|
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సినిమా కూర్పుపై అవగాహన: కథాగమనంలో లయను వివరించిన శ్రీకర్ ప్రసాద్
· ఎడిటర్ దృక్కోణాన్ని నిర్వచించే భావోద్వేగం... నైపుణ్యం... కథాగమనం · ప్రతిభ... కథనం.. దృశ్య క్రమాన్ని మలిచే కళా ప్రతిభను వెల్లడించిన కార్యగోష్ఠి
प्रविष्टि तिथि:
24 NOV 2025 8:12PM by PIB Hyderabad
భారత 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2025 (ఇఫి)లో 5వ రోజున సినిమా కూర్పు (ఎడిటింగ్)పై “ఫ్రమ్ మైండ్ టు స్క్రీన్: విజన్ టు ఎగ్జిక్యూషన్” (ఆలోచనలకు తెరరూపం - దృక్కోణం నుంచి దృశ్యీకరణ) పేరిట నిర్వహించిన కార్యగోష్ఠి (వర్క్ షాప్)ని ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ నడిపించారు. సినిమా వెనుక ఎక్కడా కనిపించని, వినిపించని నిర్ణయాత్మక కళపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ‘ఎడిటింగ్ టేబుల్’ (సినిమా కూర్పు కార్యస్థానం)పైనే దృశ్యాలన్నీ ఎంతో సమతౌల్యంతో సన్నివేశాలుగా అమరి, ఒక పరిపూర్ణ సినిమా రూపుదిద్దుకుంటుంది. శ్రీకర్ ప్రసాద్ తన సుదీర్ఘ సినిమా రంగ పయనంలో ఇప్పటిదాకా 18 భాషలలో 650 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అసంఖ్యాక ఎడిటింగ్ గదులలో.. రకరకాల సంస్కృతుల సంబంధిత కథల కూర్పులో గడించిన అపార అనుభవాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సైకత్ ఎస్.రే సంధానకర్తగా వ్యవహరించారు. ఒక కథకు తొలి దృశ్యం నుంచి సినిమా దాకా తుది రూపం ఇచ్చే ప్రక్రియపై ఇది ప్రాథమిక అవగాహన కల్పించింది.
గోష్ఠి ప్రారంభానికి ముందే శ్రీకర్ ప్రసాద్‌ను ప్రముఖ చలనచిత్ర నిర్మాత రవి కొట్టార్కర సత్కరించారు. ఎడిటింగ్ కళలో ఆయనకున్న విస్తృత అనుభవాన్ని, “ఏమి చేయకూడదో” చక్కగా తెలిసిన విశిష్ట సామర్థ్యాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇది ఒక సినిమా ఎడిటర్ నిజమైన ప్రతిభను వెల్లడించే ప్రత్యేక లక్షణమని ఆయన అభివర్ణించారు.
ఎడిటింగ్ కళ ఓ సాంకేతిక పక్రియ మాత్రమేననే భావనను సవాలు చేస్తూ ప్రసంగం ప్రారంభించిన శ్రీకర్ ప్రసాద్, ఈ రంగంలో తన 40 ఏళ్ల అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. సినిమా కూర్పు భావోద్వేగంలో అంతర్భాగమని, ప్రతి కత్తిరింపు (కట్) ప్రేక్షకుల మనోభావాన్ని నడిపించేదిగా ఉండాలని ఆయన చెప్పారు. భారీ పరిమాణంలో చిత్రించిన దృశ్యాలను ముందేసుకుని పని ప్రారంభించే ఒక ఎడిటర్, వాటన్నిటినీ అర్థవంతంగా, స్పష్టతతో కథ వెంట నడిపించడమే అతనికి నిజమైన పరీక్ష అని... అంతిమంగా సినిమా మొత్తాన్నీ మోసేది ఆ కథేనని స్పష్టం చేశారు.
ఒక ఎడిటర్ స్క్రిప్ట్ స్థాయిలోనే తన పని మొదలు పెట్టడం మంచిదని, చిత్ర నిర్మాణ ప్రక్రియ అంతటా ప్రమేయం ఉండటం ద్వారా సత్ఫలితం రాబట్టవచ్చునని ఆయన చెప్పారు. తొలినాళ్లలో ఎడిటింగ్ కళ తనకు యాంత్రికంగా అనిపించినప్పటికీ, వేర్వేరు దర్శకులతో పనిచేయడం వల్ల తనలోని కొత్త దృక్కోణాన్ని ఆవిష్కరించుకునే అవకాశం లభించిందని తెలిపారు. కంటెంట్, సృజనాత్మకత పరంగా రేపన్నది ఈ రోజులా ఎప్పుడూ ఉండదన్నారు. ఈ స్థిరమైన మార్పు కాలక్రమంలో- కథాగమనాన్ని ఎక్కడ ఆపాలో... ఎక్కడ తిరిగి ప్రారంభించాలో, కథలో ఉత్కంఠను ఎలా కొనసాగించాలో తెలిసిన దర్శకుడిలా ఎడిటర్‌ను రూపుదిద్దుతుందని చెప్పారు.
గోష్ఠి సాగుతుండగా ఒక ఆసక్తికర సందర్భంలో- “ఎడిటింగ్ టేబుల్ మీదనే సినిమా తయారవుతుంది” అనే విస్తృత భావన గురించి ఆయన ప్రస్తావించారు. వేర్వేరు దృశ్యాలను సన్నివేశాలుగా పెనవేసి, కథనాన్ని నడిపిస్తూ, అంతిమంగా పూర్తి నిడివి కథకు రూపమివ్వడం దాకా ఒక చిత్రం కూర్పులోని దశల క్రమాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ మేరకు 1998నాటి ‘ది టెర్రరిస్ట్’ చిత్రంలోని దృశ్యాలను చూపుతూ, కథను నడిపించడంలో నిశ్శబ్దమే ఒక ఉపకరణంగా మారిన తీరును ఆయన ప్రదర్శించారు. అనంతర కాలంలో ‘వానప్రస్థం’ వంటి చిత్రాల నిర్మాణానికి ఈ ఆవిష్కరణ దోహదం చేసిందని పేర్కొన్నారు. ప్రేక్షకులు పసిగట్టలేని రీతిలో కత్తిరింపులు, అతులకుతో ప్రతి సన్నివేశాన్ని ఒక స్రవంతిలా మలచాలని ఆయన వివరించారు.
భావోద్వేగ సమతౌల్యం ప్రాధాన్యాన్ని వివరిస్తూ- సమాంతర కథనాలు, బహుళ పాత్రల అంతర కథనాల వంటివి ప్రధాన కథ నుంచి ప్రేక్షకుల దృష్టిని మళ్లించకుండా జాగ్రత్త వహించాలని గుర్తుచేశారు. చిత్రంలో ఒక పాత్ర ఉత్తమ స్వభావాన్ని చేయడం కన్నా అందులోని అంతర్లీన చెడు స్వభావాన్ని కప్పిపుచ్చడంలో ఎడిటర్ తరచూ తన ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. మరింత విశదంగా చెప్పాలంటే- ఒక పాత్ర సత్ప్రవర్తన నుంచి పక్కకు మళ్లినపుడు లేదా దాని స్థాయిని మించిపోయే సందర్భంలో కూర్పులో దాన్ని సున్నితంగా సరిదిద్ది, పాత్ర సమగ్రతను కొనసాగిస్తూ సన్నివేశాన్ని బిగువుగా ఉంచాలని ఆయన అన్నారు.
అనంతరం సంధానకర్త సైకత్- ఆధునిక సాంకేతికతలను స్పృశిస్తూ సంభాషణను కృత్రిమ మేధ వైపు నడిపించారు. ఈ సందర్భంగా అలాంటి వ్యవస్థ తొలుత ప్రయత్నించేది శ్రీకర్ ప్రసాద్ శైలిని అనుకరించడమేనని ఆయన చమత్కరించారు. దీనిపై ప్రేక్షకుల నవ్వుతో గది ప్రతిధ్వనించగా, శ్రీకర్ చిరు మందహాసంతో ఆ వ్యాఖ్యపై స్పందిస్తూ- ఈ ప్రక్రియలోని యాంత్రిక అంశాలను కృత్రిమ మేధ కచ్చితంగా గ్రహించగలదన్నారు. కానీ, భావోద్వేగం, లయ వంటి అనుభూతి దానికి ఉండదని, సహజ ధోరణితో కత్తిరింపును సూచించజాలదని ఆయన స్పష్టం చేశారు. ఎడిటింగ్ అనేది తన దృష్టిలో సహజ జ్ఞానంతో కూడిన దృక్కోణంగల కళ మాత్రమేనని, ఏ యంత్రమూ ఆ జ్ఞానాన్ని మించిపోలేదని చెప్పారు.
ఓర్పు, సన్నివేశం ముగింపును రూపొందించే బాధ్యత విమర్శలపై నిష్కాపట్యం వంటి అంశాలపై అభిప్రాయాల ఆదానప్రదానంతో కార్యగోష్ఠి ముగిసింది. సినిమాను ఒక సామాజిక వ్యాఖ్యానం, వ్యక్తీకరణ, అడుగుజాడగా పాదముద్రగా శ్రీకర్ ప్రసాద్ అభివర్ణించారు. చివరగా- కథ చెప్పడం అనేది సృజనాత్మకతకు పరిమితం కాదని, అదొక సామాజిక బాధ్యతని చెబుతూ ముక్తాయింపు పలికారు.
మొత్తం మీద ఎడిటింగ్ అంటే- ఎడిటింగ్ అనేది ఒక వడపోత ప్రక్రియ.. ఇందులో ఎడిటర్ కథ అంతరార్థాన్ని గ్రహించి ఒక సమగ్ర, ప్రభావశీల కథనంతో సినిమాను రూపొందించడానికి అవవసరమైన అంశాలను జోడిస్తాడనే సత్యాన్ని ఈ కార్యగోష్ఠి స్పష్టం చేసింది.
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ నేపథ్యం
దక్షిణాసియా సినిమా రంగానికి సంబంధించి 1952లో మొదలైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫెఫ్‌ఐ-ఇఫి) అత్యంత ప్రాచీనమైనదేగాక ఘనమైన వేడుకగా ప్రపంచ గుర్తింపు పొందింది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ‘గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ’ (ఈఎస్‌జీ) ఈ ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో ఒక శక్తిగా ఎదిగిన ఈ వేడుకలలో పాత సినిమాలకు కొత్త హంగులతో చేసిన సాహస ప్రయోగాలు, తొలిసారి రంగంలో ప్రవేశించిన ప్రతిభావంతులతో పరిశ్రమ దిగ్గజాల అరమరికలు లేని ముచ్చట్లు అందర్నీ అలరిస్తాయి. వాస్తవంగా ఈ చలనచిత్రోత్సవానికి వన్నెలద్దేది దాని ఉజ్వల సమ్మేళనమే. ఇందులో అంతర్జాతీయ పోటీ, సాంస్కృతిక ప్రదర్శనలు, దిగ్గజాల ప్రసంగాలు (మాస్టర్ క్లాసులు), ప్రశంసలు సహా ఆలోచనలు, ఒప్పందాలు, సహకారం తదితరాలకు ఉత్తేజమిచ్చే శక్తిమంతమైన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్’ ప్రత్యేక ఆకర్షణలు. అద్భుత తీర ప్రాంతమైన గోవా నేపథ్యానికి మరింత వెలుగును జోడిస్తూ ఈ నెల 20 నుంచి 28 వరకు 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్దంపట్టే అద్భుత వేడుక. భాష, శైలి, ఆవిష్కరణ, గళాల అద్భుత సమ్మేళనం ఈ ఉత్సవాల్లో ప్రేక్షకులకు కనువిందు చేస్తుందనడంలో సందేహం లేదు.
మరింత సమాచారం కోసం దిగువ లింకులపై క్లిక్ చేయండి:
‘ఎక్స్’ హ్యాండిళ్లు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
(रिलीज़ आईडी: 2194038)
|