హోం మంత్రిత్వ శాఖ
స్వాతంత్ర్యవీర సావర్కర్ రచించిన ‘సాగర ప్రాణ తలమలాల’ కావ్యానికి 115 ఏళ్లు నిండిన సందర్భంగా శ్రీ విజయపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
వీర సావర్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్వయంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం
ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తున్న సాంస్కృతిక జాతీయవాదానికి పునాదులు వేసింది వీర సావర్కరే..
వీర సావర్కర్ రచించిన ‘సాగర ప్రాణ తలమలాలా’ దేశభక్తి భావ వ్యక్తీకరణలో శిఖరాయమానం
యువతలో మాతృభూమి పట్ల కర్తవ్య నిష్ట, జాతీయ సమైక్యత, సుసంపన్నమైన దేశ నిర్మాణ సంకల్పాలను బలోపేతం చేసేలా ఈ వీర సావర్కర్ విగ్రహం
భయమంటే తెలిసినా.. దాన్ని అధిగమించే ధైర్యముండాలన్న వీర సావర్కర్ విశ్వాసం అందరికీ స్ఫూర్తిదాయకం
అనంతమైన, సాగర తుల్యమైన వీర సావర్కర్ వ్యక్తిత్వాన్ని ఓ పుస్తకంలోనో, కవితలోనో, సినిమాలోనో చిత్రించడం కష్టతరమైన పని
జన్మతః దేశభక్తి, సంఘ సంస్కరణ, రచనా నైపుణ్యం, యోధుడి వంటి స్ఫూర్తి కలిగిన వీర సావర్కర్ లాంటి వ్యక్తులు పుట్టేది యుగానికొక్కరే
‘హిందూత్వ’పై దృఢ విశ్వాసంతో కలిగిన సావర్కర్ జీవితం.. ఆధునికత - సంప్రదాయాల విశిష్ట సమ్మేళనం
హిందూ సమాజంలోని సామాజిక దురాచారాలన్నింటిపైనా పోరాడిన సావర్కర్
మాతృభూమి సేవకై ఆత్మ సమర్పణ వాంఛ కలిగిన సావర్కర్ వంటి వ్యక్తులు అత్యంత అరుదు
రెండుసార్లు జీవితఖైదు విధించినా.. మాతృభూమిని కీర్తిస్తూ సాహితీ సృజన చేసిన సావర్కర్‌కు సాటి వచ్చే గొప్ప దేశభక్తుడు మరొకరు లేరు
అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధుల శ్రమ, త్యాగం, అంకితభావం, అచంచల దేశభక్తితో రూపుదిద్దుకున్న తపోభూమి అండమాన్ - నికోబార్ దీవులు
ఈ దీవులకు ‘షహీద్’, ‘స్వరాజ్’ అని పేర్లు పెట్టి సుభాష్ చంద్రబోస్ కల నెరవేర్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
తమ రంగాల్లో సురక్షిత, సుసంపన్న దేశంగా భారత్‌ను నిలపాలన్న లక్ష్యంతో దేశ యువత ముందుకు సాగితేనే వీర సావర్కర్ స్వప్నించిన భారతదేశం సాకారమవుతుంది: శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
12 DEC 2025 8:40PM by PIB Hyderabad
స్వాతంత్ర్యవీర సావర్కర్ రచించిన ‘సాగర ప్రాణ తలమలాల’ కావ్యానికి 115 ఏళ్లు నిండిన సందర్భంగా శ్రీ విజయపురంలో ఈ రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్, అండమాన్ - నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ (విశ్రాంత) శ్రీ డి. కె. జోషి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. వీర సావర్కర్ తన జీవితంలో అత్యంత కష్టతరమైన కాలాన్ని గడిపిన అండమాన్ - నికోబార్ దీవులు ఈ రోజు భారతీయులందరికీ ఓ పుణ్యక్షేత్రంగా మారాయన్నారు. మరో గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్మృతులు కూడా ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్‌ను విముక్తం చేసేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాడుతున్న సమయంలో, వారు మొదట విముక్తం చేసింది అండమాన్ - నికోబార్ దీవులనే అని హోం మంత్రి చెప్పారు. సుభాష్ చంద్రబోస్ రెండురోజులు ఇక్కడే ఉన్నారన్నారు. శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ద్వీప సమూహానికి ‘షహీద్’, ‘స్వరాజ్’ అని పేర్లు పెట్టాలని సుభాష్ చంద్రబోస్ సూచించారని, శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ సూచనను ఆచరణలోకి తెచ్చారని తెలిపారు. అండమాన్ - నికోబార్ దీవులు కేవలం ఒక ద్వీప సమూహం మాత్రమే కాదనీ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, తపం, అంకితభావం, అచంచల దేశభక్తి రూపుదిద్దిన పవిత్ర క్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు వీర సావర్కర్ సంపూర్ణ విగ్రహావిష్కరణ, అదీ సావర్కర్ సిద్ధాంతాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్తున్న సంస్థ సర్‌సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా జరగడం చరిత్రాత్మక ఘట్టమని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ నేల, అలాగే వీర సావర్కర్ స్మృతి పవిత్రమైనవని, ఈ విగ్రహాన్ని శ్రీ మోహన్ భాగవత్ ఆవిష్కరించడంతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేసిందని హోం మంత్రి అన్నారు.
నేడు ఆవిష్కరించిన ఈ విగ్రహం.. అనేక ఏళ్ల పాటు వీర సావర్కర్ త్యాగం, సంకల్పం, మాతృభూమి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తికి ప్రతీకగా నిలుస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. భవిష్యత్ తరాలు సావర్కర్ జీవితం నుంచి పాఠాలు నేర్చుకునేలా.. కొన్ని దశాబ్దాల పాటు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు. వీర సావర్కర్ పిలుపును యువతరం అంతర్గతంగా స్వీకరించేందుకు ఈ ప్రదేశం ప్రధాన కేంద్రంగా నిలుస్తుందన్నారు. సావర్కర్ ధైర్యం, మాతృభూమి పట్ల కర్తవ్య నిష్ట, ఆయన అంకితభావం, దేశ సమైక్యత, భద్రత, సమృద్ధి దిశగా ఆయన లక్ష్యాలను యువతకు అందించడంలో ఇది ముఖ్య ప్రదేశంగా నిలవనుందని శ్రీ అమిత్ షా అన్నారు. వీర సావర్కర్ రచించిన ‘సాగర ప్రాణ తలమలాలా’ దేశభక్తి వ్యక్తీకరణలో పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ‘శౌర్యమంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం’ అని సావర్కర్ చెప్పిన మాట ఆయన అనుచరులకు అత్యంత ముఖ్యమైనదన్నారు. భయమంటే తెలియని వారు ధైర్యవంతులు.. కానీ భయమంటే ఏమిటో తెలిసి, దాన్ని అధిగమించే ధైర్యమున్నవారు నిజమైన నాయకులు.. ఈ సత్యం మూర్తీభవించిన వ్యక్తీ వీర సావర్కర్.
ఈ రోజు ఓ కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా విడుదల చేశామని, సావర్కర్ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అందులో పొందుపరిచేందుకు ప్రయత్నించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. సావర్కర్ భావాలను ముందుకు తీసుకెళ్లిన చాలా మందిని ఈ రోజు ఇక్కడ సత్కరించామన్నారు. సముద్రాన్ని ఎవరూ నిరోధించలేనట్టే.. సావర్కర్ గుణగణాలను, ఆయన జీవిత ఔన్నత్యాన్ని, బహుముఖీన వ్యక్తిత్వాన్ని ఒక పుస్తకంలోనో, సినిమాలోనో, ఓ కవితలోనో ఆవిష్కరించడం కూడా అత్యంత కష్టంతో కూడుకున్నదన్నారు. వివిధ స్థాయిల్లో చేసిన అనేక ప్రయత్నాల వల్ల.. భవిష్యత్ తరాలు సావర్కర్‌ను అర్థం చేసుకునేందుకు మార్గం సుగమమైందన్నారు. ఓ వ్యక్తి అస్తిత్వమంటే అతడి దేహం మాత్రమే కాదనీ... సిద్ధాంతం, ఆయన పరమోన్నతంగా భావించే సంస్కృతి, కార్యాచరణలే ఓ వ్యక్తికి అస్తిత్వమని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వీర సావర్కర్‌లోని ఈ మూడు లక్షణాలనూ భారత్ గుర్తించిందన్నారు.
ఈ రోజు దేశం కోసం ఎవరూ అమరులు కావాల్సిన అవసరం లేదని, దేశం కోసం జీవించాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. అప్పుడే మనం సావర్కర్ ఆశయాలకనుగుణమైన భారత్‌ను సాకారం చేసుకోగలమన్నారు. మన యువత సావర్కర్ ఆశించిన భారత్‌ను నిర్మించాలనుకుంటే.. తమ రంగాలలో సావర్కర్ స్ఫూర్తికి అనుగుణంగా వారు జీవించాలనీ, సురక్షిత, సుసంపన్న భారత్ నిర్మాణమే వారి లక్ష్యంగా ఉండాలని వ్యాఖ్యానించారు. సావర్కర్ జీవితాన్ని చూస్తే.. శతాబ్దాలు గడిచినా అలాంటి వ్యక్తి భూమిపై మళ్లీ పుట్టడనిపిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. సావర్కర్ రచయిత, యోధుడు, జన్మతః దేశభక్తుడు, సంఘ సంస్కర్త, గొప్ప కవి కూడా అని ఆయన కొనియాడారు. సావర్కర్ గద్యంలోనూ, పద్యంలోనూ నిష్ణాతులనీ.. అలాంటి సాహితీవేత్తలు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. మన భాషలకు 600కు పైగా పదాలను అందించి వీర సావర్కర్ మన పదజాలాన్ని సుసంపన్నం చేశారని శ్రీ అమిత్ షా చెప్పారు.
ఆధునికమైనప్పటికీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లి, నిలబెట్టిన హిందుత్వానికి వీర సావర్కర్ జీవితాన్ని అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అన్నారు. అస్పృశ్యత నిర్మూలన దిశగా వీర సావర్కర్ కృషికి దేశంలో తగిన గుర్తింపు లభించలేదన్నారు. నాటి హిందూ సమాజంలో ప్రబలంగా ఉన్న అన్ని సామాజిక దురాచారాలపైనా సావర్కర్ పోరాడారని, సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారని హోం మంత్రి చెప్పారు. ఈ ఆశయం కోసం వీర సావర్కర్ పునరంకితమయ్యారని వ్యాఖ్యానించారు. రెండు సార్లు జీవితకాల ఖైదును విధించినా.. మాతృభూమిని కీర్తిస్తూ సాహిత్య సృజన చేసిన సావర్కర్‌కు సాటివచ్చే గొప్ప దేశభక్తుడు మరొకరు ఉండరని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో.. ఈ రోజు ప్రభుత్వానికి ప్రాతిపదికగా ఉండి, నడిపిస్తున్న సాంస్కృతిక జాతీయవాద భావనకు ఆద్యుడు, దానిని వివరించింది వీర సావర్కరే అని శ్రీ అమిత్ షా చెప్పారు. భారత ఉపఖండంలోని సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, దేశ చరిత్ర ఆధారంగా ఆవిర్భవించిన ఈ సమష్టి అస్తిత్వానికి ప్రాచుర్యం కల్పించేలా అనేక మంది కృషి చేశారనీ.. వారిలో వీర సావర్కర్ ఈ భావనను అత్యంత చిత్తశుద్ధితో అనుసరించారనీ హోం మంత్రి అన్నారు. విద్య ద్వారా శాశ్వత బానిసత్వాన్ని, ఆ తరహా మనస్తత్వాన్ని మనపై రుద్దాలని బ్రిటిష్ వారు ప్రయత్నించారని శ్రీ అమిత్ షా చెప్పారు. అందుకే 1857 స్వాతంత్ర్య సంగ్రామాన్ని వారు ‘తిరుగుబాటు’గా పిలిచారన్నారు. 1857 నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని ‘తిరుగుబాటు’గా కాకుండా.. దానికి స్వాతంత్య్ర సంగ్రామమని పేరు పెట్టి, దేశ వాస్తవిక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి వీర సావర్కర్.
ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నామని, సుదీర్ఘ ప్రయాణం తర్వాత దేశం ఈ స్థాయికి చేరుకుందని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో ప్రభుత్వం దాదాపు గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ మోదీ అయిదు ప్రతిజ్ఞలను (పంచ ప్రాణ్) మనకందించారని శ్రీ అమిత్ షా తెలిపారు. వలస పాలన కాలపు స్మృతులను తొలగించడం కూడా వాటిలో ఒకటిగా ఉందని, దాంతో దేశం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ప్రతి రంగంలోనూ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచే గొప్ప భారత్‌ను 2047 ఆగస్టు 15 నాటికి మనమంతా కలిసి నిర్మించాలని హోం మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఇచ్చిన ఈ పిలుపు నేడు 140 కోట్ల భారతీయుల సంకల్పంగా మారిందని వ్యాఖ్యానించారు. 140 కోట్ల ప్రజలు ఒకే దిశలో ముందుకు సాగితే.. మనం 140 కోట్ల అడుగుల ముందుకు వెళ్తామని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ బలమే ఓ గొప్ప భారతదేశాన్ని సాకారం చేస్తుందనీ.. సురక్షిత, సుసంపన్న, సంస్కారవంతమైన, విద్యావంతమైన దేశంగా భారత్‌ను నిలుపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వీర సావర్కర్‌కు ‘వీర’ అన్న బిరుదును ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని, దేశ ప్రజలే ఆయనకు ఆ గౌరవాన్నిచ్చారని అన్నారు.
***
(रिलीज़ आईडी: 2203630)
आगंतुक पटल : 11