ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ 50వ సమావేశం


గత దశాబ్దంలో రూ. 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో సహాయపడిన ప్రగతి వ్యవస్థ: ప్రధానమంత్రి

ప్రగతి తదుపరి దశకు ప్రధానమంత్రి సూత్రాలు: సరళీకరణకు సంస్కరణ, అమలుకు పనితీరు, ప్రభావానికి మార్పు
సంస్కరణల వేగాన్ని కొనసాగించేందుకు, అమలును నిర్ధారించేందుకు ప్రగతి ఎంతో కీలకమన్న ప్రధానమంత్రి

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ప్రగతి ద్వారా పూర్తి: ప్రధానమంత్రి

సహకార సమాఖ్య స్పూర్తికి ప్రగతి వేదిక నిదర్శనం.. శాఖల మధ్య అడ్డంకులను తొలగిస్తుంది: ప్రధానమంత్రి
సామాజిక రంగంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయిలో ప్రగతి తరహా వ్యవస్థలను సంస్థాగతంగా అమలు చేయాలని రాష్ట్రాలను ప్రోత్సహించిన ప్రధాని

ఈ సమావేశంలో అయిదు రాష్ట్రాల్లో విస్తరించిన రూ. 40,000 కోట్ల కంటే ఎక్కువ వ్యవయంతో కూడిన అయిదు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన ప్రధానమంత్రి

రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఇతర పాఠశాలలకు పీఎం శ్రీ పాఠశాలు ఒక ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని ప్రధాని పిలుపు

प्रविष्टि तिथि: 31 DEC 2025 8:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఉదయం ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్- ముందస్తు చర్యలతో కూడిన పాలన, సకాలంలో అమలు) ఐసీటీ-ఆధారిత బహుముఖ వేదిక 50వ సమావేశం జరిగింది. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా సహకార, ఫలితాల ఆధారిత పాలనలో ‘ప్రగతి’ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతికతతో కూడిన నాయకత్వం, తక్షణ పర్యవేక్షణ, కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం ద్వారా జాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో ఎలా విజయవంతం చేశాయో ఈ సమావేశం స్పష్టం చేసింది.
50వ ప్రగతి సమావేశంలో చేపట్టిన సమీక్ష
ఈ సమావేశంలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్, జల వనరులు, బొగ్గు వంటి రంగాల్లోని అయిదు కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షించారు. ఈ ప్రాజెక్టులు 5 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉండగా.. వీటి మొత్తం వ్యయం రూ.40,000 కోట్లకు పైగా ఉంది.
‘పీఎం శ్రీ’ పథకం సమీక్ష సందర్భంగా.. ఈ పథకం సమగ్రమైన, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఉండే విద్యా వ్యవస్థకు జాతీయ ప్రమాణంగా మారాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం అమలు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా విద్యార్థుల ఫలితాలను మెరుగుపరిచే దిశగా ఉండాలని అన్నారు. ‘పీఎం శ్రీ’ పథకాన్ని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నిశితంగా పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఇతర పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ పాఠశాలలు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఈ పాఠశాలల పనితీరును అంచనా వేయడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని ప్రధానమంత్రి తెలిపారు.
ఈ సమావేశాన్ని గత దశాబ్దంలో పాలనా సంస్కృతిలో చూసిన గణనీయమైన పరివర్తనకు చిహ్నంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. నిర్ణయాలు సకాలంలో ఉన్నప్పుడు సమన్వయం ప్రభావవంతంగా ఉన్నప్పుడు, జవాబుదారీతనం స్థిరంగా ఉన్నప్పుడు, ప్రభుత్వ పనితీరు వేగం సహజంగా పెరుగుతుందని, దాని ప్రభావం పౌరుల జీవితాల్లో నేరుగా కనిపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రగతి ఆవిర్భావం
ప్రగతి వేదిక ఆరంభాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి తన పాత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల ఫిర్యాదులను క్రమశిక్షణతో, పారదర్శకతతో, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడానికి సాంకేతికత ఆధారిత ‘స్వాగత్‌’ (సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫిర్యాదులపై రాష్ట్రవ్యాప్త శ్రద్ధ) వేదికను ప్రారంభించినట్లు తెలిపారు.
దీని ఆధారంగా కేంద్రంలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే స్ఫూర్తితో స్వాగత్ అనుభవాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ‘ప్రగతి’ని రూపొందించినట్లు తెలిపారు. పెద్ద ప్రాజెక్టులు, ప్రధాన కార్యక్రమాలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని ఒకే సమగ్ర వేదికపైకి తీసుకువచ్చి.. సమీక్ష, పరిష్కారం, తదుపరి చర్యల కోసం వేగవంతం చేసినట్లు ప్రధాని వివరించారు.
పరిధి, ప్రభావం
గత దశాబ్ద కాలంలో ‘ప్రగతి’ వ్యవస్థ ద్వారా రూ.85 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసినట్లు ప్రధానమంత్రి గుర్తించారు. భారీ స్థాయిలో సాగుతున్న ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడానికి ఈ వేదిక ఎంతో తోడ్పడినట్లు పేర్కొన్నారు.
2014లో ప్రగతి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 377 ప్రాజెక్టులను ఈ వేదిక ద్వారా సమీక్షించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో గుర్తించిన 3,162 సమస్యల్లో 2,958 సమస్యలు (సుమారు 94 శాతం) విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపారు. దీనివల్ల ప్రాజెక్టుల జాప్యం, ఖర్చు పెరగడం, శాఖల మధ్య సమన్వయ లోపాలు గణనీయంగా తగ్గినట్లు చెప్పారు.
భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రగతి ప్రాముఖ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సంస్కరణల వేగాన్ని  కొనసాగించడానికి, పథకాల ఫలాలు ప్రజలకు అందేలా చూడటానికి ప్రగతి వ్యవస్థ అత్యవసరమని ఆయన తెలిపారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి
2014 నుంచి ప్రభుత్వం ప్రాజెక్టుల అమలు, జవాబుదారీతనాన్ని ఒక వ్యవస్థీకృత రూపంలోకి తీసుకువచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో ద్వారా పనులను నిర్ణీత సమయం, బడ్జెట్‌లో పూర్తి చేసే వ్యవస్థను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రారంభమై, మధ్యలో నిలిచిపోయిన లేదా విస్మరించిన ప్రాజెక్టులను దేశ ప్రయోజనాల దృష్ట్యా పునరుద్ధరించి పూర్తి చేసినట్లు  చెప్పారు.
దశాబ్దాలుగా నిలిచిపోయిన అనేక కీలక ప్రాజెక్టులు ‘ప్రగతి’ వేదిక ద్వారా పూర్తవ్వడం, వాటి అమలుకు మార్గం సుగమమైంది. వీటిలో 1997లో తొలిసారిగా ప్రతిపాదించిన అస్సాంలోని బోగిబీల్ రైలు-రోడ్డు వంతెన ఒకటి. అదే విధంగా 1995లో పనులు ప్రారంభమైన జమ్మూ-ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం, 1997లో రూపకల్పన చేసిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, 2007లో ఆమోదం పొందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ, విస్తరణ. 2008, 2009లో మంజూరైన గదర్వారా,  లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. అత్యున్నత స్థాయి పర్యవేక్షణ, ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటే దశాబ్దాల నాటి అడ్డంకులను కూడా అధిగమించవచ్చని ఈ ప్రాజెక్టుల ఫలితాలు నిరూపిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఐక్యత లేమి నుంచి టీమ్ ఇండియా దాకా
ప్రాజెక్టులు విఫలమయ్యేందుకు కేవలం సంకల్పం లేకపోవడం మాత్రమే కారణం కాదు... సమన్వయం, ఐకమత్యం లేకుండా పనిచేయడం వల్ల కూడా ప్రాజెక్టులు విఫలమవుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒకే ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగా సంబంధిత భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రగతి  ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడిందని ఆయన అన్నారు.
సహకార సమాఖ్యవాదానికి ఒక సమర్థమైన నమూనాగా ప్రగతిని ఆయన అభివర్ణించారు. ఇందులో కేంద్ర, రాష్ట్రాలు ఒకే జట్టుగా పనిచేస్తాయి. మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ పరిమితులను దాటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాయి అని ప్రధానమంత్రి వివరించారు. ప్రగతి ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సుమారు 500ల మంది ప్రగతి సమావేశాల్లో పాల్గొన్నారని శ్రీ మోదీ తెలిపారు. వారి భాగస్వామ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయి అవగాహనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక సమీక్షా వేదిక నుంచి సమస్య పరిష్కారం కోసం అసలైన వేదికగా ప్రగతి పరిణామం చెందేలా ఇవి దోహదం చేశాయన్నారు.
జాతీయ ప్రాధాన్యాలకు తగిన వనరులు, అన్ని రంగాల్లో స్థిరమైన పెట్టుబడులు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రణాళిక నుంచి అమలు దాకా మొత్తం వ్యవస్థను బలోపేతం చేయాలనీ... టెండర్ల నుంచి క్షేత్రస్థాయి పంపిణీ వరకు జాప్యాలను తగ్గించాలని ఆయన మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
సంస్కరణ, పనితీరు, పరివర్తన
ఈ సందర్భంగా తదుపరి దశకు సంబంధించి స్పష్టమైన అంచనాలను ప్రధానమంత్రి పంచుకున్నారు. "సరళీకరణ కోసం సంస్కరణలు, ఫలితాలను అందించడానికి పనితీరు, ప్రభావం చూపడానికి పరివర్తన" అనే తన సంస్కరణ, పనితీరు, పరివర్తన దార్శనికతను ఆయన వివరించారు.
సంస్కరణ అంటే ప్రక్రియల నుంచి పరిష్కారాల వైపు పయనించడం... విధానాలను సరళీకృతం చేయడం... జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కోసం వ్యవస్థలను మరింత స్నేహపూర్వకంగా మార్చడమేనని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పనితీరు అంటే సమయం, వ్యయం, నాణ్యతలపై సమానంగా దృష్టి సారించడమేనని ఆయన తెలిపారు. ఫలితాల ఆధారిత పాలన ప్రగతి ద్వారా బలోపేతం అయిందనీ, ఇప్పుడు అది మరింత లోతుగా విస్తరించాలని ఆయన అన్నారు.
సకాలంలో లభించే సేవలు, ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం, మెరుగైన జీవన సౌలభ్యం గురించి వాస్తవానికి పౌరులు ఏమనుకుంటున్నారనే దాని ఆధారంగానే పరివర్తనను కొలవాలని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రగతి  - వికసిత్ భారత్ @ 2047 దిశగా పురోగమనం
వికసిత్ భారత్ @ 2047 అనేది ఒక జాతీయ సంకల్పం... నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన లక్ష్యం... దానిని సాధించడానికి ప్రగతి ఒక శక్తిమంతమైన చోదక శక్తి అవుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్య కార్యదర్శి స్థాయిలో... ముఖ్యంగా సామాజిక రంగానికి సంబంధించి ప్రగతి  తరహా యంత్రాంగాలను సంస్థాగతీకరించాలని ఆయన రాష్ట్రాలను ప్రోత్సహించారు.
ప్రగతి కార్యక్రమాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం కోసం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలోని ప్రతి దశలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రగతి@50 కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు... అది ఒక నిబద్ధత అని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. వేగవంతమైన అమలు, అత్యున్నత నాణ్యత, పౌరులకు కచ్చితమైన ఫలితాలను నిర్ధరించడం కోసం రాబోయే సంవత్సరాల్లో ప్రగతిని మరింత బలోపేతం చేయాలన్నారు.
కేబినెట్ కార్యదర్శి ప్రజెంటేషన్
50వ ప్రగతి  మైలురాయి సందర్భంగా కేబినెట్ కార్యదర్శి ఒక సంక్షిప్త ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ప్రగతి కీలక విజయాలను హైలైట్ చేస్తూ... అది భారత పర్యవేక్షణ, సమన్వయ వ్యవస్థను పునర్నిర్మించిన తీరును వివరించారు. ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసిందన్నారు. నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసే సంస్కృతిని పెంపొందించిందని తెలిపారు. దీని ఫలితంగా ప్రాజెక్టుల అమలు వేగవంతమైందని పేర్కొన్నారు. పథకాలు, కార్యక్రమాల కీలక దశల్లో అమలు ప్రక్రియ మెరుగుపడిందని, ప్రజల ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం లభించిందని ఆయన వివరించారు.

 

***


(रिलीज़ आईडी: 2210460) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia