ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘జి20తో విశ్వవిద్యాలయ సంధానం’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 26 SEP 2023 8:45PM by PIB Hyderabad

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రొఫెసర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు సహా నా యువ మిత్రులారా! ఈ రోజు ఇక్కడ భారత్ మండపంలో హాజరైన వారితో పోలిస్తే ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారానే అధిక సంఖ్యలో యువత మాతో మమేకమయ్యారు. ఈ మేరకు ‘జి20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ కార్యక్రమానికి మిమ్మల్నందర్నీ స్వాగతిస్తూ యువతకు నా అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

రెండు వారాల కిందటిదాకా ఇదే భారత్‌ మండపంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. భారత్ మండపం ఒక ‘వైవిధ్య వేదిక’గా మారిందనడానికి ఇదొక నిదర్శనం. ఇలాంటి వేదిక ద్వారా ఇవాళ భావిభారత తరంతో మమేకం కావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. జి20 కార్యక్రమాలను భారత్ సమున్నత స్థాయికి తీసుకెళ్లడంపై యావత్‌ ప్రపంచం నివ్వెరపోతుండటం నిజం. అయితే, మీకు తెలుసా... ఇందులో నాకెంత మాత్రం ఆశ్చర్యం లేదు. ఇంత గొప్ప విశేషమైనా నేనెందుకు ఇలా అన్నాననే సందేహం మీలో తలెత్తి ఉండవచ్చు. కారణం ఏమిటంటారా... మీలాంటి నవయువ విద్యార్థి లోకం ఈ కార్యక్రమంలో భాగస్వాములై దీన్ని సఫలం చేసే బాధ్యతను స్వీకరిస్తే అది విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? అందుకే- నేనెంత మాత్రం ఆశ్చర్యపడటం లేదు.

ఈనాడు యావద్భారతం ‘వైవిధ్య వేదిక’గా మారడానికి కారణం మీ యువతరమే. గడచిన 30 రోజుల సమయాన్ని మాత్రమే పరిశీలించినా, కార్యకలాపాల స్థాయి స్పష్టమవుతుంది. నేనీ 30 రోజుల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో మీ 30 రోజుల అనుభవాలను కూడా మీరు జోడిస్తూండి ఉంటారు. ఇదే సమయంలో మీ విశ్వవిద్యాలయంలో గత 30 రోజులను కూడా గుర్తు తెచ్చుకోండి. అంతేకాదు మిత్రులారా.. ఈ 30 రోజుల్లో ఇతరుల కృషిని మరువకండి. ఇక నా యువ మిత్రులారా... ఇవాళ మీ వద్దకు వచ్చిన సందర్భంగా నా గత 30 రోజుల ప్రగతి నివేదికను కూడా మీకిప్పుడు వివరిస్తాను. తద్వారా నవ భారత్ వేగం, స్థాయి రెండింటినీ మీరు తెలుసుకోగలుగుతారు.

మిత్రులారా!

మీకందరికీ ఆగస్టు 23వ తేదీ బాగా గుర్తుండే ఉంటుంది. ఆ రోజున అందరి హృదయాల్లో ఉత్కంఠ నిండిపోయింది. తమ చుట్టూ ఏం జరుగుతున్నదో అందరూ మరచిపోయారు. ఎలాంటి లోపం తలెత్తకుండా ఓ బృహత్కార్యం విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నారు. అవునా... కాదా? అంతలోనే  అందరి వదనాలూ వెలుగులీనాయి. “భారత్‌ చంద్రునిపై పాదం మోపింది” అనే వార్తను యావత్‌ ప్రపంచం ఆలకించింది. ఆ తేదీ (ఆగస్టు 23) మన ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా శాశ్వత స్థానం పొందింది. కానీ, ఆ తర్వాత ఏమైందో తెలుసా? చంద్రునిపై ప్రయోగంలో విజయం సాధించిన భారత్‌.. సూర్యునిపై దృష్టి సారించింది. ఒకవైపు మన చంద్రయాన్ 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యం సాధిస్తే, మరో ప్రయోగంలో భారత్‌ 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు చెప్పండి... భారత్ స్థాయిని ఎవరైనా అందుకోగలరా?

మిత్రులారా!

భారత్‌ దౌత్యనీతి గడచిన 30 రోజుల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. జి20కి ముందు దక్షిణాఫ్రికాలో ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ కృషితో మరో 6 దేశాలు ఈ కూటమిలో సభ్యత్వం స్వీకరించాయి. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత నేను గ్రీస్‌ వెళ్లాను... గడచిన 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి ఆ దేశానికి వెళ్లడం అదే తొలిసారి. అలాంటి మంచి పనులు చేయాలనే ఉద్దేశంతోనే మీరు నన్ను ఎన్నుకున్నారు. ఇక జి20 శిఖరాగ్ర సదస్సుకు ముందు ఇండోనేషియాలో అనేకమంది ప్రపంచ నాయకులతోనూ సమావేశమయ్యాను. అటుపైన ఇదే భారత్‌ మండపంలో జి20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ ప్రగతి దిశగా కీలక తీర్మానాలు చేసింది.

మిత్రులారా!

నేటి భిన్న ధ్రువ అంతర్జాతీయ పరిస్థితుల నడుమ అనేక దేశాలను ఒకే వేదికపైకి తేవడం ఆషామాషీ కాదు. మీరు విహారయాత్ర తలపెట్టినా, ఎక్కడికి వెళ్లాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు సహజం. అయితే, జి20 శిఖరాగ్ర సదస్సులో మన న్యూఢిల్లీ తీర్మాన పత్రం 100 శాతం ఏకాభిప్రాయంతో రూపొందడం అంతర్జాతీయ శీర్షికగా మారింది. ఈ 30 రోజుల కాలంలో భారత్ అనేక కీలక కార్యక్రమాలకు, నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసింది. ప్రస్తుత 21వ శతాబ్దం దిశను పూర్తిగా మార్చగల దృఢమైన నిర్ణయాలను జి20 తీసుకుంది. ఇందులో భాగంగా భారత్ చొరవతో ఆఫ్రికా సమాఖ్యకు జి20లో శాశ్వత సభ్యత్వం లభించింది. అలాగే ‘ప్రపంచ జీవ ఇంధన కూటమి’ ఏర్పాటుకూ భారత్ నాయకత్వం వహించింది. అంతేగాక ఇదే జి20 సదస్సులోనే ‘భారత్‌-మధ్యప్రాచ్యం-ఐరోపా కారిడార్‌’ ఏర్పాటుకు నిర్ణయించాం. ఇది వివిధ ఖండాలను అనుసంధానిస్తూ రాబోయే శతాబ్దాలలో వాణిజ్య, పర్యాటక రంగాల విస్తరణకు తోడ్పడుతుంది.

మిత్రులారా!

జి20 సదస్సు ముగిసిన సమయంలో సౌదీ అరేబియా యువరాజు భారత పర్యటన కోసం ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లో 100 బిలియన్ డాలర్ల సౌదీ అరేబియా పెట్టుబడులకు అంగీకారం కుదిరింది. ఇవన్నీ గత 30 రోజుల్లో సంభవించిన పరిణామాలు కాగా, అదే సమయంలో భారత ప్రధాని హోదాలో నేను 85 మంది నాయకులతో... అంటే- ప్రపంచ నేతలలో సగం మందితో సమావేశమయ్యాను. దీనివల్ల మాకేం ప్రయోజనమనే సందేహం మీకు కలిగి ఉంటుంది... అవునా? ఇతర దేశాలతో భారత్ సత్సంబంధాల వల్ల, కొత్త దేశాలతో స్నేహం కుదిరినపుడు మనకు కొత్త అవకాశాలు కలసివస్తాయి. ఓ కొత్త భాగస్వామి సహా కొత్త మార్కెట్ కూడా మనకు లభ్యమవుతుంది. మొత్తం మీద నా దేశ యువతరం వీటన్నిటి నుంచీ ప్రయోజనం పొందుతుంది.

మిత్రులారా!

గడచిన నా 30 రోజుల ప్రగతి నివేదికలో అంతరిక్ష విజయాలు, ప్రపంచ సంబంధాల గురించి మాత్రమే చెబుతున్నానని మీరు అనుకుంటున్నారేమో! ఈ 30 రోజుల్లో నేను చేసిన పనులు ఇవి మాత్రమేనా? కచ్చితంగా కాదు... దేశంలోని షెడ్యూల్డు కులాలు/తెగలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, నిరుపేదలు సహా మధ్యతరగతికి సాధికారత కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి నేపథ్యంలో “ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన”కు శ్రీకారం చుట్టాం. మన చేతివృత్తులవారు, నిపుణ కళాకారులు, సంప్రదాయ వృత్తుల్లోగల వారి సంక్షేమానికి ఉద్దేశించిన పథకమిది. అలాగే ఉపాధి సమ్మేళనాల ద్వారా గత 30 రోజుల్లో లక్షమందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు జారీచేశాం. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా యువతకు నియామక లేఖలు అందజేశాం.

మిత్రులారా!

ఈ 30 రోజుల్లోనే కొత్త పార్లమెంట్ భవనంలో తొలి సమావేశాలను కూడా మీరు చూశారు. ఈ కొత్త భవనంలో తొలి బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఆమోదం పొందడంపై యావద్దేశం గర్వించింది. ఈ బిల్లు ద్వారా మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాధాన్యాన్ని పార్లమెంటు సహర్షంగా అంగీకరించింది.

మిత్రులారా!

ఇదే 30 రోజుల వ్యవధిలో... దేశంలో విద్యుత్ రవాణా విస్తరణకు మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు ‘బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ’ల సాధికారత దిశగాముఖ్యమైన పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఇక ఇటీవలే ద్వారకలోని అంతర్జాతీయ సమావేశ మందిరం ‘యశోభూమి’ని దేశానికి అంకితం చేశాం. యువతకు క్రీడల్లో మరిన్ని అవకాశాల కల్పన లక్ష్యంగా వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి నేను శంకుస్థాపన చేశాను. రెండు రోజుల కిందటే 9 వందే భారత్ రైళ్లను కూడా  ప్రారంభించాను. ఒకే రోజున ఇన్ని ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం మన వేగం, స్థాయికి నిదర్శనం.

మిత్రులారా!

ఈ 30 రోజుల్లోనే పెట్రోరసాయనాల రంగంలో భారత్ స్వావలంబన పెంపు దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని ఒక శుద్ధి కర్మాగారంలో పెట్రోకెమికల్ సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. అదే రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం, ఐటీ పార్క్, మెగా ఇండస్ట్రియల్ పార్క్, మరో 6 కొత్త పారిశ్రామిక ప్రాంతాల సంబంధిత పనులు కూడా ప్రారంభమయ్యాయి. నేనిప్పుడు వెల్లడించిన ప్రాజెక్టులన్నీ యువతరానికి నైపుణ్యంతోపాటు ఉపాధి కల్పనకు ఉద్దేశించినవే. ఈ జాబితా ఇంకా చాల పొడవైనది కాబట్టి, మొత్తం ఏకరవు పెట్టాలంటే సమయం చాలదు. ఈ 30 రోజుల్లో నా ప్రగతి నివేదికను దాదాపు పూర్తిగా మీకు విడమరిచాను. ఇప్పుడు మీరు గత 30 రోజుల్లో చేసిన పనులను దీనికి జోడిస్తారా? మహా అయితే, మీరు ఓ రెండు సినిమాలు చూసి ఉంటారు... అవునా? నా యువ మిత్రులారా.. నేనిదంతా ఎందుకు చెబుతున్నానంటే- దేశం ఎంత వేగంగా పురోగమిస్తున్నదో, వివిధ అంశాలపై ఎంత విస్తృతంగా కృషి చేస్తున్నదో నా దేశ యువతకు తెలియజేయడానికే!

మిత్రులారా!

అవకాశాలు, ఆశావాదం, నిష్పాక్షికత ఉన్నపుడు మాత్రమే యువతరం పురోగమించగలదు. మిత్రులారా.. భారత్ నేడు ఎలా అభివృద్ధి చెందుతున్నదంటే- ఆకాశమే హద్దుగా మీ ఆకాంక్షలకు రెక్కలు తొడగడానికి సిద్ధంగా ఉంది. మీకు నేను చెప్పాలనుకున్నది ఇదే- భారీ సంకల్పం పూనండి... మీకు అసాధ్యమన్నదే ఉండదు. మీరు సాధించ తలపెట్టే లక్ష్యం ఎంత పెద్దదైన మీకు మద్దతివ్వడంలో దేశం ఎన్నడూ వెనుకంజ వేయదు. ఏ సందర్భాన్నీ తేలికగా తీసుకోకండి.. దాన్నొక సదవకాశంగా మలచుకునే కొత్త ప్రమాణంగా మార్చడంపై దృష్టి పెట్టండి. ఈ దృక్కోణంతోనే మేం జి20ని కూడా అసాధారణ, అద్భుత కార్యక్రమంగా మలచగలిగాం. జి20 అధ్యక్ష హోదాను దౌత్యపరమైన, ఢిల్లీ కేంద్రక వ్యవహారంగా పరిగణించడానికి మాత్రమే మనం పరిమితమై ఉండవచ్చు. కానీ, భారత్ దాన్ని ప్రజల సారథ్యంలో నడిచే జాతీయ ఉద్యమంగా రూపుదిద్దింది. భారత్ వైవిధ్యం, జనాభా, ప్రజాస్వామ్య సామర్థ్యంతో జి20ని కొత్త ఎత్తులకు చేర్చింది.

ఇందులో భాగంగా మొత్తం 60 నగరాల్లో 200కుపైగా సమావేశాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాలు, కార్యకలాపాలకు 1.5 కోట్ల మందికి పైగా పౌరులు సహకరించారు. మునుపెన్నడూ లేని రీతిలో ఒక అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించడంలో 2, 3 అంచెల నగరాలు కూడా తమ అపార సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఇక జి20కి సంబంధించిన ఇవాళ్టి ఈ కార్యక్రమంలో యువతను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేటి ‘విశ్వవిద్యాలయాలతో జి20 అనుసంధానం’ కార్యక్రమంలో 100కుపైగా విశ్వవిద్యాలయాలు సహా లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల్లోని 5 కోట్ల మందికిపైగా విద్యార్థులకు చేరువ కావడానికి ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది. మన ప్రజలు ఆలోచనలు ఉన్నతమైనవి కాగా, వారి సహకారం ఎంతో సమున్నతం!

మిత్రులారా!

భారత్‌ ఇప్పుడు ‘అమృతకాలం’లో పయనిస్తోంది... ఇది మీలాంటి స్వర్ణ తరానికి సొంతం. మన దేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకోనుంది. అది మనకొక చారిత్రక ఘట్టం... ఆనాటి మీ భవిష్యత్తుకు బాటలు వేసుకునే నేటి యువతరం మీరే. అంటే రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంత ముఖ్యమో... మీ జీవితంలోనూ అంతే కీలకం. దేశ ప్రగతి సంబంధిత అంశాలనేకం కలసివచ్చిన కాలమిది. చరిత్రలో ఇలాంటి సమయం మునుపెన్నడూ మనకు తటస్థించలేదు... భవిష్యత్తులో రాబోదు కూడా. అంటే- గతంలోనూ, భవిష్యత్తులోనూ మనది నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ... మీకు తెలిసిందే కదా? అతి తక్కువ సమయంలోనే మనం  10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి 5వ స్థానంలోకి దూసుకెళ్లాం. ఇప్పుడు ప్రపంచానికి భారత్‌పై నమ్మకం ఇనుమడించిన ఫలితంగా భారత్‌లో పెట్టుబడులు రికార్డు సృష్టిస్తున్నాయి. మన తయారీ, సేవా రంగాలు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాయి. ఎగుమతుల రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల మందికిపైగా పేదలు పేదరిక విముక్తులై నవ్య మధ్యతరగతిగా మారారు.

దేశంలో సామాజిక-భౌతిక-డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పనతో ప్రగతి అమిత వేగం పుంజుకుంది. ఇక ఈ సంవత్సరంలో భౌతిక మౌలిక సదుపాయాల కోసం రూ.10 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. ఏటికేడు ఇలా పెట్టుబడులు పెరగడం మన ఆర్థిక వ్యవస్థను ఎంత ముందుకు తీసుకెళ్తుందో... ఎన్ని కొత్త అవకాశాలు అందివస్తాయో ఒకసారి ఊహించండి!

మిత్రులారా!

మీలాంటి యువతకు ఇది అపార అవకాశాల తరుణం... దేశంలో 2020తర్వాత దాదాపు 5 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులయ్యారు. వీరిలో తొలిసారి అధికారిక ఉద్యోగం పొంది, ఆ పరిధిలోకి వచ్చిన యువత దాదాపు 3.5 కోట్ల మంది ఉన్నారు. అంటే- దేశంలో మీలాంటి యువతరానికి అధికారిక ఉద్యోగాల అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయని అర్థం.

దేశంలో 2014కు ముందు అంకుర సంస్థల సంఖ్య 100కు మించకపోగా, నేడు లక్ష దాటింది. అంకుర సంస్థల ఊపుతో చాలామందికి ఉపాధి అవకాశాలు లభించాయి. భారత్‌ ఇవాళ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా రూపొందడంతో ఎగుమతిదారుగా మారింది. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇక రక్షణ రంగం కొన్నేళ్లుగా భారీ స్థాయిలో పురోగమిస్తున్నందున 2014తో పోలిస్తే రక్షణ ఎగుమతులు దాదాపు 23 రెట్లు పెరిగాయి. ఇంత భారీ మార్పు సంభవించినపుడు సహజంగానే రక్షణ సరఫరా వ్యవస్థలో కొత్త ఉద్యోగాల సృష్టి అదే స్థాయిలో ఉంటుంది.

మీలో అనేకమంది యువమిత్రులు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని అభిలషిస్తుండటం నాకు తెలుసు. చిన్న వ్యాపారాల ప్రారంభానికి ముద్రా పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు 8 కోట్ల మంది తొలిసారి సొంత వ్యాపార యజమానులయ్యారు. గడచిన తొమ్మిదేళ్లలో ఏర్పాటైన 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల్లో ఇద్దరి నుంచి ఐదుగురు వంతున లక్షల సంఖ్యలో యువత ఉపాధి పొందుతున్నారు.

మిత్రులారా!

దేశంలో రాజకీయ స్థిరత్వం, విధాన స్పష్టత సహా ప్రజాస్వామ్య విలువల ఫలితంగానే ఈ పురోగమనం సాధ్యమైంది. గడచిన 9 ఏళ్లలో అవినీతి నియంత్రణకు నిజాయితీగా కృషి చేశాం. మీలో చాలామంది  విద్యార్థులు 2014 నాటికి 10, 12 లేదా 14 ఏళ్ల వయస్కులై ఉంటారు. ఆనాడు దేశాన్ని అవినీతి ఎలా నాశనం చేసిందో తెలిసే పత్రికల పతాకశీర్షికల గురించి బహుశా మీకు తెలిసి ఉండదు.

మిత్రులారా!

దళారుల బెడద తొలగించడానికి, దుర్వినియోగం అరికట్టడానికి కొత్త సాంకేతికత ఆధారిత వ్యవస్థలను సృష్టించామని ఇవాళ నేనెంతో గర్వంగా చాటగలను. అనేక సంస్కరణలతోపాటు దళారీలకు తావులేకుండా చేసి, పారదర్శక వ్యవస్థను సృష్టించాం. అవినీతిపరులను శిక్షించడంతోపాటు నిజాయితీని గుర్తిస్తున్నాం. మోదీ అనేకమందిని జైలుపాల్జేస్తున్నాడనే ఆరోపణ రావడం ఆరోపణ రావడం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. మీరు చెప్పండి... దేశ సంపదను దోచుకునే వాళ్లను ఎక్కడుంచాలి? అలాంటి వారిని వెంటాడి పట్టుకుని, జైళ్లకు పంపవద్దా? మీరు కోరుకునేది... నేను చేస్తున్నదీ సరైనతే కదా? కానీ, దీనిపై కొందరు ఎంతో కలతపడుతున్నారు.

మిత్రులారా!

ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే- పారదర్శక, విస్పష్ట, సుస్థిర సుపరిపాలన అత్యంత కీలకం. ఈ మేరకు మీరంతా దృఢ సంకల్పంతో నిలిస్తే, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన, సార్వజనీన, స్వయంసమృద్ధ దేశంగా రూపొందడాన్ని ఆపగల శక్తీ ఏదీ ఉండదు.

మిత్రులారా!

మరొక అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి... అదేమిటంటే- మీరు మెరుగ్గా రాణించాలన్నది భారత్ ఆకాంక్ష మాత్రమే కాదు... యావత్‌ ప్రపంచం ఆశలు మీ మీదనే ఉన్నాయి. భారత్, దాని యువతరం సామర్థ్యం, పనితీరు రెండూ ప్రపంచానికి ఇప్పుడు బాగా తెలుసు. భరతమాత పుత్రులు, పుత్రికల ప్రతిభ గురించి ప్రపంచానికి నేడు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఈ వాస్తవం అన్ని దేశాలకూ తెలుసు... దాన్ని అవి అంగీకరిస్తాయి.

ప్రపంచం ముందడుగు వేయాలంటే భారత్‌తోపాటు దాని యువతరం ప్రగతి పథాన పయనించడం చాలా అవసరం. అది అసాధ్యమనే గళం వినిపిస్తున్నా... భారతీయుల సామర్థ్యం పరంగా దేశానికి ఇలాంటి హామీ ఇవ్వడంలో నేనెంత మాత్రం వెనుకాడను. నా మిత్రులారా... అది మీ బలమే. మీ వెన్నుదన్నుతో నా వాగ్దానాలను నెరవేర్చడమంటే అది మీ యువశక్తి సహకారంతోనే సాధ్యం. ప్రపంచ వేదికలపై భారత్ లక్ష్యాన్ని నేను దృఢంగా ప్రకటించడంలో నాకు స్ఫూర్తినిచ్చేదీ నా యువశక్తే! ఏతావాతా యువతరమే నా నిజమైన బలం... నా శక్తిసామర్థ్యాలన్నీ మీనుంచి వచ్చినవే. అందువల్ల మీ మెరుగైన భవిష్యత్తు కోసం నేను అహర్నిశలూ కృషి చేస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను.

అయితే, మిత్రులారా!

మీ నుంచి కూడా నేను కొన్ని ఆశిస్తున్నాను.. ఆ మేరకు మిమ్మల్ని డిమాండ్ చేయాలని భావిస్తున్నాను. నేనిలా అడగటం మీకేమైనా ఆందోళన కలిగిస్తోందా... మాలాంటి యువత నుంచి ఏదైనా ఆశించే ఈయనేం ప్రధానమంత్రి అనుకుంటున్నారా? కంగారు పడకండి మిత్రులారా... ఎన్నికల్లో గెలిపించమని లేదా మా పార్టీలో చేరమని నేను మిమ్మల్ని అడగబోను.

మిత్రులారా!

నాకు సొంత లక్ష్యమంటూ ఏదీ లేదు... ఏదనా దేశానికి సంబంధించినదే... దేశ ప్రయోజనం కోసమే. అందుకే నేనీ రోజు మీ నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నానంటే, అదీ దేశం కోసమే! స్వచ్ఛ భారత్ అభియాన్‌ను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది యువతే. అయితే, పరిశుభ్ర భారత్‌ దీక్ష ఒకటి లేదా రెండు రోజులతో ముగిసే కార్యక్రమం కాదు... నిరంతర ప్రక్రియ. మనం దీన్నొక అలవాటుగా మార్చుకోవాలి. అందుకే, అక్టోబరు 2న పూజ్య బాపుజీ జయంతికి ముందు రోజున (అక్టోబర్ 1న) పరిశుభ్రత సంబంధిత ప్రధాన కార్యక్రమం ఒకదాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తాం. యువ మిత్రులంతా ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని నా అభ్యర్థన. ఇదే నా డిమాండ్‌... మీరు దీన్ని నెరవేరుస్తారా.. కచ్చితంగా నెరవేరుస్తారా? ఇది మీ విశ్వవిద్యాలయంలోనూ సాగుతుంది... ఆ ప్రాంగణంలో ఓ ప్రాంతాన్ని గుర్తించి పూర్తి శుభ్రంగా ఉంచటానికి మీరు ప్రయత్నిస్తారా?

నా రెండో అభ్యర్థన ‘యూపీఐ’ ఆధారిత డిజిటల్ లావాదేవీలకు సంబంధించినది. ప్రపంచం మొత్తం ఇవాళ డిజిటల్ భారత్, ‘యూపీఐ’ని ఎంతగానో ప్రశంసిస్తోంది. ఇందుకు గర్వించాల్సిన వారు మీరే. యువ మిత్రులారా... మీరంతా దీన్ని త్వరగా అనుసరించారు... సాంకేతికార్థిక వ్యవస్థలో దీనికి సంబంధించి అద్భుత ఆవిష్కరణలు కూడా చేశారు. ఇప్పుడిక దీన్ని మరింత విస్తరించి, సరికొత్త దిశానిర్దేశం చేసే బాధ్యత కూడా మీదే. ‘యూపీఐ’ నిర్వహణ, దానితో చెల్లింపులు, డిజిటల్ లావాదేవీల విధానం తదితరాలపై వారంలో కనీసం ఏడుగురికి అవగాహన కల్పించాలి. మీరు నిబద్ధతతో ఈ పని చేసి చూడండి మిత్రులారా... చాలా వేగంగా మార్పు రావడం తథ్యం!

మిత్రులారా!

ఇక నా మూడో అభ్యర్థన ‘స్థానికం కోసం నినాదం’ సంబంధితం... మీరు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లగలరు. ఒకసారి దీన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే, ప్రపంచం ఇక ఆగదు, నన్ను నమ్మండి... ఎందుకంటే- మీ సామర్థ్యంపై నాకెంతో విశ్వాసం ఉంది. మీ బలంపై మీకు నమ్మకం ఉందో లేదో తెలియదుగానీ, నాకు మాత్రం బాగా తెలుసు. చూడండి... ఇది పండుగల కాలం. ఈ సమయంలో ఎవరికైనా బహుమతి ఇవ్వడం కోసం మీరు కొనుగోలు చేసే వస్తువు ‘మేడ్ ఇన్ ఇండియా’దై ఉండాలని నిర్ణయించుకోండి. మిత్రులారా... దయచేసి మీ దైనందిన జీవితంలో ఈ నేలపై తయారైన, భారత కార్మిక స్వేద సుగంధం నిండిన వస్తూత్పత్తులను మాత్రమే ఉపయోగించేందుకు దీక్షబూనండి. అక్కడితో ఆగిపోరాదు... ‘స్థానికం కోసం నినాదం’ కార్యక్రమం పండుగల వేళకు పరిమితం కారాదు... నిరంతర స్రవంతి కావాలి.

ఇప్పుడు మీకు నేనొక పని అప్పగిస్తాను... చేస్తారా? ఎందుకంటే- ఇంటిపని లేకుండా ఏ తరగతిలోనూ చదువు పూర్తికాదు కదా! కొందరు మౌనంగా ఉన్నారేమిటో! ఓ పెన్ను, కాగితం తీసుకుని మీ కుటుంబ సభ్యులందరితో కలసి కూర్చోండి. లేదంటే మీరు మొబైల్‌లో రాసేవారైతే మీ ఇంట్లో వాడే... నిత్యం వినియోగించే వస్తువుల జాబితాను రాయండి. వాటిలో ఎన్ని స్వదేశీ... ఎన్ని విదేశీ వస్తువులున్నాయో చూడండి. మరి అలా జాబితా తయారు చేస్తారా? ప్రస్తుతం మీ జేబులోగల  దువ్వెన విదేశీ అని మీకు తెలియకపోవచ్చు. మిత్రులారా! అలాంటి విదేశీ వస్తువులెన్నో మన ఇళ్లలోకి, జీవితాల్లోకి ప్రవేశించాయి. కానీ, దేశాన్ని రక్షించుకోవడం మనకెంతో ముఖ్యం. అవును.. నిజమే! దేశంలో మనం ఊహించినంత మంచివి కాని కొన్ని అంశాలున్నాయి. అయితే, మనమేదైనా తప్పు చేస్తున్నామేమో జాగ్రత్తగా పరిశీలించుకునేందుకు ప్రయత్నించాలి. దేశీయ ఉత్పత్తులు కొనడం ప్రారంభించాక.. మన పరిశ్రమలు, వాణిజ్యం అనూహ్య వేగంతో అభివృద్ధి చెందడం మీరు ప్రత్యక్షంగా చూస్తారు మిత్రులారా! ఆ విధంగా ఒక చిన్న అడుగు కూడా భారీ స్వప్నాలను సాకారం చేస్తుంది.

మిత్రులారా!

స్థానికం కోసం నినాదానికి మన విశ్వవిద్యాలయ ప్రాంగణాలు కూడా ప్రధాన కేంద్రాలు కాగలవు. ఎందుకంటే అవి మన విద్యకు మాత్రమే కాదు... ఫ్యాషన్‌ కూడళ్లు కూడా. మీకు ఈ ప్రతిపాదన నచ్చిందా? మనం ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో నిర్వహించే వేడుక ఎలా ఉంటుంది? ఇవాళ ‘రోజ్ డే’ అనుకుందాం... ఖాదీ, భారతీయ వస్త్రాలను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక ఫ్యాషన్ చాటింపుగా మార్చలేమా? మీలాంటి యువకులందరికీ ఈ వెసులుబాటు ఉంది. ఆ మేరకు మార్కెట్‌, బ్రాండ్లు, డిజైనర్లు మీ వైపు మళ్లేలా ప్రభావితం చేయవచ్చు. కళాశాలలు-విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సందర్భాల్లో మనం ఖాదీ సంబంధిత ఫ్యాషన్ ప్రదర్శనలు ఏర్పాటు చేయవచ్చు.

మన విశ్వకర్మ, గిరిజన మిత్రుల హస్తకళా ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేయవచ్చు. భారత్‌ను అభివృద్ధి చేయడంతోపాటు స్వావలంబన సాధించడానికి ఇదెంతో కీలక మార్గం. ఈ బాటలో పయనిస్తే మనం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించవచ్చు. ఈ మేరకు నేను మీ ముందుంచిన నా మూడు చిన్న డిమాండ్లు నెరవేర్చిన తర్వాత మీతోపాటు దేశానికి ఎంత ప్రయోజనం సమకూరిందో, ఇతరులకు మరెంతగా ఉపయోగపడిందో స్వయంగా మీరే చూస్తారు.

నా యువ మిత్రులారా!

మన యువత, నవతరం దృఢ సంకల్పం పూనితే కచ్చితంగా ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఈ ప్రతిజ్ఞతో మీరు ఇవాళ భారత్ మండపం నుంచి బయల్దేరుతారని నా ప్రగాఢ విశ్వాసం. ఒక సంకల్పం పూనితే, దాన్ని సాధించడం కోసం నిస్సందేహంగా మీ సామర్థ్యాన్ని ప్రదర్శించగలరు.

మిత్రులారా!

ఒక్క క్షణం ఆలోచించండి... దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం మనకు లభించలేదు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల తరహాలో మాతృభూమి సేవలో అమరులయ్యే అదృష్టం మనకు దక్కలేదు. అయితే, భరతమాత కోసం జీవించే భాగ్యం మనకు దొరికింది. ఓ శతాబ్దం కిందటి... అంటే- 1919, 1920, 1922, 1923, 1925 సంవత్సరాల్లోని పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ఆ కాలంలో యువత పరాయి పాలన నుంచి దేశవిముక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమయ్యారు. అందుకోసం తమకు అనువైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమ పుస్తకాలను గూట్లో పెట్టి, జైళ్లకు వెళ్లడానికి ఇష్టపడ్డారు... ఉరిశిక్షకైనా వెనుకాడలేదు. సుమారు వందేళ్ల కిందట యువతలో ధైర్యసాహసాలు శిఖరస్థాయికి చేరాయి. త్యాగపూరిత వాతావరణంలో మాతృభూమి కోసం ప్రాణార్పణకూ సంసిద్ధులయ్యారు. అటుపైన పాతికేళ్ల వ్యవధిలో దేశం విముక్తమైంది. అవునా... కాదా మిత్రులారా? అది వారి కృషితో సాధ్యమైందా... లేదా? ఆ 25 ఏళ్లలో దేశవ్యాప్తంగా పెల్లుబికిన భావోద్వేగం 1947లో దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టింది.

మిత్రులారా!

రండి... మీకందరికీ ఇదే నా పిలుపు... నాతో కలసి నడవండి...  మన ముందు 25 సంవత్సరాల వ్యవధి ఉంది. వందేళ్ల కిందట స్వరాజ్యం కోసం యువత కదం తొక్కింది... ఇప్పుడు, మన సౌభాగ్యం  కోసం మనం కదం తొక్కుదాం! పాతికేళ్లలో దేశాన్ని అభివృద్ధి చేద్దాం... నా వంతుగా ఏం చేయడానికైనా వెనుకాడను. మిత్రులారా... స్వయంసమృద్ధ భారత్‌ సౌభాగ్య ద్వారాన్ని చేరాలి. అప్పుడు మన ఆత్మగౌరవం సమున్నత శిఖరాలకు చేరుతుంది. ఇదే సంకల్పంతో ముందడుగు వేద్దాం... వికసిత భారత్ సంకల్పాన్ని కలసికట్టుగా సాకారం చేద్దాం. మనం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ రూపొందాలి. ఆ సమయానికి మీరంతా జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అంటే- పాతికేళ్ల తర్వాత మీరెక్కడున్నా అత్యున్నత స్థానాన్ని చేరుకోగలరు.

ఒక్కసారి ఊహించుకోండి మిత్రులారా... నేటి నా కృషి, మీతో కలసి రేపు చేయబోయే ప్రయత్నం మిమ్మల్ని ఎంత ఎత్తుకు చేరుస్తాయో ఊహించండి. మీ కలలు నిజం కాకుండా ఆపగల శక్తి ఎవరికీ లేదు. ఈ సందర్భంగా భారతదేశాన్ని ప్రపంచంలోని మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి తీసుకెళ్తానన్నది నా వాగ్దానం. ఇందుకోసం నాకు మీ మద్దతు కావాలి... భరతమాత కోసం మీ నుంచి సహకారం కోరుకుంటున్నాను. దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల కోసం నేనిది ఆకాంక్షిస్తున్నాను.

ఇప్పుడు నాతో గళం కలిపి నినదించండి... భారత్‌ మాతాకీ- జై! మిత్రులారా- ఇంకా బిగ్గరగా... భారత్‌ మాతాకీ- జై! భారత్‌ మాతాకీ- జై!

అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(रिलीज़ आईडी: 2201190) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam