాల్గొన్న వారిలో 50 శాతం మంది మహిళలు కాగా, పలువురు విద్యార్థులు వివిధ నగరాల నుంచి వచ్చారు. విద్యార్థులకు అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ),గ్రాఫిటీ స్టూడియోస్‌కు చెందిన నిపుణులు మార్గదర్శకత్వం వహించారు. దీని ద్వారా వారు పరిశ్రమలో అనుసరించే ప్రక్రియలను ప్రత్యక్షంగా, వాస్తవ అనుభవంతో తెలుసుకునే అవకాశం పొందారు.
ఈ కార్యక్రమానికి రూపొందించిన అసలు గీతాన్ని శంకర్ మహదేవన్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఆలపించగా.. అది ఈ కార్యక్రమానికి సాంస్కృతిక, సృజనాత్మక కోణాన్ని మరింత పెంచింది.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఉన్న గొప్ప కథన సంప్రదాయాలపైఆధారపడిన నేటి సృజనకర్తలు.. భారతీయ కథలను ప్రపంచ ప్రేక్షకుల వరకు తీసుకెళ్లే అవకాశాన్ని పొందుతున్నారు. మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయడం, భవిష్యత్తుకు అనుకూలమైన సృజనాత్మక వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వారికి తోడ్పడుతున్నాయి. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశంలో సృష్టించి, ప్రపంచానికి అందించడానికి ఇదే సరైన సమయం. సమాచారం, సృజనాత్మకత, సంస్కృతి భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భాగాలుగా ఎదుగుతున్నాయి. సృజనకర్తలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావంతో కథనకళ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో.. ఇన్‌స్పైరింగ్ ఇన్నోవేటర్స్ వంటి కార్యక్రమాలు సమాజ సేవలో సృజనాత్మకతను ఎలా వినియోగించవచ్చో చాటిచెబుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ ఇలా అన్నారు.‘‘సామాజిక ప్రాముఖ్యత కలిగిన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, నైపుణ్యాలను, విజ్ఞాన మార్గాలను బలోపేతం చేసే విధంగా ‘‘ఇన్‌స్పైరింగ్ ఇన్నోవేటర్స్’’ కార్యక్రమాన్ని రూపొందించాం. సృజనాత్మక ప్రక్రియ ద్వారా అంకుర సంస్థలు,విద్యార్థులను ఒకచోట చేర్చడం, అలాగే నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ, పారిశ్రామిక వేత్తల మార్గదర్శకత్వంతో నైపుణ్య శిక్షణ అందించడం విశేషం. ప్రభుత్వ విధానాల లక్ష్యాలను, ప్రతిభా వికాసం, వాస్తవ ప్రపంచ అన్వయంతో అనుసంధానిస్తూ దేశ ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడంలో ఈ కార్యక్రమం ఒక సమగ్ర దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది’’.
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ.. ‘‘అసాధారణమైన ఆవిష్కరణలకు సాక్ష్యంగా భారత్ నిలుస్తోంది. సామాజిక ఆవిష్కర్తలు తమ ప్రభావవంతమైన, లక్ష్య ఆధారిత పరిష్కారాల ద్వారా రోజువారీ సవాళ్లను పరిష్కరిస్తూ ఈ మార్పును ముందుకు తీసుకెళ్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ‘‘ఇన్‌స్పైరింగ్ ఇన్నోవేటర్స్’’ కార్యక్రమం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. కథలు చెప్పడం అనేది కేవలం కంటెంట్ సృష్టించడమే కాకుండా అది ఒక అర్థవంతమైన నైపుణ్యాభివృద్ధి, సాధికారత వేదికగా ఎలా మారుతుందో ఇది నిరూపించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతుల విశ్వాసాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నిజంగా సృజనకారుల, కథల యుగం. కృత్రిమ మేధ ఆధారిత కథనాలు రూపుదిద్దుకుంటున్న ఈ కాలంలో తదుపరి తరం వృద్ధికి, పురోగతికి తోడ్పడే నూతన సాంకేతికతలను అందించడం చాలా ముఖ్యం. దేశానికి చెందిన అర్థవంతమైన, ఉద్దేశ్యపూర్వకమైన కథలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ కావడం ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.’’ అని తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ మహిమ కౌల్ మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘నెట్‌ఫ్లిక్స్‌లో మేం భారతదేశంలోని యువ, సృజనాత్మక వ్యవస్థకు నైపుణ్య శిక్షణ, నైపుణ్యాభివృద్ధిని అందించడానికి కట్టుబడి ఉన్నాం. నిజమైన సామాజిక విలువను అందించే ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించాలనే ఉమ్మడి లక్ష్యానికి ‘ఇన్‌స్పైరింగ్ ఇన్నోవేటర్స్’ ఒక నిదర్శనం.
మంథన్ ద్వారా సాధికారిత పొందిన ఆవిష్కరణ కథలు
మంథన్ అనేది దేశవ్యాప్తంగా అధిక ప్రభావం కలిగిన ఆవిష్కరణలను గుర్తించి, ఎంపిక చేసి, వాటిని విస్తరణ అవకాశాలతో అనుసంధానించే జాతీయ డిజిటల్ వెన్నుముకగా పనిచేస్తోంది. ఈ మంథన్ వేదిక ద్వారా ఎనిమిది సామాజిక ఆవిష్కరణ అంకుర సంస్థలను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎనిమిది చిత్రాలు కింద ఉన్నాయి.
1. నియోమోషన్
అంగవైకల్యం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా కదలడానికి, గౌరవప్రదమైన జీవనోపాధిని పొందడానికి వీలుగా వారి అవసరాలకు తగ్గట్టుగా తయారుచేసిన వీల్‌చైర్లు, మొబిలిటీ పరిష్కారాలను రూపొందిస్తున్న ఆవిష్కర్తల ప్రస్థానాన్ని ఈ చిత్రం వివరిస్తుంది.
2. బ్లైండ్ విజన్ ఫౌండేషన్
దృష్టి లోపం ఉన్నవారు పుస్తకాలు చదవడానికి, దారి తెలుసుకోవడానికి, ముఖాలను గుర్తించడానికి, ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా జీవించడానికి తోడ్పడే ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ (కళ్లద్దాల) గురించి ఈ చిత్రం తెలియజేస్తుంది.
3. హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ – ఇన్నౌమేషన్
గొంతు క్యాన్సర్ చికిత్సలో భాగంగా స్వరపేటికను తొలగించిన వారు తిరిగి మాట్లాడటానికి, వారి గౌరవాన్ని, జీవనోపాధిని పునరుద్ధరించడానికి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన వాయిస్ ప్రోస్థెసిస్ (కృత్రిమ స్వరపేటిక) కథను ఇది చెబుతుంది.
4. ఇన్నోగిల్
భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర భద్రత, జలచర వ్యవసాయ ఉత్పాదకత, సముద్ర తీర రక్షణ, విపత్తు పర్యవేక్షణను మెరుగుపరిచే కృత్రిమ మేధ, నీటిలో పనిచేసే సాంకేతికతలను ఈ చిత్రం తెలియజేస్తుంది.
5. కల్టీవేట్
రైతులు నీటిని ఆదా చేయడానికి, దిగుబడిని పెంచడానికి, వాతావరణ మార్పులను తట్టుకోగల ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి సహాయపడే కృత్రిమ మేధఆధారిత స్వయంప్రతిపత్తి గల సాగునీటి వ్యవస్థల గురించి ఈ చిత్రం వివరిస్తుంది.
6. వివోయిస్ ల్యాబ్స్
చెత్త సేకరణ, వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్, గౌరవప్రదమైన పారిశుధ్య పనులు, సర్క్యులర్ ఎకానమీ పరిష్కారాల ద్వారా నగరాలను మారుస్తున్న సాంకేతికత ఆధారిత వ్యర్థాల నిర్వహణ ప్రస్థానాన్ని ఇది తెలియజేస్తుంది.
7. గ్రీన్‌జైన్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్
పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, కార్బన్ డై ఆక్సైడ్‌ను విలువైన బయో వనరులుగా స్థిరంగా మార్చే మైక్రో ఆల్గే-ఆధారిత కార్బన్ శోషణ ఆవిష్కరణలను ఈ చిత్రం విశ్లేషిస్తుంది.
8. ఎల్‌సీబీ ఫెర్టిలైజర్స్
వ్యవసాయ , పారిశ్రామిక వ్యర్థాలను బయో-నానో ఎరువులుగా మార్చడం ద్వారా నేల ఆరోగ్యాన్ని, రైతుల ఆదాయాన్ని, స్థిరమైన వ్యవసాయాన్ని మెరుగుపరిచే విధానాన్ని ఈ చిత్రం చూపిస్తుంది.
ఈ ఏనిమిది చిత్రాలను Netflix India’s YouTube channel లో చూడవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ గురించి..
నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ అనేది వినోద రంగంలో తగినంత ప్రాతినిధ్యం లేని వర్గాల కోసం కొత్త అవకాశాలను సృష్టించడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేక ప్రయత్నం. టెలివిజన్, చలనచిత్ర పరిశ్రమల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుంది. బయట సంస్థలకు మద్దతు ఇవ్వడంతో పాటు, ఈ ఫండ్ నెట్‌ఫ్లిక్స్ స్వయంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలకు కూడా తోడ్పాటునందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
(रिलीज़ आईडी: 2215004)
आगंतुक पटल : 4