ప్రధాన మంత్రి కార్యాలయం
జీ20 సదస్సు క్షేత్రస్థాయి కార్యకర్తలతో ప్రధాని ముఖాముఖి
प्रविष्टि तिथि:
22 SEP 2023 10:59PM by PIB Hyderabad
మీలో కొందరు అలసిపోయామని అస్సలు ఒప్పుకోకపోవచ్చు. సరే, మీ సమయాన్ని నేనెక్కువగా తీసుకోవానుకోవడం లేదు. అయితే ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాం. దేశం పేరు వెలుగొందుతోంది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక ఉన్నది మీరే. పగలూ రాత్రీ కష్టపడింది మీరే. కాబట్టే ఈ విజయం సాధ్యమైంది. ఇదెలా ఉంటుందంటే.. ఓ క్రీడాకారుడు ఒలింపిక్ వేదికపైకి వెళ్లి పతకం గెలిస్తే, దేశానికి మంచి పేరొస్తుంది. ప్రశంసల వెల్లువ చాలాకాలం పాటు కొనసాగుతుంది. అదేవిధంగా, మీరంతా కలిసి దేశ ప్రతిష్ఠను పెంచారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో ఎంతమంది పాలుపంచుకున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఎంత పని జరిగిందో ప్రజలకు బహుశా తెలిసి కూడా ఉండకపోవచ్చు. మీలో చాలా మందికి గతంలో ఇంత పెద్ద కార్యక్రమంలో పనిచేసే అవకాశం లభించి ఉండకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, కార్యక్రమం గురించి మీరు కూడా అంచనాలు వేయాల్సి వచ్చింది. నిర్వహణలో ఎదుర్కోగల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి మీరు ఆలోచించాల్సి వచ్చింది. వివిధ పరిస్థితుల్లో ఎలా స్పందించాలనీ ఆలోచించి ఉంటారు. అనేక అంశాలను మీదైన రీతిలో పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మీ అందరికీ నాదొక ప్రత్యేక విన్నపం: మీరు సాధించిన దానితోనే సంతృప్తి చెంది ఆగిపోతారా?
మీలో కొందరు ఈ ప్రాజెక్టులో మూణ్నాలుగు సంవత్సరాలుగానో, లేదంటే కేవలం నాలుగు నెలలుగానో పాలుపంచుకుని ఉండొచ్చు. ప్రాజెక్టును మీకు వివరించిన రోజు నుంచి మీరు ఈ ప్రాజెక్టును చేపట్టిన సమయం వరకు ప్రతీదీ మీరు నమోదు చేయాలి. మీరు ప్రతిదీ రాసి పెట్టుకోవాలి. ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ పనిని ఎలా పూర్తి చేశారో ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన, తమ సొంత భాషలో రాసుకోవాలి. ప్రాజెక్టును ఎలా అర్థం చేసుకున్నారో, తాము గమనించిన లోపాలేమిటో, సమస్యలు తలెత్తితే వాటిని ఎలా పరిష్కరించారో రాయాలి. మీ అనుభవాలను నమోదు చేస్తే.. భవిష్యత్ ప్రాజెక్టులకూ, సంస్థలకూ అవి విలువైన మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఈ స్థాయిలో మరేదైనా కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు వారు దీన్ని ఆధారంగా ఉపయోగించుకోవచ్చు.
అందుకే, అది 100 పేజీలు పట్టినా సరే.. ప్రతి విషయాన్నీ వివరంగా, నిశితంగా రాయాలని మిమ్మల్ని కోరుతున్నాను. పుష్కలంగా స్థలముండే క్లౌడ్‌లో మీరు దాన్ని భద్రపరచుకోవచ్చు. మీ అనుభవాలు ఎంత ఉపయోగకరమైనవో మీకు తెలుస్తుంది. అలాంటి ఓ వ్యవస్థ ఏర్పడుతుందని, దానివల్ల ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను. అయితే, మీలో ఎవరైనా మాట్లాడేందుకు ముందుకొస్తే.. మీ నుంచే ఆ అనుభవాలను వినాలనుకుంటున్నాను.
ఉదాహరణకు, పూల కుండీలను చూసుకునే బాధ్యతను మీకు అప్పగించారనుకుందాం. ఈ భావన వెలువడి, ఈ స్ఫూర్తి జనిస్తే, పూల కుండీల నిర్వహణే జీ20 సదస్సు విజయవంతమయ్యేలా చూస్తుంది. పూలకుండీల అమరికలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది జీ20 సదస్సుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే ఇదో కీలక బాధ్యత. ఏ పనీ చిన్నది కాదని మీరు భావించగలిగితే విజయం మీ పాదాక్రాంతమవుతుంది.
మిత్రులారా,
అదేవిధంగా ప్రతి విభాగంలోని మీ సహోద్యోగులతోనూ మీరు మీ అనుభవాలను బహిరంగంగా పంచుకుని, చర్చించాలి. అలాగే వారి అనుభవాలను కూడా వినాలి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు.. ‘‘నేను చాలా పని చేశాను. నేను గనుక అక్కడ లేకపోయుంటే జీ20 సదస్సు ఏమై ఉండేదో?’’ అని మీకు అనిపించవచ్చు. అయితే, అందరూ ఒకరి కథలను మరొకరు వింటే.. మీరు చేసిన దానికన్నా ఇతరులే ఎక్కువ చేశారని స్పష్టమవుతుంది. కష్టకాలంలో వారు మరింత కష్టపడి పని చేస్తూ ఉన్నారని మీకు తెలుస్తుంది. మీరు బాగానే పనిచేశారని.. అయితే ఇతరులు కూడా అద్భుతంగా పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యపడిందని అప్పుడు మీకు అర్థమవుతుంది.
మనం ఇతరుల సామర్థ్యాలను గుర్తించి, వారి ప్రయత్నాలను అర్థం చేసుకుంటే.. అసూయ మాయమైపోతుంది. మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం లభిస్తుంది. “నిజానికి నిన్నటి వరకు నేను అంతా నేనే చేశానని అనుకున్నాను, కానీ చాలా మంది ఇతర వ్యక్తులు కూడా సహకరించారని ఈ రోజు నాకు తెలిసింది.” మీరు టీవీలో కనిపించేవారు కాదు, మీ ఫోటోలు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యేవి కావు, మీ విజయాలపై చర్చే జరిగేది కాదన్నది నిజమే. ఏమాత్రం శ్రమపడని వారు, ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారే అందరి దృష్టిని ఆకర్షించారని, కానీ అసలు పనంతా కార్మికులమే చేశామని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. నేటి కార్యక్రమం ‘మజ్దూర్ ఏక్తా’ (కార్మికుల ఐక్యత) వేడుక. బహుశా నేను కొంచెం పెద్ద కార్మికుడిని అయ్యుండొచ్చు.. మీరు చిన్న కార్మికులు అయ్యుండొచ్చు. కానీ అంతిమంగా మనమందరం శ్రామికులమే.
ఈ కఠోర శ్రమలోని ఆనందాన్ని మీరు కూడా అనుభవించి ఉంటారు. అంటే, 10వ తేదీనో, 11వ తేదీనో రాత్రి సమయంలో ఎవరైనా మీకు ఫోన్ చేసి ఏదైనా చెప్పి ఉంటే.. ‘‘ఇతడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ఇప్పటికే పని పూర్తయిపోయింది కదా’’ అని మీకు అనిపించి ఉండదు. పైగా ‘‘లేదు లేదు.. ఇంకేదో పని మిగిలుంది, దాన్ని పూర్తి చేస్తాను’’ అని మీరు అనుకుని ఉంటారు. మీకు తెలుసా.. ఈ స్ఫూర్తే మనకు అతిపెద్ద బలం.
మిత్రులారా,
మీలో చాలా మంది గతంలో కూడా పని చేశారు. మీలో చాలామంది 15- 20- 25 సంవత్సరాలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మీలో చాలామంది డెస్కులకే పరిమితమై, ఫైళ్లతో పనిచేస్తూ, పక్కనే ఉన్న సహోద్యోగులకు ఫైళ్లు అందిస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉండి ఉంటారు. బహుశా మీరు భోజన విరామ సమయంలోనో, టీ విరామ సమయంలోనో మీ పిల్లల చదువుల గురించి మాట్లాడుకుని ఉంటారు. అయితే, మనం రోజువారీ ఆఫీసు పనుల్లో ఉన్నప్పుడు సహోద్యోగుల సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం ఎప్పుడో గానీ మనకు రాదు. మనం ఒకే రకమైన ఉద్యోగానికి పరిమితమై ఉండడం వల్ల.. ఇరవై ఏళ్లు కలిసి పనిచేసినప్పటికీ, ఇతరుల్లో ఉన్న అదనపు నైపుణ్యాలు, సామర్థ్యాలు మనకు తెలియకపోవచ్చు.
ఇలాంటి అవకాశాలలో పనిచేసేటప్పుడు, మనం ప్రతి క్షణం కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. కొత్త బాధ్యతలు పుట్టుకొస్తాయి, కొత్త సవాళ్లు ఎదురవుతాయి, వాటిని పరిష్కరించడం దైనందిన జీవితంలో ఒక భాగమైపోతుంది. సహోద్యోగి పని చేస్తున్న సమయంలో చూస్తే, వారిలో అద్భుత ప్రతిభ ఉందనిపిస్తుంది. ఏ రంగంలోనైనా ఈ విధమైన సమన్వయంతో కూడిన పని.. ఏ ప్రభుత్వానికైనా విజయం సాధించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అన్ని విధాలా అవరోధాలను తొలగించి, బృంద స్ఫూర్తిని కలిగిస్తుంది.
మీరు చాలా ఏళ్లుగా పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఈసారి జీ 20 ప్రాజెక్టు సమయంలో మీరు రాత్రుళ్లు కూడా చాలా సేపు మేల్కొని ఉండి, అటూ ఇటూ తిరుగుతూ, బహుశా ఫుట్‌పాత్ పక్కన టీ కోసం కూడా వెతికుంటారు. మీరు కలిసిన కొత్త సహోద్యోగుల్లో మీ 15 లేదా 20 సంవత్సరాల పని అనుభవంలో మీరెన్నడూ చూడని వారు కూడా ఉండి ఉంటారు. కొత్త సామర్థ్యాలున్న చాలా మంది సహోద్యోగులను మీరు ఈ ప్రాజెక్టులో కలిసి ఉంటారు. కాబట్టి మనమెప్పుడూ కలిసి పనిచేయడానికి అవకాశాలను వెతకాలి.
ఉదాహరణకు అన్ని విభాగాలలోనూ స్వచ్ఛతా కార్యక్రమాలను మనం చూస్తున్నాం. సెక్రటరీ సహా విభాగంలోని ప్రతి ఒక్కరూ తమ గదుల నుంచి బయటికొచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోవడాన్ని మీరు గమనిస్తారు. అప్పుడు మీకు అది పనిలా కాదు.. పండుగలా అనిపిస్తుంది. మన ఇళ్లను శుభ్రపరచుకుందాం. కార్యాలయాలను సర్దుకుందాం. మన డెస్కుల నుంచి ఫైళ్లను బయటకు తీద్దాం – ఇది ఆనందకరమైన పని. విభాగాల వారీగా ఏడాదికోసారి పిక్నిక్‌కు వెళ్లాలని నేనెప్పుడూ చెప్తుంటాను. దగ్గర్లోని ఏదైనా ప్రదేశానికి ఒక రోజు యాత్రకు వెళ్ళండి.. 24 గంటలు అందరూ కలిసి గడపండి.
ఐక్యతలో అపారమైన శక్తి ఉంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత పని చేసినా కొన్నిసార్లు మీకిలా అనిపిస్తుంది.. ‘‘ఈ పనంతా నేనొక్కడినే చేయాలా? ప్రతిదానికీ నేనే బాధ్యుడినా? అందరూ జీతాలు తీసుకుంటున్నారు, కానీ పని అంతా నేనే చేయాల్సి వస్తోంది’’ అని అనిపిస్తుండొచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మనసులోకి వస్తాయి. కానీ మీరు అందరితో కలిసి ఉంటే.. మీలాంటి చాలా మంది విజయంలో పాలుపంచుకుంటున్నారని, వారి కృషి వల్లే సంస్థలు సజావుగా నడుస్తున్నాయని మీరు గ్రహిస్తారు.
మిత్రులారా,
మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. మనం సీనియర్లుగా ఉన్నత శ్రేణి, నియమాల నుంచి బయటికొచ్చి మనతో కలిసి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించాలి. ఆ వ్యక్తుల్లో ఎలాంటి సామర్థ్యాలున్నాయో చాలావరకు మనం గుర్తించలేకపోవచ్చు. సహోద్యోగుల బలాన్ని గుర్తిస్తే అద్భుత ఫలితాలు మీ సొంతమవుతాయి. మీ కార్యాలయంలో దీన్ని ప్రయత్నించి చూడండి. నేను మీకో ఆటను సూచిస్తాను. ఓ సారి చూడండి.. ఉదాహరణకు, మీ విభాగంలో మీతో పాటు 20 మంది సహోద్యోగులు పనిచేస్తున్నారనుకోండి. రోజూ ఒక డైరీని నిర్వహించండి. తరువాత ఆ 20 మంది సహోద్యోగులను ఒక్కొక్కరిగా వారి పూర్తి పేర్లు, వారి స్వస్థలం, వారు ఇక్కడ చేసే పని ఏమిటో, వారిలోని ప్రత్యేక లక్షణాలూ నైపుణ్యాలూ ఏమిటో డైరీలో రాయమనండి. వారిని నేరుగా అడగవద్దు. వారి గురించి మీకు తెలిసిన విషయాలను గమనించి, వాటిని డైరీలో రాయండి. తరువాత ఆ 20 మంది సహోద్యోగులు తమ గురించి ఏం రాశారో చదవండి. మీకు తెలియని వారి నైపుణ్యాల గురించి తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. వారి చేతిరాత బాగుంటుంది, వారు సమయపాలన పాటిస్తారు లేదా వారు మర్యాదగా ఉంటారు వంటి విషయాలు మీరు చెప్పొచ్చేమో.. కానీ వారిలోని నిశితమైన నైపుణ్యాలను మీరు బహుశా గమనించి ఉండకపోవచ్చు. ఒకసారి ప్రయత్నించండి. ఓ అద్భుతమైన అనుభవం మీకు లభిస్తుంది. మీ సహోద్యోగుల్లోని అద్భుత లక్షణాలు మీకు తెలుస్తాయి. సృజనాత్మకతకు సంబంధించి పరిశీలక దృక్పథాన్ని ఇది మనకు అందిస్తుంది.
మిత్రులారా,
నేను చాలా సంవత్సరాలుగా మానవ వనరుల విభాగంలో పని చేస్తున్నాను. యంత్రాలతో పనిచేసే అవకాశం నాకెప్పుడూ రాలేదు. నా పని ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేయడానికి సంబంధించినదే. కాబట్టి ఈ భావనలను నేను బాగా అర్థం చేసుకోగలను. అయితే, సామర్థ్యాభివృద్ధి దృక్కోణంలో ఈ అవకాశాలు అత్యంత ముఖ్యమైనవి. ఏదైనా కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహిస్తే.. అది గొప్ప ఫలితాలను ఇస్తుంది. లేదంటే.. ఇలాంటివి చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి, ఈసారి కూడా అలాగే జరుగుతాయన్న సాధారణ అభిప్రాయమే వినిపిస్తుంది. ఆ విధానంతో ఏం జరుగుతుంది? ఈ విషయంలో రెండు అనుభవాలు మన దేశం ఎదుట ఉన్నాయి. మొదటిది.. కొన్నేళ్ల కిందట మనం కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చాం. మీరు కామన్వెల్త్ క్రీడల గురించి ఎవరినైనా అడిగితే.. ఢిల్లీ ప్రజలు లేదా బయటి నుంచి వచ్చిన వారు ఈ క్రీడలపై ఎలా భావిస్తున్నారో మీకు ఓ అవగాహన వస్తుంది. మీలో సీనియర్లుగా ఉన్నవారికి ఆ సంఘటన గుర్తుండే ఉంటుంది. మన దేశానికి ఒక గుర్తింపును తేవడానికి, ఓ ప్రత్యేకతను సృష్టించడానికి, మన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, మన బలాన్ని ప్రదర్శించడానికి లభించిన ఓ అద్భుతమైన అవకాశమది. అయితే, దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమం వివాదాలు, అవ్యవస్థలో కూరుకుపోవడంతో మన దేశ ప్రతిష్ఠపై మచ్చ పడింది. ఇది ప్రజలలో, ప్రభుత్వంలో ఉన్నవారిలో ఒక రకమైన నిరాశను, ఇలాంటి పనులు మనకు సాధ్యం కావనే భావనను కూడా కలిగించింది.
మరోవైపు జీ20 విషయంలో లోపాలేమీ లేవని కాదు. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం సజావుగా జరిగిపోయినట్టు, ప్రతీ లక్ష్యం 99 లేదా 100 శాతం విజయవంతమైనట్టు ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో మనం 94, 99 మార్కులు సాధించి ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఏకంగా 102 మార్కులు కూడా సాధించి ఉండవచ్చు. అయితే, ఈ చర్యల సమష్టి ప్రభావం గణనీయంగా ఉంది. మొత్తంగా ఇది మన దేశ సామర్థ్యాలను ప్రదర్శించి, ప్రపంచానికి మన సత్తాను చాటింది. కేవలం 10 సంపాదకీయాల ప్రచురణలో మాత్రమే కాదు.. అవి ఏ మేరకు ప్రభావం చూపాయన్నదానిపైనే ఇలాంటి కార్యక్రమాల విజయం ఆధారపడి ఉంటుంది. మోదీకి దాని గురించి అస్సలు పట్టింపు లేదు. నా దేశంలో మనం ఏ పనినైనా సమర్థంగా పూర్తి చేయగలమన్న నమ్మకం ఇప్పుడు నెలకొంది. అది నాకు ఆనందాన్నిస్తోంది.
గతంలో ఎక్కడైనా విపత్తు సంభవించినా, లేదా మానవతా అంశాలపై పనిచేయాల్సిన అవసరం ఏర్పడినా.. ప్రచారం మొత్తాన్ని పాశ్చాత్య ప్రపంచం తమ గుప్పిట్లోకి తీసుకోవడాన్ని చూసేవాళ్ళం. ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా.. ఏదో ఒక పాశ్చాత్య దేశం తన వనరులు, సామర్థ్యాలనుపయోగించి సాయం చేసిందని ప్రజలు భావించేవారు. మన దేశం గురించి ప్రస్తావించడం చాలా అరుదు. ప్రధాన పాశ్చాత్య దేశాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే, మనమిప్పుడు మార్పును చూస్తున్నాం. నేపాల్‌లో భూకంపాలు వచ్చినప్పుడు మన ప్రజలు సాయం కోసం అక్కడికి వెళ్లారు. ఫిజీని తుఫానులు తాకినప్పుడు మన బృందాలు స్పందించాయి. శ్రీలంక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో మనం సాయం పంపించాం. మాల్దీవుల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడిన వేళ మన బృందాలు తక్షణమే సాయమందించాయి. యెమెన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సహాయాన్ని అందించాం. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మనవారు వేగంగా స్పందించారు... ఇవన్నీ మానవతా సహాయక చర్యలలో భారత్ ఒక మార్పు తీసుకురాగలదన్న నమ్మకాన్ని ప్రపంచంలో కలిగించాయి. సంక్షోభ సమయాల్లో భారత్ ప్రపంచానికి సాయమందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మన సామర్థ్యాలపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించింది.
ఇటీవల జోర్డాన్‌లో భూకంపం సంభవించినప్పుడు నేను శిఖరాగ్ర సమావేశంతో చాలా తలమునకలై ఉన్నాను. అయితే, తీరికలేని పనుల మధ్య కూడా.. తెల్లవారుజామునే నేను అధికారులకు ఫోన్ చేసి, జోర్డాన్‌కు మనమెలా సహాయపడగలమో అని విచారించాను. మన విమానాన్ని, సామగ్రిని సిద్ధం చేయమనీ, మనం ఏమి తీసుకెళ్లాలో తెలుసుకోమని, వెళ్ళే బృందాన్ని గుర్తించమని నేను వారికి చెప్పాను. మా వైపు నుంచి అంతా సిద్ధంగా ఉంది. ఒకవైపు జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగుతుండగానే, మరోవైపు జోర్డాన్‌కు సహాయం అందించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇది మన సమర్థతకు నిదర్శనం. జోర్డాన్ తన భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకుని.. మేం సిద్ధం చేస్తున్న సాయం తమకు అవసరం లేదని మనకు తెలిపింది. చివరికి మేం అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. మన అవసరం లేకుండానే వారు తమ పరిస్థితిని చక్కదిద్దుకున్నారు.
నేను చెప్పేదేమిటంటే, ఒకప్పుడు మనం ఎవరికీ కనిపించని స్థితిలో ఉన్న చోట, మన పేరు కూడా ప్రస్తావనకు రాని చోట... అనతికాలంలోనే మనం ఈ స్థాయిని సాధించాం. మనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు అవసరం. నేడు మొత్తం మంత్రి మండలి, కార్యదర్శులందరూ కలిసి మనమిక్కడ కూర్చున్నాం. మీరు ముందు కూర్చుని, ఇతరులు మీ వెనుక కూర్చునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సాధారణంగా జరిగే దానికి ఇది పూర్తిగా భిన్నమైనది. ఇదే నాకు ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చూస్తే.. మన బంధానికి బలమైన పునాది ఉందని నాకనిపిస్తుంది. పై స్థాయిలో ఏదైనా గందరగోళం ఉన్నప్పటికీ, అది పెద్ద విషయమేం కాదు.
అందుకే, నా సహోద్యోగులారా.. ఇకపై మనం సమర్థంగా పనిచేద్దాం. మన ప్రతి పనీ అంతర్జాతీయ దృక్పథంతో ఉంటుంది. ఇప్పుడు జీ20 శిఖరాగ్ర సమావేశాన్నే చూడండి – ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు లక్ష మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారి దేశాలకు చెందిన కీలక బృందాలు కూడా ఉన్నాయి. నిర్ణాయక బృందాల్లో వారు భాగం. వారు ఇక్కడికి వచ్చారు. భారత్‌ను చూసి, ఇక్కడి వైవిధ్యాన్ని ప్రశంసించారు. వారు తమ దేశాలకు తిరిగి వెళ్లి ఈ అనుభవాలను తమతోనే ఉంచుకుంటారని కాదు... కాదు, వారు తిరిగి వెళ్లి మన దేశ పర్యాటక రంగానికి రాయబారులవుతారు.
వారు వచ్చినప్పుడు స్వాగతం పలికి, వారి కోసం ఏమి చేయగలమో అడిగారనే మీరు అనుకోవచ్చు. టీ లేదా అలాంటివేమైనా తాగాలనుకుంటున్నారా అని అడిగారనుకోవచ్చు. ఇది మామూలు పనిలాగే అనిపించవచ్చు. కానీ వారికి నమస్కరించి, టీ కావాలా అని అడిగి, అతని అవసరాలను తీర్చడం ద్వారా.. వారు భారత్‌కు రాయబారులుగా మారేలా మీరు బీజం వేశారు. మీరు చాలా గొప్ప సేవలందించారు. వారు భారత్‌కు రాయబారులుగా మారుతారు. ఎక్కడికెళ్లినా ‘‘భారత్ ఇలా ఉంటుంది. భారత్‌లో ఈ విశేషాలున్నాయి. సాంకేతిక రంగంలో భారత్ చాలా ముందుంది’’ అని వారు చెబుతారు. వారు కచ్చితంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. నేను చెప్పేదేమిటంటే.. దేశంలో పర్యాటకాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం మనకుంది.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2203625)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Kannada
,
English
,
Manipuri
,
Gujarati
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil