|
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సృజనాత్మకత... సాంకేతికతల సంగమంలో: కృత్రిమ మేధ... కథా శ్రవణం.. నవశకంలో సినిమా రంగంపై మేధా మథనం
· కృత్రిమ మేధ ప్రగతిశీల భవితపై శేఖర్ కపూర్.. ట్రిసియా టటిల్ విశదీకరణ · చర్చాగోష్ఠిలో ఆవిష్కరణ.. కళాత్మక సందేశం.. మానవీయత కేంద్రక సినిమాపై దృష్టి
Posted On:
22 NOV 2025 6:27PM by PIB Hyderabad
గోవాలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) ప్రారంభమైన నేపథ్యంలో “యాన్ యురేషియన్ ఫెస్టివల్ ఫ్రాంటియర్: డూ వియ్ నీడ్ టు రీడిఫైన్ సినిమా ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఏఐ” (యురేషియా వేడుకల నేపథ్యం: కృత్రిమ మేధా ప్రపంచంలో సినిమాను మనం పునర్నిర్వచించాల్సి ఉందా?) అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠి ఇద్దరు అత్యంత గౌరవనీయ అంతర్జాతీయ వేడుకల ప్రముఖలను ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ మేరకు ‘బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ డైరెక్టర్ ట్రిసియా టటిల్, ‘ఇఫి’ డైరెక్టర్ శేఖర్ కపూర్ ఇందులో పాలుపంచుకున్నారు. ఈ గోష్ఠికి కపూర్ సమన్వయకర్తగా వ్యవహరించినప్పటికీ, వారి మధ్య అభిప్రాయాల ఆదానప్రదానం ఒక గతిశీల ముఖాముఖి సంభాషణలా సాగింది. ఈ సందర్భంగా కృత్రిమ మేధ, సృజనాత్మకత, చలనచిత్రోత్సవాల భవిష్యత్తు సంబంధిత భవిష్యత్ సంగమంపై వారు దృష్టి సారించారు.
ప్రపంచంలోని రెండు ప్రధాన చలనచిత్రోత్సవ డైరెక్టర్ల సౌహార్ద, వ్యక్తిగత వ్యాఖ్యలతో ఈ గోష్ఠి ఉల్లాసంగా మొదలైంది. ఈ మేరకు ప్రస్తుత ‘ఇఫి’ వేడుకలలో ప్లాస్టిక్ సీసాల వినియోగం లేకపోవడంపై శేఖర్ కపూర్ తొలుత నిర్వాహకులను అభినందించారు. ఇక ట్రిసియా టటిల్ మాట్లాడుతూ- తాను 1998లో శేఖర్ కపూర్ తన చిత్రం ‘ఎలిజబెత్’పై ప్రసంగించిన ‘మాస్టర్ క్లాస్’కు చలనచిత్ర పాఠశాల యువ గ్రాడ్యుయేట్‌గా హాజరైన క్షణాలను గుర్తుచేసుకున్నారు. “చరిత్ర పునరావృతమవుతుంది” అన్న రీతిలో తానెంతో సంభ్రమానికి గురయ్యానంటూ గత అనుభవాలను సినిమా రంగం భవిష్యత్తుతో సంధానించే అంశంపై చర్చకు నాంది పలికారు.
సాంకేతికత ఎంత అధునాతనమైనా... అది డిజిటల్ లేదా కృత్రిమ మేధ అయినా, సినిమా శాశ్వతం కాబట్టి మానవ సృజన మనుగడకు ఢోకా ఉండదని చర్చాగోష్ఠిలో శేఖర్ కపూర్ ఆద్యంతం పలుమార్లు ప్రస్తావించారు. కొత్త విజ్ఞానం లేదా ఉపకరణం ఏదైనా దాన్ని అంతిమంగా నడిపించేది దాని సృష్టికర్తేనని స్పష్టం చేశారు. ఆవిష్కరణ ఎలాంటిదైనా దాన్ని వాడుకునే వ్యక్తుల సృజనాత్మకతను అది అధిగమించజాలదని ఆయన ప్రేక్షకులకు గుర్తుచేశారు.
ఇక ట్రిసియా టటిల్ మాట్లాడుతూ- చిత్ర నిర్మాణంలో డిజిటల్ సాంకేతికత రాకతో సినిమా అదృశ్యమవుతుందనే ఆందోళన ఒకనాడు ఎలా భయపెట్టిందో గుర్తుచేశారు. ఆ మేరకు సాంకేతిక మార్పుల చుట్టూ ముసురుకున్న మునుపటి కాలపు ఆందోళనలను ఆమె వివరించారు. ఏదేమైనా “శాశ్వతంగా నిలిచేది ఆలోచన, నైపుణ్యం, మానవీయతలే”నని పేర్కొన్నారు. అలాగే, కృత్రిమ మేధ ఎంత పురోగమించినా.. ఒక గొప్ప నటుడు పలికించే సున్నిత భావోద్వేగ వైవిధ్యాన్ని, ముఖ్యంగా కళ్లతో ప్రదర్శించే సూక్ష్మ మార్పులను అర్థం చేసుకోజాలదని శేఖర్ కపూర్ అన్నారు. ఒక్కమాటలో “కృత్రిమ మేధ కంటిపాపల కదలికల్లోని భావాన్ని అర్థం చేసుకోలేదు” అన్నారు. క్షణకాలం మెరిసే ఆ భావోద్వేగమే ప్రేక్షకులను కథలో లీనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
సరికొత్త సృజనాత్మక ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవడంపై తన ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ- ‘వార్ లార్డ్’ పేరిట రూపొందించిన ఏఐ-సిరీస్ పరిచయ సన్నివేశాన్ని ప్రేక్షకులకు ప్రదర్శించారు. ఈ విధంగా అందివచ్చిన అవకాశాన్ని తాను వాడుకున్నప్పటికీ, సాంకేతికత కథకుడిని పునర్నిర్వచించ జాలదని చెప్పారు. వాస్తవానికి కథకుడే సాంకేతికతకు కొత్త రూపమిస్తాడంటూ తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.
కపూర్ తన ప్రసంగం కొనసాగిస్తూ- తన ఇంటి వంటమనిషి ‘చాట్‌జీపీటీ’ సాయంతో ‘మిస్టర్ ఇండియా-2’ సినిమా కోసం చిత్రకథ రాయడంపై హాస్యభరితంగా వివరించిన ఉదంతం ప్రేక్షకులను ఉల్లాసపరచింది. “ఆ కథను తయారు చేశాక అతనెంతో ఉత్సాహంతో నా దగ్గరకు వచ్చాడు” అని గుర్తుచేసుకుంటూ- “అతడి వంట లేదా సినిమా కథ వంటకాలలో దేన్ని మొదట అభినందించాలో ఒక్క నిమిషం నాకు అర్థం కాలేదు” అన్నారు. సృజనాత్మక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చిన తీరు, ఊహకైనా అందని ప్రదేశాల్లో కూడా మానవ ఊహాశక్తికి సాంకేతికత ఎలా ఉత్తేజమివ్వగలదో ఆయన హాస్యస్ఫోరక కథనం స్పష్టం చేసింది.
సాంకేతిక పరిజ్ఞాన మార్పుల్లో వేగం పెరిగినా ఒక సమష్టి సామాజిక అనుభవంగా సినిమా ఎలా మిగిలిందో వక్తలిద్దరూ చర్చించారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే సామాజిక అనుభవాన్ని ‘ఏఐ ఉపకరణాలు, లేదా ఇళ్లలో టీవీ చూసే అలవాట్లు అధిగమించడం అసాధ్యమని శేఖర్ కపూర్ అన్నారు. “రుచికరమైన వంటకాలు ఇంటికే అందుతున్నా ప్రజలు ఇప్పటికీ రెస్టారెంట్లకు వెళ్తున్నారు” అని ఆయన ఉదాహరించారు. స్వతంత్ర, సాహసోపేత చిత్రానుభవం ఇచ్చే వేదికల సంరక్షణ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దీన్ని కొనసాగించే బాధ్యత చలనచిత్రోత్సవాలదేనని ట్రిసియా టటిల్ స్పష్టం చేశారు.
చిత్ర నిర్మాణంలో తగ్గిపోతున్న కార్మికశక్తి పరిమాణం, సినిమా రంగంతో ముడిపడిన వారి భవిష్యత్తుపైనా గోష్ఠిలో చర్చించారు. సినిమా సెట్ మీద కార్మిక బృందంలో ఒకరుగా ఉండటంలోని అనుభూతిని ట్రిసియా టటిల్ ప్రముఖంగా ప్రస్తావించారు. తన కుమారుడు ఒకప్పుడు రచన లేదా దర్శకత్వంపైన కాకుండా చిత్ర బృందంలో ఒకరుగా పనిచేయడంపై ఆసక్తి చూపడాన్ని ఈ సందర్భంగా ఆమె ఉదాహరించారు. చిత్రనిర్మాణ ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే అదే మెరుగైన మార్గమన్నది అతడి అభిప్రాయమని చెప్పారు. శేఖర్ కపూర్ మాట్లాడుతూ... సరైన సమయంలో “యాక్షన్ - కట్” చెప్పే సామర్థ్యం కోల్పోతానేమోనని ఆందోళన చెందుతున్నట్లు చమత్కరించారు. ఏదేమైనా సెట్‌పై ఏర్పడే మానవ సంబంధాలను ఎలాంటి కృత్రిమ మేధ ఉపకరణంతోనైనా సృష్టించలేమని పేర్కొన్నారు.
ప్రేక్షకులతో సంభాషణ సందర్భంగా కథాచౌర్యం (కాపీరైట్), నైతికత, ఏఐ కళాత్మక చట్టబద్ధతపై పలువురు ప్రశ్నలు సంధించారు. దీనిపై శేఖర్ కపూర్ స్పందిస్తూ- “ఏఐ అంటే మాయాజాలమేమీ కాదు. ఇందులో గందరగోళానికి తావులేదు. ఇదొక అనివార్యమైన పరిణామం మాత్రమే. కానీ, వాస్తవికంగా కథను చెప్పడం ఊహలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏఐ గతాన్ని అనుకరించగలదే తప్ప భవిష్యత్తును ఊహించజాలదు” అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. కృత్రిమ మేధతో లేదా దానితో నిమిత్తం లేకుండా సృజనపై బద్ధకమే కథాచౌర్యానికి దారితీస్తుందన్నారు. భావోద్వేగ పూరితంగా కథ చెప్పడం వెనుక మానవ మేధ ఉనికి సదా ప్రస్ఫుటం అవుతుందని స్పష్టం చేశారు.
చివరగా, సినిమా రంగం నిరంతర పరిణామశీలం... అయితే, మానవుని ఊహాశక్తి, భావోద్వేగ వాస్తవం, కథకుగల శక్తి ప్రతి సాంకేతిక మార్పునూ అధిగమించగలవని వక్తలిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చడంతో చర్చాగోష్ఠి ముగిసింది. అనంతరం సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ వందన సమర్పణతో కార్యక్రమం సమాప్తమైంది.
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ నేపథ్యం
దక్షిణాసియా సినిమా రంగానికి సంబంధించి 1952లో మొదలైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫెఫ్‌ఐ-ఇఫి) అత్యంత ప్రాచీనమైనదేగాక ఘనమైన వేడుకగా ప్రపంచ గుర్తింపు పొందింది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ‘గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ’ (ఈఎస్‌జీ) ఈ ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో ఒక శక్తిగా ఎదిగిన ఈ వేడుకలలో పాత సినిమాలకు కొత్త హంగులతో చేసిన సాహస ప్రయోగాలు, తొలిసారి రంగంలో ప్రవేశంచిన ప్రతిభావంతులతో పరిశ్రమ దిగ్గజాల అరమరికలు లేని ముచ్చట్లు అందర్నీ అలరిస్తాయి. వాస్తవంగా ఈ చలనచిత్రోత్సవానికి వన్నెలద్దేది దాని ఉజ్వల సమ్మేళనమే. ఇందులో అంతర్జాతీయ పోటీ, సాంస్కృతిక ప్రదర్శనలు, దిగ్గజాల ప్రసంగాలు (మాస్టర్ క్లాసులు), ప్రశంసలు సహా ఆలోచనలు, ఒప్పందాలు, సహకారం తదితరాలకు ఉత్తేజమిచ్చే శక్తిమంతమైన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్’ ప్రత్యేక ఆకర్షణలు. అద్భుత తీర ప్రాంతమైన గోవా నేపథ్యంలో మరింత వెలుగులు విరజిమ్ములూ ఈ నెల 20 నుంచి 28 వరకు 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్దంపటే అద్భుత వేడుక. భాష, శైలి, ఆవిష్కరణ, గళాల అద్భుత సమ్మేళనం ఈ ఉత్సవాల్లో కనువిందు చేస్తుందనడంలో సందేహం లేదు.
మరితం సమాచారం కోసం దిగువ ఇచ్చిన లింకులపై క్లిక్ చేయండి:
‘ఎక్స్’ హ్యాండిళ్లు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
(Release ID: 2193226)
|