|
సహకార మంత్రిత్వ శాఖ
పట్టణ సహకార రుణ రంగంపై న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ‘కో-ఆప్ కుంభ్-2025’లో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
· “నాఫ్కబ్’ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఆమోదించే ‘ఢిల్లీ డిక్లరేషన్-2025’ పట్టణ సహకార బ్యాంకుల విస్తరణకు ప్రణాళికగా ఉపయోగపడుతుంది” · “సహకార్ డిజీ-పే’… సహకార్ డిజీ-లోన్’ యాప్‌లను ప్రారంభించిన అంబ్రెల్లా ఆర్గనైజేషన్: డిజిటల్ విప్లవంలో సహకార రంగ భాగస్వామ్యానికి ఇవి ప్రతీకలు కాగలవు” · “మోదీ ప్రభుత్వ హయాంలో పట్టణ సహకార బ్యాంకులు.. సహకార రుణ పరపతి సంఘాలు కొత్త ఉత్సాహంతో ముందడుగు వేశాయి” · “రాబోయే ఐదేళ్లలో 2 లక్షలకు పైగా జనాభా గల ప్రతి నగరంలో ఓ పట్టణ సహకార బ్యాంకు ఏర్పాటవుతుంది” · “సహకార రంగ ఆధునికీకరణ… సమస్యల పరిష్కారం సహా దాని పరిధి విస్తరణకు సహకార మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది” · “గడచిన రెండేళ్ల వ్యవధిలో నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ)ను 2.8 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గించడంలో మేం విజయం సాధించాం” · “చిన్న వ్యాపారులు.. వ్యాపారవేత్తలు.. యువతరం అభ్యున్నతికి పట్టణ సహకార బ్యాంకులు బాటలు వేస్తాయి” · “సహకార రంగానికి సంబంధించి అమూల్.. ఇఫ్కో సంస్థలు ప్రపంచ స్థాయిలో ప్రథమ.. ద్వితీయ స్థానాల్లో నిలవడం సహకార సంస్థల ఔచిత్యానికి నిదర్శనం”
Posted On:
10 NOV 2025 5:46PM by PIB Hyderabad
పట్టణ సహకార రుణ రంగంపై న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ‘కో-ఆప్ కుంభ్-2025’లో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొనడంతోపాటు హాజరైన వారినుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర సహకార శాఖ సహాయమంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్, కార్యదర్శి సహా అనేకమంది ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ సహకార సంవత్సరంలో భాగంగా పట్టణ సహకార బ్యాంకులు, సహకార రుణ పరపతి సంఘాలతో ప్రస్తుత ‘సహకార కుంభ్’ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని పట్టణ సహకార బ్యాంకింగ్ రంగం, సహకార రుణపరపతి రంగాలు గడచిన మూడునాలుగేళ్లుగా నవ్యవోత్సాహంతో ముందడుగు వేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ రంగం సంబంధిత అనేక అవకాశాల సద్వినియోగం దిశగా విధానం, సాంకేతికత, ఆవిష్కరణలపై ‘కో-ఆప్ కుంభ్-2025’లో చర్చలు సాగుతాయని ఆయన తెలిపారు. పట్టణ సహకార బ్యాంకులు, సహకార రుణపరపతి సంఘాల జాతీయ సమాఖ్య (నాఫ్కబ్) నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు ఆమోదించే ‘ఢిల్లీ డిక్లరేషన్-2025’ పట్టణ సహకార బ్యాంకుల విస్తరణకు ఒక ప్రణాళిక కాగలదని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా పట్టణ సహకార బ్యాంకుల విస్తరణపై తమ కలలు ‘కో-ఆప్ కుంభ్-2025’ ద్వారా అతి త్వరలో సాకారం కాగలవని శ్రీ అమిత్ షా ఆశాభావం వెలిబుచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ ‘సహకార్ డిజీ-పే’, సహకార్ డిజీ-లోన్’ అనువర్తనాలను అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ప్రారంభించిందని ఆయన అన్నారు. ‘డిజీ-పే’ యాప్ ద్వారా అతి చిన్న పట్టణ సహకార బ్యాంకులు కూడా డిజిటల్ చెల్లింపు సౌకర్యం కల్పించగలవని తెలిపారు.
దేశంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన నాటినుంచీ సహకార సంస్థల సంబంధిత ప్రతి అంశంలోనూ ప్రాథమిక మార్పులు తేవడం కోసం మోదీ ప్రభుత్వం అనేక కీలక విధాన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి గుర్తుచేశారు. దీంతోపాటు సహకార రంగ ఆధునికీకరణ, సమస్యల పరిష్కారం సహా సహకార సంస్థల పరిధి విస్తరణకూ ప్రధాని అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా (పీఏసీఎస్)లకు సంబంధించిన నమూనా విధివిధానాలను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
సహకార మంత్రిత్వ శాఖ ప్రస్తుతం నాలుగు లక్ష్యాలను నిర్దేశించుకున్నదని శ్రీ అమిత్ షా అన్నారు. వీటిలో మొదటిది ‘భావితరం సహకారాభివృద్ధి’… దీనికింద యువతరాన్ని సహకార ఉద్యమంతో అనుసంధానించడమని వివరించారు. ఇందుకోసమే ‘త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహకార రంగంలోని అన్ని రకాల అవసరాలనూ ఇది తీరుస్తుంది. ఇక రెండోది- అన్నిరకాల సమస్యను పరిష్కరించగలిగేలా సహకార సంఘాల సామర్థ్యం పెంచడమని ఆయన అన్నారు. రాబోయే ఐదేళ్లలోగా 2 లక్షలకుపైగా జనాభా గల ప్రతి నగరంలో ఒక పట్టణ సహకార బ్యాంకును ఏర్పాటు చేయడం మూడో లక్ష్యమని చెప్పారు. యువ ఔత్సాహికులు, స్వయం సహాయ సంఘాలు, సమాజంలోని బలహీన వర్గాల సాధికారత కోసం బహుళ రంగ విధానంతో పట్టణ సహకార బ్యాంకులు తమ కీలక విధులను నిర్వహించాలని శ్రీ అమిత్ షా తెలిపారు. సహకార సంస్థల బలోపేతం తమ నాలుగో లక్ష్యమని, అదే సమయంలో బలహీన వర్గాల బలోపేతం కూడా ఇందులో భాగమని తెలిపారు. పట్టణ సహకార బ్యాంకులు తప్ప మరే ఇతర సంస్థలూ ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పట్టణ సహకార బ్యాంకుల ద్వారా ఆర్థికంగా బలహీనులైన వ్యక్తులకు సాధికారత కల్పించడం కూడా ఒక లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు.
గడచిన రెండేళ్లలో నిరర్ధక ఆస్తులను 2.8 శాతం నుంచి 0.06 శాతానికి తగ్గించడంలో తాము విజయం సాధించామని కేంద్ర సహకార శాఖ మంత్రి అన్నారు. దీంతోపాటు కార్యాచరణ ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు ఆర్థిక క్రమశిక్షణలో ఇప్పటికే సాధించిన విజయాలను మరింత పటిష్ఠం చేయాల్సి ఉందన్నారు. సహకార సంఘాలను బ్యాంకులుగా మార్చే దిశగా కృషి చేస్తేనే ప్రతి నగరంలో ఒక పట్టణ సహకార బ్యాంకు స్థాపన సాధ్యం కాగలదన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు మాత్రమే మన ప్రగతిని ప్రతిబింబించజాలవని ఆయన చెప్పారు. వాటితోపాటు ప్రతి వ్యక్తికీ పని లభించే విధంగానూ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగానూ చూసుకోవాలని సూచించారు. సహకార సంఘాల పాత్ర లేకుండా ఈ లక్ష్యం సాధించడం సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సహకార సంస్థల భావనతోపాటు వాటి ప్రాధాన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై పారదర్శకంగా, ఫలితాల సాధన ప్రాతిపదికగా సరికొత్త విశ్వాసం, కృషి అవసరమని శ్రీ అమిత్ షా అన్నారు.
మన దేశంలోని ‘అమూల్, ఇఫ్కో’ సంస్థలు అంతర్జాతీయ సహకార కూటమి ప్రపంచ ర్యాంకింగ్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు. సహకార సంఘాల ఆలోచన, సంస్కృతి నేటికీ పాతబడలేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో శ్వేత విప్లవానికి అమూల్ సారథ్యం వహించిందని, తన పరిధిలోని 36 లక్షల మంది పాడిరైతులు, 18,000 గ్రామ సంఘాలు, 18 జిల్లా సంఘాల ద్వారా ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిత్యం 3 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2024–25 ఆర్థిక సంవత్సరం అమూల్ సంస్థ వార్‌షిక వ్యాపార పరిమాణం రూ.90,000 కోట్లు దాటిందని గుర్తుచేశారు. 36 లక్షల మంది పాడి రైతులలో 65 శాతానికిపైగా మహిళలు కావడం ఈ సందర్భంగా గమనార్హమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. స్వల్పస్థాయి వ్యక్తిగత సహకారంతో అనేక ఏళ్లుగా ఇంత పెద్ద సహకార సంస్థను విజయవంతంగా నిర్వహిస్తుండటం విశేషమని అభివర్ణించారు. మన దేశంలో సహకార సంస్థలకు అందుబాటులోగల విస్తృత సామర్థ్యాన్ని ఈ పరిణామాం ప్రతిబింబిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
మన ‘ఇఫ్కో’ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సహకార సంస్థగా పరిగణన పొందడం గర్వకారణమని కేంద్ర సహకార మంత్రి అన్నారు. ఈ సంస్థ రూ.41,000 కోట్ల వార్షిక వ్యాపార పరిమాణంతోపాటు రూ.3,000 కోట్ల లాభాలను నమోదు చేసిందని గుర్తుచేశారు. ‘ఇఫ్కో’ సహకార సంఘాల సాముదాయక సంస్థ కాగా, దేశంలోని 35,000 సహకార సంఘాలు (వీటిలో అధికశాతం ‘పీఏసీఎస్’లు), మార్కెటింగ్ సంబంధిత సంఘాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సంఘాల ద్వారా 5 కోట్ల మందికిపైగా రైతులు ‘ఇఫ్కో’లో సభ్యులయ్యారని తెలిపారు. ఈ సంస్థ ఇవాళ 93 లక్షల టన్నుల యూరియా, ‘డీఏపీ’ ఉత్పత్తి చేస్తూ దేశంలో హరిత విప్లవానికి మూలస్తంభంగా నిలిచిందన్నారు. ‘ఇఫ్కో’ తయారుచేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ ఇప్పుడు బ్రెజిల్, ఓమన్, అమెరికా, జోర్డాన్ సహా 65 దేశాలకు ఎగుమతి అవుతున్నదని ఆయన తెలిపారు.
***
(Release ID: 2188577)
|