ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· సేవే భారతీయ నాగరికత మూలం- సేవ.
· ‘సేవో పరమో ధర్మః’- ఎన్నో మార్పులు, సవాళ్ల నడుమ మన నాగరికతకు అంతర్గత బలాన్నిస్తూ.. శతాబ్దాల తరబడి భారత్‌ను సుస్థిరంగా నిలిపిన నీతి ఇదే
· సేవనే మానవ జీవన కేంద్రంగా నిలిపిన వ్యక్తి శ్రీ సత్య సాయిబాబా
· సామాజిక సేవకు, మానవ సంక్షేమానికి ఆధ్యాత్మికతను సాధనంగా మలిచిన మహనీయుడు శ్రీ సత్య సాయిబాబా
· ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేలా సంకల్పిద్దాం..
వికసిత భారత్ సాకారం కావాలంటే స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేయాలి: ప్రధాని
प्रविष्टि तिथि:
19 NOV 2025 1:30PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా భక్తకోటిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ‘సాయిరాం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి.. ఈ పవిత్ర పుట్టపర్తి క్షేత్రంలో భక్తులందరి నడుమ ఉండడం ఒక భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే బాబా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించే అవకాశం తనకు దక్కిందన్నారు. బాబా పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను పొందినట్లు చెప్పారు. బాబా ఆశీస్సులు ఎప్పుడు అందించినా మనసు భావోద్వేగానికి లోనవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరం ఈ తరానికి ఒక వేడుక మాత్రమే కాదని, దైవాశీర్వాదమని శ్రీ మోదీ అన్నారు. బాబా ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన బోధనలు, ప్రేమ, సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ కొత్త వెలుగు, మార్గనిర్దేశం, సంకల్పంతో.. 140కి పైగా దేశాల్లో లెక్కకు మిక్కిలి భక్తులు జీవితంలో ముందుకు సాగుతున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
వసుధైక కుటుంబమన్న ఆదర్శానికి శ్రీ సత్య సాయిబాబా జీవితం సజీవ ఉదాహరణగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. ‘‘అందుకే ఈ శత జయంతి సంవత్సరం విశ్వవ్యాప్త ప్రేమ, శాంతి, సేవా పర్వంగా మారింది’’ అని వ్యాఖ్యానించారు. బాబా సేవా పరంపరను ప్రతిబింబించేలా ఈ సందర్భంగా రూ. 100 స్మారక నాణేన్నీ, తపాలా బిళ్ళనీ విడుదల చేయడం ఈ ప్రభుత్వం చేసుకున్న అదృష్టమన్నారు. భక్తులకు, తోటి వలంటీర్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా అనుచరులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“సేవే భారతీయ నాగరికతకు మూలం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్‌లోని వివిధ ఆధ్యాత్మిక, తాత్విక సంప్రదాయాలన్నింటికీ సేవే అంతిమ గమ్యమని స్పష్టం చేశారు. భక్తి, జ్ఞానం, కర్మ... ఏ మార్గంలో నడిచినా సరే, అవన్నీ సేవతో అనుసంధానమయ్యే ఉంటాయి. ‘‘సమస్త జీవరాశుల్లో కొలువై ఉన్న దైవానికి సేవ లేకుండా భక్తికి అర్థం లేదు. ఇతరుల పట్ల కారుణ్య భావాన్ని మేల్కొల్పలేనిది జ్ఞానం ఎలా అవుతుంది? తన పనిని సమాజ సేవగా సమర్పించే స్ఫూర్తి లేకపోతే అది కర్మ ఎలా అవుతుంది’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘సేవా పరమో ధర్మః- ఎన్నో మార్పులు, సవాళ్ల నడుమ శతాబ్దాలుగా భారత్‌ను సుస్థిరంగా నిలిపిన భావన ఇదే. ఇది మన నాగరికతకు అంతర్గత బలాన్నిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఎందరో గొప్ప సాధువులు, సంస్కర్తలు తమ కాలానికి అనుగుణంగా.. కాలాతీతమైన ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. సేవే మానవ జీవన కేంద్రంగా శ్రీ సత్య సాయిబాబా చూశారని ప్రధానమంత్రి కొనియాడారు. “అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి” అన్న బాబా మాటలను గుర్తు చేసిన ఆయన.. బాబా దృష్టిలో ప్రేమకు ఆచరణ రూపమే సేవ అని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్య రక్షణ, గ్రామీణాభివృద్ధి, ఇంకా అనేక ఇతర రంగాల్లో ఉన్న బాబా సంస్థలు ఈ తాత్వికతకు సజీవ నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సేవ రెండూ వేర్వేరు కావనీ- అవి ఒకే సత్యానికి భిన్నమైన వ్యక్తీకరణలుగా ఈ సంస్థలు చాటుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భౌతికంగా వారిక్కడే ఉన్నప్పుడు ప్రజలకు స్ఫూర్తినివ్వడం అసాధారణమేమీ కాదనీ, అయితే బాబా భౌతికంగా ఇక్కడ లేనప్పటికీ ఆయన సంస్థల సేవా కార్యకలాపాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయని శ్రీ మోదీ చెప్పారు. నిజమైన మహనీయుల ప్రభావం కాలం గడిచిన కొద్దీ తగ్గిపోదనీ, నిజానికి అది రోజురోజుకూ మరింత పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమనీ ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీ సత్య సాయిబాబా సందేశం ఎప్పుడూ పుస్తకాలకు, ఉపన్యాసాలకు, ఆశ్రమ సరిహద్దులకు పరిమితం కాలేదనీ.. ఆయన బోధనల ప్రభావం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు, పాఠశాలల నుంచి గిరిజనావాసాల వరకు.. దేశవ్యాప్తంగా సంస్కృతి, విద్య, వైద్య సేవల అద్భుత వాహిని ప్రవహిస్తోందన్నారు. లక్షలాది మంది బాబా అనుచరులు నిస్వార్థంగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని ప్రశంసించారు. ‘మానవ సేవే మాధవ సేవ’ భావనే బాబా భక్తులకు అత్యున్నత ఆదర్శమని ఆయన స్పష్టం చేశారు. కరుణ, కర్తవ్యం, క్రమశిక్షణ, జీవన తాత్వికతా సారం వంటి అనేక భావనలను బాబా బోధించారని ప్రధానమంత్రి చెప్పారు. ‘ఎప్పుడూ సాయమే అందించు, ఎన్నడూ నొప్పించకు’, ‘తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేయి’... అన్న బాబా మార్గదర్శక సూత్రాలను ఆయన గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి బాబా ప్రవచించిన ఆ జీవన మంత్రాలు అందరి హృదయాల్లో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఆధ్యాత్మికతను- సమాజం, ప్రజా సంక్షేమం కోసం శ్రీ సత్య సాయిబాబా ఉపయోగించారన్న ప్రధానమంత్రి.. నిస్వార్థ సేవ, వ్యక్తిత్వ నిర్మాణం, విలువలతో కూడిన విద్యతోనే ఇది సాధ్యపడిందన్నారు. బాబా ఏ సిద్ధాంతాన్నీ, భావజాలాన్నీ ప్రజలపై రుద్దలేదనీ.. పేదలకు సాయమందించేందుకు, వారి బాధలను తగ్గించేందుకు కృషి చేశారని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ భూకంపం అనంతరం బాబా సేవా దళ్ సహాయక చర్యల్లో ముందుండి నడిచిందని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన అనుచరులు చాలా రోజులు పూర్తి అంకితభావంతో పనిచేశారు. బాధిత కుటుంబాలకు సాయమందించడంలో, అత్యవసర సామగ్రిని అందించడంలో, మానసిక చేయూతనివ్వడంలోనూ విశేషంగా కృషి చేశారు.
ఎవరినైనా ఒక్కసారి కలిస్తే మన హృదయం కరుగుతోందంటే... జీవన దశను మారుస్తోందంటే.. అది ఆ వ్యక్తి గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బాబా సందేశంతో తమ జీవితాల్లో గొప్ప మార్పును పొందిన వ్యక్తులు ఈ వేడుకలో పాల్గొన్న వారిలో కూడా అనేకులు ఉన్నారన్నారు.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, దాని అనుబంధ సంస్థలు శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తితో వ్యవస్థీకృతమైన, సంస్థాగతమైన, స్థిరమైన పద్ధతిలో సేవలు అందిస్తున్నాయని, ఇది ఆచరణాత్మక విధానానికి ఇది ఉదాహరణగా మారిందని శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. నీరు, గృహ నిర్మాణం, పోషకాహారం, విపత్తు సాయం, స్వచ్ఛ ఇంధనం లాంటి రంగాల్లో విశేషమైన కృషి చేస్తోందని కొనియాడారు. ట్రస్టు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాయలసీమలో తాగునీటి కొరతను తీర్చేందుకు 3,000 కి.మీ పైగా పైపులైన్లను వేసింది. ఒడిశాలో వరద బాధిత కుటుంబాల కోసం 1,000 ఇళ్లను నిర్మించింది. పేదలు కోసం బిల్లింగ్ కౌంటర్లు లేని ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఉచితంగా చికిత్స అందిస్తున్నప్పటికీ.. రోగులకు, వారి కుటుంబాలకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగదని ఆయన అన్నారు. బాలికలకు విద్యను, భద్రమైన భవిష్యత్తును అందించడానికి.. వారి పేరు మీద ఈ రోజు 20,000కు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిచారని ప్రధాని వెల్లడించారు.
బాలికలకు విద్యను, ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు పదేళ్ల కిందట భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించిందని తెలియజేశారు. మన దేశంలోని అమ్మాయిలకు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందించే కొన్ని పథకాల్లో ఇది కూడా ఒకటని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఖాతాలను తెరిచారని, వీటిలో ఇప్పటివరకు దాదాపుగా రూ.3.25 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని పొదుపు చేశారని ఆయన వెల్లడించారు. ఇక్కడ 20,000 సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచిన శ్రీ సత్య సాయి కుటుంబాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. తన నియోజక వర్గం వారణాసి గురించి ప్రస్తావిస్తూ.. గతేడాది ఫిబ్రవరిలో 27,000 సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచామని, ప్రతి ఖాతాలోనూ రూ.300 జమ చేసినట్లు వివరించారు. అమ్మాయిలకు విద్యను, ఉజ్వలమైన భవిష్యత్తును అందించడంలో సుకన్య సమృద్ధి యోజన గణనీయమైన పాత్ర పోషిస్తుందని హామీ ఇచ్చారు.
గడచిన పదకొండేళ్లలో ప్రారంభించిన వివిధ పథకాలు ప్రజల సామాజిక భద్రతా విధానాన్ని గణనీయంగా బలోపేతం చేశాయని ప్రధానమంత్రి అన్నారు. సామాజిక భద్రత పరిధిలోకి వస్తున్న పేదలు, అణగారిన వర్గాలను వేగంగా తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. 2014లో కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఈ ప్రయోజనాలు దక్కితే.. ఇప్పుడు ఆ సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. భారత్‌లో అమలు చేస్తున్న సంక్షేమ, సామాజిక భద్రతా పథకాల గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చిస్తున్నారని శ్రీ మోదీ తెలియజేశారు.
ఈ రోజు ట్రస్టు ద్వారా పేద వ్యవసాయ కుటుంబాలకు 100 ఆవులను అందించిన గోదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించిందని శ్రీ మోదీ అన్నారు. భారతీయ సంప్రదాయంలో ఆవును జీవితానికి, సంక్షేమానికి, కరుణకు ప్రతీకగా భావిస్తామని వివరించారు. ఈ కుటుంబాలు ఆర్థిక, పోషకాహార, సామాజిక స్థిరత్వాన్ని సాధించడానికి ఈ ఆవులు తోడ్పడతాయి. గో సంరక్షణ ద్వారా అందించే సంక్షేమం అనే సందేశాన్ని ప్రపంచమంతా వీక్షిస్తోందని ప్రధాని అన్నారు. కొన్నేళ్ల కిందట వారణాసిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 480కు పైగా గిర్ ఆవులను పంపిణీ చేశామని.. ఇప్పుడు అక్కడ గిర్ ఆవులు, లేగదూడల సంఖ్య దాదాపుగా 1,700కు పెరిగిందన్నారు. పంపిణీ చేసిన ఆవుకు దూడ పుడితే దానిని ఇతర ప్రాంతాల్లోని రైతులకు ఉచితంగా అందించే సరికొత్త సంప్రదాయం వారణాసిలో మొదలైందని, తద్వారా గో సంతతి పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ఏడెనిమిదేళ్ల కిందట ఆఫ్రికాలోని రువాండాలో తన పర్యటన సందర్భంగా 200 గిర్ ఆవులను ఆ దేశానికి భారత్ బహుమతిగా అందించిందని గుర్తు చేశారు. రువాండోలో సైతం ‘‘గిరింకా’’ పేరుతో ఇదే తరహా సంప్రదాయం ఉందన్నారు. ‘‘మీకు కూడా ఓ ఆవు ఉండాలి’’ అని దీని అర్థం. అక్కడ ఆవుకు జన్మించిన మొదటి పెయ్య దూడను పొరుగున ఉండే కుటుంబానికి ఇస్తారు. ఇది రువాండాలో పోషకాహారం, పాల ఉత్పత్తి, ఆదాయం, సామాజిక ఐక్యతను మెరుగుపరిచింది.
భారతీయ గిర్, కంక్రేజ్ జాతులను స్వీకరించి వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ నిర్వహణ ద్వారా అత్యుత్తమమైన పాడి పశువులుగా బ్రెజిల్ మలిచిందని ప్రధాని అన్నారు. ఈ ఉదాహరణలు సంప్రదాయం, కరుణ, శాస్త్రీయ ధోరణి కలసి ఆవును విశ్వాసం, సాధికారత, పోషకాహారం, ఆర్థిక ప్రగతికి ప్రతీకగా ఎలా మార్చవచ్చో వివరిస్తాయన్నారు. గొప్ప ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని ఇక్కడ ముందుకు తీసుకెళుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన భారత్ దిశగా దేశం ‘‘కర్తవ్య కాలం’’ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని, ఈ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడి చురుకైన భాగస్వామ్యం అవసరమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలు ప్రధాన స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ ప్రత్యేక సంవత్సరంలో ‘‘ఓకల్ ఫర్ లోకల్’’ మంత్రాన్ని బలోపేతం చేయాలని, అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించడానికి అవససరమైన స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఉత్పత్తులను కొనడం ద్వారా నేరుగా ఓ కుటుంబం, ఓ చిన్న వ్యాపార సంస్థ, స్థానిక సరఫరా వ్యవస్థను నేరుగా శక్తిమంతం అవుతాయని.. ఆత్మనిర్భర భారత్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా శ్రీ సత్య సాయి బాబా స్ఫూర్తితో జాతి నిర్మాణానికి నిరంతరాయంగా తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారని శ్రీమోదీ అంగీకరించారు. ఈ పవిత్ర భూమికి నిజంగా ఓ ప్రత్యేక శక్తి ఉందని - ప్రతి భక్తుని మాటలోనూ దయ, ఆలోచనల్లో శాంతి, చేతల్లో సేవ ప్రతిఫలిస్తున్నాయన్నారు. ఎక్కడైనా నష్టం లేదా బాధ ఉంటే.. అక్కడ ఆశా కిరణంలా భక్తులు నిలబడతారన్నారు. ఈ స్ఫూర్తితో ప్రేమ, శాంతి, సేవ అనే పవిత్ర కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి కుటుంబానికి, సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు, భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. ప్రసంగాన్ని ముగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శ్రీ కే రామ్మోహన్ నాయుడు, శ్రీ జీ కిషన్ రెడ్డి, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ఉన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా పవిత్ర క్షేత్రాన్ని, మహాసమాధిని ప్రధానమంత్రి సందర్శించి, నివాళులు అర్పించారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన జీవితాన్ని, బోధనలను, వారసత్వాన్ని గౌరవిస్తూ.. స్మారక నాణేన్ని, తపాలా బిళ్లలను విడుదల చేశారు.
*****
MJPS/SR
(रिलीज़ आईडी: 2191757)
आगंतुक पटल : 13