జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ భారత్ మిషన్- గ్రామీణ కింద విసర్జక వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించిన కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్


స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద చేపట్టిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలను ప్రశంసించిన జలశక్తి శాఖా మంత్రి సి.ఆర్. పాటిల్... విస్తృత, సుస్థిర గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాలకు పిలుపు

प्रविष्टि तिथि: 07 JAN 2026 11:16AM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద దేశవ్యాప్తంగా ‘విసర్జక వ్యర్థాల నిర్వహణ’ కోసం అవలంబిస్తున్న పద్ధతులపై చర్చించేందుకు.. పలు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాలతో 2026 జనవరి 6న జలశక్తి మంత్రిత్వ శాఖ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సమావేశానికి గౌరవ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి. ఆర్. పాటిల్ అధ్యక్షత వహించారు. జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న, తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి శ్రీ అశోక్ కె.కె. మీనా, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ ఐశ్వర్య సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీల సీఈవోలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పంచాయతీ సభ్యులతోపాటు రాష్ట్రాల మిషన్ డైరెక్టర్లు, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నోడల్ విభాగాల సీనియర్ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో విజయవంతమైన, విస్తృతంగా చేపట్టిన విసర్జక వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అందరికీ తెలియజేయడం, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు జిల్లాల మధ్య పరస్పర అవగాహనను బలోపేతం చేయడం, టాయిలెట్ల నిర్మాణానికే పరిమితం కాకుండా.. పారిశుద్ధ్య వ్యవస్థపై సంపూర్ణంగా దృష్టి సారిస్తూ సురక్షిత పారిశుద్ధ్య ప్రాధాన్యాన్ని చాటడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.

గుజరాత్, సిక్కిం, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, లడాఖ్, త్రిపుర ప్రతినిధులు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు. విసర్జక వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లలో అంతరాయం లేకుండా కార్యకలాపాలు, నిర్వహణ కోసం... స్వయం సహాయక బృందాలు, పంచాయతీలతో కలిసి స్థానికంగానే వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, తాము చేపట్టిన సామాజిక భాగస్వామ్య విధానాలు, కార్యక్రమాలను వివరించారు. అలాగే విసర్జక వ్యర్థాల నిర్వహణ కోసం పట్టణ - గ్రామీణ అనుసంధానాన్ని కూడా వారు వివరించారు. విసర్జక వ్యర్థాలు, మురుగునీటి సురక్షిత సేకరణ, రవాణాశుద్ధి, పునర్వినియోగ ప్రయత్నాలపైనా చర్చించారు. ఈ పద్ధతుల ద్వారా స్వచ్ఛతతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి.

సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పలు వినూత్న, విస్తరణకు అవకాశమున్న ‘విసర్జక వ్యర్థాల నిర్వహణ’ పద్ధతులను రాష్ట్రాలు వివరించాయి. ఒడిశాలోని ఖోర్ధా జిల్లాలో ఓ మంచి ఉదాహరణను గమనించవచ్చు. అక్కడ ట్రాన్స్‌జెండర్లతో కూడిన ఓ స్వయం సహాయక బృందం నేతృత్వంలో విసర్జక వ్యర్థాల నిర్వహణ ప్లాంటు (ఎఫ్ఎస్‌టీపీ) కార్యకలాపాలు, నిర్వహణ జరుగుతున్నాయి. సమ్మిళితమైన, అంతరాయం లేని పారిశుద్ధ్య సేవలను అందించడమెలాగో ఇది వివరిస్తోంది. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాన్నీ అందించింది. అత్యవసర సేవలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవడం, సామాజిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం, అణగారిన వర్గాల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడంలో.. సామాజిక భాగస్వామ్యం ఉన్న సంస్థల శక్తి ఈ నమూనా ద్వారా స్పష్టమవుతోంది.

ఇతర విసర్జక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు: గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ట్విన్ పిట్ టాయిలెట్లను భారీ స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. సిక్కింలోని మాంగన్ జిల్లాలో సింగిల్ పిట్ టాయిలెట్లను ట్విన్ పిట్ టాయిలెట్లుగా అమర్చేలా సమగ్ర చర్యలు చేపట్టారు. తద్వారా మారుమూల, కొండ ప్రాంతాల్లో విసర్జక వ్యర్థాల నిర్వహణ సక్రమంగా సాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా కాలిబిల్లోడ్ గ్రామపంచాయతీలో దేశంలో మొదటి గ్రామీణ ‘విసర్జక వ్యర్థాల నిర్వహణ ప్లాంటు (ఎఫ్ఎస్టీపీ)’ని ఏర్పాటు చేశారు. అక్కడ శుద్ధి చేసి బయటకు వచ్చే నీటిలో చేపల పెంపకం చేపట్టడం ఒక వినూత్న ప్రయోగం. దీనితోపాటు ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం అక్కడ ‘మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్)’ను కూడా అనుసంధానించారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో క్లస్టర్ భాగస్వామ్యమున్న ఎఫ్‌ఎస్‌టీపీ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇందులో కార్యకలాపాలు, నిర్వహణలో స్వయం సహాయక బృందాల బలమైన భాగస్వామ్యం ఉంటుంది. లడాఖ్‌లోని లేహ్ జిల్లాలో అత్యంత శీతల, పొడి, ఎత్తైన ప్రాంతాల్లో ఎకోసాన్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. త్రిపురలోని గోమతి జిల్లాలో బహిరంగ కార్యక్రమాలుసామూహిక సమావేశాలు, జాతరల కోసం మొబైల్ బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వీయ లావాదేవీల ద్వారా స్థానిక స్వయం సహాయక బృందాలు వీటి కార్యకలాపాలు, నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో ఈ పారిశుద్ధ్య విధానాలను నేరుగా అమలు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గౌరవ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్‌తో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు స్థానిక భాషల్లో మాట్లాడేందుకు కూడా అవకాశమిచ్చారు. దాంతో వారు ఉత్సాహంగా తమ అనుభవాలను వెల్లడించారు.

స్వచ్ఛభారత్‌కు దోహదపడడంతోపాటు ఆదాయ, ఉపాధి అవకాశాలను అందించే వినూత్న పద్ధతులను.. ఈ కార్యక్రమంలో పాల్గొని వివరించిన ప్రతి ఒక్కరినీ గౌరవ జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ అభినందించారు. ఈ కార్యక్రమాల్లో చాలా వరకూ క్లిష్టమైన భౌగోళిక ప్రదేశాల్లో అమలు చేసినవేనన్న కేంద్ర మంత్రి.. సవాళ్లతో కూడిన పరిస్థితులు శాశ్వత పరిష్కారాల దిశగా స్ఫూర్తినిస్తాయనేందుకు ఇవి నిదర్శనమన్నారు. సుస్థిర గ్రామీణ పారిశుద్ధ్యంలో విసర్జక వ్యర్థాల నిర్వహణ ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ స్వచ్ఛతకు భరోసానివ్వడమే కాకుండా ప్రజారోగ్యాన్నీ, పర్యావరణాన్నీ పరిరక్షించేందుకు ఇది కీలకమన్నారు. సామాజిక భాగస్వామ్యం, స్వయం సహాయక బృందాలు, పంచాయతీలు, వివిధ భాగస్వామ్య సంస్థల సహకారం, పరిస్థితులకూ అవసరాలకూ తగిన సాంకేతికతలను అవలంబించడం వంటి అంశాలు.. విసర్జక వ్యర్థాల నిర్వహణను ఆచరణీయంగా, సమ్మిళితంగా, దీర్ఘకాలికంగా మారుస్తాయని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో.. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా ఉద్యమం మునుపెన్నడూ లేనంతగా ఊపందుకుందన్నారు. పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యం అనే గాంధీజీ సందేశం దేశంలోని నలుమూలలకూ చేరిందన్నారు.

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద- సాంకేతిక సహకారం, సామర్థ్యాభివృద్ధి, వినూత్న, సామాజిక భాగస్వామ్య, సమ్మిళిత విధానాలకు ప్రోత్సాహం ద్వారా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కృషిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

 

***


(रिलीज़ आईडी: 2212274) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada