ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీమద్ విజయరత్న సుందర సూరీశ్వర్‌జీ మహరాజ్ 500వ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధాని సందేశం
प्रविष्टि तिथि:
11 JAN 2026 1:48PM by PIB Hyderabad
జై జినేంద్ర!
ఈ పవిత్ర సమయంలో ముందుగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయిన పూజ్య భువనభాను సూరీశ్వర్ జీ మహరాజ్ పాదపద్మాలకు ప్రణమిల్లుతున్నాను. ప్రశాంతమూర్తి సువిశాల్ గచ్చాధిపతి పూజ్య శ్రీమద్ విజయ రాజేంద్ర సూరీశ్వర్ జీ మహరాజ్ గారికి, పూజ్య గచ్చాధిపతి శ్రీ కల్పతరు సూరీశ్వర్ జీ మహరాజ్ గారికి, సరస్వతీ కృపా పాత్ర పరమ పూజ్య ఆచార్య భగవంత్ శ్రీమద్ విజయ రత్న సుందరసూరీశ్వర్ జీ మహరాజ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన సాధుసంతులందరికీ... గౌరవపూర్వక వందనాలు.
శ్రీ కుమార్‌పాల్‌భాయ్ షా, కల్పేశ్‌భాయ్ షా, సంజయ్‌భాయ్ షా, కౌశిక్‌భాయ్ సంఘ్వీ సహా ఉర్జా మహోత్సవ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. వారికి నా శుభాకాంక్షలు. పూజ్య సాధువులారా.. శ్రీమద్ విజయరత్న సుందర సూరిశ్వర్‌జీ మహరాజ్ గారి 500వ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నేడు మనకు లభించింది. జ్ఞానాన్ని ఆయన కేవలం గ్రంథాలకే పరిమితం చేయలేదు.. స్వయంగా ఆచరించి, ఇతరులు కూడా తమ జీవితాల్లో ఆ స్ఫూర్తిని పొందేలా ప్రేరణనిచ్చారు. నిగ్రహం, నిరాడంబరత, స్పష్టతల విశిష్ట సమ్మేళనం ఆయన వ్యక్తిత్వం. ఆయన రాస్తే.. అనుభవాల గాఢత ఆ రాతల్లో కనిపిస్తుంది. ఆయన మాట్లాడితే.. ఆ స్వరంలో కారుణ్య భావన ప్రతిధ్వనిస్తుంది. ఆయన మౌనం కూడా మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆయన 500వ గ్రంథం ‘ప్రేమ్ను విశ్వ, విశ్వనో ప్రేమ్ (ప్రేమమయ ప్రపంచం, ప్రపంచంపట్ల ప్రేమ)’ శీర్షికే ఎన్నెన్నో అంశాలను మనకు చెబుతోంది. మన సమాజం, మన యువత, యావత్ మానవాళికీ ఈ రచన వల్ల ప్రయోజనం ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా, ఉర్జా మహోత్సవం ప్రజల్లో సరికొత్త ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. మీ అందరికీ నా అభినందనలు.
మిత్రులారా.. మహారాజ్ సాహెబ్ 500 రచనలు లెక్కలేనన్ని జ్ఞాన రత్నాలతో నిండిన మహా సముద్రం వంటివి. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరళమైన, ఆధ్యాత్మిక పరిష్కారాలను ఇవి చూపుతాయి. కాలాన్నీ, పరిస్థితులనూ బట్టి.. ప్రతి గ్రంథమూ ఓ దారి దీపంలా పనిచేస్తుంది. అహింస, అపరిగ్రహం, అనేకతా దృక్పథం వంటి మన తీర్థంకరులు, పూర్వ ఆచార్యుల బోధనలతోపాటు.. ప్రేమ, సహనం, సామరస్యం వంటి విలువలు ఆధునిక, సమకాలీన రూపంలో ఈ రచనల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా నేడు.. విభేదాలూ, సంఘర్షణలతో ప్రపంచం సతమతమవుతున్న వేళ, ‘ప్రేమ్ను విశ్వ, విశ్వనో ప్రేమ్’ అన్నది కేవలం గ్రంథం మాత్రమే కాదు.. అదొక మంత్రం. ఈ మంత్రం మనకు ప్రేమ శక్తిని పరిచయం చేస్తుంది. నేడు ప్రపంచం ఎంతో ఆత్రుతగా వెతుకుతున్న శాంతి, సామరస్యాల దిశగా దారిచూపుతుంది.
మిత్రులారా,
‘పరస్పరోపగ్రహో జీవనం’ – అంటే ప్రతి ప్రాణీ మరొక ప్రాణితో అనుసంధానమై ఉంటుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే.. వ్యష్టి నుంచి సమష్టి దిశగా మన దృక్పథం విస్తరిస్తుంది. మనం వ్యక్తిగత ఆశయాలకు అతీతంగా ఎదిగి.. సమాజం, దేశం, మానవాళి లక్ష్యాల గురించి ఆలోచించడం మొదలుపెడతాం. ఇదే స్ఫూర్తితో ‘నవకార్ మంత్ర దినోత్సవం’లో నేను మీతో కలిసి పాల్గొన్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ చారిత్రక సందర్భంలో నాలుగు శాఖలూ ఏకమయ్యాయి. నేను తొమ్మిది విన్నపాలూ, తొమ్మిది తీర్మానాలూ చేశాను. మరోసారి వాటిని స్మరించుకునేందుకు నేటి కార్యక్రమం ఓ మంచి అవకాశం.
మొదటి సంకల్పం – నీటిని ఆదా చేయడం.
రెండోది – తల్లి పేరు మీద ఒక మొక్క నాటడం.
మూడోది – స్వచ్ఛతా ఉద్యమం.
నాలుగోది – స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం.
అయిదోది – భారత దర్శనం.
ఆరోది – సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించడం.
ఏడోది – ఆరోగ్యకరమైన జీవనశైలిని స్వీకరించడం.
ఎనిమిదోది – యోగా, క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం.
తొమ్మిదోది – పేదలకు సాయం చేసేందుకు కట్టుబడి ఉండటం.
మిత్రలారా,
నేడు భారత్ ప్రపంచంలో అత్యంత యువ దేశాల్లో ఒకటి. మన యువశక్తి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తూనే.. సాంస్కృతిక మూలాలను కూడా బలోపేతం చేస్తోంది. మహరాజ్ సాహెబ్ వంటి సాధువుల మార్గనిర్దేశం, వారి సాహిత్యం, తీక్షణమైన ఆధ్యాత్మిక సాధనతో నిండిన వారి మాటలు ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తాయి. మరోసారి ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ.. 500వ గ్రంథావిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆయన భావాలు భారతీయ మేధో, నైతిక, మానవీయ ప్రస్థానాన్ని నిరంతరం తేజోవంతం చేస్తూనే ఉంటాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
మీరు నన్ను మన్నించాలి. నిజానికి నేను స్వయంగా అక్కడికి రావాలని భావించాను. దాని కోసం చాలా కాలం కిందటే ప్రణాళిక వేసుకున్నాను. కానీ మీకు తెలుసు.. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను మీ వద్దకు వచ్చి, మిమ్మల్ని దర్శించుకోలేకపోయాను. అయినప్పటికీ, మహరాజ్ సాహెబ్ దయతో నా ఇబ్బందిని అర్థం చేసుకున్నారు. ఈ వీడియో సందేశం ద్వారా కార్యక్రమంలో పాల్గొని.. మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడటానికి నాకు అవకాశాన్నిచ్చారు. ఈ విషయంలో కూడా ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
జై జినేంద్ర!
(रिलीज़ आईडी: 2213630)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam