ప్రధాన మంత్రి కార్యాలయం
షిరిడీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంతోపాటు కొన్నింటిని జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
26 OCT 2023 6:52PM by PIB Hyderabad
ఛత్రపతి కుటుంబానికి నమస్కారం!
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, కష్టించే తత్వమున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే గారు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర గారు, అజిత్ గారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ..
ఈ పవిత్ర షిర్డీ భూమికి నా కోటి ప్రణామాలు! అయిదేళ్ల క్రితం.. ఈ పవిత్ర ఆలయం వందో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో నాకు సాయి దర్శనం చేసుకొనే అవకాశం లభించింది. (మరాఠీలో చెప్పారు). ఈ రోజు, సాయి బాబా ఆశీర్వాదంతో రూ. 7500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించుకుంటున్నాం లేదా శంకుస్థాపన చేసుకున్నాం. గత అయిదు దశాబ్దాలుగా మహారాష్ట్ర ఎదురు చూస్తున్న నీల్వాండే ఆనకట్ట పూర్తయింది. అక్కడ ‘జలపూజ’ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ప్రారంభించిన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు గతంలో శంకుస్థాపన చేసే అవకాశం నాకు దక్కింది. ‘దర్శనం క్యూ’ ప్రాజెక్టులు పూర్తి కావడంతో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు ప్రయోజనం చేకూరుతుంది.
స్నేహితులారా,
అమూల్యమైన వ్యక్తిత్వం కలిగిన, వరకారీ శాఖకు కీర్తిని తీసుకొచ్చిన హరి భక్తుడు బాబా మహారాజ్ శతార్కర్ ఈ ఉదయం మరణించారన్న దుర్వార్త నాకు తెలిసింది. కీర్తనలు, ప్రవచనాల ద్వారా సామాజిక అభ్యుదయానికి ఆయన చేసిన విశేష కృషి శతాబ్దాల తరబడి తరతరాలకూ స్ఫూర్తి కలిగిస్తుంది. ఆయన సరళమైన మాట తీరు, ప్రేమ నిండిన పలుకులు, ఆయన శైలి ప్రజలను ఆకర్షిస్తాయి. ఆయన ఆలపించిన ‘జయ జయ రామకృష్ణ హరి’ కీర్తన ఎంత ప్రభావం చూపించిందో మనమంతా చూశాం. బాబా మహారాజ్ శతార్కర్ గారికి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
నిజమైన సామాజిక న్యాయం అంటే పేదరికం నుంచి దేశం విముక్తి పొందాలి. అత్యంత నిరుపేద కుటుంబాలకు సైతం వృద్ధి చెందే అవకాశం లభించాలి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే మంత్రంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదల సంక్షేమమే మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న అంశం. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో పేదల సంక్షేమం కోసం కేటాయించే బడ్జెట్ కూడా పెరుగుతోంది.
ఈ రోజు మహారాష్ట్రలో 1 కోటి 10 లక్షల ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డు పొందిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి రూ. 70 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. పేదలకు ఉచిత రేషన్ అందించడానికి రూ. 4 లక్షల కోట్లను వెచ్చించింది. అలాగే పేదలకు ఇళ్లు నిర్మించడానికి మరో రూ.4 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇది 2014కు ముందు పదేళ్లలో చేసిన వ్యయంతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ. ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించేందుకు సుమారుగా రూ. 2 లక్షల కోట్లను ఖర్చు చేశాం. వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి యోజన ద్వారా వేల రూపాయల ఆర్థికసాయం లభిస్తోంది.
పీఎం విశ్వకర్మ యోజన పేరుతో ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా లక్షలాది వడ్రంగి, స్వర్ణకార, కుమ్మరి, శిల్పకారుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మొదటిసారి సాయం లభించింది. ఈ పథకం కోసం రూ.13 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని కేటాయించాం. 2014కు ముందు కూడా ఇలాంటి గణాంకాల గురించి విన్నాం. కానీ అవి లక్షలు, కోట్ల రూపాయల అవినీతి, కుంభకోణాల గురించి మాత్రమే ఉండేవి. ఇప్పుడేమి జరుగుతోంది? ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు, పథకాల మీద వెచ్చిస్తున్నాం.
నా కుటుంబ సభ్యులారా,
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతు సోదరులు కూడా ఉన్నారు. ముందుగా.. మన వ్యవసాయ సమాజానికి సందేశమిస్తూ.. ‘ధర్తీ కహే పుకార్’ అనే నాటకాన్ని మన ముందు గొప్పగా ప్రదర్శించిన అమ్మాయిలకు నా శుభాకాంక్షలు. ఈ సందేశాన్ని మీరు ఖచ్చితంగా మీ వెంట తీసుకెళతారు. ఆ అమ్మాయిలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
గతంలో రైతుల గురించి ఎవరూ పట్టించుకొనేవారు కాదు. మన రైతు సోదరీసోదరుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించాం. దీని ద్వారా సన్నకారు రైతులకు రూ. 2 లక్షల 60 వేల కోట్లు అందాయి. మహారాష్ట్రలో సైతం చిన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 26 వేల కోట్లు నేరుగా జమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నమో షెట్కారీ మహాసమ్మాన్ నిధి యోజనను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను. దీని ద్వారా మహరాష్ట్రలోని రైతు కుటుంబాలకు మరో రూ.6000 అందుతాయి. అంటే ఇప్పుడు సమ్మాన్ నిధి ద్వారా రైతులకు రూ.12 వేలు ఆర్థిక సాయం లభిస్తుంది.
నా కుటుంబ సభ్యులారా,
రైతుల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో నిమగ్నమైన వారు.. ప్రతి నీటిబొట్టుకీ మిమ్మల్ని వేధించారు. ఈ రోజు నీల్వాండే ప్రాజెక్టులో ‘జల పూజ’ నిర్వహించాం. దీనికి 1970లో ఆమోదం లభించింది. ఒక్కసారి ఆలోచించండి.. ఈ ప్రాజెక్టు పనులు అయిదు దశాబ్దాల పాటు నిలిచిపోయాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమైంది. ఇప్పుడు ఎడమ గట్టు కాలువ నుంచి ప్రజలకు నీరందుతోంది. త్వరలోనే కుడి గట్టు కాలువ సైతం ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో కరవు పీడిత ప్రాంతాలకు బలిరాజా జల్ సంజీవని యోజన ఓ వరంగా మారింది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా నిలిచిపోయిన మరో 26 నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇవి మన రైతులకు, కరవు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ఆనకట్ట నుంచి నీరు విడుదలవుతున్న నేపథ్యంలో నా రైతు సోదరీసోదరులు అందరికీ ఓ విన్నపం. ఈ నీరు దేవుడిచ్చిన వరం. కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయొద్దు. ఉన్న నీటితో ఎక్కువ దిగుబడి సాధిద్దాం. మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకోవాలి.
నా కుటుంబ సభ్యులారా,
రైతులకు సాధికారత కల్పించాలనే సదుద్దేశంతో మేం కృషి చేస్తున్నాం. కానీ మహారాష్ట్రలో కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు... చాలా ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా ఆయన్ను చాలా గౌరవిస్తాను. కానీ.. ఆయన రైతుల కోసం ఏం చేశారు? తన ఏడేళ్ల పదవీ కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కేవలం రూ. 3.5 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సంఖ్యను గుర్తు పెట్టుకోండి. మా ప్రభుత్వంలో అదే ఏడేళ్ల కాలానికి రూ.13.5 లక్షల కోట్ల మొత్తాన్ని కనీస మద్దతు ధరగా రైతులకు మా ప్రభుత్వం అందించింది. 2014కి ముందు కేవలం రూ. 500-600 కోట్ల విలువైన పప్పుధాన్యాలు, నూనె గింజలను మాత్రమే రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేవారు. కానీ మా ప్రభుత్వం.. పప్పులు, నూనె గింజల కోసం రైతులకు రూ. 1లక్షా 15 వేల కోట్లకు పైగా మొత్తాన్ని అందించింది. ఆ వ్యవసాయ శాఖ మంత్రి హయాంలో రైతులు తమకు రావాల్సిన డబ్బు కోసం దళారులపై ఆధారపడాల్సి వచ్చేది. నెలల తరబడి రైతులకు సొమ్ము చెల్లించేవారు కాదు. మా ప్రభుత్వం కనీస మద్దతు ధర సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది.
స్నేహితులారా,
ఇటీవలే రబీ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాం. కనీస మద్దతు ధరను పప్పుధాన్యాలకు రూ.105, గోధుమ, కుసుమకు రూ.150 పెంచాం. ఇది మహారాష్ట్రలోని రైతు సోదరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చెరకు రైతుల ప్రయోజనాలకు సైతం మేం ప్రాధాన్యమిస్తున్నాం. క్వింటాలుకు రూ.315 చొప్పున చెరకు ధర పెరిగింది. గడచిన 9 ఏళ్లలో రూ.70 వేల కోట్ల విలువైన ఇథనాల్ కొనుగోలైంది. ఈ మొత్తం కూడా రైతులకు చెల్లించాం. చక్కెర రైతులకు సకాలంలో చెెల్లింపులయ్యేలా చూసేందుకు వేల కోట్ల రూపాయలను చక్కెర మిల్లులు, సహకార సంస్థలకు అందించాం.
నా కుటుంబ సభ్యులారా,
సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో సహకార సంఘాలున్నాయి. దేశ రైతులకు నిల్వ, శీతల గిడ్డంగి సౌకర్యాలను కల్పించేలా సహకార సంఘాలు, పీఏసీఎస్లకు తగిన సహకారం అందుతోంది. ఎఫ్‌పీవోలు - రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా చిన్నకారు రైతులకు తోడ్పాటు లభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7500 ఎఫ్‌పీవోలు ఏర్పాటయ్యాయి.
నా కుటుంబ సభ్యులారా,
అపారమైన సామర్థ్యానికి, అంతులేని అవకాశాలకు మహారాష్ట్ర కేంద్రంగా ఉంది. ఎంత వేగంగా మహారాష్ట్ర అభివృద్ధి చెందితే.. అంత వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుంది. కొన్ని నెలల క్రితమే ముంబయి, షిర్డీ మధ్య నడిచే వందేభారత్‌ను ప్రారభించే అవకాశం నాకు లభించింది. మహారాష్ట్రలో ఈ రైల్వే విస్తరణ కొనసాగుతుంది. జలగావ్, భూసావల్ మధ్య మూడు, నాలుగు రైల్వే లైన్ల ప్రారంభంతో ముంబై-హౌరా మధ్య రైలు ప్రయాణం సులభతరమవుతుంది. అదే విధంగా, సోలాపూర్ నుంచి బోర్గావ్ వరకు నిర్మించిన నాలుగు లైన్ల రహదారి.. మొత్తం కొంకణ్ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పరిశ్రమలకు మాత్రమే కాకుండా.. చెరకు, ద్రాక్ష, పసుపు రైతులకు సైతం ప్రయోజనం కలుగుతుంది. ఈ మార్గం.. రవాణాకు మాత్రమే కాకుండా.. మొత్తం ప్రగతి, సామాజిక అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తుంది.
ఇంత పెద్ద సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాధించాలని సంకల్పం తీసుకుందాం.
ధన్యవాదాలు
గమనిక: ఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2196937)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam