ఆయుష్
azadi ka amrit mahotsav

రేపు చెన్నైలో 9వ సిద్ధ దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ.. జనవరి 6న జాతీయ సిద్ధ దినోత్సవం


భారత ఉపరాష్ట్రపతి అధ్యక్షతన చెన్నైలో 9వ సిద్ధ వైద్య దినోత్సవ ప్రారంభ కార్యక్రమం

సిద్ధ వైద్య విధానానికి విశిష్ట సేవలందించిన అయిదుగురు ప్రముఖులకు సత్కారం

“ప్రపంచ ఆరోగ్యానికి సిద్ధ వైద్యం” ఇతివృత్తంతో

భారతీయ ప్రాచీన వైద్య విధానం ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను తెలిపేలా వేడుకలు

నాడు పోస్టు చేయడమైనది: 02 JAN 2026 10:43AM by PIB Hyderabad

9వ సిద్ధ వైద్య దినోత్సవాన్ని 2026 జనవరి 3వ తేదీన చెన్నైలోని కళైవాణర్ ప్రాంగణంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ,  అనుబంధ సంస్థలైన జాతీయ సిద్ధ వైద్య సంస్థ (ఎన్ఐఎస్), కేంద్ర సిద్ధ వైద్య పరిశోధనా మండలి (సీసీఆర్ఎస్), తమిళనాడు ప్రభుత్వ భారతీయ వైద్యం, హోమియోపతి డైరెక్టరేట్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ‘‘ప్రపంచ ఆరోగ్యానికి సిద్ధ వైద్యం’’ ఇతివృత్తంతో జరిగే ఈ వేడుకలు.. సిద్ధ వైద్య పితామహుడిగా పిలిచే అగస్త్య మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 6న సిద్ధ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ప్రధాన వేడుకలు జనవరి 3న జరగనున్నాయి.

ఈ వేడుకలను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ  రాధాకృష్ణన్ ప్రారంభించి, అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, తమిళనాడు ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మా సుబ్రమణ్యం,  కేంద్ర ఆయుష్  శాఖ కార్యదర్శి, పద్మశ్రీ వైద్య రాజేష్ కోటేచా, తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీ సెంథిల్ కుమార్, తమిళనాడు ప్రభుత్వ భారతీయ వైద్యం, హోమియోపతి డైరెక్టరేట్ డైరెక్టర్ శ్రీమతి ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు.

తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సిద్ధ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు విద్యార్థులను ఈ వేడుక ఒకే వేదికపైకి చేర్చుతుంది. సిద్ధ వైద్య చట్టపరమైన సంస్థల సీనియర్ సభ్యులు, ఎన్ఐఎస్, సీసీఆర్ఎస్ పరిశోధకులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ, తమిళనాడు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా చెన్నై, పాళయంకోట్టైలోని ప్రభుత్వ సిద్ధ వైద్య కళాశాలల నుంచి డిగ్రీ, మాస్టర్స్, డాక్టరేట్ విద్యార్థులు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సొంత నిధులతో నడిచే సిద్ధ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.

సిద్ధ వైద్య విధానానికి అసాధారణమైన,  ప్రశంసనీయమైన సేవలు అందించిన అయిదుగురు ప్రముఖులను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా సత్కరించనుంది.

నివారణ ఆరోగ్యం, పరిశోధన, ప్రపంచ శ్రేయస్సులో సిద్ధ వైద్య విధానం అందిస్తున్న సేవలను 9వ సిద్ధ దినోత్సవం ద్వారా ప్రదర్శించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, పరిశోధనా సహకారం, విద్యా పురోగతిలో సిద్ధ వైద్యం పాత్రను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను తెలియజేయడం, సిద్ధ వైద్యంపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను జాతీయ, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల్లో ప్రోత్సహించడం, ఆవిష్కరణలను బలోపేతం చేయడం, సిద్ధ వైద్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ వేడుకలు ప్రతిబింబించనున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2210810) సందర్శకుల సూచీ సంఖ్య : : 149
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam