ప్రధాన మంత్రి కార్యాలయం
వల్లలార్‌గా ప్రసిద్ధి పొందిన శ్రీ రామలింగ స్వామి 200వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2023 1:52PM by PIB Hyderabad
వనక్కం! వల్లలార్‌గా ప్రసిద్ధి గాంచిన శ్రీ రామలింగ స్వామి 200వ జయంతి సందర్భంగా ప్రసంగించటం గౌరవంగా భావిస్తున్నాను. వల్లలార్కు సన్నిహిత సంబంధమున్న వడలూర్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించటం మరింత ప్రత్యేకమైనది. అత్యంత గౌరవనీయమైన సాధువుల్లో వల్లలార్ ఒకరు. 19వ శతాబ్దానికి చెందిన ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అనేక సంస్థలు ఆయన ఆలోచనలు, ఆదర్శాలపై పనిచేస్తున్నాయి.
మిత్రులారా,
వల్లలార్‌ను గుర్తు చేసుకున్నప్పుడు ఆయనలోని సేవాగుణం, కరుణా స్ఫూర్తిని స్మరించుకుంటాం. తోటి మానవుల పట్ల కరుణ చూపాలన్న జీవకారుణ్య విధానాన్ని ఆయన విశ్వసించారు. ఆకలి సమస్యను రూపుమాపటానికి దృఢ సంకల్పంతో ఆయన చేసిన కృషి అత్యంత ముఖ్యమైన సేవల్లో ఒకటి. ఖాళీ కడుపుతో నిద్రకు ఉపక్రమించటమనేది ఆయనకు అత్యంత బాధ కలిగించే అంశం. ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచటమనేది దయగల చర్యల్లోకెల్ల ఉత్తమైనదని ఆయన నమ్మారు. 'వాడియ పయరైకండా పోదెల్లామ్, వాడి నెన్' అని ఆయన అన్నారు. దీని అర్థం.. వాడిపోతున్న పంటను చూసినప్పుడల్లా నేనూ వాడిపోయాను అని. ఈ ఆదర్శానికి మనమంతా కట్టుబడి ఉన్నాం. కొవిడ్-19 మహమ్మారి సమయంలో 80 కోట్ల మంది భారతీయులు ఉచిత రేషన్ పొందిన విషయం మీకు తెలుసు. కష్ట సమయంలో వారికి అదెంతో ఉపశమనం కలిగించింది.
మిత్రులారా,
అభ్యాసం, విద్య శక్తిని వల్లాలార్ విశ్వసించారు. ఒక మార్గదర్శిలా ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. లెక్కలేనంత మందికి ఆయన మార్గనిర్దేశం చేశారు. కురల్ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన ఎంతో కృషి చేశారు. అదేస్థాయిలో ఆధునిక పాఠ్యాంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. తమిళం, సంస్కృతం, ఇంగ్లీషులో యువత ప్రావీణ్యం సంపాదించాలని ఆయన కోరుకున్నారు. గత 9 ఏళ్లలో భారతదేశంలో విద్యా మౌలిక సదుపాయాల్లో పెద్దఎత్తున మార్పులొచ్చాయి. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సమయం తర్వాత, జాతీయ విద్యా విధానాన్ని భారత్ రూపొందించింది. మొత్తం విద్యా వ్యవస్థను ఈ విధానం మారుస్తుంది. ఇప్పుడు ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి వైపు దృష్టి మారింది. గత 9 ఏళ్లలో రికార్డు స్థాయిలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఈ రోజుల్లో స్థానిక భాషల్లో చదివిన ఎంతో మంది యువత డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు. ఇది యువతకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది.
మిత్రులారా,
సాంఘిక సంస్కరణల విషయంలో వల్లలార్ చాలా ముందున్నారు. మతం, కులం, వర్గానికి అతీతంగా దేవుడిపై వల్లలార్ దార్శనికత ఉండేది. విశ్వంలోని ప్రతి అణువులోనూ దైవత్వాన్ని చూశారు. ఈ దివ్యమైన అనుబంధాన్ని గుర్తించి, గౌరవించాలని ఆయన మానవాళిని కోరారు. సమానత్వ సమాజం కోసం కృషి చేయటమే ఆయన బోధనల లక్ష్యం. వల్లలార్కు నివాళులర్పించినపుడు సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే నా విశ్వాసం మరింత బలపడుతుంది. శాసనసభలో మహిళలకు సీట్లు కేటాయించే నారీ శక్తి వందన్ అధినియం ఆమోదాన్ని వల్లలార్ తప్పకుండా ఆశీర్వదించేవారని విశ్వసిస్తున్నాను.
వల్లలార్ రచనలు చదివేందుకు, అర్థం చేసుకునేందుకు సులభంగా ఉంటాయి. సంక్లిష్టమైన ఆధ్మాతిక జ్ఞానాన్ని సాధారణ పదాల్లో ఆయన తెలియజేశారు. గొప్ప సాధువుల బోధనలను ఉమ్మడిగా అనుసంధానించి, కాలక్రమేణా వివిధ ప్రాంతాల్లో ఉన్న మన సాంస్కృతిక జ్ఞానంలోని వైవిధ్యం.. మన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఆలోచనకు బలానిస్తుంది.
ఈ పవిత్ర సందర్భంలో, వల్లలార్ ఆదర్శాలను నెరవేర్చటానికి మన ప్రాధాన్యతను తెలియజేద్దాం. ప్రేమ, దయ, న్యాయం వంటి ఆయన సందేశాలను వ్యాపింపచేయాలి. ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న అంశాలపై కూడా మనం కృషి చేయాలి. మన చుట్టూ ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకుందాం. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందేలా చూసుకుందాం. గొప్ప సాధువైన ఆయన 200వ జయంతి సందర్భంగా మరోసారి నివాళులర్పిస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2197362)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam