ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విపత్తు ముప్పు తగ్గింపుపై జి20 కార్యాచ‌ర‌ణ బృందం మూడో సమావేశంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రసంగం

प्रविष्टि तिथि: 24 JUL 2023 7:06PM by PIB Hyderabad

వేదికను అలంకరించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి శ్రీమతి మామీ మీజూటోరి, భారత జి20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, జి20 సభ్య-అతిథి దేశాల నుంచి హాజరైన సహచరులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, వర్కింగ్ గ్రూప్ చైర్మన్ శ్రీ కమల్ కిషోర్, భారత జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి, హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సహచరులు, సోదరీసోదరులారా!

నేటి విపత్తు ముప్పు తగ్గింపు కార్యాచరణ బృందం మూడో సమావేశంలో మీతో కలసి పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో మనం గాంధీనగర్‌లో తొలిసారి సమావేశమయ్యాం. అప్పటి నుంచీ ప్రపంచం కొన్ని అసాధారణ విపత్తులను ఎదుర్కొంది. దాదాపు ఉత్తరార్ధగోళంలోని నగరాలన్నీ భారీ వడగాడ్పుల గుప్పిట్లో చిక్కి విలవిలలాడాయి. కెనడా అడవుల్లో కార్చిచ్చు, తదనంతరం పొగమంచు బెడదతో ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. మరోవైపు భారత్‌లోని తూర్పు-పశ్చిమ తీరాలలో పెను తుపానుల బారినపడటం చూశాం. దేశ రాజధాని ఢిల్లీ 45 ఏళ్లలో ఎన్నడూలేని రీతిలో అత్యంత దారుణ వరదలు చవిచూసింది! ఇక వర్షాకాలం ఇంకా సగం కూడా పూర్తికాలేదు!

మిత్రులారా!

వాతావరణ మార్పు సంబంధిత విపత్తులు విరుచుకుపడే రోజులు ఎప్పుడో ఒకసారి వచ్చే రోజులు పోయాయి. మనం ఇప్పటికే పరస్పరం ముడిపడి ఉన్న అనేక విపత్తుల మధ్య జీవిస్తున్నాం. అవి భూగోళం మీద ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఇలాంటి సవాళ్లు ఈ కార్యాచరణ బృందం ఏర్పాటు ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన బృందం నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో ఎంతో ప్రగతి సాధించి, నవ్యోత్తేజం సృష్టించింది. అయితే, మనమింకా చాలా చేయాల్సి ఉంది. ఆ మేరకు మన బృందం లక్ష్యం నేటి సమస్యలకు అనుగుణమైనదిగా ఉండటం తప్పనిసరి. అంచలంచెలుగా మార్పులు వచ్చే రోజులు పోయాయి. కాబట్టి, కొత్త విపత్తుల నుంచి ముప్పు నివారణ, ప్రస్తుత విపత్తు ముప్పుల సమర్థ నిర్వహణకు స్థానిక-జాతీయ-ప్రపంచ స్థాయి వ్యవస్థలలో వినూత్న మార్పులు అవశ్యం. విభిన్న జాతీయ-అంతర్జాతీయ కృషి సమష్టి ప్రభావం చూపాలంటే వాటన్నిటి మధ్య సమన్వయం చురుగ్గా ఉండాలన్నది వాస్తవం. అందువల్ల సంకుచిత సంస్థాగత దృక్పథాల మేరకు సాగే విడివిడి ప్రయత్నాలు ఏమాత్రం తగినవి కాబోవు. ఈ పరిస్థితులలో కావాల్సిందల్లా సమస్య పరిష్కార విధానం ప్రాతిపదికగా మనం ముందుకెళ్లడమే.

ఐరాస సెక్రటరీ జనరల్ చేపట్టిన “అందరికీ ముందస్తు హెచ్చరిక” చర్యలే ఈ విధానానికి ఒక ఉదాహరణ. ఈ నేపథ్యంలో “ముందస్తు హెచ్చరిక-ముందస్తు కార్యాచరణ”ను జి20 ఐదు ప్రాథమ్యాల్లో ఒకటిగా గుర్తించి, దానికి పూర్తి ప్రాధాన్యమిచ్చిందని గమనించాలి. విపత్తు ముప్పుల తగ్గింపు నిమిత్తం నిధులు సమకూర్చడంలో సంబంధిత అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, అన్ని స్థాయులలో నిర్దిష్ట విధానాలను అనుసరించడం ముఖ్యం. భారత్‌కు సంబంధించి కొన్నేళ్లుగా దేశంలో విపత్తు ముప్పు తగ్గింపు నిమిత్తం నిధులు సమకూర్చే విధానాన్ని మేం పూర్తిగా మార్చేశాం. ఆ మేరకు విపత్తు ప్రతిస్పందనను మాత్రమేగాక ముప్పుల తగ్గింపు, సంసిద్ధత, పునరుద్ధరణకూ నిధులు సమకూర్చడంపై అంచనాలు రూపొందించగల యంత్రాంగాన్ని మేం ఏర్పాటు చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలోనూ మనకు ఇదే తరహా ఏర్పాట్లు ఎందుకు చేసుకోకూడదు? విపత్తు ముప్పు తగ్గింపు దిశగా అందుబాటులోగల వివిధ ఆర్థిక సహాయ మార్గాల మధ్య మనం మరింత సమన్వయం పాటించాలి. విపత్తు ముప్పుల తగ్గింపు నిమిత్తం నిధులు సమకూర్చుకోవడంలో వాతావరణ ఆర్థికం అంతర్భాగం కావాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆర్థిక సహాయ సమీకరణ ఒక సవాలు కాబట్టి, దాన్ని విస్మరించి అన్ని అవసరాలనూ తీర్చుకోవాలంటే మనమెంతో దూరం ప్రయాణించలేం. ప్రైవేట్ ఆర్థిక సహాయ సంస్థలను ఈ దిశగా ఆకర్షించడానికి ప్రభుత్వాలు అనువైన వాతావరణం సృష్టించడం ఎలా? ఈ అంశంలో వేగాన్ని జి20 ఎలా పెంచుతుంది... విపత్తు ముప్పుల తగ్గింపులో ప్రైవేట్ పెట్టుబడి కార్పొరేట్ సామాజిక బాధ్యత మాత్రమే కాదని, సంస్థల ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో భాగమని మనం స్పష్టం చేయలేమా?

విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల రంగంలో కొన్నేళ్ల కిందట అనేక జి20 దేశాలు, ఐక్యరాజ్య సమితి, ఇతరుల భాగస్వామ్యంతో మేం ఏర్పాటు చేసిన విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి సాధిస్తున్న విజయాలను మనం ఇప్పటికే చూస్తున్నాం. చిన్నచిన్న వర్ధమాన ద్వీప దేశాలు సహా ప్రపంచ దేశాలన్నీ తమ ప్రమాణాల ఉన్నతీకరణ కోసం ముప్పు సమాచార సమీకరణలో పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పను చేపట్టడం ఎలాగో ఈ కూటమి పనితీరు స్పష్టం చేసింది. ఈ ఆలోచనలను భారీస్థాయికి చేర్చేలా మనం కృషి చేయడం ముఖ్యం! మనం ప్రయోగాత్మక కార్యకలాపాలను మించి ఆలోచిస్తూ స్థాయి పెంపు దిశగా మన కార్యక్రమాలను రూపొందించాలి. విపత్తుల తర్వాత “సంపూర్ణంగా కోలుకోవడం”పై  కొన్నేళ్లుగా మాకు ఆచరణాత్మక అనుభవం ఉంది. అయితే, కొన్ని మంచి విధానాల సంస్థాగతీకరణ మార్గాలను మనం అన్వేషించాలి. “ప్రతిస్పందన సంసిద్ధత” తరహాలో ఆర్థిక వనరులు, సంస్థాగత యంత్రాంగాలు, సామర్థ్యాల ప్రాతిపదికన “పునరుద్ధరణ సంసిద్ధత”కు ప్రాధాన్యమివ్వాలి.

మిత్రులారా!

కార్యాచరణ బృందం పరిశీలిస్తున్న ఐదు ప్రాథమ్యాలకు సంబంధించిన అన్ని లక్ష్యాల సాధనలో గణనీయ ప్రగతి సాధించడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. కొద్ది రోజుల్లో మీరు చర్చించబోయే సమాచార ముసాయిదాను చూశాను. ఇది జి20 దేశాలకు సంబంధించి విపత్తు ముప్పుల తగ్గింపుపై విస్పష్ట, వ్యూహాత్మక కార్యక్రమాల జాబితాను మన ముందుంచుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచీ మన బృందం చర్చలలో ప్రస్ఫుటమైన ఏకాభిప్రాయం, సమన్వయం, సహ-సృష్టి స్ఫూర్తి రాబోయే మూడు రోజుల్లోనే కాకుండా ఆ తర్వాత కూడా కొనసాగాలని ఆశిస్తున్నాను.

ఈ దిశగా మన విజ్ఞాన భాగస్వాముల నుంచి లభించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞులం. ఈ బృందం కార్యకలాపాలకు మద్దతివ్వడంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి శ్రీమతి మామీ  మీజూటోరి భాగస్వామ్యానికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యాచరణ బృందం కార్యకలాపాలను రూపొందించే భాగస్వామ్య త్రయం విషయంలోనూ మేం చాలా సంతృప్తితో ఉన్నాం. ఇండోనేషియా, జపాన్, మెక్సికో సహా గతంలో జి20 అధ్యక్ష హోదాలో వేసిన పునాదులపై మేం ముందడుగు వేశాం. మా తర్వాత ఈ బాధ్యతను బ్రెజిల్ నిర్వర్తించనుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ సమావేశానికి హాజరైన ఆ దేశ సెక్రటరీ వోల్నీని స్వాగతించడం మాకెంతో సంతోషదాయకం. మీకు మా పూర్తి మద్దతు, సహకారం ఉంటాయని ఈ సందర్భంగా సెక్రటరీ వోల్నీతోపాటు వారి బృందానికి హామీ ఇస్తున్నాం.

భారత్‌ జి20 అధ్యక్ష బాధ్యత స్వీకరించాక గత 8 నెలల్లో, యావద్దేశం ఎంతో ఉత్సాహంగా కార్యకలాపాల్లో పాల్గొంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 56 ప్రదేశాలలో 177 సమావేశాలు నిర్వహించగా, వివిధ దేశాల ప్రతినిధులు చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. వారంతా భారత సామాజిక, సాంస్కృతిక, సహజ వైవిధ్యాన్ని కూడా చూశారు. జి20 ఎజెండా కీలకాంశాల్లో ఎంతో పురోగతి సాధించాం. మరో ఒకటిన్నర నెలల్లో నిర్వహించబోయే శిఖరాగ్ర సదస్సు ఒక చారిత్రక ఘట్టం కాగలదని నిస్సందేహంగా విశ్వసిస్తున్నాను. అంతిమ ఫలితం సాధనలో మీ అందరి సహకారం గణనీయమైనదిగా ఉంటుంది.

విపత్తు ముప్పుల తగ్గింపుపై యావత్‌ ప్రపంచం కోసం జి20 ఒక అర్థవంతమైన నిర్ణయం దిశగా సాగనున్న భవిష్యత్‌ చర్చలపై మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2207233) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Manipuri , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam