నమస్కారం,
నియామక పత్రాలు అందుకున్న యువ స్నేహితులకు మాత్రమే కాకుండా దేశానికి కూడా గుర్తుండిపోయే రోజు ఇది. 1947లో ఇదే రోజున అంటే జులై 22న ప్రస్తుత రూపంలో ఉన్న మువ్వన్నెల జెండాను రాజ్యాంగ పరిషత్తు స్వీకరించింది. ఇలాంటి మహత్తరమైన రోజున ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు నియామక పత్రాలు అందుకోవడం స్ఫూర్తిదాయకం. ప్రభుత్వోద్యోగం చేస్తున్నప్పుడు త్రివర్ణ పతాక ఖ్యాతిని పెంపొందించి.. దేశాన్ని గర్వపడేలా చేయాలి. అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా దేశం పని చేస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సమయంలో ప్రభుత్వోద్యోగంలో చేరడం గొప్ప అవకాశం. ఇది మీరు చేసిన కృషికి దక్కిన ఫలితం. నియామక పత్రాలు అందుకున్న యువ మిత్రులందరికీ అభినందనలు. వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు!
స్నేహితురాలా,
వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ‘ఆజాదీ కా అమృత్‌కాల్’లో దేశ ప్రజలందరూ ప్రతిజ్ఞ చేశారు. వచ్చే పాతికేళ్లు.. మీతో పాటు ఈ దేశానికి కూడా అత్యంత కీలకం. ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ను విశ్వసించడం ప్రారంభించింది. భారత్ పట్ల ఆకర్షితమవుతోంది. అంతర్జాతీయంగా భారత్ ప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
కేవలం 9 ఏళ్లలోనే పదో స్థానం నుంచి అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. మరి కొన్నేళ్లలోనే భారత్ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారుతుందని ప్రతి నిపుణుడూ అంచనా వేస్తున్నారు. మూడో స్థానానికి భారత్ చేరుకోవడం అసాధారణ విజయం కానుంది. అంటే.. ప్రతి రంగంలోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సాధారణ ప్రజల ఆదాయం పెరుగుతుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంతకంటే గొప్ప సందర్భం, ఇంతకంటే మంచి సమయం దొరకదు. జాతి ప్రయోజనాల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు దేశాభివృద్ధిని వేగవంతం చేస్తాయని నేను నమ్ముతాను. ఈ అవకాశం, ఈ సవాలు మీ ముందు ఉన్నాయి. ఈ ‘అమృత్‌కాల్’ సమయంలో దేశానికి సేవ చేసే అపూర్వ అవకాశం మీకు వచ్చింది. దేశ ప్రజల జీవితాలను సులభతరం చేయడం, వారి కష్టాలను తొలగించడమే మీ ప్రాధాన్యం కావాలి. మీరు ఏ విభాగంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏగ్రామంలో ఉన్నా.. మీరు చేపట్టే పని సాధారణ ప్రజానీకానికున్న కష్టాలను తగ్గించాలి. వారి జీవన సౌలభ్యాన్ని పెంపొందించాలి. అలాగే వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేయాలనే కలను నెరవేర్చాలని గుర్తుంచుకోండి. మీరు చేసే చిన్న పని.. నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి సాయంగా మారొచ్చు. ప్రజలే దేవుళ్లని ఎల్లప్పుడూ భావించండి. ప్రజల నుంచి, పేదల నుంచి మీకు అందే ఆశీర్వాదాలు దేవుని ఆశీస్సులతో సమానం. కాబట్టి, ఇతరులకు సేవ అందించాలనే స్ఫూర్తితో పని చేసినప్పుడు మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. జీవితంలో అతి గొప్ప సంపద సంతృప్తే. అక్కడ మీకు అది లభిస్తుంది.
బ్యాంకింగ్ రంగంలో నియామక పత్రాలను ఈ కార్యక్రమంలో చాలా మంది తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ విస్తరణలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ 9 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. దేశ ప్రయోజనాల కంటే అధికార దాహానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినప్పుడు, అనేక విధాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. దేశంలో జరిగిన ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక ఉదాహరణలున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మన బ్యాంకింగ్ వ్యవస్థ ఈ పరిస్థితులను ఎదుర్కొంది. ఇది డిజిటల్ యుగం. ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకు సేవలను పొందుతున్నారు. ఫోన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. కానీ తొమ్మిదేళ్ల క్రితం.. ఫోన్ బ్యాంకింగ్ విధానం మరోలా ఉండేది. పద్ధతులు వేరుగా ఉండేవి. ఉద్దేశాలు భిన్నంగా ఉండేవి. ఆ సమయంలో, ఆ ప్రభుత్వ హయాంలో.. మీలాంటి, నాలాంటి సామాన్యులకు ఫోన్ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేదు. అది దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల కోసం కాదు. ఆ సమయంలో ఓ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు బ్యాంకులకు ఫోన్ చేసి తమకు కావాల్సిన వారికి వేల కోట్ల రూపాయల రుణాలను ఇప్పించేవారు. ఈ రుణాన్ని ఎప్పటికీ తీర్చేవారు కాదు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రం ఉండేవి. ఒక అప్పు తీర్చాలంటే.. బ్యాంకుకు ఫోన్ చేసి మరో రుణాన్ని పొందేవారు. దానిని తీర్చడం కోసం మూడో అప్పును తీసుకొనేవారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఈ ఫోన్ బ్యాంకింగ్ ఒకటి. గత ప్రభుత్వం చేసిన ఈ కుంభకోణం వల్ల మొత్తం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. 2014లో.. మమ్మల్ని ఎన్నుకొని ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఇబ్బందుల నుంచి బ్యాంకింగ్ రంగాన్ని, దేశాన్ని దశల వారీగా బయటకు తీసుకొచ్చేలా మేం పని ప్రారంభించాం. ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేశాం. వృత్తి నైపుణ్యంపై దృష్టి సారించాం. దేశంలో ఉన్న చిన్న బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకులను తయారు చేశాం. బ్యాంకుల్లో పౌరులు డిపాజిట్ చేసిన మొత్తంలో రూ. 5 లక్షల వరకు మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నో సహకార బ్యాంకులు మునిగిపోవడం ప్రారంభించడంతో.. సాధారణ పౌరుల నమ్మకాన్ని తిరిగి పొందడం చాలా ముఖ్యంగా మారింది. సామాన్యుడు కష్టపడి సంపాదించిన తన డబ్బుని కోల్పోతున్నాడు. అందుకే 99 శాతం మంది పౌరులు తాము కష్టపడి సంపాదించిన మొత్తాన్ని తిరిగి పొందేలా హామీ పరిమితిని 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచాం. దివాలా కోడ్ తరహా చట్టపరమైన నియమాలను రూపొందించడం మా ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన చర్య. తద్వారా.. ఏదైనా కారణంతో ఓ సంస్థను మూసేస్తే.. బ్యాంకులపై చాలా తక్కువ ప్రభావం పడుతుంది. దీంతో పాటుగా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షలు విధించాం. బ్యాంకులను మోసం చేసిన వారి ఆస్తులను జప్తు చేశాం. ఇప్పుడు ఫలితం మీ ముందే ఉంది. ఒకప్పుడు వేల కోట్ల రూపాయలను నష్టపోవడం గురించి, ఎన్పీఏలకు సంబంధించి తరచూ వార్తల్లో నిలిచిన బ్యాంకులు ఇప్పుడు లాభాలను ఆర్జిస్తూ.. వార్తల్లో ఉంటున్నాయి.
స్నేహితులారా,
దేశానికున్న బలమైన బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు గత 9 ఏళ్లుగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి బ్యాంకు ఉద్యోగి చేస్తున్న కృషి మనందరికీ గర్వకారణం. బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులంతా కష్టపడి వాటిని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థ పురోగతిలో వారు ప్రధానపాత్రను పోషించారు. నన్నూ, నా లక్ష్యాన్ని వారు నిర్లక్ష్యం చేయలేదు. నన్ను నిరాశపరచలేదు. ‘‘డబ్బు లేనప్పుడు బ్యాంకు ఖాతాలను పేదలు ఏం చేసుకుంటారు?’’ అని జన్ ధన్ యోజన ప్రారంభించినప్పుడు పాత తరం ఆలోచనలతో ఉన్న వ్యక్తులు నన్ను అడిగారు. బ్యాంకులపై భారం పెరిగిపోతుంది, బ్యాంకు ఉద్యోగులు ఎలా పనిచేస్తారు? అనే ప్రతికూల ధోరణి ప్రబలంగా వ్యాపించింది. కానీ పేదల కోసం జన్ ధన్ ఖాతాలను తెరిచేందుకు బ్యాంకుల్లో పని చేసే నా స్నేహితులు రేయింబవళ్లూ కష్టపడ్డారు. బ్యాంకు ఉద్యోగులు మురికి వాడలకు వెళ్లి ప్రజలకు బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఇప్పుడు దేశంలో దాదాపు 50 కోట్ల జనధన్ ఖాతాలు ఉన్నాయి. ఇది బ్యాంకు ఉద్యోగులు చేసిన కృషి, వారి అంకితభావం వల్లే సాధ్యమైంది. కరోనా సమయంలో కోట్లాది మంది మహిళల ఖాతాల్లో నేరుగా సొమ్మును ప్రభుత్వం జమ చేసిందంటే.. అది బ్యాంకు ఉద్యోగుల కృషి వల్లనే.
స్నేహితులారా,
అసంఘటిత రంగంలో పని చేసే వారికి సహాయం చేసే వ్యవస్థ మన బ్యాంకింగ్ రంగంలో లేదని గతంలో కొంతమంది అసంబద్ధమైన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. కానీ 2014 తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. ముద్ర యోజన పరిధిలో యువతకు హామీ రహిత రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బ్యాంకు ఉద్యోగులే దీన్ని ముందుకు తీసుకెళ్లారు. స్వయం సహాయక బృందాలకు అందించే రుణాలను ప్రభుత్వం రెట్టింపు చేయాలని భావించినప్పుడు.. వారికి బ్యాంకు ఉద్యోగులే మరింత ఆర్థిక సాయం అందించారు. కొవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈ రంగానికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఎంఎస్ఎంఈ రంగానికి గరిష్ఠ పరిమితిలో రుణాలు అందించి 1.5 కోట్ల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చెందిన సంస్థలను, వాటి ద్వారా 1.5 కోట్ల మంది ఉపాధిని బ్యాంకు ఉద్యోగులే రక్షించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాలకు నేరుగా సొమ్ము జమ చేయాలని భావించినప్పుడు.. సాంకేతిక సాయంతో ఈ పథకాన్ని బ్యాంకర్లే విజయవంతం చేశారు.
వీధి వ్యాపారులు, కాలి బాటలపై వస్తువులను అమ్మేవారి కోసం స్వనిధి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పుడు.. పేదవారైన తమ సోదరీసోదరుల కోసం బ్యాంకర్లే కష్టపడి పని చేశారు. కొన్ని బ్యాంకు శాఖలైతే వారిని గుర్తించి రుణాలు అందించి సాయం చేశాయి. బ్యాంకు ఉద్యోగుల శ్రమ వల్ల ఇప్పుడు 50 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు బ్యాంకుల నుంచి సహాయాన్ని పొందగలిగారు. ఈ విషయంలో ప్రతి బ్యాంకు ఉద్యోగిని నేను అభినందిస్తున్నాను. మీ చేరికతో ఇఫ్పుడు బ్యాంకింగ్ రంగానికి కొత్త, శక్తి, విశ్వాసం, సమాజం వృద్ధికి ఏదైనా చేయాలనే నూతన స్ఫూర్తి వస్తుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల శ్రమకు మీ కృషి కూడా తోడవుతుంది. నిరుపేదలను బ్యాంకింగ్ రంగం బలోపేతం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ రోజు, నియామక పత్రంతో సహా సంకల్ప పత్రంతో మీరు తిరిగి వెళతారు.
స్నేహితులారా,
సరైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, సరైన విధానాలను రూపొందించినప్పుడు, ఫలితాలు గొప్పగా, అపూర్వంగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితమే దీనికి రుజువును ఈ దేశం చూసింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, అయిదేళ్ల వ్యవధిలోనే దేశంలో 13.5 కోట్ల మంది దారిద్ర్య రేఖను అధిగమించారు. భారత్ సాధించిన ఈ విజయంలో ప్రభుత్వోద్యోగుల కృషి కూడా ఉంది. పేదలకు పక్కా ఇళ్లు అందించడమైనా, టాయిలెట్లు నిర్మించడమైనా, విద్యుత్ సదుపాయం కల్పించాలన్నా.. ప్రతీ గ్రామానికి, ప్రతి ఇంటికీ అనేక పథకాలను ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్లారు. పేదలకు ఈ పథకాలు చేరువైనప్పుడు, వారి మనోధైర్యం పెరుగుతుంది. వారిలో కొత్త విశ్వాసం నిండుతుంది. మనమంతా కలసి నడిస్తే.. భారత్ నుంచి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని ఈ విజయం సూచిస్తుంది. దీనిలో ప్రభుత్వోద్యోగులు కీలకమైన పాత్రను పోషిస్తారు. పేదల కోసం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలపై ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అవగాహన ఉండాలి. అలాగే ఈ పథకాలకు ప్రజలను అనుసంధానించాలి.
స్నేహితులారా,
భారత్‌లో తగ్గుతున్న పేదరికానికి మరో కోణం ఉంది. పేదరికం తగ్గుతుంటే.. నవ మధ్య తరగతి దేశంలో విస్తరిస్తోంది. ఇది కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తోంది. భారత్‌లో పెరుగుతున్న ఈ నవ మధ్య తరగతి వర్గానికి అనేక అవసరాలు, ఆకాంక్షలు ఉంటాయి. వీటిని తీర్చేందుకే దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పుడు మన కర్మాగారాలు, పరిశ్రమల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది. వాటి నుంచి మన యువత అధిక లబ్ధి పొందుతోంది. ఇటీవలి కాలంలో ప్రతి రోజూ కొత్త రికార్డులు, కొత్త విజయాలు నమోదవుతున్నాయి.ఇప్పుడు భారత్ నుంచి రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అమ్ముడైన కార్ల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే భారత్‌లో విద్యుత్ వాహనాల అమ్మకాలు కూడా పెరిగాయి. ఇవన్నీ కలసి దేశంలో ఉపాధిని, ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి.
స్నేహితులారా,
భారత ప్రతిభను యావత్ ప్రపంచం చూస్తోంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ప్రజల వయసు వేగంగా పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో సీనియర్ సిజిటన్ల సంఖ్య పెరుగుతోంది. యువ జనాభా తగ్గుతోంది. శ్రామిక జనాభా తగ్గుతోంది. కాబట్టి భారత యువత తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి చాలా కష్టపడి పని చేయాల్సిన సమయమిది. భారతీయ ఐటీ నిపుణులకూ, వైద్యులకూ, నర్సులకూ ఎంత డిమాండ్ ఉందో మనం చూశాం. అలాగే గల్ఫ్ దేశాల్లో నిర్మాణ రంగంలో మన మిత్రులకు చాలా డిమాండ్ ఉంది. ప్రతి దేశంలోనూ, ప్రతి రంగంలోనూ భారతీయ ప్రతిభకు గౌరవం నిరంతరం పెరుగుతోంది. అందుకే నైపుణ్యాభివృద్దిపై గడచిన తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం దృష్టి సారించింది. పీఎం కౌశల్ వికాస యోజన ద్వారా దాదాపు 1.5కోట్ల మంది యువత శిక్షణ పొందారు. అలాగే మన యువత అంతర్జాతీయ అవకాశాలకు తగినట్టుగా సన్నద్ధమయ్యేలా 30 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అలాగే కొత్త వైద్య కళాశాలలు, కొత్త ఐటీఐలు, కొత్త ఐఐటీలు, సాంకేతిక విద్యాసంస్థలను నిర్మించే కార్యక్రమం కొనసాగుతోంది. 2014 వరకు, దేశంలో సుమారు 380 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. గత 9 ఏళ్లలో ఈ సంఖ్య 700కు పైగా పెరిగింది. అదే విధంగా, నర్సింగ్ కళాశాలల సంఖ్య సైతం భారీగా పెరిగింది. భారతీయ యువతకు లక్షలాది నూతన అవకాశాలను.. అంతర్జాతీయ అవసరాలను తీర్చగలిగే నైపుణ్యాలు అందిస్తాయి.
స్నేహితులారా,
చాలా సానుకూలమైన వాతావరణంలో మీరు ప్రభుత్వోద్యోగంలో చేరుతున్నారు. దేశానికున్న ఈ సానుకూల ధోరణిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీపై కూడా ఉంది. మీ ఆకాంక్షలను విస్తరించుకోవడానికి సైతం మీరు ప్రయత్నించాలి. నూతన బాధ్యతలను స్వీకరించిన అనంతరం కూడా నేర్చుకొనే ప్రక్రియను, స్వీయ అభివృద్ధిని కొనసాగించండి. ఈ విషయంలో మీకు సాయం చేయడానికి ప్రభుత్వం ఐజీవోటీ కర్మయోగి అనే ఆన్‌లైన్ అభ్యాస వేదికను సిద్ధం చేసింది. ఈ సౌకర్యం నుంచి వీలైనంత నేర్చుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. మరోసారి, కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న నేపథ్యంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. కొత్త బాధ్యతల స్వీకరణ ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. సేవ చేసే అవకాశం ఉన్న ప్రతి చోటా, దేశంలోని ప్రతి వ్యక్తి తమ కలను మీ ద్వారా నెరవేర్చుకొనే కొత్త శక్తిని పొందుతాడు. ప్రతి కలను, సంకల్పాన్ని, ఈ బాధ్యతను మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
సూచన: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.
***