ప్రధాన మంత్రి కార్యాలయం
‘సాంకేతికతతో జీవన సౌలభ్యం’ అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
28 FEB 2023 12:37PM by PIB Hyderabad
నమస్కారం!
జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం సందర్భంగా నేటి బడ్జెట్ వెబినార్‌లో చర్చిస్తున్న అంశం చాలా ముఖ్యమైనది. 21వ శతాబ్దపు మారుతున్న భారత్ సాంకేతికత శక్తితో నిరంతరం పౌరులను సాధికారులను చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్‌లోనూ.. సాంకేతికత సాయంతో దేశ ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా మానవీయ స్పృహతో కూడిన సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రయత్నించాం.
మిత్రులారా.. ఒకప్పుడు మన దేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాల్లో చాలా వైరుధ్యం ఉండేది. సమాజంలో ఒక వర్గం తమ జీవితంలోని ప్రతి దశలోనూ ప్రభుత్వ జోక్యాన్నీ, ప్రాబల్యాన్నీ కోరుకునేది. మరో మాటలో చెప్పాలంటే, ప్రభుత్వం వారి కోసం ఏదైనా చేయాలని వారు భావించేవారు. కానీ గత ప్రభుత్వాల హయాంలో వీళ్లెప్పుడూ అసంతృప్తితోనే ఉన్నారు. కష్టాల్లోనే వారి జీవితాలు గడిచేవి. అదే సమయంలో, సొంత బలంతో ముందుకు సాగాలనుకునే మరో వర్గం ప్రజలూ ఉన్నారు. కానీ అడుగడుగునా ప్రభుత్వ జోక్యం వల్ల వారు అడ్డంకులను ఎదుర్కొన్నారు. కొన్నేళ్లుగా మన ప్రభుత్వ ప్రయత్నాల వల్ల నేడు ఈ పరిస్థితిలో మార్పు మొదలైంది. అవసరమైన ప్రతిచోటా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల సానుకూల ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తోంది.
మా ప్రయత్నాలు ప్రతి పేదవారికి, అణగారిన వర్గాలకు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం, ఒత్తిడి కూడా తగ్గింది. ఈ రోజు ప్రజలు ప్రభుత్వాన్ని అవరోధంగా భావించడం లేదు. వారు మా ప్రభుత్వాన్ని కొత్త అవకాశాల చోదకశక్తిగా చూస్తున్నారు. ఈ విషయంలో నిస్సందేహంగా సాంకేతికత కీలక పాత్ర పోషించింది.
మీరు చూస్తే.. ‘ఒక దేశం - ఒకే రేషన్ కార్డు’కు సాంకేతికతే ప్రాతిపదిక అయ్యింది. ఫలితంగా కోట్లాది పేదలకు పారదర్శక పద్ధతిలో ఉచిత రేషన్ అందించడం సాధ్యమైంది. ఇది వలస కార్మికులకు ఒక గొప్ప వరంగా మారింది. సాంకేతికతతోపాటు.. జన్‌ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్లు కోట్లాది మంది పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బుల బదిలీని సాధ్యం చేశాయి.
అదేవిధంగా ఆరోగ్య సేతు, కోవిన్ యాప్‌లకు సాంకేతికత ముఖ్య సాధనంగా మారింది. కరోనా సమయంలో గుర్తింపు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇది చాలా సహాయపడింది. ఈ రోజు మనం చూస్తున్నాం.. సాంకేతికత ద్వారా రైల్వే రిజర్వేషన్ మరింత ఆధునికంగా మారింది. సామాన్యుడికి తలపోటు తప్పింది. ఉమ్మడి సేవా కేంద్రాల వ్యవస్థ కూడా సాంకేతికత సాయంతో అత్యంత పేదవారిని ప్రభుత్వ సేవలతో అనుసంధానిస్తోంది. ఇలాంటి అనేక నిర్ణయాలతో మా ప్రభుత్వం దేశ ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచింది.
మిత్రులారా.. నేడు దేశంలోని ప్రతి పౌరుడూ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం చాలా సులభతరమైంది. ప్రజలంతా ఈ మార్పును స్పష్టంగా గమనిస్తున్నారు. అంటే, ప్రజలు తమ సందేశాన్ని సులభంగా ప్రభుత్వానికి అందించగలుగుతున్నారు. వెంటనే పరిష్కారాన్ని కూడా పొందుతున్నారు. ఉదాహరణకు.. గతంలో పన్నులకు సంబంధించి ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉండేవి. పన్ను చెల్లింపుదారులు అనేక విధాల వేధింపులకు గురయ్యారు. దాంతో మొత్తం పన్ను ప్రక్రియను సాంకేతికత సాయంతో ఆన్లైన్ విధానంలోకి మార్చాం. ఇప్పుడు ఫిర్యాదులకూ, పరిష్కారానికీ మధ్య సాంకేతికత తప్ప వేరే వ్యక్తి ప్రమేయం లేదు. నేను మీకు ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. కానీ సాంకేతికత సాయంతో ఇతర విభాగాల్లోనూ మనం మరింత మెరుగైన రీతిలో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సాంకేతికతను ఉపయోగించుకుని వివిధ విభాగాలు తమ సేవలను అంతర్జాతీయ స్థాయికి చేర్చవచ్చు. ఈ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్తే.. ఏ రంగాల్లో ప్రభుత్వంతో సంప్రదింపులను మరింత సరళీకరించగలమో కూడా గుర్తించవచ్చు.
మిత్రులారా.. మిషన్ కర్మయోగి ద్వారా మేం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రజలే కేంద్రంగా పనిచేసేలా ఉద్యోగులను తీర్చిదిద్దడమే ఈ శిక్షణ వెనుక మా లక్ష్యం. ఈ శిక్షణను క్రమం తప్పకుండా నవీకరించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజాభిప్రాయాల ఆధారంగా మార్పులు చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. శిక్షణ కోర్సును మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు ప్రజల సూచనలను స్వీకరించే ఓ వ్యవస్థను మనం రూపొందించాలి.
మిత్రులారా.. సరైన, కచ్చితమైన సమాచారం ద్వారా ప్రతి ఒక్కరి పురోగమనానికి సమాన అవకాశాలు సాంకేతికత ద్వారా లభిస్తున్నాయి. సాంకేతికతను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. దేశంలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. దీనితోపాటు డిజిటల్ విప్లవ ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మారుమూల ప్రాంతాల్లోని చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించే అవకాశాన్ని జెమ్ పోర్టల్ నేడు కల్పించింది. రైతులు వివిధ ప్రాంతాల కొనుగోలుదారులతో అనుసంధానమయ్యే అవకాశాన్ని ఇ-నామ్ కల్పించింది. ఇప్పుడు రైతులు తమ ప్రాంతంలోనే ఉండి, పంటకు అత్యుత్తమ ధరను పొందగలుగుతున్నారు.
మిత్రులారా.. 5జీ, ఏఐ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పరిశ్రమలు, వైద్యం, విద్య, వ్యవసాయం, ఇతర అన్ని రంగాల్లోనూ పెద్ద మార్పులు రాబోతున్నాయని చెబుతున్నారు. కానీ నేడు మనం మనకోసం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. సామాన్య మానవుడి శ్రేయస్సు కోసం ఈ సాంకేతికతను ఏయే విధాలుగా ఉపయోగించవచ్చు? మనం ఏ రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి? కృత్రిమ మేధ ద్వారా పరిష్కరించగల 10 సామాజిక సమస్యలను మనం గుర్తించగలమా? లక్షలాది మంది యువత హ్యాకథాన్లలో పాల్గొని మంచి పరిష్కారాలను అందిస్తున్నారు.
మిత్రులారా.. సాంకేతికత సాయంతో ప్రతి వ్యక్తికి డిజిలాకర్ సదుపాయాన్ని మేం ప్రవేశపెట్టాం. ఇప్పుడు సంస్థలకు కూడా డిజిలాకర్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక్కడ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు తమ ఫైళ్లను భద్రపరచుకోవడంతోపాటు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో వాటిని షేర్ చేయొచ్చు. డిజిలాకర్ భావనను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ప్రజలు ఇంకెన్ని విధాలుగా ప్రయోజనం పొందగలరో మనం చూడాలి.
మిత్రులారా.. కొన్నేళ్లుగా ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచేలా మేం అనేక ముఖ్య చర్యలు తీసుకున్నాం. దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు పెద్ద కంపెనీలుగా ఎదగడంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాల్సిన అవసరముంది. చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి.. నిబంధనల అమలులో వారికి ఖర్చును తగ్గించాలని మేం భావిస్తున్నాం. వ్యాపారంలో సమయమే డబ్బు అని అంటారు. కాబట్టి నిబంధనలు పాటించడంపై వెచ్చించే సమయాన్ని ఆదా చేయడమంటే, ఆ ఖర్చును కూడా ఆదా చేయడమే అవుతుంది. మీరు అనవసరమైన నిబంధనల జాబితాను తయారు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఇప్పటికే మేం 40,000 నిబంధనలను తొలగించాం.
మిత్రులారా.. ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య నమ్మకం లేకపోవడమన్నది బానిస మనస్తత్వ ఫలితం. కానీ నేడు ప్రభుత్వం చిన్న చిన్న తప్పులను నేరంగా పరిగణించకుండా, అలాగే ఎంఎస్‌ఎంఈ రుణాలకు హామీదారుగా నిలబడుతూ.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది. కానీ మనమిక్కడే ఆగిపోకూడదు. సమాజంలో నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏం చేశారో కూడా మనం చూడాలి. వారి నుంచి నేర్చుకుని.. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు.
మిత్రులారా.. బడ్జెటుగానీ, ప్రభుత్వ విధానంగానీ... ఎంత బాగా రూపొందించారన్నదానిపైనే దాని విజయం ఆధారపడి ఉంటుంది. అయితే దాన్నెలా అమలు చేస్తారనేది అంతకన్నా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో ప్రజల సహకారం అత్యంత ఆవశ్యకం. సంబంధిత భాగస్వాములందరి సహకారంతో జీవన సౌలభ్యం గణనీయంగా మెరుగుపడుతుందన్న దృఢమైన నమ్మకం నాకుంది. ఉత్పాదక కేంద్రంగా మనం నిలవాలని నేను కచ్చితంగా చెబుతాను. ‘లోపరాహిత్యం, పర్యావరణ హితం (జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్)’ మన ప్రాధాన్యం కావాలి. మన నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఈ విషయంలో సాంకేతికత ఎంతగానో సహాయపడుతుంది. సాంకేతికత సాయంతో ఉత్పత్తి సమయంలో అత్యంత సూక్ష్మ వివరాలనూ పర్యవేక్షించడం ద్వారా.. మనం ఉత్పత్తిని మరింత మెరుగైన రీతిలో తీసుకురావచ్చు. అప్పుడే మనం ప్రపంచ మార్కెట్‌ను చేజిక్కించుకోగలం.
21వ శతాబ్దం సాంకేతికతతో నడుస్తోందని మనం అంగీకరించాలి. జీవితంలో సాంకేతికత ప్రభావం బాగా పెరగబోతోంది. కేవలం ఇంటర్నెట్, డిజిటల్ సాంకేతికతకు మాత్రమే మనం పరిమితం కాకూడదు. అలాగే ప్రస్తుతం ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ప్రతి గ్రామానికీ చేరుకుంటోంది. పంచాయతీలకు, ఆరోగ్య కేంద్రాలకు ఇది విస్తరిస్తోంది. టెలీమెడిసిన్ కూడా దీని పరిధిలోకి వస్తోంది. ఆరోగ్య రంగం కూడా పూర్తిగా సాంకేతికత ఆధారంగా నడవబోతోంది. ఈ రోజు దేశం రక్షణ, ఆరోగ్య రంగాలలో చాలా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఆప్టికల్ ఫైబర్ ప్రతి గ్రామానికి చేరుకున్నట్టుగానే.. సాంకేతికతను మరింత ఉన్నతీకరించి మన పారిశ్రామికవేత్తలు ఆ రంగాల్లో ముందుకు వెళ్లలేరా?
సామాన్యులు ఆప్టికల్ ఫైబర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో మనం ఓ నమూనాను రూపొందించవచ్చు. ప్రతి అంశంలోనూ ప్రజల భాగస్వామ్యాన్ని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి అన్నింటా పరిజ్ఞానం ఉందన్న ఆలోచన మాకు లేదు. మేం అలా వాదించడం లేదు కూడా. కాబట్టి ఈ సాంకేతికత ఆధారిత శతాబ్దాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకుని.. అనేక అంశాలను సులభతరం చేసి, సామాన్యుడిని సాధికారుడిని చేయాలని భాగస్వాములందరినీ కోరుతున్నాను. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యాన్ని సాధించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, దేశానికి, ప్రజలకు కూడా ఇదెంతో సహాయపడుతుంది. భారత్‌కు సహజంగానే ఆ సమర్థత ఉండడం మన అదృష్టం.
ప్రతిభావంతులైన యువత, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మనకుంది. భారత్‌లో గ్రామీణులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోగల సమర్థులే. దీన్నెలా మనం సద్వినియోగం చేసుకోగలమన్నది ఆలోచించాలి. దీనిపై వివరంగా చర్చించాలని, బడ్జెట్ నుంచి అత్యుత్తమ ఫలితాలను పొందడమెలాగో, దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమెలాగో చర్చించాలని నేను కోరుతున్నాను. ఈ అంశంపై మీరెంత వివరంగా చర్చిస్తే.. ఈ బడ్జెట్ అంతగా అర్థవంతంగా ఉంటుంది.
మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2210617)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Manipuri
,
Punjabi
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam