ప్రముఖ నటుడు ధర్మేంద్రకు హృదయపూర్వక నివాళులు అర్పించిన ఇఫి 2025 ధర్మేంద్ర విలక్షణ నటుడు, అరుదైన వ్యక్తి: శ్రీ రాహుల్ రవైల్
విలక్షణ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ చలనచిత్ర రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన దేశ చలనచిత్ర రంగంలో అత్యంత గొప్పవారూ, అత్యంత ప్రేమాస్పదులైన దిగ్గజాల్లో ఒకరు. నిన్న ఈ లోకాన్నుంచి సెలవు తీసుకుని, స్వర్గానికి పయనమై వెళ్లారు. దేశ ప్రజలు అంతులేని దు:ఖంతో ఆ దిగ్గజ నటునికి ఈ రోజున మన:పూర్వక నివాళుల్ని అర్పించారు. ప్రజలతో పాటు 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫి’) కూడా ఆయనకు నివాళులు అర్పించింది.
ప్రముఖ దర్శకుడు శ్రీ రాహుల్ రవైల్ భారమైన మనస్సుతో కాసేపు ప్రసంగించారు. వెండి తెరపై అత్యంత ప్రకాశవంతంగా తళుకులీనిన స్టార్లలో ఒకరైన ధర్మేంద్రతో తాను ఎప్పటికీ తన గుండెలో పదిలంగా అట్టిపెట్టుకున్న జ్ఞాపకాల్ని గురించి శ్రీ రవైల్ వెల్లడించారు. ధర్మేంద్ర కుటుంబం అంతులేని దు:ఖంలో మునిగి ఉంటుందంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన శ్రీ రవైల్ .. ధర్మేంద్ర అసాధారణ జీవితాన్ని ఓ సారి స్మరణకు తెచ్చుకోవాలన్నారు. ‘‘ఆయనో విలక్షణ నటుడు, అంతకు మించి గొప్ప మనసున్న మానవుడు’’ అని శ్రీ రవైల్ ప్రశంసించారు.

రాజ్ కపూర్ గారు ‘మేరా నామ్ జోకర్’ తీసినప్పుడు సహాయక దర్శకుల్లో ఒకరుగా తాను పనిచేసినప్పటి రోజుల్ని శ్రీ రవైల్ గుర్తుకు తెచ్చుకొన్నారు. అప్పట్లో మహేంద్ర కుమార్‌తో కలసి స్వర్గీయ శ్రీ ధర్మేంద్ర ట్రపీజ్ ఆర్టిస్టు పాత్రను పోషించారనీ, ఆ పాత్రను ఆయన సాటిలేని అంకితభావంతో కళ్లకు కట్టారనీ శ్రీ రవైల్ తెలిపారు. నెల రోజుల పాటు ప్రతి రోజూ సాయంత్రం పూట విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లి తెల్లవారుఝాము 5 గంటల వరకు షూటింగులో పాల్గొని, మళ్లీ ముంబయికి తిరిగి వచ్చి ‘ఆద్మీ అవుర్ ఇన్సాన్’ చిత్రీకరణలో పాలుపంచుకొనే వారు, ఒళ్లు అలిసేటట్లాంటి షెడ్యూలును ఏనాడూ భంగం కానివ్వలేదు అని శ్రీ రవైల్ వెల్లడించారు.
స్వర్గీయ శ్రీ ధర్మేంద్ర కుమారుడు శ్రీ సన్నీ దేవల్ పరిచయ చిత్రం ‘బేతాబ్’ (1983లో విడుదలైంది) షూటింగును గురించి కూడా శ్రీ రాహుల్ రవైల్ గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్లో చిత్రీకరణ ఉన్నప్పుడు, స్వర్గీయ శ్రీ ధర్మేంద్రను ఒక్క సారి చూస్తే చాలని జనసమూహాలు పెద్ద సంఖ్యలో గుమికూడే వారన్నారు. చిత్రం విడుదలయ్యాక, ఎన్నో రోజుల తరబడి ప్రతి సాయంత్రమూ పశ్చిమ బాంద్రా లోని గెయిటీ సినిమా హాల్లో తన కుమారుడి తొలి చలనచిత్రాన్ని ఆయన చూశారనీ, సినిమా చూడటం పూర్తి అయ్యాక.. మొదటి సారి చూసిన ప్రేక్షకునిలో ఉండే ఒక రకమైన ఉత్సాహంతో ఆ సినిమాను గురించి చర్చించడానికి దర్శకుడు శ్రీ రాహుల్ రవైల్ ఇంటికి వెళ్లే వారనీ, ఇలా రోజూ జరిగేదదనీ శ్రీ రవైల్ చెప్పారు. దిగ్గజ నటుడి పిల్లలు ఆయన ‘మహా వారసత్వాన్ని’ ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నారని శ్రీ రవైల్ గర్వంగా ప్రకటించారు.
‘‘ధరమ్ జీ జీవితాన్ని సంరంభంగా జరుపుకోవాల్సినట్లాంటి మనిషి. ప్రజలకు ఆయన ఎంతో సంతోషాన్ని పంచిపెట్టారు’’ అని శ్రీ రవైల్ ఉద్వేగంతో అన్నారు. స్వర్గీయ శ్రీ ధర్మేంద్రను ఒక్క సారి చూసి, ఆయన పాదాల్ని పట్టుకోవాలనుందని ఓ ఢిల్లీ పోలీసు అధికారి తపించి పోయారని శ్రీ రవైల్ ప్రస్తావించారు. ఆ మహనీయుడు ఈ లోకాన్ని వీడి వెళ్లారన్న సంగతి తెలిసి, ఆ అధికారి దు:ఖంతో బోరున విలపించారనీ, శ్రీ సన్నీ దేవల్‌ను కలిసి తన సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాననీ ఆ అధికారి తనతో అన్నారనీ శ్రీ రవైల్ చెప్పారు. ‘‘ధరమ్ జీకి ఉన్న శక్తి ఇదీ’’ అని ఉద్ఘాటించారు.
స్వర్గీయ శ్రీ ధర్మేంద్ర తన వృత్తిజీవనమంతటా తనకు అండగా నిలబడి, తనను వృద్ధిలోకి తీసుకు వచ్చిన పితృసమానులు అని కూడా శ్రీ రవైల్ చెప్పుకొన్నారు.
‘‘మనం ఒక గొప్ప మనిషిని కోల్పోయాం. ధర్మేంద్ర గారి వంటి లబ్ధప్రతిష్ఠులు పనిచేస్తున్న కాలంలో జీవించి ఉండటం మనం చేసుకున్న అదృష్టం’’ అని చెప్తూ, శ్రీ రవైల్ తన ప్రసంగాన్ని ముగించారు. కాల ప్రభావానికి లోబడని స్టార్ గౌరవార్థం ఒక ప్రత్యేక శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇఫి నిర్వహకులకు శ్రీ రవైల్ తన కృతజ్ఞతలు తెలియజేశారు.
శిఖరాయమాన వ్యక్తిత్వం, ప్రేమాస్పద కళాకారుడు, సాటిలేని ఆప్యాయతా మూర్తి.. స్వర్గీయ శ్రీ ధర్మేంద్ర వారసత్వం భారతీయ సినిమా గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఐఎఫ్ఎఫ్ఐ వైబ్‌సైట్: https://www.iffigoa.org/
ఐఎఫ్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని పీఐబీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56/
పీఐబీ ఆధ్వర్యంలోని ఐఎఫ్ఎఫ్ఐవుడ్ ప్రసార ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిళ్లు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2194351
| Visitor Counter:
3
Read this release in:
English
,
Konkani
,
Gujarati
,
Manipuri
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam