మంత్రిమండలి
azadi ka amrit mahotsav

పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశలోని ఖరడీ–ఖడక్వాస్లా (లైన్ 4), నాల్ స్టాప్–వార్జే–మానిక్ బాగ్ (లైన్ 4A)లకు కేబినెట్ ఆమోదం

Posted On: 26 NOV 2025 4:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు పూణే మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ కింద లైన్ 4 (ఖరాడి–హడప్సర్–స్వర్గేట్–ఖడక్వాస్లా), లైన్ 4A (నాల్ స్టాప్–వర్జే–మానిక్ బాగ్) లకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పూణే ప్రజా రవాణా నెట్‌వర్క్‌లో మరో పెద్ద పురోగతికి మార్గం సుగమమైంది. లైన్ 2A (వనాజ్–చందాని చౌక్), లైన్ 2B (రామ్‌వాడి–వాఘోలి/విఠల్‌వాడి) మంజూరీ తర్వాత... రెండో దశ కింద ఆమోదం పొందిన రెండో ప్రధాన ప్రాజెక్ట్ ఇది.

31.636 కిలోమీటర్ల పొడవునా 28 ఎలివేటెడ్ స్టేషన్లతో విస్తరించి ఉన్న లైన్ 4, 4Aలు... తూర్పు, దక్షిణ, పశ్చిమ పూణేలోని ఐటీ హబ్‌లు, వాణిజ్య మండలాలు, విద్యా సంస్థలు, నివాస క్లస్టర్‌లను కలుపుతాయి. ఐదు సంవత్సరాల్లోపు రూ.9,857.85 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. దీనికి భారత ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంలతో పాటు బాహ్య ద్వైపాక్షిక, బహుపాక్షిక సంస్థలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి.

ఈ లైన్లు పూణే సమగ్ర రవాణా ప్రణాళికలో కీలక భాగంగా ఉన్నాయి. ఇవి ఖరాడి బైపాస్, నాల్ స్టాప్ (లైన్ 2), స్వర్గేట్ (లైన్ 1) వద్ద కార్యాచరణలో ఉన్న, మంజూరైన కారిడార్‌లతో సజావుగా అనుసంధానం కలిగి ఉంటాయి. ఇవి హడప్సర్ రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్‌ఛేంజ్‌ను కూడా అందిస్తాయి.  లోనీ కల్భోర్, సస్వాద్ రోడ్ వైపు భవిష్యత్ కారిడార్‌లతో అనుసంధానం కలిగి ఉంటాయి. మెట్రో, రైలు, బస్సు నెట్‌వర్క్‌లతో సజావుగా మల్టీమోడల్ కనెక్టివిటీనీ నిర్ధారిస్తాయి.

ఖరాడి ఐటీ పార్క్ నుంచి ఖడక్వాస్లా సుందర పర్యాటక ప్రాంతం వరకు... హడప్సర్ పారిశ్రామిక కేంద్రం నుంచి వార్జే నివాస సమూహాల వరకు... లైన్ 4, 4Aలు విభిన్న ప్రాంతాలను కలుపుతాయి. సోలాపూర్ రోడ్, మాగర్పట్ట రోడ్, సింహగఢ్ రోడ్, కార్వే రోడ్, ముంబై-బెంగళూరు హైవే మీదుగా ప్రయాణించే ఈ ప్రాజెక్టు పూణేలోని అత్యంత రద్దీ మార్గాల్లో రద్దీని తగ్గిస్తుంది. అదే సమయంలో భద్రతను మెరుగుపరుస్తుంది. పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

అంచనాల ప్రకారం... లైన్ 4, 4A లలో కలిపి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2028 లో 4.09 లక్షలుగా ఉంటుంది. ఇది 2038 నాటికి దాదాపు 7 లక్షలకు, 2048 నాటికి 9.63 లక్షలకు, 2058 నాటికి 11.7 లక్షలకు పైగా పెరుగుతుందని అంచనా. ఇందులో ఖరాడి-ఖడక్వాస్లా కారిడార్ 2028లో 3.23 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించనుంది. 2058 నాటికి ఈ సంఖ్య 9.33 లక్షలకు పెరుగుతుందని అంచనా. అదే సమయంలో నాల్ స్టాప్-వార్జే-మానిక్ బాగ్ స్పర్ లైన్ ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అదే కాలంలో 85,555 నుంచి 2.41 లక్షల మంది ప్రయాణికులకు పెరుగుతుంది. ఈ అంచనాలు రాబోయే దశాబ్దాల్లో లైన్ 4, 4A ల అంచనా రవాణాలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (మహా-మెట్రో) అమలు చేస్తుంది. ఇది అన్ని సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్ సంబంధిత పనులను నిర్వహిస్తుంది. స్థలాకృతి సర్వేలు, వివరణాత్మక డిజైన్ కన్సల్టెన్సీ వంటి ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి.

ఈ తాజా ఆమోదంతో పూణే మెట్రో నెట్‌వర్క్ 100 కిలోమీటర్ల మైలురాయిని దాటి విస్తరిస్తుంది. ఇది ఆధునిక, సమగ్ర, సుస్థిర పట్టణ రవాణా వ్యవస్థ దిశగా పూణే నగర ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు.

లైన్ 4, 4A లతో పూణే మరిన్ని మెట్రో ట్రాక్‌లను పొందడమే కాకుండా... వేగవంతమైన, పచ్చదనంతో కూడిన, మరింత అనుసంధానం గల భవిష్యత్తును పొందుతుంది. గంటల తరబడి ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు... ట్రాఫిక్ గందరగోళాన్ని తగ్గించడానికి... పౌరులకు సురక్షితమైన, నమ్మదగిన, సరసమైన ప్రత్యామ్నాయాన్ని అందించేలా ఈ కారిడార్లను రూపొందించారు. రాబోయే సంవత్సరాల్లో అవి పూణే కోసం నిజమైన జీవనాధారాలుగా ఉద్భవించి, పట్టణ రవాణా వ్యవస్థను పునర్నిర్మించడంతో పాటు నగర వృద్ధి కథను పునర్నిర్వచిస్తాయి.

 

***

 


(Release ID: 2194864) Visitor Counter : 3