56వ ఇఫీలో నిర్వహించిన చివరి ఫైర్‌సైడ్ చాట్ చర్చా కార్యక్రమంలో నూతనోత్తేజం నింపిన ఏకే
ఇఫీ 2025 కోసం తన చమత్కారం, జ్ఞానం, శైలితో ఇఫీ 2025లో
చివరి రోజు సాయంత్రాన్ని ఉత్సాహంగా మార్చిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
‘‘నా ప్రేక్షకులతో పాటు నన్ను నేను ఆశ్చర్యపరచుకోవడం నాకు ఇష్టం’’: ఆమీర్ ఖాన్
‘‘నేను పూర్తిగా సినిమాకు సంబంధించిన వ్యక్తిని, ఉద్యమకారుణ్ని కాదు,
ప్రేక్షకులను రంజింప చేయడమే నా ప్రథమ కర్తవ్యం’’: ఆమీర్
‘‘దర్శకత్వం చేయాలని నిర్ణయం తీసుకున్న రోజున బహుశా, నేను నటించడం మానేయెచ్చు’’
‘‘ది నేరేటివ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ సోషల్ ట్రాన్సఫర్మేషన్ అండ్ ఇంక్లూజివిటీ’’ పేరుతో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో నిర్వహించిన చివరి ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత ఆమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొనేందుకు ఆయన కళా అకాడమీలో ప్రవేశించినప్పడు సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
దిగ్గజ నటుడు ధర్మేంద్రకు నివాళులు అర్పించి.. ఈ కార్యక్రమాన్ని చర్చ సంధాన కర్త, ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ ప్రారంభించారు. ‘‘ధర్మాజీని చూస్తూ నేను పెరిగాను. భారతీయ సినిమాలో హీ-మ్యాన్‌గా గుర్తింపు సాధించినప్పటికీ.. శృంగారం, హాస్యం, నాటకంతో సహా అన్ని కళల్లో ఆయనది అసమాన ప్రతిభ. అద్భుతమైన నటనా పరిధి, ఉనికి కలిగిన నటుడు. ఆయన సౌమ్యుడు. పరిపూర్ణ నటుడు. భాషపై ఆయనకున్న పట్టు, సహజమైన హోదా, కళాకారుడిగా అసాధారణ ప్రతిభతో తనను తాను గొప్పవాడిగా మలుచుకున్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగానూ, కళా రంగానికి తీరని నష్టం’’ అని ఆమీర్ అన్నారు.
ఆ తర్వాత గంటన్నర పాటు ‘ది ఆమీర్ ఖాన్ షో’ కొనసాగింది. కథల పట్ల ప్రేమతో తన జీవితం ఎలా నిండిపోయిందనే విషయాన్ని ఆయన వివరించడంతో చర్చ ప్రారంభమైంది. చిన్నతనంలో తన బామ్మ చెప్పిన కథలు, రేడియోలో ప్రసారమైన హవా మహల్ మాయాజాలం తనను కట్టిపడేశాయని, ఇలాంటి అనుభవాలే తన సృజనాత్మక ఆలోచనలను మలిచాయని ఆయన అంగీకరించారు. ‘‘నేను ఎల్లప్పుడూ కథల పట్ల ఆకర్షితమయ్యాను. నా బాల్యంలో అవి భాగం. ఈ ఆకర్షణే నటుడిగా నేను ప్రతి కథను ఎంపిక చేసుకొనే విషయంలో నాకు మార్గనిర్దేశం చేసింది’’ అని గుర్తు చేసుకున్నారు.
సినిమా విషయంలో లెక్కలు వేసుకోని తన విధానం గురించి ఈ పర్ఫెక్షనిస్టు తనదైన శైలిలో వివరించారు. అది తనలో సహజంగా ఉందని తెలిపారు. ‘‘నేను చేసిందే మళ్లీ చేయను. ఒక తరహా సినిమా చేసిన తర్వాత అక్కడి నుంచి ముందుకు సాగాలనుకుంటాను. నేను కొత్తవైన, ప్రత్యేకమైన, సృజనాత్మక ఆసక్తిని కలిగించే కథల కోసం నేను చూస్తుంటాను’’ అని వెల్లడించారు.
సినిమా పట్ల తనకున్న స్వాభావిక ధోరణి గురించి ఆయన మరింత వివరించారు. చిత్ర రంగంలో చాలా మంది యాక్షన్, కామెడీ లేదా బాక్సాఫీసు వద్ద విజయం సాధించే ఇతర తరహా మార్పులను ప్రయత్నిస్తూ ట్రెండ్‌ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారని, తాను ఆ విధంగా ఎప్పుడూ పని చేయలేదని ఆయన వివరించారు. ‘‘కథ విషయంలో భావోద్వేగపరంగా నాకు కలిగిన ఆసక్తి ఆధారంగా మాత్రమే నేను సినిమాలను ఎంచుకుంటాను. ప్రమాణాలకు భిన్నంగా ఉన్నప్పటికీ అదే పని చేస్తాను’’ అని ఆయన అన్నారు. ‘‘నా నిర్ణయాల్లో చాలా వరకు పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఆచరణ సాధ్యం కానివే. లగాన్ సినిమా చిత్రీకరణ సమయంలో దాన్ని చేయొద్దని జావెద్ సార్ మాకు సూచించారు. లాజిక్ ప్రకారం చూస్తే.. నేను స్టార్ అయి ఉండకూడదు. కానీ నేను ప్రతి నియమాన్ని చేధించాను. అయితే.. ఆ అసాధారణ ఎంపికలు ప్రజల మెప్పు పొందాయి. ఈ విషయంలో నేను కృతజ్ఞుణ్ని’’ అని తెలిపారు.
తన మనసు చెప్పిన దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటానని ఆమీర్ తెలిపారు. ‘‘నేను ఏ సామాజిక అంశంపై తర్వాతి సినిమా తీయాలని ఆలోచించి ఎంపిక చేసుకోను. నాకు ఆసక్తి కలిగించే వాటిని మాత్రమే ఎంపిక చేసుకుంటాను. ఓ గొప్ప సామాజిక సందేశాన్ని కలిగి ఉంటే.. అది బోనస్. అంతేకానీ దానితోనే మొదలుపెట్టకూడదు’’ అని చెప్పారు.
సామాజిక ఇతివృత్తాలను ప్రతిబింబించేలా ఉన్న తన చిత్రాల గురించి ఆమీర్ వివరిస్తూ.. ‘‘ఇది కావాలని చేసినట్లు ఉండొచ్చు. కానీ కాదు. ఈ కథలు నా దగ్గరకు సహజంగానే వచ్చాయి. బహుశా ఈ తరహా కథలకు నేను అనుసంధానమై ఉండొచ్చు. అలాంటి కథలను చేసే అదృష్టం నాకు కలిగి ఉండచ్చు’’ అని తెలిపారు.
‘‘తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్, దంగల్, లాపాటా లేడీస్ సినిమాలకు అవసరమైన పునాదిని రచయితలే వేశారు. వారే ఆ ప్రపంచాలను, పాత్రలను రూపొందించారు - నేను ఆ కథల పట్ల ఆకర్షితుడయ్యాను’’ అంటూ.. తన కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన సినిమాల విజయాల వెనక ఘనతను రచయితలకే ఇచ్చారు. ‘‘నా చిత్రాలు ఎన్నో సామాజిక సమస్యలను ఎత్తిచూపాయి. కానీ అది సహజంగా జరిగిపోయింది. కావాలని చేసింది కాదు’’ అని ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడైన నటుడు తెలిపారు.
‘‘నేను పూర్తిగా సినిమా వ్యక్తిని. ఉద్యమకారుణ్ని కాదు. ప్రేక్షకులను రంజింప చేయడమే నా ప్రథమ కర్తవ్యం’’ అని ఆయన నిజాయతీగా చెప్పారు.
తన ప్రధాన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను నిర్మిస్తున్న లాహోర్ 1947, హ్యాపీ పటేల్, ఇతర చిత్రాలు మరికొన్ని నెలల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత నా మొత్తం దృష్టిని నిర్మాణం నుంచి నటన వైపు తిరిగి మళ్లిస్తాను’’ అని ఆమీర్ తెలియజేశారు.
‘‘ఇప్పటి నుంచి నేను వినే ప్రతి కథ పూర్తిగా నాలోని నటుడి కోసమే. ఇది ముఖ్యమైన మార్పు. మళ్లీ నేను నటనకు పునరంకితమయ్యేందుకు ఇదే సరైన సమయం’’ అని ఈ వేదిక నుంచి ప్రకటించారు.
‘‘ఇప్పుడు నేను కొత్త కథలను వింటున్నాను. వాటిలో కొన్ని నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా రెండు మూడు కథల నుంచి ఎంపిక చేసుకొనే ప్రక్రియలోనే ఉన్నాను’’ అని తెలిపారు.
‘‘ప్రేక్షకుల్లో ఉన్న చిత్ర నిర్మాత ఎవరైనా మీతో కలసి పనిచేయాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి’’ అని రంగన్ అడిగారు. దీనికి ‘‘వారు నా మేనేజర్‌ను కలసి కథ వినిపించడానికి సమయం అడగొచ్చు. లేదా నాకు స్క్రిప్టు పంపించవచ్చు. కొన్ని సందర్భాల్లో నేను స్క్రిప్టు చదువుతాను. మరికొన్ని సందర్భాల్లో నేను దాన్ని వింటాను. కాబట్టి ఏదైనా ఎంచుకోవచ్చు’’ అని ఆమీర్ సమాధానమిచ్చారు.
తన దర్శకత్వ ప్రయాణంపై ఆమీర్ ఖాన్ చెప్పిన అంచనాలతో ఫైర్‌సైడ్ ఛాట్ ముగిసింది. ‘‘నిజానికి నాకు దర్శకత్వమంటే ఇష్టం. సినిమా నిర్మాణాన్ని నేను ఆస్వాదిస్తాను. నేను ఓ సారి దర్శకత్వం చేశాను. కానీ అది ప్రణాళికాబద్ధంగా చేసింది కాదు. అనుకోకుండా ఎదురైన సంక్షోభం నుంచి బయటపడటానికి చేశాను. అయితే నేను దర్శకత్వం చేయాలని కచ్చితమైన నిర్ణయం తీసుకున్న రోజున నేను బహుశా నటనను ఆపేస్తాను. ఎందుకంటే.. అది పూర్తిగా నా సమయాన్ని తీసేసుకుంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాను’’ అని తెలిపారు.
కార్యక్రమం ముగించే ముందు అమీర్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సత్కరించారు.
ఇఫీ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలబడుతోంది. జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గోవా ఎంటర్‌టైన్మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంతర్జాతీయ సినిమా శక్తి కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ పునరుద్ధరించిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాలను చేరుకుంటాయి. దిగ్గజాలు.. తొలిసారి చిత్రాలను తెరకెక్కిస్తున్న కొత్త తరంతో వేదికను పంచుకుంటారు. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాసులు, నీరాజనాలతో పాటుగా ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వృద్ధి చెందే వేవ్స్ ఫిలిం బజార్ కలగలిసి ఇఫీని శక్తివంతం చేస్తున్నాయి. సుందరమైన గోవా తీరప్రాంత నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ సంచిక భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన ప్రపంచాన్ని అందిస్తుంది. అలాగే అంతర్జాతీయ వేదికపై భారతీయ సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి:
ఇఫీ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ నిర్వహిస్తోన్నఇఫీ మైక్రో సైట్: https://www.pib.gov.in/iffi/56/
పీఐబీ ఇఫీవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిళ్లు : @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
रिलीज़ आईडी:
2196713
| Visitor Counter:
3