సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో దీపావళి


దీపావళి శాశ్వత స్ఫూర్తిని సజీవంగా ఉంచుతున్న భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ప్రజలకు గర్వకారణం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

प्रविष्टि तिथि: 10 DEC 2025 12:09PM by PIB Hyderabad

ఇవాళ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన యునెస్కో అంతర్గత ప్రభుత్వ కమిటీ 20వ సమావేశం సందర్భంగా భారతదేశంలో విస్తృతంగా జరుపుకునే సంప్రదాయ పండగల్లో ఒకటైన దీపావళిని మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో చేర్చారు.

కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, 194 సభ్య దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు, యునెస్కో ప్రపంచ నెట్‌వర్క్ ప్రతినిధుల సమక్షంలో ఈ చేరికకు ఆమోదం లభించింది.

ఈ గుర్తింపు, భారతదేశానికి, దీపావళి స్ఫూర్తిని సజీవంగా ఉంచుతున్న ప్రపంచవ్యాప్త సమాజానికి గర్వకారణమైన క్షణమని అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి అన్నారు. ఈ పండగ "తమసో మా జ్యోతిర్గమయ" అనే విశ్వవ్యాప్త సందేశాన్ని మూర్తీభవింపజేస్తుంది. చీకటి నుంచి వెలుగులోకి మారటాన్ని అంటే ఆశ, పునరుద్ధరణ, సామరస్యాన్ని ఈ సందేశం సూచిస్తుంది.

పండగలోని జీవన విధానం, ప్రజల కేంద్రీకృత స్వభావాన్ని తెలియజేస్తూ సంప్రదాయ దీపాలను తయారుచేసే కుమ్మరులు, పండగ అలంకరణలను సిద్ధం చేసే కళాకారులు, రైతులు, మిఠాయి తయారీదారులు, పూజారులు, ప్రాచీన ఆచారాలను పాటించే కోట్లాది మంది సహకారంతో దీపావళి వర్ధిల్లుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ సంప్రదాయాన్ని నిలబెట్టే సామూహిక సాంస్కృతిక శ్రమకు ప్రశంస ఈ గుర్తింపు అని మంత్రి తెలిపారు.

ఆగ్నేయాసియా, ఆఫ్రికా, గల్ఫ్, యూరప్, కరేబియన్ అంతటా ఉత్సవాల ద్వారా ఖండాంతరాల్లో దీపావళి సందేశాన్ని, సాంస్కృతిక వారధులను బలోపేతం చేసిన భారతీయ ప్రవాసుల శక్తిమంతమైన పాత్రను కేంద్రమంత్రి గౌరవించారు.

వారసత్వాన్ని పరిరక్షించేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు ఈ గుర్తింపు, నూతన బాధ్యతను తీసుకొచ్చింది. దీపావళిలో ప్రతిబింబించే సమ్మిళితత్వం, ఐక్యతా భావాన్ని స్వీకరించాలని, భారత గొప్ప అమూర్త సాంస్కృతిక సంప్రదాయాలకు మద్దతును కొనసాగించాలని కేంద్రమంత్రి ప్రజలను కోరారు.

లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ప్రాంతాలు, సంఘాలు, ప్రపంచవ్యాప్త భారతీయ ప్రవాసులు జరుపుకునే దీపావళి, ప్రజల పండగగా గుర్తింపు పొందింది. ఐక్యతా, పునరుద్ధరణ, సామాజిక సామరస్య సూత్రాలను ఈ పండగ ప్రతిబింబిస్తుంది. దీపాలు వెలిగించటం, రంగవల్లులు వేయటం, సంప్రదాయ చేతివృత్తులు, ఆచారాలు, సామాజిక సమావేశాలు, తరతరాలుగా జ్ఞానాన్ని అందించటం వంటి విభిన్న ఆచారాలు.. ఈ పండగ శాశ్వత సజీవ శక్తిని, కాలం, భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2201689) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada