నటనా నైపుణ్యం నుంచి మరువలేని పాత్రల వరకు: సినీ అనుభవాలను పంచుకున్న ఖుష్బూ,సుహాసిని
నటీనటులకు గొప్ప శిక్షణ తరగతిగా మారిన ఇఫీ చర్చాగోష్టి
శక్తిమంతమైన, గత స్మృతుల భావోద్వేగ ప్రత్యక్ష ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఖుష్బూ,సుహాసిని
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ-ఇఫీ)లో జరిగిన చర్చాగోష్ఠి కళా అకాడమీని కళా నైపుణ్యం, భాగస్వామ్యం, సినిమా జ్ఞాపకాలు కలిసిపోయే ప్రత్యేక వేదికగా మార్చింది. “ప్రకాశించే చిహ్నాలు: సృజనాత్మక బంధాలు, సాహసోపేత ప్రదర్శనలు” (ద ల్యూమినరీ ఐకాన్స్: క్రియేటివ్ బాండ్స్ అండ్ ఫియర్స్ పర్ఫార్మెన్సెస్) అనే శీర్షికతో జరిగిన ఈ సెషన్, దశాబ్దాలుగా సినిమాతో జీవించి, శ్వాసించి, దాని రూపాన్ని తయారు చేసిన ఇద్దరు ప్రసిద్ధ నటీమణులు - సుహాసిని మణిరత్నం, ఖుష్బూ సుందర్ లను అభినయ కళపై ఆలోచనాత్మక, చైతన్యవంతమైన సంభాషణ కోసం ఒకే వేదికపైకి చేర్చింది.
అతిథులకు చలనచిత్ర నిర్మాత శ్రీ రవి కొట్టారక్కర ఘనమైన స్వాగత సన్మానంతో కార్యక్రమం ప్రారంభమైంది. కొద్ది క్షణాల్లోనే వేదిక హాస్యం, జ్ఞాపకాలు, అలాగే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న ఇద్దరు కళాకారులు మాత్రమే సృష్టించగల ప్రత్యేకమైన హావభావాలతో ఉత్సాహభరితంగా మారింది.

సుహాసిని తనదైన శైలిలో మాట్లాడుతూ, తాను కమల్ హాసన్‌కు బంధువా , కాదా అని జనం మొదట్లో సందేహించిన రోజులను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. శిక్షణ పొందిన సినిమాటోగ్రాఫర్‌గా, కెమెరా వెనుక, కెమెరా ముందు సునాయాసంగా మారగల సుహాసిని, ‘కళాత్మక చిత్రాలను, వాణిజ్య సినిమాలను మీరు ఎలా చూస్తారు?’ అని ఖుష్బూను అడగడం ద్వారా, సంభాషణను నేరుగా అసలు విషయంలోకి తీసుకువెళ్లారు.
దానికి ఖుష్బూ దృఢంగా సమాధానమిస్తూ, తాను కళాత్మక, వాణిజ్య సినిమాల మధ్య అలాంటి భేదాన్నేమీ చూడనని స్పష్టం చేశారు. కే.జి.జార్జ్ వంటి ప్రఖ్యాత కళాత్మక, వాస్తవిక సినిమా దర్శకులతో పనిచేసినా, లేదా పి. వాసు వంటి వాణిజ్య చిత్రాల దర్శకులతో పనిచేసినా, ప్రతి ప్రాజెక్ట్‌లోకి తాను ఒక ‘మృదువైన మట్టిముద్దలా’ వెళ్తానని, దర్శకుడి ఆలోచనా దృష్టిని పూర్తిగా గ్రహించడానికి సిద్ధంగా ఉంటానని ఆమె అన్నారు. నిజ జీవితంలో తనకు ఈత కొట్టడం, గుర్రపు స్వారీ చేయడంలో ఉన్న నైపుణ్యాలను గుర్తించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఆ బలాలను తెరపైకి తీసుకు వచ్చే విధంగా ఒక పాత్రను ఎలా సృష్టించారో ఆమె గుర్తు చేసుకున్నారు. ఇది దర్శకుడికి, నటికి మధ్య ఉండే నమ్మకానికి ఒక చక్కటి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.
అనంతరం సుహాసిని అక్కడ ఉన్న యువ నటుల వైపు తిరిగి, చర్చను వాణిజ్య సినిమాల ప్రపంచానికి మళ్లించారు. ఒక కథ వినేటప్పుడు, అది హిట్ అవుతుందనే భావన ఖుష్బూకు ఎప్పుడైనా వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. దీనికి ప్రతిగా, ఖుష్బూ తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘చిన్నతంబి‘ ఉదాహరణను పేర్కొన్నారు. అలాగే తన హృదయానికి దగ్గరైన కెప్టెన్ మగల్, జాతి మల్లి వంటి సినిమాలు అనుకున్నంతగా నడవలేదని నిజాయితీగా అంగీకరించారు. ప్రతి నటుడూ విజయవంతమైన చిత్రాన్నే ఆశిస్తారని, కానీ బాక్సాఫీస్ అనూహ్యత మాత్రం ఎప్పటికీ మనల్ని మౌనంగా ఉంచే సత్యమని ఆమె అన్నారు.

నటనలోని కీలక భావోద్వేగ అంశం గురించి సుహాసిని మాట్లాడుతూ, నటులు తమ స్వంత వ్యక్తిత్వంలోని కొన్ని కోణాలను తప్పనిసరిగా తమ పాత్రల్లోకి తీసుకువస్తారన్న విషయాన్ని ప్రముఖంగా చెప్పారు. “ప్రతి సన్నివేశానికి తనదైన ప్రాధాన్యం ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు. ‘‘ప్రతి సన్నివేశాన్ని కొత్త సినిమా ప్రారంభిస్తున్నట్లే ప్రారంభించాలి” అని ఖుష్బూ అన్నారు. ఎక్కువగా పాత్ర స్వరూపం, శరీర భాషను ఊహించడం నుంచే తన శైలి మొదలవుతుందని చెప్పారు. ఒక దర్శకుడు తాను ఆశించిన సహజత్వాన్ని రాబట్టేందుకు ఒక షాట్‌కు ముందు తనను మేకప్ అంతా తీసేయమని అడిగిన ఒక సంఘటనను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేదికపై ఉన్న ఔత్సాహిక నటుల కోసం, సంభాషణను తన స్వదేశీ భాషలో రాయడం, వాటిని పునరావృతంగా చదవడం ఎంత ముఖ్యమో సుహాసిని పేర్కొన్నారు. భాషను అధిగమించడం అనేది తరచుగా ఒక నటుడు ఎదుర్కోవలసిన మొదటి అవరోధం అని ఆమె అన్నారు.
తర్వాత ఈ సమావేశం భాషలు, దశాబ్దాలుగా విభిన్న షూటింగ్ సెట్ల అనుభవాల పరస్పర మార్పిడిగా విస్తరించింది. ఖుష్బూ తన మొదటి తమిళ చిత్రంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకున్నారు. అక్కడ భాషతో అనుభవం లేకపోవడం కొన్నిసార్లు సరదా, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పొరపాట్లకు కారణమైందని అన్నారు. ఖుష్బూ తన సంభాషణలతో పాటు సహనటుల సూచనలను కూడా హిందీలో రాయడం ద్వారా తన ప్రదర్శన మెరుగ్గా ఉండేలా చూసుకోవడం గురించి వివరించారు. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ 29 టేక్‌లు తీసుకున్న క్లిష్టమైన కన్నడ సంభాషణను సుహాసిని గుర్తు చేసుకున్నారు. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకుల కోసం తెరపై ప్రదర్శించారు.

భారీ షూటింగ్ సెట్ల ముందు ఉత్కంఠ, నటుడు మమ్ముట్టి ముందు డైలాగ్ మర్చిపోవడం, ప్రతి నటుడు నిశ్శబ్దంగా ఎదుర్కొనే ప్రారంభ భయాలు వంటి అనుభవాలను ఇద్దరు నటీమణులు పంచుకున్నారు. నటులు చిరంజీవి, విష్ణువర్ధన్ లాంటి మార్గనిర్దేశకుల సలహా సహకారాల గురించి కూడా సుహాసిని మాట్లాడారు. దాపరికం లేకుండా వారు ఇచ్చిన సహకారం తన కళ మరింత రాణించేలా చేసిందని తెలిపారు. మోహన్‌లాల్‌తో కలిసి నటించిన వానప్రస్థం సినిమాలో మాటలేకుండా సన్నివేశం ద్వారా కథ చెప్పే శక్తిని వివరించారు. అబినయంలోని సున్నితమైన అంశాలను ప్రేక్షకులకు వివరించారు.
ఆ తర్వాత సుహాసిని, దిగ్భ్రాంతి (షాక్) భావాన్ని ఎలా ప్రదర్శించాలో కొన్ని పద్ధతులను- ఒక షాట్ సమయంలో కచ్చితంగా 'మార్క్' వద్ద నిలబడటం ప్రాముఖ్యతను, సూక్ష్మమైన కదలికలు కథనానికి స్పష్టతను ఎలా అందిస్తాయో వివరిస్తూ, వేదికపైనే సంక్షిప్తంగా సమగ్రమైన మాస్టర్‌క్లాస్‌ను అందించారు.
పాత జ్ఞాపకాలతో రెండు సన్నివేశాల ప్రదర్శన...
ఖుష్బూ 'చిన్నతంబి'లో తాను అద్భుతంగా నటించిన సన్నివేశాన్ని ప్రదర్శించారు. ఆమె కన్నీటితో ముగించగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం మార్మోగింది. సుహాసిని 'కన్నకి' చిత్రం నుంచి ఒక సన్నివేశాన్ని ప్రదర్శిస్తుండగా, డ్యాన్స్ మాస్టర్ కళా అకస్మాత్తుగా వేదికపైకి వచ్చి, ఆ సన్నివేశాన్ని నిర్దేశిస్తూ ప్రేక్షకులను ఆనందపరిచారు.
సదస్సు పరస్పర ప్రశ్న-సమాధానాల ఘట్టంతో ముగిసింది. తద్వారా భారతీయ సినిమాను నిరంతరం తీర్చిదిద్దుతున్న ఇద్దరు కళాకారుల మార్గదర్శకత్వం, జ్ఞాపకాలు, సాంకేతికత అనుభవసారం కలగలిసిన ఒక సంభాషణకు ముగింపు పలికింది.
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్, భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2192991
| Visitor Counter:
3