రెండు ప్రపంచాలు, ఒకే లయ: లతా మంగేష్కర్ ఇచ్చిన వారసత్వాన్ని గౌరవిస్తూ విశాల్ భరద్వాజ్, బీ. అజనీష్ లోక్‌నాథ్ చర్చ
అలరించిన విశాల్ భరద్వాజ్ సంగీత కథనాలు, లతా మంగేశ్వర్ జ్ఞాపకాలు
జానపద సంగీతంలోని ప్రయోగాల గురించి మాట్లాడుతూ మంత్రముగ్ధులను చేసిన అజనీష్
ఐఎఫ్ఎఫ్ఐలో "ది రిథమ్స్ ఆఫ్ ఇండియా: హిమాలయాల నుంచి దక్కన్ వరకు" అనే శీర్షికతో నిర్వహించిన వార్షిక లతా మంగేష్కర్ స్మారక ఉపన్యాసం.. జ్ఞాపకాలు, శ్రావ్యత, సృజనాత్మకత కలయికతో ఒక చైతన్యవంతమైన సంగీత ప్రయాణంగా జరిగింది. సంగీత దర్శకులు విశాల్ భరద్వాజ్, బీ. అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్న ఈ సంభాషణకు క్రిటిక్ సుధీర్ శ్రీనివాస్ సమన్వయకర్తగా ఉన్నారు. రెండు విలక్షణమైన సంగీత మేధస్సుల సృజనాత్మక ప్రపంచాలను ఆవిష్కరించే అరుదైన అవకాశాన్ని ఈ సెషన్ ఇచ్చింది.
సాయంత్రం వేళ జరిగిన ఈ సెషన్.. వక్తలను చలనచిత్ర నిర్మాత రవి కొట్టారకర సన్మానించే కార్యక్రమంతో ప్రారంభమైంది. మనల్ని మార్చే, ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని ఆయన అన్నారు. ఆత్మపరిశీలన, హాస్యం, సంగీతపరమైన అంశాలు సమానంగా ఉన్న ఈ సంభాషణను ఆయన ప్రారంభించారు.

అభిమానం, ప్రభావం, ఐకానిక్ ఇతివృత్తాలు-
“అజనీష్ 'కాంతారా' సంగీత దర్శకుడి కంటే చాలా ఎక్కువ “ అని ప్రేక్షకులకు సుధీర్ గుర్తు చేశారు. గదిలో తనకు, విశాల్‌కు మధ్య "భారతీయ సంగీత గతం, వర్తమానం, భవిష్యత్తు" ఉందని అన్నారు. ఎంతో కాలంగా ఒకరి పనిని మరొకరు అభిమానించుకుంటున్న ఇద్దరు కళాకారుల మధ్య సాధారణంగా ఉండే హృదయపూర్వకమైన వాతావరణంలో ఈ చర్చ కొనసాగింది.
విశాల్ మాట్లాడుతూ.. “ 'కాంతారా' థీమ్ మ్యూజిక్ ఇప్పటివరకు అందించిన అత్యుత్తమ సినిమా థీమ్‌లలో ఒకటి” అని పేర్కొన్నారు. దీనిని ఇచ్చిన సంగీత దర్శకుడిని గురించి తెలుసుకునేందుకు ఇది ప్రేరేపించిందని అన్నారు. దీనికి బదులుగా అజనీష్.. విశాల్ మ్యూజిక్‌లోని 'మాచిస్', 'చప్పా చప్పా'లలో ఉన్న లయబద్ధమైన ‘స్వింగ్’తో తన చిన్నతనం నిండి ఉందని చెప్పారు. సంతోషంతో ఈ లయబద్ధమైన పాటను కొద్దిగా పాడారు.
'పానీ పానీ రే' పాటపై చర్చ దృష్టి సారించగా అక్కడున్న వారంతా ఉత్కంఠగా విన్నారు. నీటి శబ్దం, నదీతీర ప్రశాంతత పాట ఆత్మను ఎలా నిర్వచించాయో విశాల్ వివరించారు. లతా మంగేష్కర్‌కు ఉన్న సహజమైన పరిపూర్ణతను ఆయన గుర్తు చేశారు. ప్రతి నోట్‌ను ఆమె గుర్తుంచుకునే తీరును తెలియజేసిన ఆయన ఒకే టేక్‌లో దీనిని పాడినట్లు తెలిపారు. నీటి ప్రవాహానికి సంబంధించిన ట్యూన్‌లలో సర్దుబాట్లకు కూడా సూచించారని పేర్కొన్నారు. "ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదు. స్వంతంగా ఆమె ఒక సంగీత రూపకర్త" అని ఆయన వ్యాఖ్యానించారు.

స్వరకర్త హృదయాంతరంలోని భావాలు
తన సొంత విచిత్రమైన ప్రక్రియను గురించి అజనీష్ చెప్పారు. 'అయ్యయ్యో', 'అబ్బబ్బ' వంటి భావ వ్యక్తీకరణ పదాలు పాటలోని పంక్తుల కంటే ముందే భావోద్వేగాన్ని తెలియజేయడానికి తరచుగా తన ట్యూన్‌లలోకి వచ్చే తీరును కూడా వివరించారు. దాదాపు అన్ని సార్లు వీటిని ఉంచమని సంబంధిత డైరెక్టర్లు పట్టుబడతారని నవ్వుతూ చెప్పారు. 'వరాహరూపం' విడుదలయ్యేందుకు 20 రోజుల ముందు ఒత్తిడి ఉండేదని, ఆ చివరి రోజుల్లోనే పాటను పూర్తి చేయటం గురించి చెప్పగా ప్రేక్షకులలో సంతోషకరంగా స్పందించారు.
సృజనాత్మకతలో సంగీతకారులు తరచుగా ఆధ్యాత్మిక శక్తి గురించి ఎందుకు మాట్లాడుతారని సుధీర్ అడిగినప్పుడు ఈ సంభాషణ తాత్విక మలుపు తీసుకుంది. ఎప్పటిలానే దీనికి విశాల్ స్పష్టతతో కూడిన సమాధానం ఇచ్చారు. "మనకు అత్యంత దగ్గరగా ఉండే నిశ్శబ్దం సంగీతమే" అని వ్యాఖ్యానించిన ఆయన.. రహస్యమైన, దాదాపు పవిత్రమైన ఒక ట్యూన్ రాక గురించి మాట్లాడారు. ఇది "మరెక్కడ నుంచో” వస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. సృజనాత్మక స్థితిలోకి తాను ఎలా ప్రవేశిస్తానో పూర్తిగా అర్థం కాలేదని తెలిపిన అజనీష్.. 'కాంతారా'కు ఎప్పుడూ పూర్తి క్రెడిట్ తీసుకోలేదని అన్నారు.

భాష, జానపద సంప్రదాయాలు, భారతదేశ సంగీతం
ఈ సెషన్ తరువాత భాష, సంగీతానికి ఉన్న క్లిష్టమైన పరస్పర సంబంధంపై చర్చించారు. అజనీష్ 'కర్మ' పాట అందరికీ ఏ విధంగా చేరువైందో వివరించారు. సంస్కృతిపరంగా పాతుకుపోయిన ఇతర పాటలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ప్రయాణించవని చెప్పారు. తనకు పూర్తిగా తెలియని భాషలో సంగీతాన్ని అందించటంలో ఎదురైన పలు ఆసక్తికర సవాళ్ల గురించి విశాల్ ప్రస్తావించారు. ఎమ్.టీ. వాసుదేవన్ నాయర్, ఓ.ఎన్.వీ. కురుప్‌లతో కలిసి మలయాళంలో సంగీతం కూర్చిన అనుభవాలను ఆయన పంచుకున్నారు.
తరువాత జానపద సంగీతంపై చర్చ దృష్టి సారించింది. అజనీష్ జానపదాన్ని "నిష్కపటత్వం నుంచి పుట్టినది"గా అభివర్ణించారు. 'కాంతారా' చలనచిత్ర చివరి భాగం పూర్తిగా గిరిజన వాయిద్యాలపై ఆధారపడిన తీరును ఆయన వివరించారు. విభిన్న ఢోల్ శబ్దాల ద్వారా మాట్లాడుకునే కోరగా వర్గాన్ని ఉదహరిస్తూ భారతదేశ లయబద్ధమైన వైవిధ్యాన్ని వర్ణించారు. భారత్‌లో "అనేక సంస్కృతులు" ఉన్నాయన్న విశాల్.. ప్రతి ఒక్కటి సొంత మాండలికాలు, అల్లికలు, జానపద సంప్రదాయాలు, సంగీతాలను కలిగి ఉందని పేర్కొన్నారు.
సంగీత రంగం భవిష్యత్తు: ఏఐ, సాహిత్యం, కథాకథనం
ప్రశ్నల సెషన్‌లో సాహిత్యం, కథాకథనం నుంచి ఏఐ, సంగీత రంగం భవిష్యత్తు వైపు చర్చలు మళ్లాయి. కొన్ని విషయాల్లో ఏఐ సహాయపడవచ్చని అజనీష్ అన్నారు. సాంకేతికతకు భయపడకూడదన్న విశాల్.. "దేనిని ఉపయోగించాలో, దేనిని వదిలేయాలో మనం నేర్చుకుంటాం" అని వ్యాఖ్యానించారు.
ఈ స్మారక ఉపన్యాసం ముగింపు సందర్భంగా భారత గాన కోకిల అయిన లతా మంగేష్కర్‌ను గౌరవించటమే కాకుండా శాస్త్రీయం నుంచి జానపదం వరకు, వ్యక్తిగత జ్ఞాపకాల నుంచి ఆధ్యాత్మికత వరకు భారతీయ సంగీతం విస్తృత దృశ్యాన్ని ప్రదర్శించారు. సృజనాత్మకతను దాని అత్యంత స్పష్టమైన రూపంలో చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు ఈ ఉపన్యాసం కల్పించింది. ఇది కేవలం పేరుతోనే కాక స్ఫూర్తితో కూడా ఒక నివాళిగా ఉంది. భారతీయ సృజనాత్మకతకు రూపాన్ని ఇచ్చే లయ, సంస్కృతి, జ్ఞాపకం, అంతులేని శ్రావ్యతకు సంబంధించిన వేడుకగా ఈ కార్యక్రమం కొనసాగింది.
ఏఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ చరిత్ర కలిగిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించబడిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహించే ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం, ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2193843
| Visitor Counter:
4