మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
తమిళం, ఒడియా, మలయాళం, తెలుగు, కన్నడ, భారతీయ సంజ్ఞా భాష సహా ప్రాచీన భారతీయ భాషల్లో 55 సాహిత్య రచనలను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
प्रविष्टि तिथि:
06 JAN 2026 5:33PM by PIB Hyderabad
ప్రాచీన భారతీయ భాషల్లో రచించిన 55 సాహిత్య రచనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) ఆధ్వర్యంలోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ రూపొందించిన 41 పుస్తకాలు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) విడుదల చేసిన 13 పుస్తకాలు సహా తిరుక్కురల్ సంజ్ఞా భాషా సిరీస్ వీటిలో భాగంగా ఉన్నాయి.
ఈ సేకరణలో భారతీయ సంజ్ఞా భాషలోని తిరుక్కురల్ వివరణ సహా కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా, తమిళ భాషల్లోని ముఖ్యమైన పరిశోధనా గ్రంథాలు ఉన్నాయి. భారత భాషా వారసత్వాన్ని విద్య, పరిశోధనలకు కేంద్రంగా ఉంచడానికి... భారత సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడానికి... శాస్త్రీయ జ్ఞాన సంప్రదాయాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి జరుగుతున్న జాతీయస్థాయి కృషిలో ఈ ప్రచురణలు కీలకమైనవి.
ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని భారతీయ భాషలను బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి విస్తృతంగా కృషి చేస్తోందన్నారు. షెడ్యూల్డ్ జాబితాకి మరిన్ని భాషలను చేర్చడం, శాస్త్రీయ గ్రంథాలను భారతీయ భాషల్లోకి అనువదించడం, భారతీయ భాషల్లో విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలనూ ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. భారతీయ భాషల విధ్వంసానికి గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కాల పరీక్షకు నిలిచాయని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని... అపారమైన భాషా వైవిధ్యం కలిగిన దేశమని... భారత చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య సంపదను కాపాడటం, భవిష్యత్ తరాలకు దాని గురించి అవగాహన కల్పించడం సమాజం బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. భాషలను ఏకీకృత శక్తిగా పేర్కొన్న ఆయన... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ అన్ని భారతీయ భాషలూ జాతీయ భాషలేనని స్పష్టంగా చెబుతుంటారని కేంద్ర మంత్రి తెలిపారు.
తిరుక్కురల్ సారాంశాన్ని సంజ్ఞా భాషలో చేర్చడం వల్ల అందరికీ జ్ఞాన ప్రాప్తి కలిగించాలనే సమగ్ర భారత్ దార్శనికతకు బలం చేకూరుతుందని శ్రీ ప్రధాన్ తెలిపారు. ఈ అద్భుత రచనల విడుదల భారత మేధో సాహిత్యానికి విలువైన సహకారంగా ఆయన పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానం-2020 భారతీయ భాషల్లో విద్యా దార్శనికతను ముందుకు తీసుకువెళుతుందని ఆయన తెలిపారు. సమాజాన్ని అనుసంధానించే మాధ్యమంగా భాష పనిచేస్తూ... భిన్నత్వంలో ఏకత్వానికి ఒక శక్తిమంతమైన ఉదాహరణగా భారత్ నిలుస్తోందన్నారు. వలసవాద యుగం నాటి మెకాలే మనస్తత్వానికి భిన్నంగా... భారతీయ నాగరికత ఎల్లప్పుడూ భాషలను సంభాషణ, సాంస్కృతిక సామరస్యాలకు వారధిగా భావిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
భారతీయ భాషలపై భారతీయ భాషా సమితి, ఎక్సలెన్స్ సెంటర్లు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ సంస్థలు భారతీయ భాషలను ప్రోత్సహించడానికి చేస్తున్న కృషి పట్ల శ్రీ ప్రధాన్ తన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఉన్నత విద్య) శ్రీ వినీత్ జోషి... భారతీయ భాషా సమితి చైర్మన్ శ్రీ చాము కృష్ణ శాస్త్రి... సీఐఐఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ శైలేంద్ర మోహన్... సీఐసీటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ చంద్రశేఖరన్... సలహాదారు (కాస్ట్) శ్రీమతి మన్మోహన్ కౌర్, విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇలా పేర్కొన్నారు:
‘‘ఢిల్లీలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం... భారతీయ భాషా సంస్థ, మైసూరు ప్రచురించిన ప్రాచీన సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ప్రసిద్ధి చెందిన ఎనిమిది గ్రంథాలను ఆవిష్కరించాను’’.
***
(रिलीज़ आईडी: 2212285)
आगंतुक पटल : 7