గోవాలో ప్రారంభోత్సవ వేడుకలతో మొదలైన వేవ్స్ ఫిల్మ్ బజార్
ఏడు దేశాల నుంచి 300 చలన చిత్ర ప్రాజెక్టులు, ప్రతినిధులను ఒకచోట చేర్చిన వేదిక
శ్రీమతి జేవాన్ కిమ్ వందేమాతరాన్ని ఆలపించడంతో స్వరభరితంగా ఒక్కటైన భారత్-కొరియా
దక్షిణాసియా ప్రపంచ చలనచిత్ర మార్కెట్ అయిన వేవ్స్ ఫిల్మ్ బజార్ గోవాలోని పంజిమ్‌లోని మారియట్ రిసార్టులో నేడు ప్రారంభమైంది. నేతలు, చిత్ర రూపకర్తలు, నిర్మాతలు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమం, స్ఫూర్తిదాయకంగా మొదలైంది. ప్రతిష్టాత్మకమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంతో పాటు ఏటా నిర్వహించే ఈ బజార్ 19వ సంచికను ఇప్పుడు ‘వేవ్స్ ఫిల్మ్ బజార్’గా వ్యవహరిస్తున్నారు. సృజనాత్మక, ఆర్థిక భాగస్వామ్యాలను కోరుకునే దర్శకులు, నిర్మాతలు, సినిమా ప్రతినిధులు, ప్రోగ్రామర్లు, పంపిణీదారులకు ప్రపంచ సమావేశ కేంద్రంగా ఇది నిలుస్తుంది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 24 వరకు జరగనుంది.

ఈ సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ.. వేవ్స్ ఫిల్మ్ బజార్‌ను ఇఫీ వేడుకలకు సహజమైన, సముచితమైన ప్రారంభంగా అభివర్ణించారు. ఇది “ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, సాంకేతిక ప్రదర్శనల సంపూర్ణ వ్యవస్థగా” పేర్కొన్నారు. వేవ్స్ కొత్త గుర్తింపు “కళను వాణిజ్యంగా మార్చడం” అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉందని తెలిపారు.

ప్రపంచంలో చిత్రరూపకర్తల కోసం ఏర్పాటు చేసిన మొదటి ఈ-మార్కెట్ వేదికగా ‘వేవ్స్’ ను ప్రస్తావిస్తూ.. ‘‘ఇది సృజనశీలురను, దేశాలను అనుసంధానిస్తూ.. భారత్‌ను ప్రపంచ సహకారానికి సమావేశ కేంద్రంగా మారుస్తుంది’’ అని ఆయన అభివర్ణించారు. ఇందులో ఎంపిక చేసిన వివిధ ప్రాజెక్టులు, నగదు గ్రాంట్లు, నిర్మాణాత్మక అభిప్రాయ సేకరణ ప్రక్రియలున్నాయని పేర్కొన్నారు. అలాగే దేశంలో తొలి కృత్రిమ మేధ చలనచిత్రోత్సవం, హ్యాకథాన్‌ను భావితరం సినిమా సాంకేతికతను అందిపుచ్చుకోడానికి ముఖ్య ప్రారంభంగా పేర్కొన్నారు.
గౌరవ అతిథిగా హాజరైన కొరియా రిపబ్లిక్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలు శ్రీమతి జేవాన్ కిమ్ మాట్లాడుతూ, వేడుక ప్రారంభం నుంచీ నిర్వాహకుల కృషిని, నిబద్దతను ప్రశంసించారు. భారత్, కొరియా మధ్య చురుకైన సహకారాన్ని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘వందే మాతరం’ గీతాన్ని ఆమె చక్కగా ఆలపించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు , చప్పట్లు, అభివందనాలు అందుకున్నారు.

సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రసంగిస్తూ భారత్‌ను ప్రపంచ స్థాయి సినీ నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి దార్శనికత గురించి వివరించారు. ఈయన ఈ వేదికను ‘‘సృష్టికర్తలు, నిర్మాతల మధ్య వారధి’’గా అభివర్ణించారు. యువతకు, కొత్త రచయితలకు శక్తినిచ్చే వేదికగా దీన్ని ప్రశంసించారు, ఈ సంవత్సరం బజార్‌లో 124 మంది కొత్త సృష్టికర్తలు పాల్గొనడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ ఈ కార్యక్రమంలో వందన సమర్పణ చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎఫ్‌ఓఫ్‌ఐ ఫెస్టివల్ దర్శకుడు, ప్రముఖ చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్, నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ, శ్రీ అనుపమ్ ఖేర్; వేవ్స్ బజార్ సలహాదారు జెరోమ్ పైలార్డ్, ఆస్ట్రేలియా సినిమా దర్శకుడు డైరెక్టర్ గార్త్ డేవిస్, ఎన్ ఎఫ్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్డం పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమం సృజనాత్మకత, పరిశ్రమ నాయకత్వ గొప్ప సంగమాన్ని సూచిస్తుంది.

వేవ్స్ ఫిల్మ్ బజార్: ప్రతిభ, సాంకేతికత, ప్రపంచ సహకారానికి వేదిక
గతంలో ఫిల్మ్ బజార్ అని పిలిచే ఈ కార్యక్రమాన్ని 2007లో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) ప్రారంభించింది. అప్పటి నుంచి ఇది దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమైన చిత్ర వేదికగా ఎదిగింది.
ఈ బజారులో స్క్రీన్ రచయితల ల్యాబ్, మార్కెట్ స్క్రీనింగ్‌లు, వ్యూయింగ్ రూమ్ లైబ్రరీ, కో-ప్రొడక్షన్ మార్కెట్ వంటి విభాగాల ద్వారా ఎంపిక చేసిన 300 కంటే ఎక్కువ చలనచిత్ర ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తుంది. కో-ప్రొడక్షన్ మార్కెట్‌లో 22 ఫీచర్ సినిమాలు,5 డాక్యుమెంటరీలు ఉన్నాయి. అయితే వేవ్స్ ఫిల్మ్ బజార్ రికమెండ్స్ విభాగం బహుళ ఫార్మాట్‌లలో 22 ప్రత్యేక చిత్రాలను ప్రదర్శిస్తుంది. ఏడు కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధి బృందాలు, పది కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాల నుంచి చలనచిత్ర ప్రోత్సాహక ప్రదర్శనలు వేదికను మరింత సమృద్ధిగా మారుస్తున్నాయి.
టెక్ పెవిలియన్‌లో అత్యాధునిక వీఎఫ్ఎక్స్, సీజీఐ, యానిమేషన్, డిజిటల్ ప్రొడక్షన్ సాధనాలను తెలుసుకోడానికి ప్రత్యేక స్థలం కేటాయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఎల్‌టీఐమైండ్‌ట్రీ సహకారంతో సినిమా ఏఐ హ్యకథాన్ ప్రారంభం కూడా జరగనుంది. ఇందులో కృత్రిమ మేధ ఆధారంగా కథ చెప్పడం, సర్టిఫికేషన్ ప్రక్రియలు, పైరసీ వ్యతిరేక ఆవిష్కరణలు వంటి రంగాల్లో ప్రయోగాలు చేసేందుకు సృజనకర్తలను ఆహ్వానిస్తుంది. ఇది సినీ రంగంలో సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడానికి ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తోంది.
సృజనాత్మకత, సాంకేతికత, ప్రపంచ మార్పిడి సమ్మేళనంతో, వేవ్స్ ఫిల్మ్ బజార్ శక్తివంతమైన సహకారం, ఆవిష్కరణకు వేదికగా నిలుస్తోంది. సినిమా స్థాయి ఆలోచనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు భారత్ ఒక చురుకైన కేంద్రంగా మారనుంది.
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి..
1952లో ఆవిర్భవించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ).. గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం.. పునర్నిర్మిత క్లాసిక్‌ల నుంచి సాహసోపేతమైన ప్రయోగాల వరకు, దిగ్గజ చిత్ర ప్రముఖుల నుంచి తొలి అడుగు వేస్తున్న కొత్త ప్రతిభాపరుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ స్థాయి సినీ వేదికగా ఎదిగింది. వైవిధ్యభరితమైన మేళవింపు, అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు, ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు రెక్కలు తొడిగిన ఉత్సాహవంతమైన ఫిల్మ్ బజార్ లతో ఐఎఫ్ఎఫ్ఐ మెరిసింది. గోవాలోని అందమైన తీరప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు జరుగుతున్న 56వ సంచిక.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సమూహారాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్భుతమైన వేడుకగా నిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2192337
| Visitor Counter:
3
Read this release in:
Punjabi
,
Khasi
,
English
,
Urdu
,
Konkani
,
Marathi
,
हिन्दी
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam