ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ‘లక్ష కంఠాల గీతా పారాయణం’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 28 NOV 2025 3:26PM by PIB Hyderabad

ఎల్లారీగూ నమస్కారా !

జై శ్రీ కృష్ణ!

జై శ్రీ కృష్ణ!

జై శ్రీ కృష్ణ!

నేను మొదలుపెట్టే ముందు.. కొంతమంది పిల్లలు తమ బొమ్మలను ఇక్కడికి తీసుకువచ్చారు. దయచేసి ఎస్పీజీ, స్థానిక పోలీసులు వాటిని తీసుకునే విషయంలో సహాయం చేయండి. మీరు వెనుక వైపున మీ చిరునామా రాస్తే నేను ఖచ్చితంగా మీకు ఒక ధన్యవాద లేఖ పంపుతాను. ఎవరి దగ్గర ఏమున్నా దయచేసి వారికి ఇవ్వండి. వారు వాటిని తీసుకుంటారు. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఈ పిల్లలు ఎంత కష్టపడి పనిచేస్తారు. కొన్నిసార్లు వీటిని నేను గుర్తించక పోతే అది నాకు బాధ కలిగిస్తుంది.

జై శ్రీ కృష్ణ!

శ్రీకృష్ణ భగవానుని దివ్య దర్శనం పొందిన సంతృప్తి, శ్రీమద్ భగవద్గీత మంత్రాల ఆధ్యాత్మిక అనుభవం, ఇంతమంది గౌరవ సాధువులు- గురువుల సమక్షం అనేది నాకు ఒక గొప్ప అదృష్టం. నాకు ఇది లెక్కలేనన్ని పుణ్యాలు పొందినట్లుగా అనిపిస్తోంది. నాకు ఇచ్చిన గౌరవం, నా గురించి చెప్పిన మంచి మాటలకు అర్హుడిని అయ్యేంత ఎక్కువ పని చేసేందుకు, నాపై పెట్టిన అంచనాలను నెరవేర్చే విషయంలో ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను. 

సోదరీసోదరులారా, 

కేవలం మూడు రోజుల క్రితం నేను భగవద్గీత పుట్టిన నేల అయిన కురుక్షేత్రంలో ఉన్నాను. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు, జగద్గురువు శ్రీ మధ్వాచార్యులవారి కీర్తి ఉన్న ఈ పుణ్యభూమికి రావడం నాకు అత్యంత సంతృప్తిని ఇస్తోంది. ఈ సందర్భంగా లక్ష మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలను పారాయణం చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారత్‌‌కు ఉన్న వేల సంవత్సరాల దైవత్వాన్ని చూశారు. ఈ కార్యక్రమంలో మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్న శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ, శ్రీ శ్రీ సుశీంద్ర తీర్థ స్వామీజీ, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గారు,  కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉడిపిలోని అష్ట మఠాల అనుచరులందరూ, ఇక్కడ ఉన్న ఇతర సాధువులు- సోదరీసోదరులారా!

కర్ణాటక ప్రాంతానికి, ఇక్కడి ప్రేమించే ప్రజల మధ్యకు రావడం నాకు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభవంగా అనిపిస్తుంది. ఉడిపికి రావడం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. నేను గుజరాత్‌లో జన్మించాను. గుజరాత్‌కు ఉడిపికి మధ్య ఒక లోతైన, ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాన్ని మొదట ద్వారకలో రుక్మిణీ దేవి పూజించారని నమ్ముతారు. తర్వాత జగద్గురు శ్రీ మధ్వాచార్యులవారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. గతేడాది నేను సముద్రం అడుగున ఉన్న శ్రీ ద్వారకను సందర్శించడానికి వెళ్లి అక్కడ భగవంతుడి ఆశీస్సులు కూడా తీసుకున్నానని మీకు తెలుసు. ఈ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు ఏ విధమైన అనుభూతి కలిగిందో మీరు ఊహించుకోగలరు. ఈ దర్శనం నాకు హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది.

మిత్రులారా, 

మరొక కారణం వల్ల కూడా ఉడిపికి రావడం నాకు ప్రత్యేకమైనది. జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సుపరిపాలనా నమూనాకు ఉడిపి ఒక కార్యక్షేత్రంగా ఉంది. 1968లో ఉడిపి ప్రజలు ఇక్కడ మా జనసంఘ్ అభ్యర్థి వీ.ఎస్. ఆచార్యను మునిసిపల్ కౌన్సిల్‌‌కు ఎన్నుకున్నారు. దీనితో ఒక కొత్త పాలనా నమూనాకు కూడా ఉడిపి పునాది వేసింది. ఈ రోజు మనం చూస్తున్న జాతీయ స్థాయిలో ఊపందుకున్న ‘స్వచ్ఛతా కార్యక్రమాన్ని’ ఐదు దశాబ్దాల క్రితమే ఉడిపి స్వీకరించింది. నీటి సరఫరా - మురుగునీటి నిర్వహణ వ్యవస్థకు ఒక కొత్త నమూనాను అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాలను 1970 ప్రాంతంలో మొదట ప్రారంభించిన ప్రాంతాల్లో ఉడిపి ఒకటి. నేడు ఈ కార్యక్రమాలు జాతీయ అభివృద్ధిలో భాగంగా మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి.. ఇవి ఒక జాతీయ ప్రాధాన్యతగా మారుతున్నాయి.

మిత్రులారా, 

రామచరితమానస్‌లో "కలిజుగ కేవలం హరి గుణ గాహా। గావత నర పావహిం భవ థాహా।।" అని ఉంది. "కేవలం దీన్ని జపిస్తూ ఉండటం మాత్రమే జీవన సముద్రం నుంచి విముక్తిని ఇస్తుంది" అనేది దీని అర్థం. శతాబ్దాలుగా గీతలోని శ్లోకాలు, మంత్రాల పఠనం మన సమాజంలో జరుగుతోంది. కానీ లక్ష మంది ఈ శ్లోకాలను ఏకకాలంలో పఠించినప్పుడు, ఇంత మంది ప్రజలు గీత వంటి పవిత్ర గ్రంథాన్ని పఠించినప్పుడు, ఈ దివ్య శ్లోకాలు ఒకే చోట కలిసి ప్రతిధ్వనించినప్పుడు.. మనస్సుతో పాటు మెదడుకు ఒక శక్తినిచ్చే ఒక నూతన చైతన్య తరంగం, ఒక నూతన బలాన్నిచ్చే శక్తి విడుదలవుతుంది. ఈ శక్తే ఆధ్యాత్మికత.. ఈ శక్తే సామాజిక ఐక్యతా. కాబట్టి ఈ రోజు లక్ష గొంతులు గీతా పారాయణం చేసిన సందర్భం.. ఒక విశాలమైన శక్తి సమూహాన్ని అనుభూతి చెందే అవకాశంగా మార్చింది. ఇది సామూహిక చైతన్యం శక్తిని కూడా ప్రపంచానికి తెలియజేస్తోంది.

మిత్రులారా, 

ఈ రోజున నేను ప్రత్యేకంగా శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి వందనం చేస్తున్నాను. ఆయన ‘లక్ష కంఠాల గీత’ ఆలోచనను ఇంత దివ్యంగా సాకారం చేశారు. గీతను సొంత చేతులతో రాయాలనే ఆలోచనతో ఆయన ప్రారంభించిన ‘కోటి గీతా లేఖన్ యజ్ఞం’ అనేది సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ప్రపంచ సామూహిక ఉద్యమం. మన యువతరం భగవద్గీత స్ఫూర్తి, బోధనలతో అనుసంధానమౌతున్న తీరు కూడా స్వయంగా లోతైన ప్రేరణ‌గా ఉంది. భారత్‌కు వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాల్లోని జ్ఞానాన్ని తర్వాతి తరానికి అందించే సంప్రదాయం శతాబ్దాలుగా ఉంది. తర్వాతి తరాలను భగవద్గీతతో అనుసంధానించే ఈ సంప్రదాయానికి ఒక అర్థవంతమైన కొనసాగింపుగా ఈ కార్యక్రమం మారింది.

మిత్రులారా, 

ఇక్కడికి రావడానికి మూడు రోజుల ముందు నేను అయోధ్యలో కూడా ఉన్నాను. నవంబర్ 25న వివాహ పంచమి శుభ సందర్భంగా అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో ధర్మధ్వజం ప్రతిష్ఠాపన జరిగింది. అయోధ్య నుంచి ఉడిపి వరకు లక్షలాది మంది రామ భక్తులంతా ఈ అత్యంత దివ్యమైన గొప్ప ఉత్సవాన్ని వీక్షించారు. రామ మందిర ఉద్యమంలో ఉడిపి పోషించిన ముఖ్యమైన పాత్ర మొత్తం దేశానికి తెలుసు. దశాబ్దాల క్రితం నాటి రామ మందిర ఉద్యమానికి దివంగత పూజ్య శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ చేసిన కృషికి ఈ పతాకారోహణ వేడుక నిదర్శనంగా నిలుస్తోంది. రామ మందిరం నిర్మాణం ఉడిపికి ఇంకో కారణం వల్ల కూడా ప్రత్యేకమైనది. కొత్త ఆలయంలో జగద్గురు మధ్వాచార్యులవారి పేరు మీద ఒక పెద్ద ద్వారం కూడా ఉంది. శ్రీరాముని గొప్ప భక్తుడు అయిన జగద్గురు మధ్వాచార్యులవారు "రామాయ శాశ్వత సువిస్తృత షడ్గుణాయ, సర్వేశ్వరాయ బల-వీర్య మహార్ణవాయ" అని రాశారు. "ఆరు దివ్య గుణాల అలంకరణలో ఉన్న శ్రీరాముడు అందరికీ ప్రభువు.. అపారమైన బలం, ధైర్యానికి ఆయన మహాసముద్రం" అని దీని అర్థం. అందుకే రామ మందిర సముదాయంలోని ఒక ద్వారానికి ఆయన పేరు పెట్టడం అనేది ఉడిపి ప్రజలకు, కర్ణాటకకు అలాగే దేశం మొత్తానికి గొప్ప గర్వకారణం.

మిత్రులారా, 

జగద్గురు శ్రీ మధ్వాచార్యులవారు భారతదేశంలోని ద్వైత సిద్ధాంతానికి వ్యవస్థాపకుడు, వేదాంతానికి ఒక జ్యోతి. ఆయన స్థాపించిన ఉడుపిలోని అష్ట మఠాల వ్యవస్థ అనేది సంస్థలు, కొత్త సంప్రదాయాల సృష్టికి సంబంధించిన మూర్తీభవించిన ఉదాహరణ. శ్రీకృష్ణ భగవానుడిపై భక్తి, వేదాంత జ్ఞానం, వేలాది మందికి అన్నదానం చేసే సంకల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఒక విధంగా ఈ ప్రాంతం తీర్థయాత్ర స్థలం.. జ్ఞానం, భక్తి, సేవల సంగమం. 

మిత్రులారా, 

జగద్గురు మధ్వాచార్యులవారు జన్మించిన సమయంలో భారత్‌ అనేక అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ కాలంలో ఆయన సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి విశ్వాసానికి అనుసంధానమయ్యే భక్తి మార్గాన్ని చూపించారు. ఈ మార్గదర్శకత్వం కారణంగానే అనేక శతాబ్దాల తర్వాత కూడా ఆయన స్థాపించిన మఠాలు ప్రతి రోజు లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. ఆయన స్ఫూర్తి కారణంగానే ద్వైత సంప్రదాయంలో ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా మంది జన్మించారు. వారు ఎల్లప్పుడూ ధర్మం, సేవ, సామాజిక నిర్మాణ కార్యాలను ముందుకు తీసుకువెళ్లారు. ఈ ప్రజా సేవ శాశ్వత సంప్రదాయమే ఉడుపి గొప్ప సాంస్కృతిక వారసత్వం. 

మిత్రులారా, 

జగద్గురు మధ్వాచార్యులవారి వారసత్వం హరిదాస సంప్రదాయానికి శక్తినిచ్చింది. పురందరదాసు, కనకదాసు వంటి మహనీయులు ఆధ్యాత్మికతను సామాన్య, సులభమైన కన్నడ భాషలో ఆసక్తికరమైన రీతిలో ప్రజలకు వ్యాప్తి చేశారు. పేదవారి హృదయాలను కూడా తాకిన వారి రచనలు ప్రజలను ధర్మం, శాశ్వత ఆలోచనలతో అనుసంధానించాయి. ఈ రచనలు నేటి తరంలో కూడా అంతే ముఖ్యమైనవి. నేటికీ సామాజిక మాధ్యమాలకు చెందిన రీల్స్‌లో శ్రీ పురందరదాసు రచించిన 'చంద్రచూడ శివ శంకర పార్వతి' విని మన యువత ఒక విభిన్న మానసిక స్థితిలోకి వెళ్తున్నారు. నేటికీ ఉడిపిలో నావంటి ఒక భక్తుడు ఒక చిన్న కిటికీ నుంచి శ్రీకృష్ణుడిని చూసినప్పుడు కనకదాసు భక్తితో అనుసంధానమయ్యే అవకాశం లభిస్తుంది. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు ఇంతకుముందు కూడా ఈ అదృష్టం లభించింది. కనకదాసు గారి పట్ల నా గౌరవాన్ని తెలిపే అవకాశం నాకు లభించింది.

మిత్రులారా, 

శ్రీకృష్ణ భగవానుడి బోధనలు ప్రతి యుగంలోనూ ఆచరణాత్మకమైనవి. గీత వచనాలు కేవలం వ్యక్తులకే కాకుండా దేశ పాలనకు కూడా మార్గనిర్దేశం చేస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు "సర్వభూతహితే రతా:" అని చెప్పారు. సకల ప్రాణుల సంక్షేమం కోసం పనిచేయాలనేది దీని అర్థం. "లోక సంగ్రహమ్ ఏవాపి, సమ్ పశ్యన్ కర్తుమ్ అర్హసి!" అని కూడా గీతలో ఉంది. అంటే.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఈ రెండు శ్లోకాల అర్థం ఏంటంటే.. మనం ప్రజా సంక్షేమం కోసం పని చేయాలి. జగద్గురు మధ్వాచార్యులవారు ఈ భావాలను తీసుకుని జీవితాంతం భారతదేశ ఐక్యతను బలోపేతం చేశారు.

మిత్రులారా, 

ఈ రోజు మా 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్', 'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' అనే విధానాలు శ్రీకృష్ణ భగవానుడి ఈ శ్లోకాల నుంచే ప్రేరణ పొందుతున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు మనకు పేదలకు సహాయం చేసే మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రానికి ఉన్న స్ఫూర్తి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ వంటి పథకాలకు ఆధారంగా మారింది. శ్రీకృష్ణుడు మనకు మహిళల భద్రత, మహిళా సాధికారతకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చారు. దీని నుంచి ప్రేరణ పొంది భారతదేశం నారీ శక్తి వందన్ చట్టం వంటి చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంటోంది. శ్రీకృష్ణుడు మనకు అందరి శ్రేయస్సు గురించి చెప్పారు. ఇది మన టీకా మైత్రి, సౌర కూటమి, వసుధైవ కుటుంబకం విధానాలకు ఆధారంగా మారింది. 

మిత్రులారా, 

శ్రీకృష్ణుడు భగవద్గీత సందేశాన్ని యుద్ధక్షేత్రంలో అందించారు. భగవద్గీత మనకు శాంతి, సత్యాన్ని స్థాపించేందుకు అణచివేసేవారిని అంతం చేయాల్సిన అవసరాన్ని బోధిస్తోంది. ఇదే మన జాతీయ భద్రతా విధానానికి మూలంగా ఉంది. మనం "వసుధైవ కుటుంబకం" అని అంటున్నాం. "ధర్మో రక్షతి రక్షిత:" అనే మంత్రాన్ని కూడా పునరుద్ఘాటిస్తున్నాం. మనం ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి సందేశాన్ని అందించాం. అదే కోట నుంచి "మిషన్ సుదర్శన్ చక్ర"ను ప్రకటించాం. మిషన్ సుదర్శన్ చక్రం అంటే దేశంలోని కీలక స్థానాలు, పారిశ్రామిక- ప్రభుత్వ రంగాల పరిధిలోకి శత్రువు చొరబడలేని విధంగా ఒక భద్రతా గోడను ఏర్పాటుచేయటం. శత్రువు ధైర్యం చేస్తే మన సుదర్శన్ చక్రం వారిని నాశనం చేస్తుంది.

మిత్రులారా, 

ఆపరేషన్ సింధూర్‌లో కూడా దేశం మా సంకల్పాన్ని చూసింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో చాలా మంది దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధితులలో కర్ణాటకకు చెందిన నా సోదరీసోదరులు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు నిష్క్రియంగా ఉండేవి. కానీ ఇది నూతన భారతదేశం.. ఇది ఎవరికీ తలవంచదు.. పౌరులను రక్షించే కర్తవ్యాన్ని విస్మరించదు. శాంతిని ఎలా స్థాపించాలో మాకు తెలుసు. శాంతిని ఎలా పరిరక్షించాలో కూడా మాకు తెలుసు.

మిత్రులారా, 

భగవద్గీత సొంత కర్తవ్యాలు, జీవిత సంకల్పాల గురించి మనకు తెలియజేస్తోంది. ఈ ప్రేరణతో ఇవాళ నేను మీ అందరి నుండి కొన్ని సంకల్పాలను కూడా కోరుతున్నాను. ఈ అభ్యర్థనలు తొమ్మిది సంకల్పాల రూపంలో ఉన్నాయి. మన వర్తమానం, భవిష్యత్తుకు ఇవి చాలా అవసరం. సాధు సమాజం ఈ అభ్యర్థనలకు ఆశీస్సులు ఇచ్చినప్పుడు అవి ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు.

మిత్రులారా, 

మన మొదటి సంకల్పం ఏంటంటే.. నీటిని సంరక్షించటం- నీటిని ఆదా చేయటం- నదులను కాపాడటం. మన రెండో సంకల్పం ఏంటంటే.. చెట్లను నాటడం. తల్లి పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది. ఈ కార్యక్రమానికి అన్ని మఠాల శక్తి తోడైతే దాని ప్రభావం మరింత పెరుగుతుంది. మూడో సంకల్పంగా మనం దేశంలో కనీసం ఒక్క పేదవారి జీవితాన్ని అయినా మెరుగపరిచేందుకు ప్రయత్నించాలి. నేను ఎక్కువగా అడగడం లేదు. నాలుగో సంకల్పం స్వదేశీ భావన అయి ఉండాలి. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనమందరం స్వదేశీని స్వీకరించాలి. ఈ రోజు దేశం ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ మంత్రంతో ముందుకు సాగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ, మన పరిశ్రమ, మన సాంకేతికత అన్నీ సొంత కాళ్లపై గట్టిగా నిలబడ్డాయి. అందుకే మనం గట్టిగా చెప్పాలి.. వోకల్ ఫర్ లోకల్, వోకల్ ఫర్ లోకల్,వోకల్ ఫర్ లోకల్. 

మిత్రులారా, 

ఐదో సంకల్పంగా మనం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. మన ఆరో సంకల్పం ఏంటంటే.. మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని స్వీకరించటం. చిరుధాన్యాలను పండించాలి. మన ఆహారంలో నూనెను తగ్గించాలి. యోగాను స్వీకరించటమే మన ఏడో సంకల్పం. యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. తాళపత్ర గ్రంథాల పరిరక్షణలో సహకరించటం అనేది ఎనిమిదో సంకల్పం. దేశంలోని పురాతన జ్ఞానంలో ఎక్కువ భాగం తాళపత్ర గ్రంథాలలో దాగి ఉంది. ఈ జ్ఞానాన్ని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'జ్ఞాన్ భారతం మిషన్'పై పనిచేస్తోంది. మీ మద్దతు ఈ అమూల్యమైన వారసత్వాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది. 

మిత్రులారా, 

మన సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన దేశంలోని కనీసం 25 ప్రదేశాలను సందర్శించాలన్న ప్రతిజ్ఞను తొమ్మిదో సంకల్పంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి నేను మీకు కొన్ని సూచనలు ఇస్తాను. మూడు, నాలుగు రోజుల క్రితం కురుక్షేత్రలో మహాభారత అనుభూతి కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని సందర్శించి శ్రీకృష్ణ భగవానుడి జీవితాన్ని తెలుసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవి వివాహాన్ని పురస్కరించుకొని నిర్వహించే మాధవ్‌పూర్ మేళా గుజరాత్‌లో జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం నుంచి చాలా మంది ప్రజలు ఈ మేళాకు వస్తారు. మీరు కూడా వచ్చే సంవత్సరం దీన్ని సందర్శించే ప్రయత్నం చేయాలి. 

మిత్రులారా, 

శ్రీకృష్ణ భగవానుడి జీవితంతో పాటు గీతలోని ప్రతి అధ్యాయం.. కర్మ, కర్తవ్యం, శ్రేయస్సులకు సంబంధించిన సందేశాన్ని తెలియజేస్తోంది. మన భారతీయులకు 2047 సంవత్సరం అనేది కేవలం ఒక అమృత కాలం మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించేందుకు ఇదొక కర్తవ్య కాలం. దేశంలోని ప్రతి పౌరుడికి, ప్రతి భారతీయుడికి తనదైన బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు తనదైన కర్తవ్యం ఉంది. ఈ కర్తవ్యాలను నెరవేర్చడంలో కష్టపడే‌తత్వం ఉన్న కర్ణాటక ప్రజలకు కీలక పాత్ర ఉంది. మన ప్రతీ ప్రయత్నం దేశం కోసమే చేయాలి. కర్తవ్యానికి ఉన్న ఈ స్ఫూర్తిని అనుసరిస్తే అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్‌ అనే కల కూడా సాకారమవుతుంది. ఇదే ఆశతో.. అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే మన సంకల్పానికి ఉడుపి నేలకు ఉన్న శక్తి మార్గనిర్దేశం చేస్తూనే ఉండాలని కోరుతుంటున్నాను. ఈ పవిత్ర కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  అందరికీ—

జై శ్రీ కృష్ణ!

జై శ్రీ కృష్ణ!

జై శ్రీ కృష్ణ!

 

***


(रिलीज़ आईडी: 2196702) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Odia , Kannada