ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన/ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
07 JUL 2023 9:26PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! హర హర మహాదేవ్! మాత అన్నపూర్ణా కీ జై! గంగా మయ్యా కీ జై! ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, యూపీ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పథకాల లబ్ధిదారులు, కాశీకి చెందిన ప్రియ సోదర సోదరీమణులారా!
శ్రావణ మాసం ప్రారంభంతోనే బాబా విశ్వనాథ్, మాత గంగా దేవి దీవెనలు, కాశీ ప్రజల కలయికతో జీవితం నిజంగా ధన్యమైంది. కాశీ ప్రజలు ఈ రోజుల్లో చాలా తీరిక లేకుండా ఉన్నారని నాకు తెలుసు. కాశీలో సందడి రోజురోజుకూ పెరుగుతోంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నుంచి వేల సంఖ్యలో శివ భక్తులు బాబాకు జలాభిషేకం చేసేందుకు ప్రతిరోజూ ఇక్కడకు వస్తున్నారు. ఈసారి శ్రావణ మాసం కూడా ఎక్కువ రోజులు ఉంది. అందుకే బాబా దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు రావడం ఖాయం. కానీ వీటన్నిటితో పాటు ఒక విషయం మాత్రం స్పష్టం. ఇప్పుడు కాశీకి ఎవరు వచ్చినా సంతోషంగానే! ఇంత మంది వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్ల విషయంలో నాకెలాంటి ఆందోళన లేదు.
కాశీ ప్రజలే నాకు నేర్పారు. నేను వారికి ఏమీ నేర్పలేను. జీ-20 సదస్సు సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది బనారస్‌కు వచ్చారు. కాశీ ప్రజలు వారికి ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రతిదీ చాలా చక్కగా నిర్వహించారు. అందుకే ఈ రోజు ప్రపంచమంతటి నుంచీ మీకు, కాశీకి ప్రశంసలు దక్కుతున్నాయి. కాబట్టే కాశీ ప్రజలు అన్నీ చూసుకుంటారని నా నమ్మకం. కాశీ విశ్వనాథ్ ధామ్‌ను, పరిసరాలను మీరు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ పులకించిపోతున్నారు. దానిని నెరవేర్చడంలో మనం భాగం కావాలన్నది బాబా కోరిక. ఇది మనందరి అదృష్టం.
సోదరీ సోదరులారా,
ఈ రోజు కాశీతో సహా ఉత్తరప్రదేశ్‌కు సుమారు రూ. 12,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల కానుక లభించింది. కాశీ స్ఫూర్తిని ఆధ్యాత్మిక స్ఫూర్తిని నిలబెడుతూనే పూర్తి మార్పు తీసుకురావాలనే మన సంకల్పానికి ఇది విస్తరణ. వీటిలో రైల్వేలు, రోడ్లు, జల వనరులు, విద్య, పర్యాటకం వంటి వాటికి సంబంధించిన ప్రాజెక్టులు, అలాగే నది స్నాన ఘట్టాల పునరాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు.
మిత్రులారా,
కొద్దిసేపటి క్రితమే, నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన లబ్ధిదారులతో మాట్లాడాను. గత ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న అతి పెద్ద ఫిర్యాదు ఏమంటే, వారు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని పథకాలు రూపొందించేవారు. ఆ సమయంలో క్షేత్ర స్థాయిలో ఈ పథకాల ప్రభావం ఎలా ఉందనేది ప్రభుత్వాలకు తెలిసేది కాదు. అయితే, బీజేపీ ప్రభుత్వం లబ్ధిదారులతో సంభాషణ, సమాచారం పంచుకోవడం, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. అంటే, ఇప్పుడు ప్రయోజనాలను నేరుగా అందిస్తున్నారు, అభిప్రాయాలను కూడా నేరుగా తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రతి ప్రభుత్వ విభాగం, అధికారి తమ బాధ్యతలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరూ తప్పించుకోవడానికి అవకాశం లేదు.
మిత్రులారా,
గతంలో అవినీతిమయమైన, అసమర్థమైన పాలన నడిపిన పార్టీలు లబ్ధిదారుల పేరు వింటేనే షాక్ అవుతున్నాయి. ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తర్వాత, ప్రజాస్వామ్య నిజ ప్రయోజనాలు ఇప్పుడు సరైన రీతిలో అసలు లబ్ధిదారులకు దక్కుతున్నాయి. లేదంటే, గతంలో ప్రజాస్వామ్యం పేరుతో కొద్ది మంది ప్రయోజనాలే నెరవేరేవి, పేదలు నిర్లక్ష్యానికి గురయ్యేవారు. లబ్ధిదారుల వర్గం బీజేపీ ప్రభుత్వంలో నిజమైన సామాజిక న్యాయానికి, నిజమైన లౌకికవాదానికి ఉదాహరణగా నిలిచింది. ప్రతి పథకం కింద నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు, వారిని చేరుకోవడానికి, వారు అన్ని పథకాల ప్రయోజనాలను అందుకునేలా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. దీనివల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏమిటో మీకు తెలుసా? ప్రభుత్వం స్వయంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఏమి జరుగుతుంది? కమీషన్లు తీసుకునే వారి దుకాణాలు మూతపడ్డాయి. దళారుల దుకాణాలు మూసుకుపోయాయి. అవినీతికి పాల్పడే వారి దుకాణాలు మూతబడ్డాయి. అంటే, ఇక్కడ వివక్ష లేదు. అవినీతి లేదు.
మిత్రులారా,
గత తొమ్మిదేళ్లలో, కేవలం ఒక కుటుంబం కోసమో, ఒక తరం కోసమో మేం పథకాలు రూపొందించలేదు. భవిష్యత్ తరాలను, వారి భవిష్యత్తు అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో కృషి చేశాం. ఉదాహరణకు, పేదల కోసం గృహ నిర్మాణ పథకం ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో ఇప్పటివరకు నాలుగు కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయి. ఈ రోజు కూడా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 4.5 లక్షల పేద కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించాం. శ్రావణ మాసంలో ఇది మహాదేవుడి గొప్ప అనుగ్రహం.
మిత్రులారా,
ఈ ఇళ్లను పేదలకు అందించినప్పుడు, వారి ప్రధాన చింతలన్నీ తొలగిపోతాయి. వారిలో ఒక భద్రతా భావం ఏర్పడుతుంది. ఈ ఇళ్లను పొందిన వారికి ఒక కొత్త ఆత్మగౌరవం, శక్తి లభిస్తాయి. అలాంటి ఇంటిలో పెరిగే పిల్లల ఆశయాలు కూడా భిన్నంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ చెబుతున్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న ఇళ్లలో అత్యధికం మహిళల పేర్ల మీదే నమోదవుతున్నాయి. ఈ రోజు ఈ ఇళ్ల విలువ అనేక లక్షల రూపాయలు ఉంటుంది. కోట్ల సంఖ్యలో ఉన్న అక్కాచెల్లెళ్ల పేర్ల మీద మొదటిసారిగా ఆస్తి నమోదైంది. ఈ పేద కుటుంబాల అక్కాచెల్లెళ్ళు తమకు లభించిన ఆర్థిక భద్రత విలువను కచ్చితంగా అర్థం చేసుకుంటారు.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ యోజన కేవలం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించడానికి మాత్రమే పరిమితం కాదు. దాని ప్రభావం అనేక తరాల వరకు విస్తరించి ఉంటుంది. ఒక పేద కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే, పిల్లల చదువు దెబ్బతింటుంది. వారిలో ఎవరైనా చిన్న వయసులోనే పని చేయడం మొదలుపెట్టాల్సి వస్తుంది, భార్య కూడా జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్య భారం కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారి, పిల్లలకు వివాహాలు జరగకుండా చాలా సంవత్సరాలు గడిచిపోవచ్చు. పేదలకు రెండు మార్గాలు మాత్రమే మిగులుతాయి. ఒకటి, తమ ప్రియమైన వారు కళ్లెదుటే ప్రాణాల కోసం పోరాడటం చూడడం. రెండు, వైద్య చికిత్స కోసం అప్పు తీసుకునేందుకు తమ ఆస్తిని, భూమిని అమ్ముకోవడం. ఆస్తులు అమ్మేసినప్పుడు, అప్పుల భారం పెరుగుతుంది. అది భవిష్యత్ తరాల మీద ప్రభావం చూపుతుంది. ఈ రోజు ఆయుష్మాన్ భారత్ యోజన పేదలను ఈ సంక్షోభం నుంచి కాపాడుతోంది. అందుకే ఆయుష్మాన్ కార్డు ప్రతి ఒక్క పేదవానికి అందించే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ రోజు కూడా ఇక్కడ నుంచి కోటి అరవై లక్షల మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది.
సోదరీ సోదరులారా,
దేశ వనరులపై అట్టడుగు వర్గాలు, పేదలకు అత్యధిక హక్కు ఉంది. గతంలో, బ్యాంకు సదుపాయం కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం అయ్యేది. పేదలకు డబ్బు లేనప్పుడు, వారికి బ్యాంకు ఖాతా ఎందుకు అని భావించేవారు. హామీ లేని పక్షంలో వారికి బ్యాంకు రుణం ఎలా లభిస్తుంది అని కొందరు ఆలోచించేవారు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ ఆలోచన విధానాన్ని కూడా మార్చింది. మేము బ్యాంకు తలుపులను అందరి కోసం తెరిచాం. దాదాపు 50 కోట్ల జన ధన్ బ్యాంకు ఖాతాలను తెరిపించాం. ముద్రా యోజన కింద, ఎటువంటి హామీ లేకుండా రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందించాం. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో కూడా కోట్ల సంఖ్యలో లబ్ధిదారులు ముద్రా యోజన ప్రయోజనాలను పొంది తమ వ్యాపారాలను ప్రారంభించారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీ కుటుంబాలు, మహిళా పారిశ్రామికవేత్తలు అత్యధికంగా లబ్ధి పొందారు. ఇదే బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తున్న సామాజిక న్యాయం.
మిత్రులారా,
తోపుడు బండ్లపైనా, స్టాల్స్ లోనూ, ఫుట్‌పాత్‌లపైనా చిన్న వ్యాపారాలు చేసుకునే మన స్నేహితుల్లో ఎక్కువ మంది అట్టడుగు సమాజానికి చెందినవారే. కానీ గత ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేశాయి. వారు అవమానాలకు, వేధింపులకు గురయ్యేవారు. బండ్లపైనా, స్టాల్స్ పైనా, ఫుట్‌పాత్‌లపైనా చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని ఎవరైనా తిట్టేవారు, నిందించేవారు. కానీ, మోదీ ఒక పేద తల్లి కొడుకు కాబట్టి, ఈ అవమానాన్ని సహించలేడు. అందువల్ల, నేను వీధి వ్యాపారుల కోసం పీఎం-స్వనిధి పథకాన్ని ప్రారంభించాను. వీధి వ్యాపారులకు గౌరవం అందించాం. పీఎం-స్వనిధి పథకం కింద వారికి బ్యాంకుల నుంచి సహాయం అందేలా చూశాం. వీధి వ్యాపారులకు అందించే రుణాలకు ప్రభుత్వం స్వయంగా హామీ ఇస్తోంది. ఇప్పటివరకు పీఎం-స్వనిధి పథకం కింద 35 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరైంది. ఇక్కడ బనారస్‌లో కూడా ఈ రోజు 1.25 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేశాం. ఈ రుణంతో వారు తమ పనిలో పురోగతి సాధించి, వ్యాపారాలను విస్తరించుకోగలుగుతారు. ఎవరూ వారిని ఇకపై అవమానించడానికి లేదా చిన్నచూపు చూడడానికి సాహసించరు. పేదలకు గౌరవం కల్పించడం మోదీ హామీ.
మిత్రులారా,
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ప్రభుత్వాల పాలనలో అవినీతి పూర్తిగా పాతుకుపోయింది. ఇలా జరిగినప్పుడు, ఎంత డబ్బు కేటాయించినా అది సరిపోదు. 2014కు ముందు గత ప్రభుత్వాల హయాంలో అవినీతి, బంధుప్రీతి విపరీతంగా పెరిగాయి. బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా, లోటుపాట్లు, నష్టాల గురించిన సాకు మాత్రమే ఉండేది. అయితే, నేడు పేదల సంక్షేమం కోసం గానీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గానీ బడ్జెట్‌కు ఎలాంటి కొరత లేదు. పన్ను చెల్లింపుదారులు మారలేదు. వ్యవస్థ కూడా మారలేదు. కానీ ప్రభుత్వం మారింది. ఉద్దేశాలు మారాయి. ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో, వార్తాపత్రికలు అవినీతి, కుంభకోణాల నివేదికలతో నిండి ఉండేవి. ఇప్పుడు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, ఆవిష్కరణలే ప్రధాన శీర్షికలుగా ఉంటున్నాయి. గత తొమ్మిదేళ్లలో జరిగిన మార్పుకు భారతీయ రైల్వే అతిపెద్ద ఉదాహరణ. తూర్పు ప్రాంతం కోసం ప్రత్యేక సరకు రవాణా కారిడార్, సరకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గాలను ఏర్పాటు చేసే ప్రణాళిక 2006లోనే ప్రారంభమైంది. అయితే 2014 వరకు ఒక్క కిలోమీటరు ట్రాక్ కూడా వేయలేదు. ఒక్క కిలోమీటరు కూడా! అయితే, ఈ ప్రాజెక్ట్‌లో గణనీయమైన భాగం గత తొమ్మిదేళ్లలో పూర్తయింది. ఇప్పటికే ఈ మార్గాలపై గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి కొత్త సోన్ నగర్ సెక్షన్ ప్రారంభమయింది. ఇది గూడ్స్ రైళ్ల వేగాన్ని పెంచడమే కాకుండా, పూర్వాంచల్, తూర్పు భారతదేశంలో అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
మిత్రులారా,
నిజాయితీ ఉంటే పనులు ఎలా జరుగుతాయో తెలియజేయడానికి నేను మరో ఉదాహరణ ఇస్తాను. దేశం ఎప్పుడూ హై-స్పీడ్ రైళ్లను కోరుకుంది. దేశంలో మొదటిసారిగా దాదాపు 50 సంవత్సరాల క్రితం రాజధాని ఎక్స్‌ప్రెస్ ను ప్రవేశపెట్టారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ నడవడం మొదలైంది. అయితే, ఇన్నేళ్లు గడిచినా ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం 16 మార్గాల్లో మాత్రమే నడుస్తున్నాయి. అదేవిధంగా, దాదాపు 30-35 సంవత్సరాల క్రితం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది, కానీ ఇన్నేళ్లు గడిచినా అది కేవలం 19 మార్గాలకు మాత్రమే సేవలు అందిస్తోంది. ఈ రైళ్ల మధ్య, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉంది. దేశంలో మొట్టమొదటి వందే భారత్ బనారస్‌లో ఉండటం మనకు గర్వకారణం. ఈ రైలు కేవలం నాలుగేళ్లలో 25 మార్గాల్లో రాకపోకలు ప్రారంభించింది. ఈ రోజే గోరఖ్‌పూర్ నుంచి రెండు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాం. ఒకటి గోరఖ్‌పూర్ నుంచి లక్నోకు, మరొకటి అహ్మదాబాద్ నుంచి జోధ్‌పూర్‌కు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోని మధ్యతరగతి ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. దేశం నలుమూలల నుంచి దీని కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వందే భారత్ దేశంలోని ప్రతి మూలనూ కలిపే రోజు ఎంతో దూరంలో లేదు.
సోదరీ సోదరులారా,
గత తొమ్మిదేళ్లలో, కాశీ అనుసంధానతను మెరుగుపరచడానికి అద్భుతమైన పనులు జరిగాయి. ఇక్కడి అభివృద్ధి ప్రాజెక్టులు అనేక కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, గత సంవత్సరం 7 కోట్లకు పైగా పర్యాటకులు, యాత్రికులు కాశీని సందర్శించారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే కాశీని సందర్శించిన పర్యాటకుల సంఖ్య 12 రెట్లు పెరిగింది. పర్యాటకుల సంఖ్య 12 రెట్లు పెరగడంతో, రిక్షా లాగేవారు, దుకాణదారులు, చిన్న చిన్న తినుబండారాలు, హోటళ్లు నడిపేవారు ప్రత్యక్ష లబ్ధిదారులుగా మారారు. మీరు బెనారస్ చీరల వ్యాపారంలో ఉన్నా, బెనారస్ పాన్ వ్యాపారంలో ఉన్నా, నా సోదరులారా, ప్రతి ఒక్కరూ దీని ద్వారా గొప్పగా లాభపడుతున్నారు. పర్యాటకం పెరగడం వల్ల మన పడవ నడిపే వారికి కూడా గొప్ప ప్రయోజనం లభించింది. సాయంత్రం గంగా హారతి (ప్రార్థనా కార్యక్రమం) సమయంలో కూడా పడవల్లో ఇంత పెద్ద జనసమూహాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. దయచేసి ఇదే విధంగా కాశీ క్షేత్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
మిత్రులారా,
బాబా (శివుడు) ఆశీస్సులతో, వారణాసి వేగవంతమైన అభివృద్ధి ప్రయాణం కొనసాగుతుంది. కాశీ ప్రజలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటీవల కాశీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మీరందరూ అభివృద్ధి ప్రయాణానికి మద్దతు ఇచ్చారు. అభివృద్ధిని నమ్మేవారికి విజయాన్ని అందించారు. కాశీలో సుపరిపాలన స్థాపనకు దోహదపడ్డారు. పార్లమెంటులో మీ ప్రతినిధిగా, మీ మద్దతుకు నేను నిజంగా కృతజ్ఞుడిని. అభివృద్ధి పనుల్లో సాధించిన పురోగతి సాధించినందుకు మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. హర హర మహాదేవ!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2204509)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam