హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో 'ఉగ్రవాద వ్యతిరేక సదస్సు-2025'ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఉగ్రవాదంపై జోరో టాలరెన్స్ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ప్రకారం
వర్ధమాన ముప్పులను ఎదుర్కోవడానికి వేదికగా మారిన ఈ వార్షిక సదస్సు: హోం మంత్రి
ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు దేశంతో పాటు
ప్రపంచంలో జరిగిన ప్రతి ఉగ్రవాద ఘటనలను అన్ని ఏజెన్సీలు విశ్లేషించాలి: హోం మంత్రి
ఉగ్రదాడుల విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉగ్రవాద రూపురేఖలు మారుతున్నందున మనం ఈ విషయంలో రెండు అడుగులు ముందుండాలి: హోం మంత్రి
రాబోయే తరాల కోసం ప్రతి సవాలును ఎదుర్కోగల పటిష్టమైన,
బలమైన 'ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్'ను తయారుచేసుకోవాలి: హోం మంత్రి
సంఘటిత నేరాలపై అన్ని కోణాల్లో పనిచేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకువస్తున్నాం: హోం మంత్రి
కార్యచరణలో ఏకరూపత ద్వారా మాత్రమే ముప్పుల విషయంలో
ఖచ్చితమైన అంచనా, నిఘా సమాచార మార్పిడి, సమన్వయ ప్రతిఘటన సాధ్యమౌతాయి: హోం మంత్రి
మొట్టమొదటిసారిగా 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాద దాడులకు ప్రణాళిక వేసిన వారిని భద్రతా దళాలు శిక్షించాయి.. 'ఆపరేషన్ మహాదేవ్' ద్వారా ప్రణాళికను అమలు చేసిన వారిని మట్టుబెట్టాయి: హోం మంత్రి
దేశవ్యాప్తంగా పోలీసుల కోసం ఒక ఉమ్మడి ఏటీఎస్ వ్యవస్థను తయారుచేయటం అత్యంత అవసరం..
రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్స్ దీనిని వీలైనంత త్వరగా అమలు చేయాలి: హోం మంత్రి
రాష్ట్ర పోలీసులతో కలిసి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ఏజెన్సీలు
జాతీయ భద్రత కోసం సమర్థవంతంగా పనిచేసే 'టీం ఇండియా'గా ఏర్పడాలి: హోం మంత్రి
ఎన్ఐఏ రూపొందించిన నవీకరించిన క్రైమ్ మాన్యువల్‌ను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి
సంఘటిత నేర నెట్‌వర్క్ డేటాబేస్, ఆయుధాల డేటాబేస్‌ను ప్రారంభించిన శ్రీ అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
26 DEC 2025 7:31PM by PIB Hyderabad
ఢిల్లీలో జరుగుతున్న ‘ఉగ్రవాద వ్యతిరేక సదస్సు-2025’ను ఈ రోజు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఎన్ఐఏ నవీకరించిన క్రైమ్ మాన్యువల్, సంఘటిత నేర నెట్‌వర్క్ డేటాబేస్, పోగొట్టుకున్న లేదా దోపిడీకి గురైన- రికవరీ చేసిన ఆయుధాల డేటాబేస్‌ను హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ సదస్సులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ బండి సంజయ్ కుమార్.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కార్యదర్శి, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సీనియర్ అధికారులు, ఉగ్రవాద వ్యతిరేక అంశాలకు సంబంధించిన కేంద్ర సంస్థలు, శాఖల అధికారులు.. చట్టం, ఫోరెన్సిక్స్, సాంకేతికత వంటి రంగాలకు చెందిన నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకోనున్నారు.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ప్రకారం వర్ధమాన ముప్పులను ఎదుర్కొనే విషయంలో ఈ వార్షిక సదస్సు ఒక వేదికగా మారిందని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఈ సదస్సును ఒక వార్షిక సంప్రదాయంగా మార్చే దిశగా ముందుకు సాగినట్లు ఆయన చెప్పారు. ఈ సదస్సు కేవలం చర్చల కోసం మాత్రమే కాదని ఇక్కడ కార్యాచరణ అంశాలు ఉద్భవిస్తాయని.. వాటి అమలు కోసం ఎన్ఐఏ, రాష్ట్రాల్లోని సంబంధిత ఏజెన్సీలు ఏడాది పొడవునా నిరంతరం శ్రమిస్తాయని ఆయన తెలిపారు. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఒక బలమైన ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్‌ను నిర్మించడంలో విజయం సాధిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సదస్సు దేశ భద్రతా సంకల్పాన్ని పునరుద్ఘాటించే మాధ్యమం మాత్రమే కాదని హోం మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. గత ఏడాదికాలంగా దేశంతో పాటు ప్రపంచంలో జరిగిన అన్ని ఉగ్రదాడులను వాటి గురించి అందిన నిఘా సమాచారంతో కలిపి విశ్లేషించడం, దానికి అనుగుణంగా మన ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం కూడా ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. సాంకేతిక పురోగతితో పాటు ఉగ్రవాద దాడుల్లో సాంకేతికతను ఉపయోగించడం వల్ల ప్రపంచంలో ఉగ్రవాద రూపురేఖలు మారుతున్నాయని.. దీనిని నిరోధించడానికి మనం కూడా సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు. కనిపించని భవిష్యత్తు సవాళ్లను ముందుగానే అంచనా వేయడం, వాటిని నిరోధించటాన్ని ఈ సదస్సుకు ఉన్న జాతీయ బాధ్యతగా ఆయన వర్ణించారు.
నేడు ఇక్కడ మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఎన్ఐఏ రూపొందించిన నవీకరించిన క్రైమ్ మాన్యువల్ ఈ రోజు ఆయన విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు, ప్రాసిక్యూషన్ అవసరాల కోసం ఈ మాన్యువల్‌ను అధ్యయనం చేసేలా చూడాలని రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్స్ అందరినీ ఆయన కోరారు. అలాగే ఈ రోజు ఆయుధాల ఈ-డేటాబేస్ కూడా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
సంఘటిత నేర వ్యవస్థలకు సంబంధించిన ఒక డేటాబేస్‌ను కూడా ఈ రోజు విడుదల చేసినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఈ వ్యవస్థలు ప్రారంభంలో కేవలం డబ్బులు వసూలు చేయడం, దోపిడీల కోసమే పనిచేస్తాయన్న ఆయన.. వాటి నాయకులు విదేశాలకు పారిపోయి అక్కడ స్థిరపడినప్పుడు స్వయంచాలకంగా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఏర్పాటు చేసుకుంటారని ఆయన వివరించారు. ఆ తర్వాత వాళ్లు దోపిడీల ద్వారా వచ్చే మొత్తాన్ని దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా ఎన్ఐఏ, సీబీఐ మార్గదర్శకత్వంలో ఏబీ సహకారం, ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకోవడం ద్వారా తమ పరిధిలో అటువంటి వ్యవస్థలను నిర్మూలించాలని ఆయన సూచించారు.
బైసరన్ లోయలో జరిగిన దాడి మొత్తం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ దాడి ద్వారా ఉగ్రవాదులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలని, కాశ్మీర్లో ప్రారంభమైన కొత్త అభివృద్ధి- పర్యాటక యుగానికి విఘాతం కలిగించాలని భావించారని అన్నారు. అత్యంత ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా మన భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి పాకిస్థాన్‌కు గట్టి సందేశాన్ని పంపాయని ఆయన చెప్పారు. ఉగ్రవాద దాడులను ప్రణాళిక చేసిన వాళ్లను 'ఆపరేషన్ సిందూర్' ద్వారా శిక్షించటం, సూత్రధారులు అందించిన ఆయుధాలతో ఉగ్ర ప్రణాళికను అమలు చేసిన వాళ్లను 'ఆపరేషన్ మహాదేవ్' ద్వారా మట్టుబెట్టిన మొదటి సంఘటన ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి సంబంధించిన రెండు విభాగాల్లో భద్రతా దళాలు, నిఘా సంస్థల ద్వారా భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు, భారత ప్రజలు పాకిస్థాన్ సూత్రధారులకు బలంగా తగిన సమాధానం ఇచ్చారని హోం మంత్రి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై మన బృందం సంపూర్ణ, విజయవంతమైన దర్యాప్తును నిర్వహించిందని.. రాబోయే రోజుల్లో దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు అధ్యయనం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తు ఫలితాలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను నిలదీస్తాయని ఆయన చెప్పారు.
ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు అద్భుతంగా దర్యాప్తు చేశారని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా కొనియాడారు. ఢిల్లీ ఘటనలో 40 కిలోల పేలుడు పదార్థాలు వాడగా అవి పేలకముందే మరో 3 టన్నుల పేలుడు పదార్థాలను రికవరీ చేశామనీ, ఢిల్లీ పేలుడు సంభవించడానికి ముందే ఈ కుట్రలో పాల్గొన్న మొత్తం బృందాన్ని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ మొత్తం నెట్‌వర్క్‌పై దర్యాప్తును మన ఏజెన్సీలన్నీ అత్యంత సమర్థవంతంగా నిర్వహించాయని ఆయన తెలిపారు. పహల్గామ్, ఢిల్లీ పేలుడు కేసుల దర్యాప్తు కేవలం సాధారణ పోలీసింగ్‌కు ఉదాహరణలు మాత్రమే కావని.. ఇవి పకడ్బందీ దర్యాప్తునకు నిదర్శనాలని ఆయన అన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండే అధికారి దేశాన్ని ఇటువంటి భారీ సంక్షోభం నుంచి ఏ విధంగా రక్షించగలరో చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
డీజీపీల సదస్సు, రక్షణ వ్యూహం సదస్సు, ఎన్-కార్డ్ సమావేశాలు, ఉగ్రవాద వ్యతిరేక సదస్సుల మధ్య సమన్వయం, సహకారం, కమ్యూనికేషన్ విషయంలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఈ నాలుగు స్తంభాలను విడిగా చూడలేమనీ, వీటన్నింటినీ కలిపే ఒక ఉమ్మడి సూత్రం ఈ ఉగ్రవాద వ్యతిరేక సదస్సు అని ఆయన పేర్కొన్నారు. ఎన్ఐఏ చాలా కష్టపడి ఒక ఉమ్మడి ఏటీఎస్ వ్యవస్థను రూపొందించి రాష్ట్రాల పోలీసు బలగాలకు పంపిందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏటీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయటం ప్రతి స్థాయిలోనూ ఏకరూప సన్నద్ధతకు అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే విధమైన ఏటీఎస్ వ్యవస్థ అత్యంత ముఖ్యమనీ, రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్స్ అందరూ దీనిని వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాల ఏటీఎస్ యూనిట్లు నిదాన్ (ఎన్ఐడీఏఏఎన్), నాట్‌గ్రిడ్ ఉపయోగించడాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దర్యాప్తులో ఈ రెండింటినీ ఉపయోగించడం వల్ల కేసులను మిగతా వాటితో సంబంధం లేకుండా దర్యాప్తు చేయటాన్ని నిరోధించటమే కాకుండా ఆయా కేసుల్లోని అదృశ్య సంబంధాలు కూడా వెలుగులోకి వస్తాయని ఆయన వివరించారు. కొన్ని రకాల దర్యాప్తుల్లో నాట్‌గ్రిడ్ వాడకాన్ని, మరికొన్ని రకాల కేసుల్లో నిదాన్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ఆయన ప్రముఖంగా చెప్పారు.
మల్టీ ఏజెన్సీ సెంటర్, నేషనల్ మెమరీ బ్యాంక్‌లో క్రియాశీల భాగస్వామ్యాన్ని తప్పకుండా నిర్ధారించాలని కేంద్ర హోం మంత్రి సూచించారు. ఉగ్రవాదులను శిక్షించడంలో ఉమ్మడి ఏటీఎస్ వ్యవస్థ, కార్యాచరణ ఏకరూపత అనేవి గొప్ప ప్రయోజనాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యాచరణ ఏకరూపతను సాధించనంత కాలం ముప్పులను ఖచ్చితంగా అంచనా వేయలేమని, నిఘా సమాచార మార్పిడిని సరిగ్గా ఉపయోగించుకోలేమని, సమన్వయంతో ప్రతిఘటన చర్యలను చేపట్టలేమని ఆయన వివరించారు. దర్యాప్తు నుంచి ప్రాసిక్యూషన్, ప్రతిఘటన చర్యల వరకు మనం ఖచ్చితమైన ఏకరూపతను నిర్ధారించాలని ప్రధానంగా చెప్పారు.
భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం కారణంగా మన భౌగోళిక రాజకీయ స్థానం కూడా చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమిస్తున్న కొద్దీ సమస్యలు కూడా అదే రకంగా పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున అప్రమత్తతను కూడా తదనుగుణంగా పెంచుకోవాలని హోం మంత్రి సూచించారు. దేశ అంతర్గత భద్రతను నిర్ధారించే సన్నాహాలు సరిహద్దుల వద్ద ప్రారంభం కావని.. బదులుగా సరిహద్దులను రక్షించే సన్నాహాలు చాలా మైళ్ల దూరంలోనే ప్రారంభం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్- సమాచార యుద్ధక్షేత్రం, ఆర్థిక నెట్‌వర్క్‌ల దుర్వినియోగం, ఉగ్రవాదానికి ఉన్న హైబ్రిడ్ ఫార్మాట్ కోసం ఒక బలమైన జాతీయ గ్రిడ్ వ్యవస్థను తయారు చేయాలని ఆయన చెప్పారు. అప్రమత్తంగా ఉంటూ వేగవంతమైన, ఫలితాల ఆధారిత చర్యలు తీసుకోగల సామర్థ్యం కలిగిన వ్యవస్థను ఇటువంటి సమావేశాల ద్వారా మాత్రమే సాధించగలమని ఆయన తెలిపారు. బహుళ అంచెల భద్రతా నమూనాను తయారుచేయటం, ఉగ్రవాదంపై నిర్దాక్షిణ్యమైన విధానంతో పనిచేయడం అనేవి రాబోయే రోజుల్లో మనల్ని సురక్షితంగా ఉంచగలవని ఆయన స్పష్టం చేశారు.
‘తెలుసుకోవాల్సిన అవసరం’ అనే పాత పద్ధతికి బదులుగా ‘పంచుకోవాల్సిన బాధ్యత’ అనే సూత్రంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. కేంద్ర సంస్థలు, రాష్ట్ర పోలీసులు ఆయా స్థాయుల్లో సాంకేతికతను బాగా ఉపయోగించాయనీ, విడివిడిగా అభివృద్ధి చేసిన సాంకేతికత, విడివిడిగా సేకరించిన డేటా అనేవి బుల్లెట్లు లేని తుపాకీ వంటివని అభిప్రాయపడ్డారు. అన్ని డేటా వ్యవస్థలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలిగితే, ఒకే విధమైన సాంకేతికతను ఉపయోగించి వాటిని తయారుచేయగలిగితే అది మరింత ఉత్తమంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సాంకేతికత, డేటాకు సంబంధించి ఉత్తమమైన జాతీయ స్థాయి విధానాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎన్ఐఏ, ఐబీ చర్చించాలని కోరారు. దీనిని బలోపేతం చేయడంలో రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఉగ్రవాదులు, నేరస్థుల డేటాబేస్‌ను ఏమాత్రం ఉపేక్షలేని ఉగ్రవాదం అనే విధానానికి ప్రధాన ఆస్తిగా మార్చాలని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్స్ ఈ డేటాబేస్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘటిత నేరాలపై అన్ని కోణాల్లో పనిచేసేందుకు ఒక ప్రణాళికను తీసుకొస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి ప్రకటించారు.
ట్రయల్-ఇన్-అబ్సెంటియాతో ముడిపడి ఉన్న వివాదాలకు భయపడకుండా దీనిపై ముందుకెళ్లాలని కేంద్ర హోం మంత్రి సూచించారు. ఇది విదేశాలకు పారిపోయిన నేరస్థులు తిరిగి దేశానికి వచ్చేలా ఒత్తిడి తెస్తుందని తెలిపారు. రాష్ట్ర పోలీసులతో కలిసి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ఏజెన్సీలు.. జాతీయ భద్రత కోసం సమర్థవంతంగా పనిచేసే ‘టీం ఇండియా’గా ఏర్పడాలని హోం మంత్రి పిలుపునిచ్చారు. భారత్ పురోగమిస్తున్న కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతూనే ఉంటాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశం, రాబోయే తరాల అధికారుల కోసం ఒక బలమైన ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్‌ను నిర్మించడం మనందరి బాధ్యత అని తెలిపిన ఆయన.. తద్వారా భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2209102)
సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada