పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఇండిగో విమాన సర్వీసుల అంతరాయంపై పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ప్రకటన
प्रविष्टि तिथि:
05 DEC 2025 4:45PM by PIB Hyderabad
విమానాల రాకపోకల్లో ముఖ్యంగా ప్రస్తుతం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాన్ని పరిష్కరించడానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ తక్షణ, క్రియాశీల చర్యలు చేపట్టింది. విమాన విధుల సమయం పరిమితులకు సంబంధించి (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్-ఎఫ్డీటీఎల్) జారీ చేసిన ఆదేశాలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తక్షణమే తాత్కాలికంగా నిలిపి వేసింది. విమాన భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా, కేవలం ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర అవసరాల కోసం సకాలంలో విమాన ప్రయాణంపై ఆధారపడే ఇతరుల కోసం ఈ చర్య తీసుకున్నారు.
దీనితోపాటు సాధారణ విమానయాన సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించడానికి అనేక నిర్వహణ పరమైన చర్యలను చేపట్టాలని కూడా ఆదేశించారు.ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయడం వల్ల విమాన సర్వీసులు రేపటికల్లా సాధారణ స్థితికి చేరుకునే అవకాశముంది. పూర్తిస్థాయి సర్వీసుల పునరుద్ధరణ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఈ సమయంలో ప్రయాణీకులకు సహాయం చేయడానికి, విమానయాన సంస్థలు మెరుగైన ఆన్‌లైన్ సమాచార వ్యవస్థల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. దీనివల్ల ప్రయాణీకులు తమ ఇళ్ల నుంచే విమానాల అందుబాటు స్థితిని సరైన సమయంలో తెలుసుకోవడానికి వీలవుతుంది. విమానాలు రద్దయిన పక్షంలో, ప్రయాణీకులు ఎటువంటి అభ్యర్థనలు చేయకుండానే, విమానయాన సంస్థలు మొత్తం డబ్బును పూర్తిగా తిరిగి చెల్లిస్తాయి. ఎక్కువ ఆలస్యం వల్ల చిక్కుకుపోయిన ప్రయాణీకులకు విమానయాన సంస్థలే నేరుగా హోటల్ వసతిని ఏర్పాటు చేస్తాయి.
వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇస్తారు. వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా చూసేందుకు వారికి లాంజ్ (విశ్రాంతి గది) ప్రవేశంతో పాటు సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తారు. అంతేకాకుండా, విమానాల ఆలస్యం కారణంగా ప్రభావితమైన ప్రయాణీకులందరికీ ఆహారం, ఇతర అత్యవసర సేవలు అందిస్తారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 24×7 పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ (011-24610843, 011-24693963, 096503-91859) ను కూడా ఏర్పాటు చేసింది. సత్వర చర్యలు, సమర్థవంతమైన సమన్వయం, సమస్యలు తలెత్తిన వెంటనే వాటిని పరిష్కరించడం కోసం ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు
విమాన సర్వీసుల అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇండిగోలో ఏం తప్పు జరిగిందో దర్యాప్తు చేస్తారు. అవసరమైన చోట తగిన చర్యల కోసం ఎవరి బాధ్యత ఉందో నిర్ధారిస్తారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు రాకుండా నిరోధించడానికి, ప్రయాణీకులు మళ్లీ ఇలాంటి కష్టాలను ఎదుర్కోకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తుంది.
దేశ ప్రజలకు హామీ
విమాన ప్రయాణీకులు ఎదుర్కొంటున్న కష్టాలపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. విమానయాన సంస్థలతో, అలాగే సంబంధిత భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. విమాన సర్వీసులను యధాస్థితికి తీసుకురావడానికి ప్రజలకు అసౌకర్యాన్ని వీలైనంత త్వరగా తగ్గించడానికి డీజీసీఏ విధించిన నియంత్రణలను సడలించడంతో సహా, ప్రతి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
ప్రయాణీకుల సంరక్షణ, భద్రత, సౌలభ్యం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన ప్రాధాన్యతలుగా కొనసాగుతున్నాయి.
***
(रिलीज़ आईडी: 2199662)
आगंतुक पटल : 5