ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: 20వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2023 10:19PM by PIB Hyderabad
గౌరవనీయులారా!
చంద్రయాన్ విజయంపై మీరందరూ అభినందనలు చెప్పటం పట్ల నేను గాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఈ విజయం ఒక్క భారత దేశానికే చెందినది కాదు.. ఇది మొత్తం మానవజాతి సాధించిన విజయం. మానవాళి సంక్షేమానికి ఇది తోడ్పడుతుంది. విజ్ఞాన శాస్త్ర రంగంలో మరింత ముందుకు వెళ్లేలా మన యువతను ఇది ప్రేరేపిస్తుంది. మీ విలువైన ఆలోచనలు, సూచనలకు ధన్యవాదాలు.
మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం, సుసంపన్నం చేసేందుకు ఆరు కీలక అంశాల్లో సహకారం కోసం మీ ముందు ప్రతిపాదనలను ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మొదటిది అనుసంధానత. త్రిపక్ష రహదారి, దాని విస్తరణపై మనం ఇప్పటికే పని చేస్తున్నాం. సముద్ర వాణిజ్య సహకారంపై మన ఉమ్మడి ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను. భారత్, పశ్చిమ ఆసియా, ఐరోపాలతో ఆగ్నేయాసియాను అనుసంధానించే ఆర్థిక కారిడార్, బహుళ నమూనా అనుసంధానతను అభివృద్ధి చేయాలన్నది నా దార్శనికత.
సౌర గ్రిడ్లు, స్వచ్ఛ ఇంధనం, మౌలిక సదుపాయాలు, సరఫరా వ్యవస్థ, రవాణా వంటి రంగాలపై ఈ కారిడార్ దృష్టి సారించవచ్చు. రెండోది.. డిజిటల్ పరివర్తన. మన భవిష్యత్తు వృద్ధికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక చోదకశక్తిగా ఉంటుంది. భారత్‌లో మేము డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీకి గట్టి ప్రాధాన్యతను ఇచ్చాం. భారత్‌లో అభివృద్ధి చేసిన ‘డిజిటల్ ఇండియా స్టాక్’ను మీ అందరితో పంచుకోవటాన్ని మేం సంతోషిస్తాం. ఈ నేపథ్యంలో ‘డిజిటల్ భవిష్యత్తు కోసం ఆసియాన్–భారత్ నిధి’ ఏర్పాటును నేను ప్రకటిస్తున్నాను.
ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం అనేది మూడో ప్రధాన రంగం. 'ఆసియాన్–భారత్ వస్తువుల వాణిజ్య ఒప్పందం'పై గత ఏడాది సాధించిన పురోగతిని మేం స్వాగతిస్తున్నాం. నిర్ణీత కాలపరిమితిలోగా దీని సమీక్షను మనం తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇదే సమయంలో ‘ఆవిష్కరణ సదస్సు’, 'ఆసియాన్–భారత్ స్టార్టప్ ఫెస్టివల్' వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. 'ఆసియాన్ - తూర్పు ఆసియా ఆర్థిక పరిశోధనా సంస్థ'కు మా మద్దతును పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా మేం తీసుకున్నాం.
గౌవరనీయులారా!
ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడం అనేది నాలుగో అంశం. వాతావరణ మార్పు, ఇంధనం, ఎరువులు, ఆహారం వంటి అనేక సవాళ్లతో నేడు దక్షిణ ప్రపంచం సతమతమౌతోంది. బహుళ పక్ష వేదికలలో దక్షిణాది దేశాలకు ఉన్న ఉమ్మడి ఆందోళనలను మనం సమష్టిగా లేవనెత్తాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో ఒక "ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని" ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగస్వాములు కావాలని నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. పర్యావరణం కోసం జీవనశైలి.. అంటే మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలపై కూడా మనం కలిసి పనిచేయాలి.
భారత్‌లోని జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నాం. మా అనుభవాలను మీ అందరితో పంచుకోవటాన్ని మేం సంతోషిస్తాం. ప్రజల మధ్య సంబంధాలు అనేది ఐదో అంశం. ఈ నేపథ్యంలో మనం యువత, పర్యాటకం, పరిశోధన, శాస్త్ర సాంకేతికత, విద్యపై దృష్టి సారించాలి. గౌరవ ప్రధానమంత్రి షానానా గుస్మావో గారు నేడు మన మధ్య ఉన్నారు. తైమూర్-లెస్టేలో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాలని భారత్ నిర్ణయించుకుందని ఈ సందర్భంగా ప్రకటించటం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం అనేది ఆరో అంశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పురోగతి, శ్రేయస్సు, భద్రత, శాంతి పట్ల మనకు ఉమ్మడి ఆసక్తి ఉంది. ఈ ఏడాది మనం సముద్రాలపై సైనిక విన్యాసాలను ప్రారంభించాం. ప్రపంచంలోని ఇతర సముద్ర మార్గాలతో పాటు దక్షిణ చైనా సముద్రంలో ఆటంకం లేని చట్టబద్ధమైన వాణిజ్యం, ఓవర్‌ఫ్లైట్, నౌకాయాన స్వేచ్ఛ, శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడం అత్యవసరం. దక్షిణ చైనా సముద్రం కోసం రూపొందించే ఏ ప్రవర్తనా నియమావళి అయినా యూఎన్‌సీఎల్‌ఓఎస్ సహా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. ఈ చర్చల్లో నేరుగా పాల్గొనని దేశాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
గౌవనీయులారా,
ప్రపంచ, ప్రాంతీయ శాంతికి ఉగ్రవాదం ఒక తీవ్రమైన ముప్పు. సైబర్ వ్యవస్థల్లో తప్పుడు సమాచారం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి పనిచేస్తూ నిర్ణయాత్మక కృషి చేయాలి. సంప్రదాయ, సంప్రదాయేతర ముప్పులను ఎదుర్కోవడంలో కూడా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. సముద్ర వాణిజ్య రంగ అవగాహన, విపత్తు నిర్వహణ రంగాలలో కూడా మనం సహకరించుకోవాలి. విపత్తులను తట్టుకొనే మౌలిక సదుపాయాల కూటమిలో చేరాలని నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.
***
(రిలీజ్ ఐడి: 2210762)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
Manipuri
,
English
,
Urdu
,
Assamese
,
Bengali
,
Odia