ప్రధాన మంత్రి కార్యాలయం
హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
26 NOV 2025 12:09PM by PIB Hyderabad
భారత పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాఫ్రాన్ గ్రూప్‌తో అనుబంధం ఉన్న ప్రముఖులు, సోదరీ సోదరులారా!
నేను పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉన్నందున సమయం చాలా తక్కువగా ఉంది. గౌరవ రాష్ట్రపతితో ఒక కార్యక్రమం ఉంది. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకుండా నేను కొన్ని అంశాలను త్వరగా పంచుకుని... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ రోజు నుంచి భారత విమానయాన రంగం కొత్త ఊపును పొందబోతోంది. ఈ కొత్త శాఫ్రాన్ కేంద్రం భారత్‌ను ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా నిలపడంలో సహాయపడుతుంది. ఈ ఎంఆర్వో కేంద్రం హైటెక్ ఏరోస్పేస్ ప్రపంచంలో యువతకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది. నేను ఈనెల 24న సాఫ్రాన్ బోర్డు యాజమాన్యాన్ని కలిశాను. నేను వారిని ఇంతకు ముందు కూడా కలిశాను. ప్రతి చర్చలోనూ భారత్ పట్ల వారి నమ్మకం, ఆశను నేను చూశాను. భారత్‌లో శాఫ్రాన్ పెట్టుబడి అదే వేగంతో కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ కేంద్రం కోసం కృషి చేసిన టీం శాఫ్రాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాలుగా భారత విమానయాన రంగం అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందిందని మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటి. బలమైన మన మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్దది. నేటి భారత ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. అటువంటి సందర్భంలో... భారత్‌లో విమాన ప్రయాణానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అందువల్ల, మన విమానయాన సంస్థలు తమ క్రియాశీల విమానాలను నిరంతరం విస్తరిస్తున్నాయి. భారతీయ విమానయాన సంస్థలు 1,500 కంటే ఎక్కువ కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి.
మిత్రులారా,
భారత్‌లో విమానయాన రంగం వేగంగా విస్తరించడం వల్ల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) కేంద్రాల అవసరం కూడా పెరిగింది. గతంలో మన ఎంఆర్వో పనిలో దాదాపు 85 శాతం విదేశాల్లోనే జరిగేది. దీని వల్ల ఖర్చులు పెరిగడంతోపాటు ఎక్కువ సమయం పట్టేది. విమానాలు చాలా కాలం పాటు నిలిచిపోయేవి. ఈ పరిస్థితి భారత్ వంటి పెద్ద విమానయాన మార్కెట్‌కు తగినది కాదు. అందుకే ఈ రోజు భారత ప్రభుత్వం దేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. మొదటిసారిగా ఒక ప్రపంచ ఓఈఎం దేశంలో అత్యున్నత స్థాయి సేవల సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తోంది.
మిత్రులారా,
శాఫ్రాన్ ప్రపంచస్థాయి శిక్షణ, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం దేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడతాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో మొత్తం ఎంఆర్వో వ్యవస్థకు కొత్త వేగాన్నీ, దిశనూ అందిస్తుంది. ఈ కేంద్రం దక్షిణ భారతదేశంలోని యువతకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మనం ఎంఆర్వో విమానయానానికే పరిమితం కావాలని కోరుకోవడం లేదు. షిప్పింగ్‌కు సంబంధించిన ఎంఆర్వో వ్యవస్థనూ అభివృద్ధి చేయడానికి మేం చాలా పెద్ద స్థాయిలో పని చేస్తున్నాం.
మిత్రులారా,
దేశంలో ప్రతి రంగంలోనూ మేం డిజైనింగ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. భారత్‌లోనూ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్, కాంపోనెంట్ డిజైన్ అవకాశాలను అన్వేషించాలని నేను శాఫ్రాన్ బృందాన్ని అభ్యర్థిస్తున్నాను. ఇందులో మా విస్తారమైన ఎంఎస్ఎంఈల నెట్వర్క్, పెద్దసంఖ్యలో గల మా యువ ప్రతిభ మీకు ఎంతో మద్దతునిస్తుంది. ఏరోస్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్‌లపై శాఫ్రాన్ విస్తృతంగా పనిచేస్తుంది. మీరు భారత్ ప్రతిభను, ప్రొపల్షన్ డిజైన్, తయారీకి ఇక్కడ అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను.
మిత్రులారా,
నేటి భారత్ కేవలం పెద్ద కలలు కనడం మాత్రమే కాదు... పెద్ద నిర్ణయాలూ తీసుకుంటోంది. ఇంకా పెద్ద ఫలితాలనూ సాధిస్తోంది. మనం పెద్ద కలలు కంటున్నాం... పెద్ద పనులు చేస్తున్నాం. అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తున్నాం. భారత్ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపై బలంగా దృష్టి సారించింది.
మిత్రులారా,
ప్రపంచ పెట్టుబడులను, ప్రపంచ పరిశ్రమలను ఆకర్షించడానికి స్వతంత్ర భారతదేశంలో మేం అతిపెద్ద సంస్కరణలు కొన్నింటిని చేపట్టాం. మొదట మేం మా ఆర్థిక వ్యవస్థకు అవకాశాలను అందుబాటులోకి తెచ్చాం. రెండోది, మేం మా ప్రాథమిక అంశాలను బలోపేతం చేశాం. మూడోది, మేం వ్యాపార నిర్వహణను సులభతరం చేశాం.
మిత్రులారా,
చాలా రంగాల్లో ఇప్పుడు ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తున్నాం. గతంలో ప్రైవేటు రంగానికి చోటు లేని రక్షణ రంగం వంటి రంగాల్లోనూ మేం ఇప్పుడు ఆటోమేటిక్ రూట్ ద్వారా 74 శాతం ఎఫ్‌డిఐని అనుమతిస్తున్నాం. అంతరిక్ష రంగంలోనూ ధైర్యంగా నూతన విధానాన్ని అవలంబించాం. ఈ చర్యలు ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపాయి. భారత్ పెట్టుబడులను, ఆవిష్కరణలను స్వాగతిస్తుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు ప్రపంచ తయారీదారులను మేక్ ఇన్ ఇండియా వైపు ఆకర్షించాయి. గత 11 సంవత్సరాల్లో అనుమతి సంబంధిత భారాలను 40,000 లకు పైగా తగ్గించాం. భారత్ వందలాది వ్యాపార సంబంధిత నిబంధనలను నేరరహితం చేసింది. జాతీయ సింగిల్ విండో వ్యవస్థ అనేక ఆమోదాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, ఫేస్‌లెస్ అంచనాలు, కొత్త కార్మిక నియమావళులు, ఐబీసీ గతంలో కంటే పాలనను మరింత సరళంగా, పారదర్శకంగా చేశాయి. ఈ ప్రయత్నాల కారణంగానే భారత్ ఇప్పుడు విశ్వసనీయ భాగస్వామిగా, ప్రధాన మార్కెట్‌గా, వృద్ధి చెందుతున్న తయారీ కేంద్రంగా కనిపిస్తోంది.
మిత్రులారా,
భారత్ వేగవంతమైన వృద్ధిని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని, సంస్కరణల ఆధారిత మనస్తత్వాన్ని, విస్తారమైన యువ ప్రతిభావంతుల సమూహాన్ని, పెద్ద దేశీయ మార్కెట్‌ను కలిగి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, భారత్‌లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులను సహ-సృష్టికర్తలుగా మేం పరిగణిస్తాం. 'వికసిత్ భారత్' ప్రయాణంలో మేం వారిని భాగస్వాములుగా చూస్తాం. అందువల్ల, నేను అన్ని పెట్టుబడిదారులకు చెప్పాలనుకునేది ఒక్కటే... భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ఈ దశాబ్దంలో అత్యంత తెలివైన వ్యాపార నిర్ణయం అని భారత్ నిరూపిస్తోంది. మరోసారి, ఈ ఆధునిక ఎంఆర్వో కేంద్రం కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. నాకు సమయం తక్కువగా ఉంది. కాబట్టి నేను బయలుదేరడానికి మీ అనుమతి కోరుతున్నాను. చాలా ధన్యవాదాలు!
***
(Release ID: 2195067)
Visitor Counter : 3