సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫీ 2025లో ఏడుగురు భారతీయ, అంతర్జాతీయ దర్శకుల తొలి చిత్రాల ప్రదర్శన
ప్రపంచ సినిమా రంగంలో కొత్త వారికి ప్రోత్సాహం: ఇఫీ 2025లో ఉత్తమ తొలి దర్శకుడు పురస్కారం
అంతర్జాతీయ సినిమాలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) 2025లో ఉత్తమ డెబ్యూ ఫీచర్ చిత్ర దర్శకుడు విభాగంలో అయిదు అంతర్జాతీయ, రెండు భారతీయ సినిమాలను ప్రదర్శిస్తారు.
విజేతగా నిలిచిన వారికి రజత మయూరం, రూ. 10 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
చలన చిత్ర రంగ ప్రముఖులతో ఏర్పాటు చేసిన జ్యూరీ విజేతను ఎంపిక చేస్తుంది. ఈ జ్యూరీకి ప్రముఖ భారతీయ దర్శకుడు రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా అధ్యక్షత వహిస్తుండగా.. గ్రేమ్ క్లిఫోర్డ్ (ఎడిటర్, దర్శకుడు, ఆస్ట్రేలియా), క్యాథరినా షట్లర్ (నటి, జర్మనీ), చంద్రన్ రత్నం (దర్శకుడు, శ్రీలంక), రేమీ ఎడేఫరాసిన్ (సినిమాటోగ్రాఫర్, ఇంగ్లడ్) సభ్యులుగా ఉన్నారు.
ప్రతి ఏడాది లాగే ఈ సారి ఎంపిక చేసిన సినిమాలు తొలిసారి దర్శకత్వం వహించిన వారి ప్రతిభను, తర్వాతి తరం కథకుల సినిమా ఆలోచనలను అంతర్జాతీయంగా ప్రదర్శిస్తాయి.
ఫ్రాంక్
హృదయాన్ని కదిలించే యువకుని కథతో ఎస్టోనియన్ దర్శకుడు టోనిస్ పిల్ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ ఆడియన్స్ - ష్లింగెల్ 2025లో ప్రదర్శించారు. అక్కడ ఫిప్రెస్కీ జ్యూరీ బహుమతితో సహా వివిధ పురస్కారాలకు నామినేట్ అయింది.
తీవ్రమైన గృహహింస ఎదుర్కొన్న 13 ఏళ్ల పాల్ ఇంటి నుంచి పారిపోయి కొత్త నగరానికి చేరుకుంటాడు. అక్కడ ఒంటరిగా బతుకుతున్న అతడు చెడు మార్గాల్లోకి వెళతాడు. భవిష్యత్తు సుడిగుండంలా మారుతున్న సమయంలో.. అసాధారణమైన, దివ్యాంగుడైన ఓ అపరిచిత వ్యక్తితో ఏర్పడిన అనుబంధం అతడి జీవిత గమనాన్ని మార్చేస్తుంది.
విచ్ఛిన్నమైన కుటుంబాలను, చిన్ననాటి గాయాలు నిశ్శబ్దంగా కలిగించే బాధను, అసాధారణ స్నేహానికున్న పరివర్తన శక్తిని ఈ చిత్రంలో సున్నితంగా తెరకెక్కించారు.
ఫ్యూరీ (ఒరిజినల్ టైటిల్: లా ఫ్యూరియా)
స్పానిష్ దర్శకురాలు గెమ్మా బ్లాస్కో తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం ఫ్యూరీ.. ధైర్యం నిండిన కొత్త స్వరాన్ని మనకు వినిపిస్తుంది. ఎస్ఎక్స్ఎస్డబ్ల్యూ చిత్రోత్సవం 2025, శాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సశం 2025లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
నూతన సంవత్సర వేడుకల్లో అత్యాచారానికి గురైన నటి అలెగ్జాండ్రా.. మెడియా అనే పాత్ర ద్వారా తన బాధను వ్యక్తం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమెను రక్షించడంలో విఫలమైనందుకు ఆమె సోదరుడు ఆడ్రియన్ గ్రాపెల్స్ అపరాధ భావం, ఆగ్రహంతో పోరాడుతుంటాడు.
హింసాత్మకమైన, పితృస్వామ్య సమాజంలో అత్యాచార బాధితులు ఎదుర్కొంటున్న భయం, అవమానం, ద్వేషం, అపరాధ భావనను సరికొత్త స్త్రీవాద దృక్పథంలో ఈ చిత్రం చూపించింది.
కార్లా
జర్మన్ దర్శకురాలు క్రిస్టినా టోర్నాట్జెస్ తొలి చిత్రం కార్లాను మ్యూనిచ్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. అక్కడ ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ స్క్రీన్ రైటర్‌గా రెండు పురస్కారాలను సొంతం చేసుకుంది.
1962లో మ్యూనిచ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 12 ఏళ్ల కార్లా తన కథను చెబుతుంది. ఏళ్ల తరబడి తండ్రి నుంచి ఎదుర్కొంటున్న హింస నుంచి రక్షణ కోరుతూ.. ఆమె కేసు నమోదు చేస్తుంది.
సున్నితత్వం, అట్మాస్పియరిక్ సినిమాటోగ్రఫీతో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఓ చిన్నారి బాధితురాలి గాథను ఆమె మాటల్లోనే చెబుతుంది. కార్లా చిత్రం ద్వారా సున్నితత్వం, స్పష్టత, తీవ్రతతో చెప్పలేని అంశాలను వివరించే సినిమాటిక్ భాషను టోర్నాట్జెస్ రూపొందించారు.
మై డాటర్స్ హెయిర్ (ఒరిజినల్ టైటిల్ - రాహా)
లఘు చిత్రాలు, డాక్యుమెంటరీల ద్వారా ప్రసిద్ధి పొందిన ఇరానియన్ దర్శకుడు హేసమ్ ఫరాహ్మండ్.. రాహాతో ఓ సామాజిక గాథను తెరపైకి తీసుకువచ్చారు.
సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవడం కోసం తన కూతురి జుట్టు అమ్మిన తోహిద్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది ఆ కుటుంబానికి చిన్న ఆనందమే. కానీ ల్యాప్‌టాప్ కోసం ఓ సంపన్న కుటుంబం వీరితో పోటీపడినప్పుడు జరిగే వరుస గొడవలు సమాజంలోని వర్గ విబేధాలను బహిర్గతం చేస్తాయి.
వాస్తవ పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది.. నైతిక విలువలు మృగ్యమైపోయిన, న్యాయం దుర్బలంగా మారిన ప్రపంచాన్ని ఫరాహ్మండ్ తెరకెక్కించారు. గౌరవం, పోరాటం, మనుగడల నిశ్శబ్ద వ్యయానికి సంబంధించి ఎలాంటి బెరుకూ లేని సార్వత్రిక కథగా ఈ చిత్రం మారింది.
ది డెవిల్ స్మోక్స్ (అండ్ సేవ్స్ ది బర్న్ట్ మ్యాచెస్ ఇన్ ది సేమ్ బాక్స్)
(ఒరిజినల్ టైటిల్ - ఎల్ డియాబ్లో ఫ్యూమా (వై గార్డా లాస్ కాబెజాస్ డె లాస్ సెరిల్లోస్ క్యుమడోస్ ఎన్ లా మిస్మా కజ))
మెక్సికన్ దర్శకుడు ఎర్నెస్టో మార్టినెజ్ బూసియో రూపొందించిన తొలి చిత్రం.. బెర్లిన్ అంతరర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో తొలి పర్స్పెక్టివ్స్ పోటీలో గెలిచింది.
తల్లిదండ్రులు వదిలేసిన తర్వాత తమను తాము పోషించుకోవాల్సి వచ్చిన అయిదుగురు తోబుట్టువుల కథ ఇది. స్క్రీజోఫీనియాతో బాధపడుతున్న బామ్మ అస్థిరమైన ఆలోచనల్లో వారి ఆందోళనలను కనిపిస్తాయి. ఒకరికొరు దూరం కాకుండా ఉండేందుకు ఊహకు, వాస్తవానికి మధ్య ఉన్న రేఖను చెరిపేస్తారు.
ఈ ఉత్కంఠభరితమైన కథనం ద్వారా.. బాల్యంలో ఎదురయ్యే భయాలు, స్వభావాలకు సంబంధించిన పదునైన, భీతిగొలిపే ఆలోచనలను ఈ చిత్రం అందిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉండటమనే సుపరిచితమైన కథాంశాన్ని భయం, భ్రమ, మనుగడకు సంబంధించిన లోతైన మానసిక అధ్యయనంగా ఈ చిత్రం మారుస్తుంది.
షేప్ ఆఫ్ మోమో
భారతీయ దర్శకురాలు త్రిబేణి రాయ్ తొలి చిత్రమైన షేప్ ఆఫ్ మోమో ఈ చలన చిత్రోత్సవాల్లో పోటీపడుతోంది. కేన్స్ 2025 లో ‘హెచ్ఏఎఫ్ గోస్ టు కేన్స్’లో ప్రదర్శనకు ఎంపికైన అయిదు ఆసియా చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఈ చిత్రాన్ని బూసన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. శాన్ సెబాస్టియన్లో ఈ చిత్రం న్యూ డైరెక్టర్స్ పురస్కారానికి నామినేట్ అయింది.
సిక్కిం నేపథ్యంగా నేపాలీ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం బిష్ణు అనే యుమతి చుట్టూ తిరుగుతుంది. వివిధ తరాలకు చెందిన, ఉదాసీనతలో కూరుకుపోయిన మహిళలున్న తన కుటుంబానికి తిరిగి వస్తుంది. తనకు, తన వారికి స్వేచ్ఛను తీసుకురావాలని నిశ్చయించుకొని పితృస్వామ్యం ఏర్పాటు చేసిన అడ్డంకులను బద్దలుగొడుతుంది. తద్వారా వాటిని అనుసరించాలా, తిరస్కరించాలా అని మహిళలే నిర్ణయించుకొనేలా చేస్తుంది.
సంప్రదాయానికి, స్వేచ్ఛకు, కుటుంబాల్లో నిశ్శబ్దంగా చెలరేగే విప్లవాలకు ప్రతిరూపమే షేప్ ఆఫ్ మోమో.
అటా తంబైచ నే! (ఆంగ్ల టైటిల్ - నౌ, దేర్ ఈజ్ నో స్టాపింగ్!)
నటుడు శివరాజ్ వైచల్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ మరాఠీ చిత్రం.. క్లాస్ IV ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన యదార్థ గాథ. అంకితభావం కలిగిన అధికారిని చూసి స్ఫూర్తి పొంది పదో తరగతి పరీక్షలు రాయడానికి తిరిగి పాఠశాలకు వెళ్లాలని వారు నిర్ణయించుకుంటారు.
హాస్యం, భావోద్వేగాలతో అందంగా అల్లిన ఈ కథ.. స్థిరత్వం, పని పట్ల గౌరవం, విద్యకున్న పరివర్తనాత్మక శక్తిని తెలియజేస్తుంది. అలాగే నేర్చుకోవడానికి, కలలు కనడానికి లేదా తిరిగి ప్రారంభించడానికి ఎప్పుడూ సమయం మించిపోలేదని నిరూపిస్తుంది.
***
(Release ID: 2188586)
Visitor Counter : 3