ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: ఢిల్లీలో జరిగిన ఆరో విడత రామ్‌నాథ్ గోయెంకా ఉపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
17 NOV 2025 10:16PM by PIB Hyderabad
వివేక్ గోయెంకా గారు, సోదరుడు అనంత్, జార్జ్ వర్గీస్ గారు, రాజ్‌కమల్ ఝా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లోని ఇతర సహచరులందరూ.. గౌరవ ప్రతినిధులు, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులకు, మహిళలు- పెద్దలూ..!
భారత ప్రజాస్వామ్యంలో జర్నలిజం, భావ వ్యక్తీకరణ, ప్రజా ఉద్యమాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తిని గౌరవించేందుకు ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. దార్శనికుడిగా, సంస్థలను నిర్మించే వ్యక్తిగా, దేశభక్తుడిగా, మీడియా నాయకుడిగా ఉన్న రామ్‌నాథ్ గారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం ఒక వార్తాపత్రికగానే కాకుండా భారత ప్రజలకు సంబంధించిన ఒక యజ్ఞంగా స్థాపించారు. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ.. భారత ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాలకు గొంతుకగా మారింది. ఈ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతున్నప్పుడు.. రామ్‌నాథ్ గోయెంకా గారి నిబద్ధత, ఆయన చేసిన కృషి, ఆయన దార్శనికత మనకు గొప్ప స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఈ ఉపన్యాసానికి నన్ను ఆహ్వానించినందుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విషయంలో మీ అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
భగవద్గీతలోని "సుఖ దుఃఖే సమే కృత్వా, లాభా-లాభౌ। జయా-జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ, నైవం పాపం అవాప్స్యసి।।" అనే శ్లోకం నుంచి రామ్‌నాథ్ గోయెంకా గారు గొప్ప స్ఫూర్తిని పొందారు. ‘సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలను సమానంగా చూస్తూ తన విధిని నిర్వర్తిస్తూ పోరాడాలి. అలా చేయడం ద్వారా పాపం కలగదు’ అనేది దీని అర్థం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రామ్‌నాథ్ గోయెంకా గారు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. తర్వాత జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. జనసంఘ్ టిక్కెట్‌పై ఎన్నికలలో కూడా పోటీ చేశారు. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఆయన ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. రామ్‌నాథ్ గారితో సంవత్సరాలుగా పనిచేసిన వాళ్లతో ఆయన పంచుకున్న అనేక కథలను చెబుతుంటారు. స్వాతంత్ర్యం తర్వాత హైదరాబాద్, రజాకార్ల అకృత్యాలకు తెగబడినపుడు రామ్‌నాథ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సహాయం చేశారు. 1970లలో బీహార్‌లో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం అవసరమైనప్పుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో కలిసి రామ్‌నాథ్ గారు జేపీని ఒప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి సన్నిహిత మంత్రి ఒకరు రామ్‌నాథ్ గారిని పిలిచి జైల్లో పెడతామంటూ బెదిరించినప్పుడు.. రామ్‌నాథ్ గారు ఇచ్చిన సమాధానం ఇప్పుడు చరిత్రలో దాగి ఉంది. కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి.. మరికొన్ని తెలియకుండా మిగిలిపోయాయి. కానీ ఈ కథలు ‘తనకు వ్యతిరేకంగా ఎంతటి శక్తిమంతమైన వ్యక్తులు నిలబడినా రామ్‌నాథ్ గారు ఎల్లప్పుడూ సత్యానికి అండగా నిలిచారు.. కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచారు’ అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి.
మిత్రులారా,
రామ్‌నాథ్ గారు చాలా అసహనంతో ఉండేవారని తరచుగా చెబుతుంటారు. ఇది ప్రతికూల అర్థంలో కాదు.. సానుకూల అర్థంలోనే. మార్పు కోసం ఒక వ్యక్తిని కష్టంలోకి నెట్టే అసహనం అది.. నిలిచి ఉన్న నీటిలో కూడా అలలను సృష్టించే అసహనం అది. ఇదే తరహాలో నేటి భారత్ కూడా అలాంటి అసహనంతో ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న అసహనంతో ఉంది. ఆత్మనిర్భర్ అయ్యేందుకు అసహనంగా ఉంది. 21వ శతాబ్దంలో మొదటి 25 సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయో మనమందరం చూశాం. భారీ సవాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మనకు అడ్డుగా వచ్చాయి. అయినప్పటికీ అవి భారత్ వేగాన్ని తగ్గించలేకపోయాయి.
మిత్రులారా,
ప్రపంచ మొత్తానికి గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఎంత సవాలుగా ఉన్నాయో మీరు చూశారు. 2020లో కరోనా వైరస్ సంక్షోభం వచ్చింది. అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అనిశ్చితికి గురయ్యాయి. ప్రపంచ సరఫరా గొలుసు తీవ్రంగా ప్రభావితమైంది. ప్రపంచం మొత్తం నిరాశ వైపు కదలడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత పరిస్థితి నెమ్మదిగా స్థిరపడటం ప్రారంభమైనప్పుడు.. మన పొరుగు దేశాలలో అల్లకల్లోలం మొదలైంది. ఈ సంక్షోభాలన్నింటి మధ్య మన ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటును సాధించింది. 2022లో ఐరోపా సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులు, ఇంధన మార్కెట్లు ప్రభావితమయ్యాయి. ఇది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపించింది. అయినప్పటికీ 2022–23లో కూడా మన ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి సాధించింది. 2023లో పశ్చిమ ఆసియాలో పరిస్థితి మరింత దిగజారినప్పుడు కూడా మన వృద్ధి రేటు బలంగానే ఉంది. ఈ సంవత్సరం కూడా ప్రపంచం అస్థిరతను ఎదుర్కొంటున్నప్పటికీ మన వృద్ధి రేటు ఇప్పటికీ సుమారు ఏడు శాతంగా ఉంది.
మిత్రులారా,
ప్రస్తుతం ప్రపంచం కల్లోల పరిస్థితులకు భయపడుతున్నప్పుడు.. ఒక సజీవ భవిష్యత్తు దిశగా భారత్ ముందుకు సాగుతోంది. ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వేదిక నుంచి నేను ‘భారత్ కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మాత్రమే కాదు.. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న నమూనా కూడా’ అని నేను ధైర్యంగా చెప్పగలను. ఇవాళ ప్రపంచం భారత వృద్ధి నమూనాను ఆశతో కూడిన నమూనాగా చూస్తోంది.
మిత్రులారా,
ఒక బలమైన ప్రజాస్వామ్యానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది.. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉంది.. వారు ఏ స్థాయి ఆశావాదులు అనేది ఎన్నికల సమయంలో అత్యంత స్పష్టంగా తెలుసుకోవచ్చు. నవంబర్ 14న వచ్చిన ఫలితాలు మీకు గుర్తు ఉండే ఉంటాయి. రామ్‌నాథ్ గారికి బీహార్‌తో కూడా సంబంధం ఉన్నందున.. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేది సబబు. ఈ చరిత్రాత్మక ఫలితాలతో పాటు మరొక చాలా ముఖ్యమైన అంశం కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యాన్ని ఎవరూ విస్మరించలేరు. బీహార్ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ ఈసారి నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతం కంటే మహిళల ఓటింగ్ దాదాపు 9 శాతం ఎక్కువగా ఉంది. దీని గురించి ఒక్క సారి ఆలోచించండి. ఇది కూడా ప్రజాస్వామ్య విజయమే.
మిత్రులారా,
బీహార్ ఫలితాలు మరోసారి భారత ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేశాయి. ఈ ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటానికి నిజాయితీగా పనిచేసే రాజకీయ పార్టీలను భారత ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇవాళ్టి ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వేదిక నుంచి నేను దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి.. అది లెఫ్ట్, రైట్, సెంటర్ లేదా ఏ సిద్ధాంతానికి చెందిన ప్రభుత్వమైనా సరే వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు ఈ రోజు నడిపించే ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే పాఠాన్ని బీహార్ ఫలితాలు మనకు నేర్పిస్తున్నాయి. బీహార్ ప్రజలు ఆర్‌జేడీ ప్రభుత్వానికి 15 సంవత్సరాలు ఇచ్చారు. లాలూ యాదవ్ గారు తలుచుకుంటే బీహార్ అభివృద్ధికి చాలా చేయగలిగేవారు. కానీ ఆయన 'జంగిల్ రాజ్' మార్గాన్ని ఎంచుకున్నారు. బీహార్ ప్రజలు ఈ ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రోజు కేంద్రంలో మన ప్రభుత్వం అయినా లేదా రాష్ట్రాలలో వివిధ పార్టీల ప్రభుత్వాలు అయినా మన అత్యున్నత ప్రాధాన్యత కేవలం అభివృద్ధి, అభివృద్ధి.. అభివృద్ధి మాత్రమే అయి ఉండాలి. అందుకే నేను ‘మీ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మెరుగైన వాతావరణాన్ని సృష్టించడానికి పోటీ పడండి.. వ్యాపారాన్ని సులభతరం చేయడంలో పోటీ పడండి.. అభివృద్ధి ప్రమాణాలలో ముందుకెళ్లేందుకు పోటీ పడండి.. అప్పుడు ప్రజలు మీపై ఎలా విశ్వాసం ఉంచుతారో మీరే చూడండి.’ అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాను.
మిత్రులారా,
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోదీ అభిమానులతో సహా మీడియాలోని కొంతమంది.. బీజేపీ, మోదీ 24 గంటలూ ఎన్నికల గురించే ఆలోచిస్తారని చెప్పటం మళ్లీ మొదలుపెట్టారు. నా విశ్వాసం ఏంటంటే.. ఎన్నికలలో గెలవడానికి ఎన్నికల ఆలోచనలో ఉండాల్సిన అవసరం లేదు… 24 గంటలు భావోద్వేగంతో ఉండటం అవసరం. మంచి చేయాలనే ఆలోచన మనసులో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయకూడదు. పేదల కష్టాలను తగ్గించేందుకు, పేదలకు ఉపాధి కల్పించడానికి, పేదలకు ఆరోగ్య సంరక్షణ అందించడానికి, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఈ విషయంలో నిరంతరాయంగా పని చేయాలి. ప్రభుత్వాన్ని నిరంతరం ఈ భావోద్వేగం, ఈ అనుభూతి నడిపించినప్పుడు.. వీటి ఫలితాలు ఎన్నికల రోజున స్పష్టంగా కనిపిస్తాయి. ఇది బీహార్‌లో కూడా జరగడం మనం ఇటీవలే చూశాం.
మిత్రులారా,
ఎవరో రామ్‌నాథ్ గారి కథను ఒకసారి ప్రస్తావించారు. జనసంఘ్ పార్టీ నుంచి విదిశ నియోజవర్గ టికెట్ లభించినప్పటికీ విషయం ఇది. సంస్థ ముఖ్యమా లేక వ్యక్తి ముఖమా అనే విషయంపై ఆయనా, నానాజీ దేశ్‌ముఖ్ చర్చిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చి, ఆ తర్వాత విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి మాత్రమే మళ్లీ వస్తే చాలని రామ్‌నాథ్ గారికి నానాజీ దేశ్‌ముఖ్ చెప్పారు. పార్టీ కార్యకర్తల బలంతో రామ్‌నాథ్ గారి తరఫున నానాజీ ఎన్నికలలో పోరాడారు. తద్వారా రామ్‌నాథ్ గారు విజయాన్ని నిర్ధారించారు. ఈ కథను ప్రస్తావించడం ద్వారా అభ్యర్థులు కేవలం నామినేషన్ కోసం మాత్రమే రావాలని చెప్పడం కాదు నా ఉద్దేశం. భాజపాకు ఉన్న అంకితభావం కలిగిన, విధి నిర్వహణకు కట్టుబడిన లెక్కలేనంత మంది కార్యకర్తల నిబద్ధత గురించి చెప్పటమే నా ఉద్దేశం.
మిత్రులారా,
లక్షలాది మంది భాజపా కార్యకర్తలు చెమటోడ్చి పార్టీ మూలాలను ధృడంగా చేశారు. ఈ రోజు కూడా వారు అదే పనిని కొనసాగిస్తున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో వందలాది కార్యకర్తలు రక్తంతో కూడా భాజపా అనే చెట్టు వేళ్లకు నీళ్లు పోశారు. అటువంటి అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీకి ఎన్నికలలో గెలవడం మాత్రమే లక్ష్యం కాదు. ఇలాంటి పార్టీ ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి సేవానిరతితో నిరంతరం పనిచేస్తుంది.
మిత్రులారా,
దేశం అభివృద్ధి చెందాలంటే పురోగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పథకాలు దళితులు, అణగారిన వర్గాలు, పీడితులు, వెనుకబడిన వారికి చేరినప్పుడు సామాజిక న్యాయం అందుతుంది. కానీ గత దశాబ్దాలలో కొన్ని పార్టీలు, కొన్ని కుటుంబాలు.. కేవలం సొంత ప్రయోజనాలను కాపుడుకునేందుకు మాత్రమే సామాజిక న్యాయం పేరును ఉపయోగించుకోవటం మనం చూశాం.
మిత్రులారా,
ఈ రోజు దేశంలో సామాజిక న్యాయం వాస్తవ రూపం దాల్చుతుండటం అనేది నాకు సంతృప్తిని ఇస్తోంది. నిజమైన సామాజిక న్యాయం అంటే ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బహిరంగ మల విసర్జన చేయాల్సి వచ్చిన పేద ప్రజల జీవితాలలో 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా గౌరవం వచ్చింది. గత ప్రభుత్వాలు బ్యాంక్ ఖాతాకు కూడా అర్హులుగా భావించని వారికి 57 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఆర్థిక సమ్మిళితాన్ని కల్పించాయి. పేదలకు అందించిన 4 కోట్ల పక్కా ఇళ్లు కొత్త కలల కనేందుకు వారి ధైర్యాన్ని, రిస్కు తీసుకునే వారి సామర్థ్యాన్ని పెంచాయి.
మిత్రులారా,
గత 11 సంవత్సరాలలో సామాజిక భద్రత విషయంలో చేసిన కృషి అసాధారణమైనది. నేడు భారతదేశంలో దాదాపు 94 కోట్ల మంది ప్రజలు సామాజిక భద్రతా వలయంలోకి వచ్చారు. 10 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? కేవలం 25 కోట్ల మంది ప్రజలు మాత్రమే సామాజిక భద్రతా పరిధిలో ఉండేవారు. నేడు ఆ సంఖ్య 94 కోట్ల మందికి చేరింది. దీని అర్థం.. .గతంలో కేవలం 25 కోట్ల మంది ప్రజలు మాత్రమే ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను పొందుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 94 కోట్లకు చేరింది. ఇదే నిజమైన సామాజిక న్యాయం. మేం సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించడమే కాకుండా 'సంతృప్త స్థాయి’ని సాధించేందుకు కృషి చేస్తున్నాం. అర్హులైన ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకూడదు. ఒక ప్రభుత్వం ఈ లక్ష్యంతో పనిచేసినప్పుడు.. ప్రతి లబ్ధిదారుడికి చేరుకోవాలని అనుకున్నప్పుడు ఏ విధమైన వివక్షకు అవకాశం ఉండదు. ఈ పనుల కారణంగా గత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారు. అందుకే ప్రజాస్వామ్యం ఫలితాలనిస్తుందని ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది.
మిత్రులారా,
నేను మీకు మరొక ఉదాహరణ చెప్తాను. మా ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని గమనించండి. గత ప్రభుత్వాలు వందకు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ముద్ర వేసి వాటిని మర్చిపోయాయి. ఈ ప్రాంతాలలో అభివృద్ధి చాలా కష్టమని, అటువంటి జిల్లాలలో కష్టపడి పనిచేయడానికి ఎవరు దృష్టి పెడతారని భావించేవారు? ఒక అధికారికి శిక్షించేందుకు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ వెనుకబడిన జిల్లాలకు పంపేవారు.. అక్కడే ఉండమని చెప్పేవారు. ఈ వెనుకబడిన జిల్లాలలో ఎంతమంది ప్రజలు నివసించేవారో మీకు తెలుసా? దేశంలోని 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ జిల్లాలలో నివసించేవారు.
మిత్రులారా,
ఈ వెనుకబడిన జిల్లాలు అలాగే ఉండిపోయి ఉంటే రాబోయే 100 సంవత్సరాలలో కూడా భారత్ అభివృద్ధి చెందగలిగేది కాదు. అందుకే మా ప్రభుత్వం ఒక కొత్త వ్యూహంతో పనిచేయడం మొదలుపెట్టింది. మేం రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తూ.. ఏ జిల్లా ఏ అభివృద్ధి ప్రమాణంలో వెనుకబడి ఉందో అధ్యయనం చేశాం. ప్రతి జిల్లా కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేశాం. దేశంలోని ఉత్తమ అధికారులను, వినూత్నంగా ఆలోచించే ప్రతిభావంతులైన యువ మేధావులను అక్కడ మోహరించి.. ఆ జిల్లాలను వెనుకబడినవిగా కాకుండా ఆకాంక్షిత ప్రాంతాలుగా పరిగణించాం. ఈ ఆకాంక్షిత జిల్లాలు ఇవాళ చాలా అభివృద్ధి ప్రమాణాల్లో ఆయా రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయో మీరు చూడొచ్చు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను ఉదాహరణగా తీసుకోండి. జర్నలిస్టులలో చాలా మందికి ఇది ఇష్టమైన అంశంగా ఉండేది. జర్నలిస్టులు ఒకప్పుడు అక్కడికి వెళ్లాలంటే ప్రభుత్వం నుంచి మాత్రమే కాకుండా ఇతర సంస్థల నుంచి కూడా అనుమతులు అవసరమయ్యేవి. కానీ అదే బస్తర్ ఈ రోజు అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోంది. బస్తర్ ఒలింపిక్స్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎంత కవరేజ్ ఇచ్చిందో నాకు తెలియదు కానీ.. ఈ రోజు బస్తర్ యువత బస్తర్ ఒలింపిక్స్ వంటి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారో చూసి రామ్‌నాథ్ గారు చాలా సంతోషించి ఉండేవారు.
మిత్రులారా,
బస్తర్‌ను ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ వేదికపై నుంచి నక్సలిజం, వామపక్ష తీవ్రవాదం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా నక్సలిజం, మావోయిస్టు హింస వేగంగా తగ్గిపోతోంది. అయితే అది కాంగ్రెస్ లోపల మాత్రం అంతే వేగంగా పెరుగుతోంది. గత ఐదు దశాబ్దాలుగా దేశంలోని దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్రం మావోయిస్టు హింసతో ప్రభావితమైందని మీ అందరికీ తెలుసు. కానీ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వామపక్ష తీవ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించటం, సమర్థించడం దేశం చేసుకున్న దురదృష్టం. కేవలం మారుమూల అటవీ ప్రాంతాల్లోనే కాకుండా నక్సలిజాన్ని నగరాల్లో కూడా కాంగ్రెస్ పెంచి పొషించింది. అనేక పెద్ద పెద్ద సంస్థలలో పట్టణ నక్సల్ సానుభూతిపరులను ఈ పార్టీ తయారుచేసింది.
మిత్రులారా,
10–15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌లోకి చొరబడిన పట్టణ నక్సలైట్లు, మావోయిస్టు శక్తులు ఇప్పుడు ఆ పార్టీని ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్‌గా మార్చేశాయి. ఇవాళ నేను పూర్తి బాధ్యతతో ‘ఈ ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను విస్మరించింది’ అని చెబుతున్నాను. ప్రస్తుతం ఉన్న ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్ దేశ ఐక్యతకు ఒక పెద్ద ముప్పుగా మారుతోంది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఒక కొత్త ప్రయాణాన్ని భారత్ ప్రారంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. రామ్‌నాథ్ గోయెంకా గారి వారసత్వం మరింత సందర్భోచితంగా మారుతోంది. బ్రిటీష్ నిరంకుశత్వంపై రామ్‌నాథ్ గారు గట్టి వైఖరి తీసుకున్నారు. బ్రిటీష్ ఆదేశాలను పాటించే బదులు తన వార్తాపత్రికను మూసివేయడానికి ఇష్టపడతానని ఆయనొక సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితి రూపంలో దేశాన్ని మళ్లీ బానిసగా చేయడానికి ప్రయత్నించినప్పుడు రామ్‌నాథ్ గారు బలంగా నిలబడ్డారు. ఈ సంవత్సరంతో అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. ప్రజలను బానిసలుగా చేయాలని చూసే ఆలోచనను ఖాళీ సంపాదకీయాలు కూడా సవాలు చేయగలవని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చూపించింది.
మిత్రులారా,
బానిస మనస్తత్వం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే అంశం గురించి ఇవాళ ఈ గౌరవనీయమైన వేదిక నుంచి నేను వివరంగా మాట్లాడుతాను. దీని కోసం మనం 190 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం కంటే వెనక్కు వెళ్లాలి. అదే 1835 సంవత్సరం. బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో భారతదేశ పునాదిని పెకిలించివేసేందుకు ఒక భారీ పథకాన్ని ప్రారంభించారు. రూపంలో భారతీయులుగా ఉంటూ ఆలోచన పరంగా ఆంగ్లేయులుగా ఉండే భారతీయులను తయారుచేస్తానని ఆయన ప్రకటించారు. దీనిని సాధించేందుకు భారతీయ విద్యా వ్యవస్థను కేవలం మార్చడమే కాకుండా.. మూలాల నుంచి ధ్వంసం చేశారు. భారత ప్రాచీన విద్యా వ్యవస్థ అందమైన చెట్టు లాంటిదని.. దానిని పెకిలించి నాశనం చేశారని మహాత్మాగాంధీ స్వయంగా చెప్పారు.
మిత్రులారా,
మన సంస్కృతి పట్ల గర్వంగా ఉండాలని మన విద్యా వ్యవస్థ మనకు నేర్పించింది. చదువుతో పాటు నైపుణ్యాలకు కూడా భారత విద్యా వ్యవస్థ సమాన ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే దేశ విద్యా వ్యవస్థ వెన్నెముకను విరిచేయాలని మెకాలే నిర్ణయించుకున్నారు. ఆయన ఈ లక్షాన్ని సాధించటంలో విజయవంతం అయ్యారు. ఆ సమయంలో బ్రిటీష్ భాష, బ్రిటీష్ ఆలోచనకు ఎక్కువ గుర్తింపు లభించేలా మెకాలే చూసుకున్నారు. అప్పటి నుంచి శతాబ్దాల పాటు దీనికి భారత్ మూల్యం చెల్లించింది.
మిత్రులారా,
మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశారు. ఆయన మనలో న్యూనతా భావాన్ని నింపారు. ఒక్క దెబ్బతో మన వేల సంవత్సరాల జ్ఞానం- విజ్ఞానాన్ని, మన కళ- సంస్కృతిని, మన మొత్తం జీవన విధానాన్ని చెత్తబుట్టలో పడేశారు. భారతీయులు పురోగమించాలంటే, ఏదైనా గొప్పది సాధించాలంటే విదేశీ పద్ధతుల ద్వారానే చేయాలనే బీజం ఆ క్షణంలోనే పడింది. ఈ భావన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మరింత బలపడింది. మన విద్య, మన ఆర్థిక వ్యవస్థ, మన సామాజిక ఆకాంక్షలు.. అన్నీ విదేశీ వ్యవస్థలకు కట్టుబడిపోయాయి. మనదైన దాని పట్ల గర్వంగా ఉండే భావన క్రమంగా తగ్గిపోయింది. గాంధీజీ స్వాతంత్య్రానికి పునాదిగా భావించిన స్వదేశీకి విలువ లేకుండా పోయింది. మనం పరిపాలనా పద్ధతులను విదేశాల్లో వెతకటం ప్రారంభించాం. ఆవిష్కరణల కోసం మనం విదేశాల వైపు చూడటం ప్రారంభించాం. దిగుమతి చేసుకున్న ఆలోచనలు, దిగుమతి చేసుకున్న వస్తువులు, దిగుమతి చేసుకున్న సేవలు ఉన్నతమైనవిగా పరిగణించే ధోరణికి ఈ మనస్తత్వం దారితీసింది.
మిత్రులారా,
ఒకరు సొంత దేశాన్ని గౌరవించనప్పుడు దేశీయ వ్యవస్థను తిరస్కరిస్తారు. అలాంటి వారు భారత్‌లోని తయారీ వ్యవస్థను ఒప్పుకోరు. నేను పర్యాటకానికి సంబంధించిన ఉదాహరణ మీకు చెప్తాను. పర్యాటకం అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ సొంత చారిత్రక వారసత్వం పట్ల స్థానిక ప్రజలు గర్వంగా ఉండటం మీరు గమనిస్తారు. మన విషయంలో దీనికి వ్యతిరేకంగా జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత మన వారసత్వాన్ని నిర్లక్ష్యం చేసే ప్రయత్నాలు జరిగాయి. వారసత్వం పట్ల గౌరవం లేనప్పుడు దానిని సంరక్షించేందుకు ప్రయత్నం జరగదు. సంరక్షణ అనేది లేనప్పుడు దానిని మనం కేవలం రాళ్లు, శిథిలాల వలె చూస్తాం. మనకు కూడా ఇదే జరిగింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటే మన వారసత్వం పట్ల తప్పనిసరిగా గర్వంగా ఉండాలి.
మిత్రులారా,
స్థానిక భాషల విషయంలో కూడా ఇదే నిజం. ఏ దేశంలోనైనా స్థానిక భాషలను తక్కువగా చూస్తారా? జపాన్, చైనా, కొరియా వంటి దేశాలు అనేక పాశ్చాత్య పద్ధతులను అవలంబించాయి కానీ వారు తమ భాషలను చెక్కుచెదరకుండా కాపాడుకున్నారు. వాళ్లు తమ భాషల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. అందుకే మేం కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలలో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. ‘మేం ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు.. మేం భారతీయ భాషలకు మద్దతుగా ఉన్నాం’ అనే విషయాన్ని నేను స్పష్టంగా చెబుతున్నాను.
మిత్రులారా,
1835లో మెకాలే ద్వారా ఈ నేరం జరిగింది. మరో పది సంవత్సరాల తర్వాత అంటే 2035లో ఈ నేరానికి 200 సంవత్సరాలు నిండుతాయి. ఇందుకే ఇవాళ నేను మీ ద్వారా దేశం మొత్తానికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.. రాబోయే 10 సంవత్సరాలలో మెకాలే బానిస మనస్తత్వం నుంచి మనం విముక్తి పొందాలని ప్రతిజ్ఞ చేయాలి. ఈ రాబోయే 10 సంవత్సరాలు మనకు అత్యంత ముఖ్యమైనవి. నాకు ఒక చిన్న సంఘటన గుర్తు ఉంది. గుజరాత్లో కుష్టురోగుల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ఆస్పత్రికి సంబంధించిన వాళ్లు మహాత్మాగాంధీ వద్దకు వెళ్లారు. కుష్టురోగుల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి తాను అనుకూలం కాదని గాంధీజీ చెప్పారు. “నేను ప్రారంభోత్సవానికి రాను. కానీ ఆ ఆసుపత్రిని శాశ్వతంగా మూసేయాల్సి వచ్చినప్పుడు నన్ను పిలవండి. నేను వచ్చి తాళం వేస్తాను” అని గాంధీజీ అన్నారు. గాంధీజీ జీవితకాలంలో ఆ ఆసుపత్రికి తాళం పడలేదు. కానీ కుష్టువ్యాధి రహితంగా గుజరాత్ మారినప్పుడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆసుపత్రికి తాళం వేసే అవకాశం నాకు లభించింది. ఆస్పత్రికి తాళం వేయాలని గాంధీజీ కోరుకున్నట్లే.. 1835లో ప్రారంభమైన ఈ ప్రయాణం 2035 నాటికి ముగియాల్సి ఉంది. ఈ మనస్తత్వానికి మనం శాశ్వతంగా తాళం వేయడం అనేది కూడా నా కల.
మిత్రులారా,
ఈ రోజు మనం అనేక అంశాల గురించి మాట్లాడుకున్నం. నేను మీ సమయాన్ని మరింతగా తీసుకోదలచుకోలేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు మన దేశంలోని ప్రతి పరివర్తన, ప్రతి వృద్ధి కథనానికి సాక్షిగా ఉంది. 'వికసిత భారత్'గా మారాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్నప్పుడు.. ఈ గ్రూపు మరోసారి ఈ ప్రయాణంలో ఒక భాగమైంది. రామ్‌నాథ్ గారి ఆలోచనలు, ఆదర్శాలను పూర్తి అంకితభావంతో పరిరక్షించేందుకు మీరు చేస్తున్న నిజాయితీతో కూడిన ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమం పట్ల మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామ్‌నాథ్ గోయెంకా గారికి గౌరవపూర్వక నమస్కారాలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
***
(Release ID: 2191212)
Visitor Counter : 5