రాష్ట్రపతి సచివాలయం
‘‘ప్రజలే కేంద్రంగా జాతీయ భద్రత: వికసిత్ భారత్ నిర్మాణంలో సమాజ భాగస్వామ్యం’’ అంశంపై ఐబీ శతాబ్ది ఎండోమెంట్ ఉపన్యాసంలో భారత రాష్ట్రపతి ప్రసంగం
ఆర్థిక పెట్టుబడులు, వృద్ధికి భద్రత కీలక చోదక శక్తి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జాతీయ భద్రతా వ్యూహంలో పౌరుల సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం అత్యంత ముఖ్యం, దీని ద్వారా పౌరులను దేశ భద్రత, నిఘా వ్యవస్థలో సమర్థవంతమైన వనరులుగా మార్చగలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
23 DEC 2025 1:45PM by PIB Hyderabad
న్యూఢిల్లో నేడు జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) శతాబ్ది ఎండోమెంట్ ఉపన్యాసంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
రాష్ట్రపతి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ఐబీ అద్భుతమైన పాత్ర పోషిస్తుందని, ఇది గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
‘ప్రజలే లక్ష్యంగా జాతీయ భద్రత- వికసిత్ భారత్ నిర్మాణంలో సమాజ భాగస్వామ్యం’ ’ ఇతివృత్తంలో కొనసాగుతున్న ఈ ఉపన్యాసం.. మన దేశానికి తక్షణ, దీర్ఘకాలిక ప్రాముఖ్యత కలిగి ఉందని రాష్ట్రపతి అన్నారు. జా తీయ భద్రత అనేది కేవలం ప్రభుత్వ సంస్థల పని మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి బాధ్యత అనే అవగాహనను ఐబీతో సహా అన్ని సంస్థలు ప్రజల్లో కల్పించాలని ఆమె సూచించారు. అప్రమత్తత కలిగిన పౌరులు జాతీయ భద్రతలో నిమగ్నమైన ప్రభుత్వ సంస్థల ప్రయత్నాలకు గొప్ప మద్దతును అందించగలరని చెప్పారు. మన పౌరులు సమాజాలుగా సంఘటితమైనప్పుడు గొప్ప సమన్వయాన్ని సాధించగలరని, జాతీయ భద్రతకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వగలరని తెలిపారు. మన రాజ్యాంగం పౌరుల ప్రాథమిక విధులను వివరిస్తుంది. ఈ విధుల్లో చాలావరకు జాతీయ భద్రత విస్తృత పరిమాణాలకు సంబంధించినవే. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా, నివాసితుల సంక్షేమ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ఇతర అనేక సమాజాలు ఈ విధులను చేయగలవు.
సమాజ భాగస్వామ్యం జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని రాష్ట్రపతి అన్నారు. భద్రతా సంక్షోభాలను నివారించడంలో అప్రమత్తత కలిగిన పౌరులు తమ సమాచారంతో బలగాలకు సహకరించిన అనేక ఉదాహరణలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలే లక్ష్యంగా పనిచేయడమే జాతీయ భద్రతకు విస్తృతమైన అర్థం, వ్యూహమని తెలిపారు. ప్రజలు తమ చుట్టూ జరుగుతున్న విషయాలను పట్టనట్టు ఉండకుండా.. తమ పరిసరాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రతా పరంగా అప్రమత్తంగా, క్రియాశీల భాగస్వాములుగా మారాలని అన్నారు. ‘జన్ భాగిదారి’ అనేది ప్రజా కేంద్రిత భద్రతకు కీలకమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
పౌర పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రత సంస్థలు ప్రజలకు సేవ చేయాలనే భావనతో పనిచేయాలని రాష్ట్రపతి అన్నారు. ఈ సేవా దృక్పథమే ప్రజల్లో భద్రతా సంస్థలపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, సమాజ భాగస్వామ్యంతో కూడిన జాతీయ భద్రతా వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నమ్మకం అత్యంత అవసరమని ఆమె చెప్పారు.
బహుముఖ భద్రతా సవాళ్లు, ముప్పులను భారత్ ఎదుర్కొంటోందని రాష్ట్రపతి అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తతలు, ఉగ్రవాదం, తీవ్రరవాదం, తిరుగుబాట్లు, మతపరమైన తీవ్రవాదం భద్రతా ఆందోళన కలిగించే కీలక రంగాలుగా ఉన్నాయని చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో సైబర్ నేరాలు తీవ్రమైన భద్రత ముప్పుగా ఎదిగాయని, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా భద్రత లోపిస్తే దాని ఆర్థిక ప్రభావం ఆ ప్రాంతాన్ని మించి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక పెట్టుబడి, వృద్ధికి భద్రత కీలకమైన చోదక శక్తుల్లో ఒకటని.. ‘సమృద్ధ భారత్’ నిర్మాణానికి 'సురక్షిత్ భారత్' అభివృద్ధి కీలకమని రాష్ట్రపతి తెలిపారు.
దేశంలో వామపక్ష తీవ్రవాదం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అంతర్గత భద్రత విభాగాలకు చెందిన బలగాలు, సంస్థలు చేపట్టిన తీవ్రమైన చర్యలే వామపక్ష తీవ్రవాదం అంతరించిపోవడానికి కీలక కారణమని ఆమె తెలిపారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి అనుసరించిన సమగ్ర విధానం వల్లే ఇది సాధ్యమైందని ఆమె అన్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక వికాసాన్ని ప్రోత్సహించడం ద్వారా తీవ్రవాదులు, తిరుగుబాటు సంస్థలు ప్రజలను దోచుకోకుండా అడ్డుకోవడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ఆమె వివరించారు.
సమాచార ప్రపంచాన్ని సోషల్ మీడియా పూర్తిగా మార్చేసిందని రాష్ట్రపతి తెలిపారు. అయితే ఇందులో సృజనాత్మకత, విధ్వంసం.. రెండింటికీ అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలను తప్పుడు సమాచారం నుంచి రక్షించడం ప్రస్తుతం పెద్ద సవాలుతో కూడిన పని అని, దీనిని నిరంతరం, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, సోషల్ మీడియాలో నిరంతరం వాస్తవాలను, సరైన సమాచారాన్ని అందించే క్రియాశీల సోషల్ మీడియా వినియోగదారుల సమూహాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
జాతీయ భద్రతకు ఎదురవుతున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లు సంప్రదాయేతరమైనవి, డిజిటల్ రూపంలో ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సమస్యల్లో ప్రధానంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఉద్భవిస్తున్నాయని ఆమె తెలిపారు.ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతికంగా సమర్థులైన పౌర సమాజాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే గృహ, సంస్థాగత, సామాజిక స్థాయిల్లో నిరంతర నిఘా అవసరమని సూచించారు. ఫిషింగ్, డిజిటల్ మోసాలు, ఆన్లైన్ వేధింపుల గురించి పౌరులు ఫిర్యాదు చేయడానికి డిజిటల్ వేదికలు తోడ్పడతాయని తెలిపారు. పౌరులు అందించే తక్షణ వాస్తవిక సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ముందస్తు రక్షణ చర్యలను చేపట్టవచ్చని ఆమె వివరించారు. అప్రమత్తత కలిగిన పౌర సముదాయాలు సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఒక ‘రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆమె అన్నారు.
మన వ్యూహంలో పౌరుల సంక్షేమానికి, ప్రజా భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం ద్వారా దేశ భద్రత, నిఘాలో ప్రతి పౌరుడిని ఒక సమర్థవంతమైన సమాచార వనరుగా మార్చవచ్చని రాష్ట్రపతి తెలిపారు. ప్రజా భాగస్వామ్యం ద్వారా కొనసాగే ఈ పరివర్తన 21వ శతాబ్దపు సంక్లిష్టమైన, బహుముఖ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజా భాగస్వామ్యం ద్వారా మనమందరం అప్రమత్తమైన, శాంతియుతమైన, సురక్షితమైన, సంపన్నమైన భారత్ ను నిర్మించే దిశగా వేగంగా ముందుకు సాగుతామని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
(रिलीज़ आईडी: 2207944)
आगंतुक पटल : 3