ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లతో ముఖాముఖీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
10 OCT 2023 9:05PM by PIB Hyderabad
నా ప్రియ మిత్రులారా,
140 కోట్లమంది దేశ ప్రజల తరఫున మీ అందరికీ స్వాగతం. అభినందనలు.
మంచి అరుదైన యాదృచ్చికం ఏమిటంటే, 1951లో మొట్టమొదటి ఆసియా క్రీడలు ఇక్కడే, ఈ స్టేడియంలోనే జరిగాయి. ఈ రోజు మీరు చూపిన ధైర్యం, మీరు చేసిన కృషి, మీరు సాధించిన ఫలితాల కారణంగా దేశం నలుమూలలా ఉత్సవ వాతావరణం నెలకొంది. మీరు 100 పతకాల లక్ష్యాన్ని దాటడానికి రేయింబవళ్లు శ్రమించారు. మీ అథ్లెట్లందరి ప్రదర్శనకు యావత్ దేశం గర్విస్తోంది.
నేడు, యావత్ దేశం తరఫున, మన అథ్లెట్ల శిక్షకులకు కోచ్‌లకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జట్టులో పాలుపంచుకున్న ప్రతి వ్యక్తికి, సహాయ సిబ్బందికి, ఫిజియోలకు, అధికారులకు నా అభినందనలు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే అంతా ఇంటి నుంచే మొదలవుతుంది. పిల్లలు తమ వృత్తిపరమైన మార్గంలో ఈ దిశగా అడుగులు వేసినప్పుడు, ప్రారంభంలో చాలా వ్యతిరేకత ఎదురవుతుంది. తల్లిదండ్రులు ‘సమయం వృథా చేయొద్దు, చదువు పై దృష్టి పెట్టండి’ అంటుంటారు. ‘అలా చేయండి, ఇలా చేయకండి‘ అని శాసిస్తారు. కొన్నిసార్లు పిల్లలకు గాయమైతే, ఆ సంఘటన మళ్లీ జరగకుండా తల్లులు వారిని మళ్లీ ఆడుకోనివ్వరు. అందుకే మీ తల్లిదండ్రులు కూడా ప్రశంసలకు అర్హులు. మీరు తెరపై కనిపిస్తారు, కానీ మీ విజయం వెనుక ఉన్న వ్యక్తులు ఎప్పుడూ తెరపై కనిపించరు. అయినప్పటికీ, శిక్షణ నుంచి పతకాలు తీసుకునే వేదిక వరకు ప్రయాణం ఈ వ్యక్తులు లేకుండా సాధ్యం కాదు.
మిత్రులారా,
మీరంతా చరిత్ర సృష్టించారు. ఈ ఆసియా క్రీడల్లో పతకాల పట్టిక భారత్ విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. మనం సరైన దిశలో పయనిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మనం వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నప్పుడు, అది విజయవంతం అవుతుందా కాదా అనే అనేక సందేహాలు ఉండేవి. కానీ వ్యాక్సిన్ విజయవంతమైనప్పుడు, 200 కోట్ల డోస్‌లు ఇచ్చారు, దేశ ప్రజల ప్రాణాలు కాపాడారు, ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు భారత్ సహాయపడింది. అప్పుడు నా దిశ సరైందని నాకు భరోసా కలిగింది. నేడు మీరు విజయం సాధించినందున, మన దిశ సరైనదని నేను మరోసారి భావిస్తున్నాను.
ఈసారి విదేశీ గడ్డపై అథ్లెటిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలు సాధించింది. షూటింగ్‌లో, ఆర్చరీలో, స్క్వాష్‌లో, రోయింగ్‌లో, మహిళల బాక్సింగ్‌లో అత్యధిక పతకాలు సాధించారు. మహిళల క్రికెట్‌లో తొలిసారి స్వర్ణం, పురుషుల క్రికెట్‌లో తొలిసారి స్వర్ణం, స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలిసారి స్వర్ణం దక్కాయి. మీరు స్వర్ణ పతకాల వరద సృష్టించారు. చూడండి, మహిళల షాట్ పుట్‌లో డెబ్భై రెండు ఏళ్ల తర్వాత పతకం గెలిచాం. 4X4 100 మీటర్ల రిలేలో అరవై ఒక్క ఏళ్ల తర్వాత పతకం సాధించాం. గుర్రపు స్వారీలో నలభై ఒక్క ఏళ్ల తర్వాత, పురుషుల బ్యాడ్మింటన్‌లో నలభై ఏళ్ల తర్వాత పతకాలు గెలిచాం. అంటే, నాలుగు, ఐదు, ఆరు దశాబ్దాల పాటు ఈ వార్త వినడానికి దేశం ఆరాటపడింది. మీరు దానిని నెరవేర్చారు. మీ ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాయో ఊహించండి.
మిత్రులారా,
ఈసారి మరో ప్రత్యేక విషయం ఉంది, దానిని నేను తప్పక ప్రస్తావించాలి. మనం పాల్గొన్న చాలా క్రీడలలో, ఈవెంట్లలో పతకం సాధించాం. కాబట్టి, ఇది మన పరిధి పెరుగుతున్నట్లు నిరూపిస్తుంది; ఇది భారత్‌కు చాలా శుభ సూచకం. ఇప్పటివరకు దేశం పోడియం ఫినిష్ సాధించని 20 ఈవెంట్‌లు ఉండేవి. మీరు అనేక క్రీడలలో కొత్త ప్రారంభాన్ని మాత్రమే కాక, కొత్త మార్గాన్ని కూడా సృష్టించారు. అది మొత్తం యువతరానికి స్ఫూర్తినిచ్చే మార్గం. ఆ మార్గం ఇప్పుడు ఆసియా క్రీడలకు మించి ఒలింపిక్స్ వైపు మన ప్రయాణంలో కొత్త విశ్వాసాన్ని నింపుతుంది.
మిత్రులారా,
ఈ క్రీడల్లో మన మహిళలు అద్భుతమైన ప్రదర్శన కనబరచడం గర్వంగా ఉంది. మన మహిళా క్రీడాకారులు చూపిన ఉత్సాహం భారతీయ ఆడపిల్లల సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. ఆసియా క్రీడల్లో భారత్ గెలిచిన పతకాల్లో సగానికి పైగా మన మహిళా అథ్లెట్లే సాధించారు. వాస్తవానికి, ఈ చారిత్రక విజయానికి మన మహిళా క్రికెట్ జట్టు శ్రీకారం చుట్టింది.
బాక్సింగ్‌లో అత్యధిక పతకాలు అమ్మాయిలే గెలిచారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మన కుమార్తెలు ముందంజలో ఉండాలనే సంకల్పం తీసుకొని వచ్చినట్టే అనిపించింది. వారు ఎందులోనూ మొదటి ర్యాంక్ కంటే తక్కువ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇదే కొత్త భారత్ స్ఫూర్తి. ఇదే కొత్త భారత్ బలం. తుది ఫలితం ప్రకటించే వరకు, లేదా తుది విజయం సాధించే వరకు కొత్త భారత్ తన ప్రయత్నాలను వదులుకోదు. కొత్త భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి, అత్యుత్తమ ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది.
నా ప్రియమైన క్రీడాకారులారా,
మన దేశంలో ప్రతిభకు ఎప్పుడూ కొరత లేదనే వాస్తవం మీకు తెలుసు. దేశంలో ఎప్పుడూ విజయం సాధించాలనే స్ఫూర్తి ఉంది. గతంలో కూడా మన క్రీడాకారులు బాగా రాణించారు. కానీ వివిధ సవాళ్ల కారణంగా, పతకాల విషయంలో మనం వెనుకబడిపోయాం.
అందువల్ల, 2014 నుంచి భారత్ తన క్రీడా వ్యవస్థను ఆధునికీకరించడానికి, పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది. భారతీయ క్రీడాకారులకు ప్రపంచంలో అత్యుత్తమ శిక్షణా సౌకర్యాలు లభించేలా చూడడమే మా ప్రయత్నం. భారతీయ క్రీడాకారులకు దేశ,విదేశాలలో గరిష్ట అవకాశాలు లభించేలా చూడడం భారత్ ప్రయత్నం. భారతీయ క్రీడాకారులకు ఎంపికలో పారదర్శకత లభించేలా, వారు వివక్షకు గురి కాకుండా ఉండేలా చూడడమే మా ప్రయత్నం. గ్రామాల్లోని క్రీడా ప్రతిభకు కూడా గరిష్ఠ అవకాశాలు లభించేలా చూస్తున్నాం. మా క్రీడాకారుల మనోధైర్యం చెక్కుచెదరకుండా ఉండేందుకు, వారికి వనరుల కొరత ఎదురుకాకుండా ఉండేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం.
క్రీడా రంగానికి బడ్జెట్‌ను కూడా తొమ్మిదేళ్ల క్రితంతో పోలిస్తే మూడు రెట్లు పెంచాం. మా టాప్స్ (టీఓపీఎస్), ఖేలో ఇండియా పథకాలు గేమ్ ఛేంజర్‌లుగా నిరూపితమయ్యాయి. గుజరాత్ ప్రజలకు డబ్బు ఆట మాత్రమే తెలుసని అంటారు. కానీ ఖేలో గుజరాత్ ప్రారంభించినప్పుడు, క్రమంగా అక్కడ ఒక క్రీడా సంస్కృతి అభివృద్ధి చెందడం మొదలైంది. ఆ అనుభవం నాకు ఒక ఆలోచన ఇచ్చింది ఆ అనుభవం ఆధారంగానే ఇక్కడ ఖేలో ఇండియా ప్రారంభించాం. ఇది అపారమైన విజయం సాధించింది.
మిత్రులారా,
ఈ ఆసియా క్రీడల్లో దాదాపు 125 మంది అథ్లెట్ల ప్రతిభను ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా గుర్తించారు. వీరిలో 40 మందికి పైగా పతకాలు కూడా సాధించారు. ఖేలో ఇండియా కార్యక్రమం నుంచి ఇంత మంది క్రీడాకారులు బహుమతుల వేదిక వద్దకు చేరుకోవడం ఆ కార్యక్రమం సరైన దిశలో పయనిస్తోందని చూపిస్తుంది. మీరు ఎక్కడి వారైనా, పాఠశాలలు కళాశాలల్లో ఎప్పుడు మాట్లాడినా, ఖేలో ఇండియాలో పాల్గొనమని అందరినీ ప్రోత్సహించాలని నేను కోరుతున్నా. వారి జీవితాలు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి.
ప్రతిభను గుర్తించడం నుంచి ఆధునిక శిక్షణ, ప్రపంచంలోనే అత్యుత్తమ కోచింగ్ వరకు నేడు భారత్ ఏ విషయంలోనూ వెనుకబడడం లేదు. ప్రస్తుతం 3000 మందికి పైగా ప్రతిభావంతులైన అథ్లెట్లు ఖేలో ఇండియా పథకం ద్వారా శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం ప్రతి క్రీడాకారుడికి కోచింగ్, వైద్యం, ఆహారం, శిక్షణ మొదలైన వాటి కోసం ఏటా రూ. 6 లక్షలకు పైగా స్కాలర్‌షిప్ కూడా ఇస్తోంది.
ఈ పథకం కింద, ప్రస్తుతం అథ్లెట్లకు సుమారు రూ. 2500 కోట్ల సహాయం నేరుగా అందిస్తున్నారు. డబ్బు కొరత మీ ప్రయత్నాలకు ఎప్పటికీ అడ్డుకాదని నేను మీకు హామీ ఇస్తున్నా. రాబోయే ఐదేళ్లలో క్రీడల కోసం ప్రభుత్వం మరో రూ. 3000 కోట్లు ఖర్చు చేయనుంది. నేడు దేశం నలుమూలలా మీ కోసం ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు.
మిత్రులారా,
ఆసియా క్రీడల్లో మీ ప్రదర్శన నన్ను మరో విషయంలో కూడా ఉత్సాహపరిచింది. ఈసారి చాలామంది యువ అథ్లెట్లు పతకాల జాబితాలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. యువ క్రీడాకారులు గొప్ప శిఖరాలను చేరుకున్నప్పుడు, వారు మన క్రీడా దేశ గుర్తింపుగా మారతారు. ఇది క్రీడా దేశ లక్షణం. అందుకే, దేశానికి మీరు చాలా కాలం పాటు సేవలందించబోతున్నందున, విజయం సాధించిన ఈ యువ అథ్లెట్లను ఈ రోజు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కొత్త యువ విజేతలు దేశం కోసం చాలా కాలం పాటు అద్భుతంగా రాణిస్తారు. కొత్త ఆలోచన ప్రకారం, యువ భారత్ కేవలం మంచి ప్రదర్శనతో సంతృప్తి చెందడం లేదు, దానికి పతకాలు, విజయాలు కూడా కావాలి.
మిత్రులారా,
నేటి యువతరం ‘గోట్‘ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తోంది. దేశానికి మీరంతా ఆ ‘గోట్‘ లే. మీ ఉత్సాహం, మీ అంకితభావం, మీ చిన్ననాటి కథలు అందరికీ స్ఫూర్తి. పెద్ద లక్ష్యాలు సాధించడానికి ఇతర యువకులను అవి ప్రేరేపిస్తాయి. చిన్న పిల్లలు మీ పట్ల ఎంతగానో ఆకర్షితులవుతుండడం నేను చూశాను. వారు మిమ్మల్ని చూసి మీలా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు మీ సానుకూల ప్రభావాన్ని సద్వినియోగం చేసుకొని, వీలైనంత ఎక్కువ మంది యువకులతో అనుసంధానం కావాలి. గతంలో క్రీడాకారులను పాఠశాలలకు వెళ్లి పిల్లలను కలవాలని నేను కోరినప్పుడు, చాలా మంది క్రీడాకారులు పాఠశాలలకు వెళ్లిన విషయం నాకు గుర్తుంది. వారిలో కొందరు ఇక్కడ కూడా ఉన్నారు. నీరజ్ ఒక పాఠశాలకు వెళ్లగా, అక్కడి పిల్లలు నీరజ్‌ను ఎంతగానో ప్రశంసించారు. ఈ రోజు మీ అందరినీ నేను అదే విధంగా మళ్లీ అభ్యర్థిస్తున్నాను. దేశానికి మీ నుంచి ఏదైనా కోరే హక్కు ఉంది. అవునా? ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అవునా - కాదా? లేదు, నాకు వినిపించడం లేదు; ఏదో తేడా ఉంది. దేశం మీ నుంచి కూడా ఏదో ఆశిస్తోంది,అవునా? ఆ అంచనాలను నెరవేరుస్తారా?
చూడండి, నా ప్రియమైన క్రీడాకారులారా,
ప్రస్తుతం దేశం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయాత్మక పోరాటం చేస్తోంది. మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి మీ అందరికీ బాగా తెలుసు. అనాలోచిత డోపింగ్ కూడా ఒక క్రీడాకారుడి కెరీర్‌ను నాశనం చేయగలదు. అనేకసార్లు, గెలవాలనే కోరిక కొంతమందిని తప్పుడు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. అందుకే నేను మిమ్మల్ని, మీ ద్వారా మన యువతను అప్రమత్తం చేయాలనుకుంటున్నాను. మీరంతా విజేతలు కాబట్టి మన యువతను మీరు హెచ్చరించాలి. సరైన మార్గంలో నడిచి గొప్ప విజయాన్ని సాధించారు. కాబట్టి, ఎవరూ తప్పుడు మార్గంలో వెళ్లాల్సిన అవసరం లేదు. వారు మీ మాట వింటారు. అందువల్ల మీరు ఇందులో కీలక పాత్ర పోషించగలరు.
మీరు పట్టుదల, మానసిక సంకల్పానికి ప్రతీకలు. పతకాలు కేవలం శారీరక బలం ద్వారా మాత్రమే రావు; మానసిక సంకల్పం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అది మీలో పుష్కలంగా ఉంది. ఇదే మీ గొప్ప ఆస్తి. ఆ ఆస్తి దేశానికి ఉపయోగపడాలి. మాదకద్రవ్యాల హానికర ప్రభావాల గురించి యువ తరానికి అవగాహన కల్పించే గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు కూడా మీరే.
మీకు అవకాశం దొరికినప్పుడు, ఎవరైనా సందేశం లేదా ఇంటర్వ్యూ అడిగితే, దయచేసి ఈ రెండు వాక్యాలు చెప్పండి- ‘దేశ యువ మిత్రులకు నేను చెప్పదలచుకుంది ఇదే.’ మీరు ఈ మాట చెప్పండి, ఎందుకంటే మీరు ఏదో సాధించారు. దేశ యువత మీ మాట వింటారు."
మీరు ప్రజలను కలిసినప్పుడు, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, “మాదకద్రవ్యాల ముప్పు గురించి పాఠశాలలు, కళాశాలల్లో తప్పకుండా అవగాహన కల్పించాలి” అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. మాదకద్రవ్య రహిత భారత్ కోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికి మీరు ముందుకు రావాలి.
మిత్రులారా,
సూపర్‌ఫుడ్స్ ప్రాముఖ్యత, ఫిట్‌నెస్‌కు అవి ఎంత ముఖ్యమో మీకు తెలుసు. మీరు మీ జీవనశైలిలో పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇష్టమైనప్పటికీ అనేక రకాల ఆహారాలకు దూరంగా ఉన్నారు. ఏమి తినాలో తెలుసుకోవడం కంటే ఏమి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే మీరు దేశంలోని పిల్లలకు వారి ఆహారపు అలవాట్లపై పోషక ఆహారం గురించి చాలా మార్గదర్శకత్వం అందించగలరని నేను చెబుతాను. మీరు మిల్లెట్ ఉద్యమం పోషణ మిషన్‌లో కూడా కీలక పాత్ర పోషించవచ్చు. పాఠశాలల్లో సరైన ఆహారపు అలవాట్ల గురించి మీరు పిల్లలతో మరింతగా మాట్లాడాలి.
మిత్రులారా,
క్రీడా మైదానంలో మీరు చేసిన కృషి కూడా ఒక పెద్ద పరిధిలో భాగమే. దేశం పురోగమిస్తున్నప్పుడు దాని ప్రభావం ప్రతి రంగంలో కనిపిస్తుంది. భారత క్రీడా రంగంలో కూడా ఇదే జరుగుతోంది. దేశంలో పరిస్థితులు సరిగా లేనప్పుడు, అది క్రీడా మైదానంలో కూడా ప్రతిబింబిస్తుంది. నేడు భారత్ ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందుతున్నప్పుడు, మీరు దానిని క్రీడా రంగంలో కూడా ప్రదర్శించారు. నేడు భారత్ ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారే దిశలో ఉన్నప్పుడు మన యువత నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అందుకే, అంతరిక్షంలో భారత్ పేరు ప్రకాశించడాన్ని మీరు ఈ రోజు చూడవచ్చు. చంద్రయాన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
నేడు స్టార్టప్‌ల ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సైన్స్, టెక్నాలజీలో అద్భుతమైన కృషి జరుగుతోంది. పరిశ్రమల ఏర్పాటులో భారత యువత ఎంతో రాణిస్తోంది. ప్రపంచంలోని కొన్ని అగ్రగామి కంపెనీల సీఈఓలు భారతీయ బిడ్డలే కావడం విశేషం. అంటే భారత యువత సామర్థ్యం ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది. మీలాంటి క్రీడాకారులందరిపై దేశానికి గొప్ప విశ్వాసం ఉంది. ఈ విశ్వాసంతోనే మేం ‘100 దాటండి’ అనే నినాదం ఇచ్చాం. మీరు ఆ కోరికను నెరవేర్చారు. వచ్చేసారి ఈ రికార్డును దాటి మరింత ముందుకు వెళ్తాం. ఇప్పుడు మన ముందు ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. పారిస్ కోసం శ్రద్ధగా సిద్ధం అవ్వండి. ఇప్పుడు విజయం సాధించలేక పోయినవారు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనం తప్పుల నుంచి నేర్చుకుని కొత్త ప్రయత్నాలు చేస్తాం. మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను. కొన్ని రోజుల తర్వాత అక్టోబర్ 22 నుంచి పారా ఆసియా క్రీడలు కూడా ప్రారంభం కానున్నాయి. మీ ద్వారా పారా ఆసియా క్రీడల్లో పాల్గొనే పిల్లలందరికీ క్రీడాకారులకు కూడా నా శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన ప్రదర్శన, ఈ అద్భుతమైన విజయం ద్వారా దేశాన్ని గర్వపడేలా చేసినందుకు మీ అందరినీ మరోసారి అభినందిస్తున్నాను.
చాలా ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2197349)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam