ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని


జామ్‌నగర్‌లో ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని స్థాపించటం భారత్‌కు లభించిన గౌరవం.. ఇది దేశానికి గర్వకారణం: ప్రధాని

ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఆరోగ్యం, సమతుల్యత, సామరస్యపూర్వకమైన జీవితం వైపు నడిపించిన యోగా: ప్రధాని

భారత్‌ చేసిన కృషితో 175 కంటే ఎక్కువ దేశాల సహకారంతో జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి: ప్రధాని

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి నలుమూలల్లోని ప్రజల జీవితాలను తాకింది: ప్రధాని

ఢిల్లీలో డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం మరొక కీలక ఘట్టం: ప్రధాని

భారత్ అందించిన వినమ్రమైన బహుమతిగా ఉన్న ఈ గ్లోబల్ హబ్ పరిశోధనను ముందుకు తీసుకెళ్తుంది.

చట్టపరమైన నియంత్రణను బలోపేతం చేస్తుంది. సామర్థ్య నిర్మాణాన్ని పెంపొందిస్తుంది: ప్రధాని

సమతుల్యతే ఆరోగ్యానికి అసలైన సారాంశమని ఆయుర్వేదం చెబుతోంది. శరీరం ఈ సమతుల్యతను

కాపాడుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నిజంగా ఆరోగ్యవంతుడిగా ఉన్నట్లు: ప్రధాని

సమతుల్యతను పునరుద్ధరించడం అనేది ఇకపై కేవలం ప్రపంచ లక్ష్యం మాత్రమే కాదు. ఇదొక ప్రపంచ అత్యవసర పరిస్థితిగా మారింది. దీనిని పరిష్కరించడానికి మనం మరింత వేగం, దృఢమైన నిబద్ధతతో పనిచేయాలని ఇది చెబుతోంది: ప్రధాని

శారీరక శ్రమ లేకుండా వనరులు, సౌకర్యాలు పెరగడం మానవ ఆరోగ్యానికి ఊహించని సవాళ్లను తీసుకొస్తోంది: ప్రధాని
సంప్రదాయ వైద్యం కేవలం తక్షణ అవసరాలకు మించి ఆలోచించాలి.. భవిష్యత్తు కోసం సిద్ధమవ్వడం మనందరి ఉమ్మడి బాధ్యత: ప్రధాని

प्रविष्टि तिथि: 19 DEC 2025 7:07PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వైద్య రంగ నిపుణులు లోతైన అర్థవంతమైన చర్చల్లో నిమగ్నమయ్యారని ప్రధాని అన్నారు. ఈ విషయంలో భారత్ ఒక బలమైన వేదికగా నిలుస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో డబ్ల్యూహెచ్ఓ చురుకైన పాత్ర పోషిస్తోందన్న ఆయన.. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, హాజరైన ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
“జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని స్థాపించటం భారత్‌కు లభించిన గౌరవం, దేశానికి ఇది గర్వకారణం” అని ప్రధానమంత్రి అన్నారు. 2022లో జరిగిన మొదటి సంప్రదాయ వైద్య సదస్సులో  ప్రపంచం ఎంతో నమ్మకంతో భారత్‌కు ఈ బాధ్యతను అప్పగించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కేంద్రం ప్రతిష్ఠ, ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని.. ఈ సదస్సు విజయవంతం కావడమే దీనికి పెద్ద ఉదాహరణ అని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. ఈ సదస్సు సంప్రదాయ జ్ఞానం, ఆధునిక పద్ధతుల కలయికకు సాక్ష్యంగా నిలుస్తోందని.. వైద్య విజ్ఞానం, సమగ్ర ఆరోగ్యం విషయంలో భవిష్యత్తును మార్చగల పలు కొత్త కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు, ప్రతినిధుల మధ్య చర్చలకు ఈ సదస్సు వేదికగా నిలిచిందని.. ఇది ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడానికి, నిబంధనలను సరళీకరించడానికి, శిక్షణ-  జ్ఞానాన్ని పంచుకోవడానికి కొత్త మార్గాలను తెరిచిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సంప్రదాయ వైద్యం మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా మారే విషయంలో ఇటువంటి సహకారం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
ప్రపంచ భాగస్వామ్యాల సామర్థ్యాన్ని సదస్సులో పలు ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయం తెలియజేస్తోందన్న ఆయన.. పరిశోధనలను బలోపేతం చేయడం, సంప్రదాయ వైద్య రంగంలో డిజిటల్ సాంకేతికత వినియోగాన్ని పెంచడం, ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన నియంత్రణ చట్రాలను రూపొందించడం వంటివి సంప్రదాయ వైద్యాన్ని గొప్పగా సాధికారితం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రదర్శనలో డిజిటల్ ఆరోగ్య సాంకేతికత, ఏఐ ఆధారిత సాధనాలు, పరిశోధనా ఆవిష్కరణలు, ఆధునిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ప్రదర్శించారని.. ఇవన్నీ కలిసి సంప్రదాయం, సాంకేతికత మధ్య కొత్త సహకారాన్ని తెలియజేశాయని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయం, సాంకేతికత కలిసినప్పుడు ప్రపంచ ఆరోగ్యాన్ని మరింత ప్రభావవంతంగా మార్చే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని.. అందుకే ప్రపంచ దృక్కోణం నుంచి ఈ సదస్సు విజయం అనేది గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని ప్రధానమంత్రి చెప్పారు.
“యోగా అనేది సంప్రదాయ వైద్య విధానంలో ఒక అంతర్భాగం. ఇది ప్రపంచం మొత్తానికి ఆరోగ్యం, సమతుల్యత, సామరస్య మార్గాన్ని చూపింది” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. భారత్ చేసిన కృషి, 175 కంటే ఎక్కువ దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో యోగా ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుందని అన్నారు. యోగాను ప్రాచూర్యంలోకి తెచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. గౌరవ జ్యూరీ ద్వారా కఠినమైన ప్రక్రియతో ఎంపికైన కొందరికి ఈ రోజు ‘ప్రధానమంత్రి అవార్డులు’ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. యోగా పట్ల అంకితభావం, క్రమశిక్షణ, జీవితకాల నిబద్ధతకు ఈ అవార్డు గ్రహీతలు నిదర్శనమని.. వారి జీవితాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. అవార్డు గ్రహీతలను ప్రశంసించిన ఆయన వారందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు శాశ్వతత్వాన్ని తీసుకొచ్చేందుకు పలు ముఖ్యమైన చర్యలు తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సంప్రదాయ వైద్యానికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం, విధాన పత్రాలను ఒకే చోట భద్రపరిచే ప్రపంచ వేదికగా 'సంప్రదాయ వైద్య ప్రపంచ గ్రంథాలయం' ప్రారంభించడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం వల్ల ఉపయోగకరమైన సమాచారం అన్ని దేశాలకు సమానంగా చేరటం సులభతరమవుతుందని ఆయన చెప్పారు. భారత్ జీ20 అధ్యక్షతన జరిగిన మొదటి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సదస్సులో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. నేడు ఆ నిబద్ధత నెరవేరిందని పేర్కొన్నారు.
వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు ప్రపంచ సహకారానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారన్న ఆయన.. ప్రమాణాలు, భద్రత, పెట్టుబడి వంటి అంశాలపై చర్చలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఈ చర్చలు 'ఢిల్లీ డిక్లరేషన్'కు మార్గం సుగమం చేశాయని.. ఇది రాబోయే సంవత్సరాలకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాల విశిష్ట మంత్రుల ఉమ్మడి కృషిని ప్రధాని మోదీ అభినందించారు.. వారి సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఢిల్లీలో ఈ రోజు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు. దీనిని భారత్‍ ఇచ్చిన ఒక వినమ్రమైన బహుమతిగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యాలయం పరిశోధన, నియంత్రణ, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ కేంద్రంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
స్వస్థత విషయంలో ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలపై భారత్ దృష్టి సారిస్తోందని తెలిపిన ప్రధానమంత్రి, ఈ విషయంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రకటించారు. మొదటిది దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలను కలుపుతూ బిమ్‌స్టెక్ దేశాల కోసం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు కాగా.. రెండోది విజ్ఞానం, సంప్రదాయ పద్ధతులు, ఆరోగ్యాన్ని ఏకీకృతం చేసే లక్ష్యంతో జపాన్‌తో కుదిరిన సహకారం అని ఆయన పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశ ఇతివృత్తమైన 'సమతుల్యత పునరుద్ధరణ: సైన్స్- ఆరోగ్యం, శ్రేయస్సుల అభ్యాసం' సంపూర్ణ ఆరోగ్య ప్రాథమిక ఆలోచనను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆయుర్వేదం… ఆరోగ్యంతో సమతుల్యతను సమానం చేస్తుందనీ, ఈ సమతుల్యతను కాపాడుకునే శరీరాలు మాత్రమే నిజంగా ఆరోగ్యంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. మధుమేహం, గుండెపోటు, కుంగుబాటుల నుంచి క్యాన్సర్ వరకు వ్యాధులన్నీ తరచుగా జీవనశైలి, అసమతుల్యతలను అంతర్లీన కారణాలుగా కలిగి ఉన్నాయన్నారు. వాటిలో పని-జీవిత అసమతుల్యత, ఆహార అసమతుల్యత, నిద్ర అసమతుల్యత, పేగుల్లోని సూక్ష్మజీవుల అసమతుల్యత, కేలరీల అసమతుల్యత, భావోద్వేగ అసమతుల్యతలు భాగంగా ఉంటాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ అసమతుల్యతల నుంచి అనేక ప్రపంచ ఆరోగ్య సవాళ్లు తలెత్తుతున్నాయన్న శ్రీ మోదీ... అధ్యయనాలు, డేటా దీనినే నిర్ధరిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య నిపుణులు దీనిని మరింత బాగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. 'సమతుల్యత పునరుద్ధరణ' కేవలం ప్రపంచస్థాయి అంశం మాత్రమే కాదని, ప్రపంచ అత్యవసరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమస్య పరిష్కారం కోసం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
21వ శతాబ్దంలో జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు మరింత పెరుగుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌తో కూడిన నూతన సాంకేతిక యుగం రాక మానవ చరిత్రలో అతిపెద్ద పరివర్తన సూచిస్తుందనీ, రాబోయే సంవత్సరాల్లో జీవన విధానం అపూర్వమైన రీతిలో మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. శారీరక శ్రమ లేని వనరులు, సౌకర్యాల సౌలభ్యంతో పాటు ఇటువంటి ఆకస్మిక జీవనశైలి మార్పులు మానవ శరీరాలకు ఊహించని సవాళ్లను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ ప్రస్తుత అవసరాలపై మాత్రమే దృష్టి సారించకుండా భవిష్యత్తు బాధ్యతలనూ పరిష్కరించాలనీ, ఇది అందరి సమష్టి బాధ్యత అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సాంప్రదాయ వైద్యం గురించి చర్చించినప్పుడు భద్రత, ఆధారాలకు సంబంధించి సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్ ఈ దిశలో నిరంతరం పనిచేస్తుందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో అశ్వగంధ ఉదాహరణను ఉటంకించినట్లు ఆయన తెలిపారు. శతాబ్దాలుగా భారత సాంప్రదాయ వైద్య వ్యవస్థల్లో అశ్వగంధను ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 సమయంలో దానికి ప్రపంచ స్థాయిలో డిమాండ్ బాగా పెరిగిందనీ, అనేక దేశాల్లో దీనిని ఉపయోగించడం ప్రారంభించారని శ్రీ మోదీ తెలిపారు. భారత్ తన పరిశోధన,  సాక్ష్యాల ఆధారిత ధ్రువీకరణ ద్వారా అశ్వగంధను విశ్వసనీయ రీతిలో ముందుకు తీసుకువెళుతోందన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో, అశ్వగంధపై ప్రపంచస్థాయి ప్రత్యేక చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ నిపుణులు దాని భద్రత, నాణ్యత, వినియోగంపై లోతుగా చర్చించారని శ్రీ మోదీ తెలిపారు. కాలపరీక్షకు గురైన అటువంటి మూలికలను ప్రపంచ ప్రజారోగ్యంలో భాగం చేయడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఒకప్పుడు సాంప్రదాయ వైద్యం కేవలం ఆరోగ్యం, జీవనశైలికే పరిమితమనే భావన ఉండేదని, కానీ ఈ రోజు ఈ అవగాహన వేగంగా మారుతోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సాంప్రదాయ వైద్యం ప్రభావవంతమైన పాత్ర పోషించగలదని, భారత్ ఈ దార్శనికతతోనే ముందుకు సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సాంప్రదాయ వైద్యం కేంద్రంగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో సమగ్ర క్యాన్సర్ సంరక్షణను బలోపేతం చేయడానికి ఈ రెండూ సమష్టి ప్రయత్నం చేశాయన్నారు. ఈ కార్యక్రమం కింద సాంప్రదాయ వైద్య వ్యవస్థలను ఆధునిక క్యాన్సర్ చికిత్సతో అనుసంధానిస్తామని ఆయన పేర్కొన్నారు. సాక్ష్యాల ఆధారిత మార్గదర్శకాలను రూపొందించడంలోనూ ఈ కార్యక్రమం సహాయపడుతుందని శ్రీ మోదీ తెలిపారు. భారత్‌లోని అనేక ముఖ్యమైన సంస్థలు రక్తహీనత, ఆర్థరైటిస్, మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై క్లినికల్ అధ్యయనాలను నిర్వహిస్తున్నాయని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశంలోని అనేక అంకురసంస్థలూ ఈ రంగంలోకి ప్రవేశించాయని, మన యువ శక్తి పురాతన సంప్రదాయంలో భాగమయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలన్నిటి ద్వారా సాంప్రదాయ వైద్యం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సాంప్రదాయ వైద్యం ప్రస్తుతం ఒక నిర్ణయాత్మక మలుపులో ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగం చాలా కాలంగా దానిపై ఆధారపడి ఉందని, అయితే అపార సామర్థ్యం ఉన్నప్పటికీ సాంప్రదాయ వైద్యం నిజంగా దానికి అర్హత గల స్థానాన్ని ఇంకా పొందలేదని ఆయన పేర్కొన్నారు. సైన్స్ ద్వారా విశ్వాసాన్ని గెలుచుకోవాలని, దాని పరిధిని మరింత విస్తరించాలని ఆయన సూచించారు. ఈ బాధ్యత ఏ ఒక్క దేశంపైనా లేదని, ఇది అందరి సమష్టి కర్తవ్యమని శ్రీ మోదీ తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో గత మూడు రోజులుగా అందరి భాగస్వామ్యం, చర్చలు, నిబద్ధత... ప్రపంచం ఈ దిశలో కలిసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని మరింతగా పెంచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ వైద్యాన్ని నమ్మకం, గౌరవం, బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడం పట్ల అందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, కేంద్ర మంత్రులు శ్రీ జే.పీ. నడ్డా, శ్రీ ప్రతాపరావు జాదవ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
సాంప్రదాయ వైద్యంపై నిర్వహించిన డబ్ల్యూహెచ్‌వో రెండో ప్రపంచ సదస్సు... ప్రపంచవ్యాప్త సైన్స్ ఆధారిత, ప్రజా-కేంద్రిత సాంప్రదాయ వైద్య ఎజెండాను రూపొందించడంలో మెరుగవుతున్న భారత్ నాయకత్వం, మార్గదర్శక కార్యక్రమాలను స్పష్టం చేసింది.
పరిశోధన, ప్రామాణీకరణ, ప్రపంచ సహకారం ద్వారా సాంప్రదాయ వైద్యాన్ని, భారతీయ విజ్ఞాన వ్యవస్థను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నిరంతరం స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగానే ఈ కార్యక్రమంలో ఆయుష్ రంగానికి మాస్టర్ డిజిటల్ పోర్టల్ అయిన మై ఆయుష్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ పోర్టల్ సహా కీలకమైన అనేక ఆయుష్ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆయుష్ ఉత్పత్తులు, సేవల నాణ్యతకు ప్రపంచస్థాయి ప్రమాణంగా భావించే ఆయుష్ మార్క్‌నూ శ్రీ మోదీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యోగా శిక్షణపై డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక నివేదికనూ, “మూలాల నుంచి ప్రపంచస్థాయికి: 11 సంవత్సరాల ఆయుష్ పరివర్తన” పుస్తకాన్నీ ప్రధానమంత్రి విడుదల చేశారు. భారత సాంప్రదాయ ఔషధ వారసత్వం ప్రపంచస్థాయిలో ప్రతిధ్వనిస్తున్న తీరును సూచిస్తూ... అశ్వగంధపై ఒక స్మారక పోస్టల్ స్టాంపునూ ఆయన విడుదల చేశారు.
ఢిల్లీలో కొత్త డబ్ల్యూహెచ్‌వో-ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయ సముదాయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది డబ్ల్యూహెచ్‌వో ఇండియా కార్యాలయాన్నీ కలిగి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో భారత్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిని ఇది సూచిస్తుంది.
2021–2025 సంవత్సరాల కాలంలో యోగా ప్రచారం, అభివృద్ధికి అత్యుత్తమ కృషి చేసిన ప్రధానమంత్రి పురస్కార గ్రహీతలను శ్రీ మోదీ సత్కరించారు. ప్రపంచస్థాయిలో యోగాకి ప్రచారం కల్పించడంలో వారి నిరంతర అంకితభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ పురస్కారాలు యోగాను సమతుల్యత, శ్రేయస్సు, సామరస్యం కోసం అద్భుత సాధనంగా పునరుద్ఘాటించాయి. ఇది ఆరోగ్యకరమైన, బలమైన నవ భారత్‌కు దోహదపడింది.
సాంప్రదాయ వైద్య ఆవిష్కరణల ప్రదర్శననూ ప్రధానమంత్రి సందర్శించారు. ఇది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ వైద్య విజ్ఞాన వ్యవస్థల వైవిధ్యాన్ని, లోతును, సమకాలీన ఔచిత్యాన్ని ప్రదర్శించే ఒక ప్రదర్శన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈ నెల 17 నుంచి 19 వరకు "సమతుల్యత పునరుద్ధరణ: సైన్స్ – ఆరోగ్యం, శ్రేయస్సుల అభ్యాసం" అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ఈ సదస్సులో ప్రపంచస్థాయి నాయకులు, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, అభ్యాసకులు, దేశీయ మేధావులు, పౌర సమాజ ప్రతినిధులు సహేతుకమైన, సుస్థిరమైన, ఆధారాల ఆధారితమైన ఆరోగ్య వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లడం గురించి లోతుగా చర్చించారు.


(रिलीज़ आईडी: 2207053) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam , Malayalam