|
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫి-2025లో 5వ రోజు: మనసును కదిలించే కథలు
చిత్రాల్లో- భావోద్వేగం.. ఆత్మశోధన.. కల్పనా దృక్కోణాలను జోడించే దర్శకులు
Posted On:
24 NOV 2025 8:25PM by PIB Hyderabad
గోవా రాజధాని పణజి నగరంలో నిర్వహిస్తున్న భారత 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2025 (ఇఫి)లో 5వ రోజున దర్శకులు, రచయితలు, కథకులు, సృజనాత్మక బృందాల వారందరూ ఒకే వేదికపైకి రాగా, వారి మధ్య ఫలదాయక చర్చలు, ఉత్తమ చిత్రాల ప్రదర్శన, ఆలోచనాత్మక పాత్రికేయ సమావేశాలతో రోజంతా సందడి నెలకొంది.
ఈ సందర్భంగా చలన చిత్రోత్సవ అత్యంత ఆకర్షణీయ అంశాలలో కొన్నింటికి సంబంధించిన సృజనాత్మక ప్రక్రియలపై ప్రతి సంభాషణ విస్తృత చర్చకు దారితీసింది. ఈ మేరకు లోతైన ఆత్మశోధన నుంచి వాతావరణ మార్పు, సాంస్కృతిక వారసత్వం, మానవ పునురత్థాన సామర్థ్యం తదితరాలపై శక్తిమంతమైన కథనాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం దాకా అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
సినిమా రంగంలోని ప్రముఖుల వ్యక్తిగత ప్రస్థానం, చారిత్రక జ్ఞాపకాలు, సమకాలీన వాస్తవాలపై దిగ్గజాలను అభిప్రాయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సవాలు చేసే, సాంత్వననిచ్చే, ప్రశ్నించే, స్ఫూర్తినిచ్చే కథలతో హృదయాన్ని కదిలించి, ప్రపంచంపై అవగాహనను ఈ కార్యక్రమం మరింత విస్తృతం చేసింది.
పాత్రికేయ సమావేశాల చిత్రమాలిక:
1. ఇఫి-2025లో ‘లాలా అండ్ పాపీ’
ఇది ముంబయి నగరంలో ఓ లింగ విరుద్ధ ప్రేమకథను వివరిస్తుంది. లాలా, పాపీ అనే ఇద్దరు యువతీయువకులు తమలో లింగవిరుద్ధ భావనలను అవగతం చేసుకుంటూ భావోద్వేగ బంధాన్ని వీడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. లింగ స్వభావానికి విరుద్ధంగా జీవించేవారికి గుర్తింపు, అంగీకారం, ప్రేమ పునరుత్థానం తదితరాలను అర్థం చేసుకోవడంలో ప్రపంచం తరచూ విఫలం కావడంపై ఈ చిత్రం గంభీరమైన చర్చను లేవనెత్తుతుంది.
నిర్మాత బాబీ బేడి ఈ చిత్రంలోని సార్వత్రికాంశాన్ని వివరిస్తూ- “మానవులే ప్రథమం... ఆ తర్వాతిదే లింగం” అని స్పష్టం చేశారు. నిరుడు ‘ఇఫి’ సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆలోచనల్లో పురుడు పోసుకున్నదని, లింగమార్పిడి వ్యక్తులకు చట్టబద్ధ గుర్తింపు ఉన్నప్పటికీ, సామాజిక ఆమోదం ఇప్పటికీ గగన కుసుమమేనంటూ భారతదేశంలో వారి సామాజిక స్థితిని గుర్తుచేశారు.
దర్శకుడు కైజాద్ గుస్తాద్ మాట్లాడుతూ- ఇది ఇద్దరు లింగమార్పిడి వ్యక్తులు ప్రధాన పాత్రధారులైన నిజాయితీగల, ప్రపంచవ్యాప్త ప్రేమ కథగా అభివర్ణించారు. ఏళ్ల తరబడి పరిశోధన, విరుద్ధ ప్రవర్తనగల సమాజంతో మెలగడం ద్వారా ఈ స్క్రీన్‌ప్లే రూపొందిందని తెలిపారు. ఇందులో ప్రామాణికత, సూక్ష్మ నైపుణ్యం, భావోద్వేగ వాస్తవాలకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు.
2. ఇన్ పర్సూట్ ఆఫ్ స్ప్రింగ్... ఫ్లడ్
ఫ్లడ్:
స్లొవేకియాలో ఒక భారీ జలాశయ నిర్మాణం అనంతరం ఒక గ్రామవాసులు నిరాశ్రయులైన ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని కటారినా క్రంకోవా చెప్పారు. మజోవా ప్రాంతంలో తీసిన ఈ చిత్రంలో దాదాపు 80 శాతం రుథేనియన్ మైనారిటీ వర్గం నటులు తమ మాతృభాషలో నటించారు. ఉత్సవాల వెండితెరపై ఇలాంటి చిత్రాల ప్రదర్శన చూడటం ఎంతో అరుదైన అవకాశం.
ఈ చిత్రం గోవా ‘ఇఫి’లో ప్రపంచవ్యాప్త రెండో ప్రీమియర్ ప్రదర్శన. ఈ కథకు ప్రేరణనిచ్చిన, వాస్తవ జీవనంలో ఇలాంటి ప్రాజెక్టు వల్ల ప్రభావితులైన ప్రజల కోసం దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని చిత్ర బృందం ఆశిస్తోంది.
ఇన్ పర్సూట్ ఆఫ్ స్ప్రింగ్:
ఈ ఉజ్బెకిస్థాన్ చిత్రానికి ప్రతినిధులుగా దర్శకుడు అయూబ్ షాఖోబిద్దినోవ్, ప్రధాన పాత్రధారి నటి ఫరీనా జుమావియా ‘ఇఫి-2025’లో పాలుపంచుకున్నారు. తాష్కెంట్‌లో నివసించే రహత్ షుకురోవా అనే మహిళ మదిలో పాతేసిన రహస్యాలు, భావోద్వేగ గాయాలను ఈ చిత్ర కథ వివరిస్తుంది. సోవియట్ విచ్ఛిన్న శకం చివరి సంవత్సరాల్లోని సాంత్వన, సమన్వయం, ఆత్మశోధన వంటి ఇతివృత్తాల ఔచిత్యం నేటికీ స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ప్రపంచ సినిమాతోపాటు సంస్కృతులను ఒకచోటకు చేర్చే కీలక అంతర్జాతీయ వేదికగా ‘ఇఫి’ని కొనియాడారు.
3. రుధిరవన
ఒక రిసార్ట్ నిర్మాణ ప్రాజెక్టు యాజమాన్యానికి స్థానిక దాదాసి తెగ ప్రజలకు మధ్య హింసాత్మక ఘర్షణ మధ్య అడవిలో చిక్కుకున్న ఎన్నికల అధికారుల బృందం ఉదంతాన్ని ‘రుధిరవన’ చిత్రం వివరిస్తుంది. శిథిల స్థితిలోగల ఒక వృక్షగృహంలో తలదాచుకున్న వీరికి, తమకు ఆవల సాగుతున్న సంఘర్షణకు మించిన అతిపెద్ద అతీంద్రియ ప్రమాదం గురించి వారు తెలుసుకుంటారు.
అటవీ నిర్మూలనపై మానవుల ఆందోళనను, ఒక ప్రాచీన దుష్టశక్తితో ప్రకృతి పోరాటాన్ని మిళితం చేసే కథనంతో ఈ చిత్రం సాగుతుంది.
4. మా.. ఉమా.. పద్మ (ఘటక్)- పుస్తకావిష్కరణ
ప్రసిద్ధ దర్శకుడు రిత్విక్ ఘటక్ గౌరవార్థం ఆయన రచించిన ఈ ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సినిమాపై ఆయన శాశ్వత ప్రభావం, దర్శకుడుగా ఆయన ప్రస్థానంలోని నిరంతర పోరాటాన్ని ఈ సందర్భంగా వక్తలు విశదీకరించారు.
ఈ మేరకు రచయిత కమ్రాన్ తన ప్రసంగంలో ఘటక్ శిక్షణపై అపోహలను ప్రస్తావించారు. ఆయన అభ్యసనం ఎంతో కృషితో కూడినదని, తరుణ దశలోనే రచనా నైపుణ్యంతోపాటు ఆనాటి దిగ్గజాలతో సంయుక్తంగా పనిచేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ఐసెన్‌స్టెయిన్, స్టానిస్లావ్‌స్కీ వంటి ప్రపంచ సినిమా దిగ్గజాలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘ఎఫ్‌టీఐఐ’లో ఘటక్ వ్యాసంగం చలనచిత్ర ఆలోచనాత్మకత, బోధన దిశగా ఆయన పోషించిన పాత్రను మరింత స్పష్టం చేస్తుందన్నారు.
5. హమ్‌సఫర్.. పిప్లాంత్రి: ఎ టేల్ ఆఫ్ ఈకో ఫెమినిజం.. బ్యాటిల్ ఫీల్డ్
హమ్‌సఫర్:
ఈ చిత్రం ఓ తాతగారి భావోద్వేగ ప్రయాణాన్ని వివరిస్తుంది. అదృశ్యమైన తన జీవితకాల “సహచరి” వంటి విలువైన పాత రేడియో కోసం అన్వేషణలో ఎదురయ్యే సంఘటనలతో ఈ కథ సాగిపోతుంది. ఈ చిత్రం భారతీయ సాంస్కృతిక విలువలను చాటింది. ఆ మేరకు అత్యంత సాధారణ వస్తువుకూ ఒక గుర్తింపు, ఒక జ్ఞాపకంగా భావోద్వేగ తీవ్రత లోతును ఈ పాత్ర ప్రతిబింబిస్తుంది. ఇది ఒక నష్టం, చింత, అవినాభావ సంబంధాలను స్పృశించే సున్నిత కథనం.
పిప్లాంత్రి:
ఒక చలనచిత్రం నిడివిగల ఈ డాక్యుమెంటరీ రాజస్థాన్‌లోని పిప్లాంత్రి గ్రామంలో అద్భుత పర్యావరణ, సామాజిక పరిణామశీల మార్పును ప్రతిబింబిస్తుంది. పర్యావరణానికి నష్టంపై దూరదృష్టి గల సర్పంచి శ్యామ్ సుందర్ పలీవాల్ ఆవేదన పర్యావరణ-స్త్రీవాద ఉద్యమంగా మారిన తీరును దర్శక-నిర్మాత సూరజ్ కుమార్ ఇందులో కళ్లకు కట్టారు. గ్రామంలో పుట్టే ప్రతి ఆడశిశువు పేరిట 111 మొక్కలు నాటే సంప్రదాయం గురించి, ఈ చిత్రం ద్వారా బలమైన రీతిలో ఆయన సమాజానికి వివరించారు.
ప్రపంచ గుర్తింపు, ఐక్యరాజ్య సమితి ఆసక్తి ఫలితంగా ఈ చిత్రం సమాజ పునరుత్థాన సామర్థ్యం, పర్యావరణ పునరుజ్జీవనం, మహిళా కేంద్రం అభివృద్ధికిగల సామర్థ్యాన్ని చాటింది.
బ్యాటిల్ ఫీల్డ్:
బ్రిటిష్ పాలన కాలంలో 1944 నాటి ఇంఫాల్ యుద్ధం చేదు జ్ఞాపకాలను ఇది వివరిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా మణిపూర్‌లో చోటు చేసుకున్న తీవ్ర రక్తపాత అధ్యాయాలలో ఈ పోరాటం కూడా ఒకటి. ఆ యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన వీరుల జ్ఞాపకాలు, తవ్వకాల ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా వాస్తవాలను వెల్లడించడానికి రాజేశ్వర్ ఎంతో తపన పడ్డారు. దైనందిన జీవితాలపై యుద్ధం దీర్ఘకాలిక మానసిక ప్రభావాన్ని ఈ చిత్రం వివరిస్తుంది. అలాగే సాంస్కృతిక జ్ఞాపకాలకు హింస ఎలా ప్రాతిపదికగా మారిందీ బోధపరుస్తుంది.
6. సాంగ్స్ ఆఫ్ ఆడమ్... స్కిన్ ఆఫ్ యూత్
సాంగ్స్ ఆఫ్ ఆడమ్:
ఇది మెసొపొటేమియాలో 1946 నాటి స్థితిగతులను వివరించే చిత్రం. సుమారు 12 ఏళ్ల బాలుడు ఆడమ్ చుట్టూ తిరిగే ఈ కథలో తానెప్పటికీ పిల్లాడిగానే ఉండిపోవాలన్న అతడి కోరిక నెరవేరుతుంది. కానీ, తన చుట్టూ పరిస్థితులన్నీ కాలానుగుణంగా మారిపోవడం, దాన్ని ఆపే శక్తి లేకపోవడంతో అమాయకత్వం, అనివార్యతల మధ్య నలిగిపోయే అతడి భావోద్వేగ వాస్తవిక స్థితిని ఈ చిత్రం కవితాత్మకంగా వివరిస్తుంది.
స్కిన్ ఆఫ్ యూత్:
ఇది సైగాన్‌లో 1990 నాటి పరిస్థితులను కళ్లకు కడుతుంది. లింగ నిర్ధారణ కోసం ప్రయత్నించే ఒక లింగమార్పిడి సెక్స్ వర్కర్, ఆమె స్వప్నాన్ని సమర్ధించే ఒక పంజర పోరాట యోధుడి మధ్య గమ్మత్తయిన ప్రేమను ఇది ప్రతిబింబిస్తుంది. వారిలోని అంతర్గత సంఘర్షణలు, హింసాత్మక మాఫియాతో పోరు వారి ప్రేమకు పరీక్ష పెడతాయి. ఈ క్రమంలో తమనుతాము అన్వేషించుకునే దిశగా వారు తమవంతు బలహీన ప్రయత్నాలు చేస్తుంటారు.
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ నేపథ్యం
దక్షిణాసియా సినిమా రంగానికి సంబంధించి 1952లో మొదలైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫెఫ్‌ఐ-ఇఫి) అత్యంత ప్రాచీనమైనదేగాక ఘనమైన వేడుకగా ప్రపంచ గుర్తింపు పొందింది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ‘గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ’ (ఈఎస్‌జీ) ఈ ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో ఒక శక్తిగా ఎదిగిన ఈ వేడుకలలో పాత సినిమాలకు కొత్త హంగులతో చేసిన సాహస ప్రయోగాలు, తొలిసారి రంగంలో ప్రవేశించిన ప్రతిభావంతులతో పరిశ్రమ దిగ్గజాల అరమరికలు లేని ముచ్చట్లు అందర్నీ అలరిస్తాయి. వాస్తవంగా ఈ చలనచిత్రోత్సవానికి వన్నెలద్దేది దాని ఉజ్వల సమ్మేళనమే. ఇందులో అంతర్జాతీయ పోటీ, సాంస్కృతిక ప్రదర్శనలు, దిగ్గజాల ప్రసంగాలు (మాస్టర్ క్లాసులు), ప్రశంసలు సహా ఆలోచనలు, ఒప్పందాలు, సహకారం తదితరాలకు ఉత్తేజమిచ్చే శక్తిమంతమైన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్’ ప్రత్యేక ఆకర్షణలు. అద్భుత తీర ప్రాంతమైన గోవా నేపథ్యానికి మరింత వెలుగును జోడిస్తూ ఈ నెల 20 నుంచి 28 వరకు 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్దంపట్టే అద్భుత వేడుక. భాష, శైలి, ఆవిష్కరణ, గళాల అద్భుత సమ్మేళనం ఈ ఉత్సవాల్లో ప్రేక్షకులకు కనువిందు చేస్తుందనడంలో సందేహం లేదు.
***
(Release ID: 2194368)
|