56వ ఇఫి కోసం వచ్చిన 500 సమర్పణల్లోంచి 20 నాన్-ఫీచర్ చిత్రాల ఎంపిక..
ప్రక్రియ కఠినంగా ఉన్నప్పటికీ ఆనందకరమైన అనుభవాన్ని అందించిందన్న జ్యూరీ
“మేం ప్రధానంగా కథాంశం పైనే దృష్టి పెట్టాం. ఎందుకంటే అది అన్నింటికంటే ముఖ్యం’’: ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ జ్యూరీ అధ్యక్షుడు శ్రీ ధర్మ గులాటి
“మేం భారతదేశాన్ని ఎంపిక చేశాం’’: చిత్రాల ఎంపికపై నాన్-ఫీచర్ జ్యూరీ సభ్యుడు అశోక్ కశ్యప్
ఇఫి నాన్-ఫీచర్ జ్యూరీ ప్రదర్శనకు ఎంపికైన చిత్రాలు వైవిధ్యానికి ప్రతిబింబాలు
“500 సమర్పణల్లోంచి 20 చిత్రాలను ఎంపిక చేయడం నిజంగా చాలా కష్టమైన పని!’’గా మారిందని 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ జ్యూరీ చైర్మన్ శ్రీ ధరమ్ గులాటి పేర్కొన్నారు. ఆయన అభిప్రాయాన్ని ఇతర న్యాయ నిర్ణేతల బృంద సభ్యులంతా అంగీకరించారు. జ్యూరీ సభ్యులు అంజలి పంజాబీ, అశోక్ కశ్యప్, బాబీ శర్మ బరువా, రేఖా గుప్తా, ఎ. కార్తీక్ రాజా, జ్యోత్స్నా గార్గ్‌లతో కలిసి గోవాలో జరిగిన ఒక విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి జ్యూరీ ఛైర్‌పర్సన్ శ్రీ ధర్మ గులాటి ప్రసగించారు. సమర్పించిన అన్ని చిత్రాలను చూడడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సభ్యులందరూ ఏకగ్రీవంగా తెలిపారు.
తాము ఎంపిక చేసిన చిత్రాల విషయంలో న్యాయ నిర్ణేతల బృంద సభ్యులందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని నాన్-ఫీచర్స్ జ్యూరీ ఛైర్మన్ శ్రీ ధర్మ తెలిపారు. ‘‘మేం ప్రధానంగా చిత్రాల విషయంపైనే దృష్టి పెట్టాం, ఎందుకంటే అది అన్ని విషయాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనది’’ అని పేర్కొన్నారు. నాన్-ఫీచర్స్ విభాగంలో ఎంపిక కాలేని చిత్రాలను ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వంటి ఇతర వేడుకలకు పంపాలని ఆయన చిత్ర నిర్మాతలను కోరారు.
సినిమాలను ఎంపిక చేసుకునేటప్పుడు.. వివిధ ప్రాంతాలు, వివిధ భాషల నుంచి సినిమాలను ఎంచుకోవాలని జ్యూరీ కూడా భావించినట్లు ఆయన వివరించారు
ఇతర న్యాయ నిర్ణేతల బృంద సభ్యులు కూడా ఈ సంవత్సరం నాన్-ఫీచర్స్ విభాగంలో ప్రదర్శనకు 20 చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియలో తమ అనుభవాలను, వారికి బాగా నచ్చిన అంశాలను పంచుకున్నారు.
మణిపూర్‌లో చిత్రీకరించిన ‘బ్యాటిల్‌ఫీల్డ్’ అనే డాక్యుమెంటరీని శ్రీ ధరమ్ గులాటి ప్రస్తావించారు. దీన్ని 1944లో రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత రక్తపాతం జరిగిన ఇంఫాల్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. ఈ యుద్ధం మణిపూర్‌ను తీవ్రంగా ధ్వంసం చేసి, తీవ్ర గాయాలను మిగిల్చింది.
ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగం.. చిన్న కథా చిత్రాల అద్భుతమైన ఖజానాగా నిలుస్తోందని జ్యూరీ సభ్యురాలు అంజలి పంజాబీ పేర్కొన్నారు. ‘‘ఈ సంవత్సరం వైవిధ్యంతో కూడిన చిత్రాలను చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఫీచర్ చిత్రాల నిర్మాణం, నిధుల పరిమితులను దాటి చిన్న కథలు అందించే సృజనాత్మక స్వేచ్ఛను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అనుభవజ్ఞులైన దర్శకులు నుంచి అప్పుడే అభివృద్ధి చెందుతున్న విద్యార్థి సృజనకర్తల వరకు అందరూ ఈ గొప్ప కథనాల అల్లికలో తమ రచనల ద్వారా భాగస్వామ్యం అయ్యారని ఆమె అన్నారు. ప్రారంభ చిత్రం ‘కాకోరి’ని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. కల్పిత, వాస్తవాంశాల ను ప్రత్యేకంగా మేళవించడమే ఈ చిత్రం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఈశాన్య ప్రాంత ప్రాతినిధ్యాన్ని న్యాయనిర్ణేతల బృంద సభ్యురాలు బాబీ శర్మా బరువా ప్రత్యేకంగా గుర్తుచేశారు. సిక్కిం చిత్రం ‘శాంగ్రిలా’ అస్సామీ చిత్రం ‘పాత్రలేఖా’ సృజనాత్మకత, లోతైన సాంస్కృతిక అంశాలతో మెప్పించాయని ఆమె ప్రశంసించారు.
కాకోరి చిత్ర ప్రాముఖ్యతను రేఖా గుప్తా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 505 చిత్రాల సమర్పణల్లో ఇదొక్కటే దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని, మరుగునపడిన వీరుల కథలను ప్రతిబింబించిందని తెలిపారు. అలాగే కాకోరి సంఘటన జరిగి ఈ ఏడాదికి వందేళ్లు పూర్తవడంతో శతాబ్దీ ఉత్సవంతో సమకాలీనమైందని పేర్కొన్నారు. ‘ఆది కైలాస్’ చిత్రం భారత్ నుంచి మానసరోవరానికి వెళ్లే మార్గాన్ని, ముఖ్యంగా పవిత్రమైన ఆది కైలాష్‌ను అద్భుతంగా చిత్రీకరించిందని తెలిపారు. ఇందులో భౌగోళిక, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆవిష్కరించిందని పేర్కొన్నారు.
జ్యోత్స్నా గార్గ్ ‘పిప్లాంతరి’ చిత్రాన్ని అందరూ తప్పనిసరిగా చూడాలని సూచించారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో దూరదృష్టి కలిగిన సర్పంచ్ కథను ఈ సినిమా తెలియజేస్తుందని అన్నారు. ఆడపిల్లల భ్రూణహత్యలు, తగ్గుతున్న భూగర్భ జలాలు, అటవీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వినూత్న పరిష్కారాలతో కథను మలచినట్లు తెలిపారు. అలాగే ‘నీలగిరి’ చిత్రంలోని అద్భుతమైన సినిమాటోగ్రఫీని ఆమె అభినందించారు.
సమర్పణల్లోంచి న్యాయనిర్ణేతల బృందం 20 మంచి చిత్రాలను ఎంపిక చేసిందని కార్తీక్ రాజా అభినందించారు.
న్యాయనిర్ణేతల బృందం పనిని సమీక్షిస్తూ.. ‘‘మేం విషయం, నిర్మాణం, ప్రదర్శన,భాష అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇఫి భారత పనోరమా దేశ సంస్కృతిని సూచిస్తుంది. కాబట్టి మేం భారతదేశాన్ని ఎంపిక చేశాం’’ అని అశోక్ కష్యప్ తెలిపారు.

ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి..
1952లో ఆవిర్భవించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం.. పునర్నిర్మిత క్లాసిక్‌ల నుంచి సాహసోపేతమైన ప్రయోగాల వరకు, దిగ్గజ చిత్ర ప్రముఖుల నుంచి తొలి అడుగు వేస్తున్న కొత్త ప్రతిభావంతుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ స్థాయి సినీ వేదికగా ఎదిగింది. వైవిధ్యభరితమైన మేళవింపు, అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు, ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు, రెక్కలు తొడిగిన ఉత్సాహవంతమైన ఫిల్మ్ బజార్ లతో ఐఎఫ్ఎఫ్ఐ మెరిసింది. గోవాలోని అందమైన తీరప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు జరుగుతున్న 56వ సంచిక.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సమాహారాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్భుతమైన వేడుకగా నిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2192982
| Visitor Counter:
3