ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారతీయ రైల్వేల తదుపరి తరానికి పునాది వేస్తోన్న వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు: ప్రధాని
వికసిత్ భారత్ కోసం దేశంలో వనరులను మెరుగుపరిచేందుకు ప్రారంభమైన మిషన్: ప్రధాని
ఆ ప్రయాణంలో కీలకంగా ఉండనున్న ఈ రైళ్లు: ప్రధాని
వందే భారత్ నెట్‌వర్క్ ద్వారా ఇప్పుడు అనుసంధానమౌతోన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు: ప్రధాని
భారతీయ సంస్కృతి, విశ్వాసం, అభివృద్ధి ప్రయాణాల కలయికను సూచిస్తోన్న ఈ అనుసంధానత: ప్రధాని
వారసత్వ నగరాలను జాతీయ ప్రగతికి చిహ్నాలుగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు: ప్రధాని
प्रविष्टि तिथि:
08 NOV 2025 10:15AM by PIB Hyderabad
భారతదేశ ఆధునిక రైలు మౌలిక సదుపాయాల విస్తరణలో మరో ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. విశ్వనాథుని పవిత్ర నగరమైన వారణాసి స్థానిక కుటుంబాలందరికీ గౌరవ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల దేవ్ దీపావళి సందర్భంగా జరిగిన అసాధారణ వేడుకలను ఆయన గుర్తు చేశారు. ఈ రోజు కూడా ఒక శుభ సందర్భమని పేర్కొన్న ఆయన.. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తి ధృడమైన మౌలిక సదుపాయాలేనని ప్రధానమంత్రి అన్నారు. గణనీయమైన ప్రగతి, అభివృద్ధిని సాధించిన ప్రతి దేశంలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది కీలక పాత్ర పోషించిందని ప్రధానంగా చెప్పారు. భారత్ కూడా ఈ మార్గంలో వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ దేశంలోని వివిధ ప్రాంతాలలో కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. బనారస్–ఖజురహో వందే భారత్‌తో పాటు ఫిరోజ్‌పూర్–ఢిల్లీ వందే భారత్, లక్నో–సహారన్‌పూర్ వందే భారత్, ఎర్నాకులం–బెంగళూరు వందే భారత్‌లను ఆయన ప్రారంభించారు. ఈ నాలుగు కొత్త రైళ్లతో దేశంలో నడుస్తున్న మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య ఇప్పుడు 160కి పైగా చేరుకుంది. ఈ రైళ్ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని వారణాసి ప్రజలకు, దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
"వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు భారతీయ రైల్వేల తదుపరి తరానికి పునాది వేస్తున్నాయి" అని వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి.. ఇది భారతీయ రైల్వేను పూర్తిగా మార్చేసే సమగ్ర చర్య అని ఉద్ఘాటించారు. వందే భారత్ అనేది భారతీయుల కోసం భారతీయులు తయారు చేసిన భారతీయ రైలని అన్నారు. ఇది ప్రతి భారతీయుడిని గర్వంతో నింపుతుందని ఆయన అభివర్ణించారు. వందే భారత్‌ను చూసి విదేశీ ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. వికసిత్ భారత్ కోసం దేశ వనరులను మెరుగుపరిచేందుకు ఒక మిషన్ ప్రారంభమైందని, ఈ ప్రయాణంలో ఈ రైళ్లు కీలక ఘట్టాలుగా నిలవబోతున్నాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
భారతదేశంలో తీర్థయాత్రలు శతాబ్దాలుగా జాతీయ చైతన్యానికి మాధ్యమంగా ఉన్నాయన్న ప్రధాని.. ఈ ప్రయాణాలు కేవలం దైవ దర్శనాలకు మాత్రమే కాదని, భారతదేశ ఆత్మతో అనుసంధానమయ్యే పవిత్ర సంప్రదాయాలని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్రలను దేశ వారసత్వంలోని ఆధ్యాత్మిక కేంద్రాలని అన్నారు. "ఈ పవిత్ర స్థలాలు ఇప్పుడు వందే భారత్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానమౌతున్నాయి. ఇది భారత సంస్కృతి, విశ్వాసం, అభివృద్ధి ప్రయాణం కలయికను సూచిస్తోంది. వారసత్వ నగరాలను జాతీయ ప్రగతికి చిహ్నాలుగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
భారతదేశంలో తరచుగా విస్మరణకు గురయ్యే తీర్థయాత్రల ఆర్థిక కోణాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గత 11 సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్థయాత్రలను మరో స్థాయికి తీసుకెళ్లాయని అన్నారు. గత ఒక్క సంవత్సరంలోనే 11 కోట్ల మంది భక్తులు కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వారణాసిని సందర్శించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తైనప్పటి నుంచి 6 కోట్ల మందికి పైగా ప్రజలు శ్రీ రాముని మందిరాన్ని సందర్శించారు. ఈ యాత్రికులు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయలను అందించారని మోదీ తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, వ్యాపారులు, రవాణా సంస్థలు, స్థానిక కళాకారులు, పడవ నడిపేవారికి నిరంతర ఆదాయ అవకాశాలను కల్పించిందని అన్నారు. ఫలితంగా వారణాసిలో వందలాది మంది యువత ఇప్పుడు రవాణా సేవల నుంచి మొదలుకొని బనారసి చీరల వ్యాపారాల వరకు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు ఉత్తరప్రదేశ్‌తో పాటు వారణాసిలో శ్రేయస్సుకు ద్వారాలు తెరిచాయని అన్నారు.
అభివృద్ధి చెందిన వారణాసి ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశం అనే మంత్రాన్ని సాకారం చేసేందుకు నగరంలో నిరంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. వారణాసిలో నాణ్యమైన ఆసుపత్రుల ఏర్పాటు- విస్తరణ- గుణాత్మక మెరుగుదల, మెరుగైన రహదారులు, గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ అనుసంధానత విషయంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. రోప్‌వే ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని.. గంజారి, సిగ్రా స్టేడియాల వంటి క్రీడా మౌలిక సదుపాయాలు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వారణాసిని సందర్శించడం, ఇక్కడ గడపటం, ఇక్కడి అనుభూతిని పొందడం అనేది అందరికీ ఒక ప్రత్యేకమైన మంచి అనుభవంగా మార్చడమే లక్ష్యమని ప్రధాని ఉద్ఘాటించారు.
ప్రభుత్వం వారణాసిలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచేందుకు నిరంతరం కృషి చేస్తోందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 10-11 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితిని గుర్తు చేశారు. తీవ్ర ఆరోగ్య సమస్యల కోసం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) మాత్రమే ఏకైక మార్గంగా ఉండేదని.. అధిక సంఖ్యలో రోగుల కారణంగా రాత్రంతా వేచి ఉన్నా చాలా మంది చికిత్స పొందలేకపోయేవారని ఆయన అన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధుల విషయంలో చికిత్స కోసం ప్రజలు భూములు, పొలాలను అమ్మి ముంబయి వెళ్లాల్సి వచ్చేదని వివరించారు. తమ ప్రభుత్వం ఈ సమస్యను తగ్గించేందుకు కృషి చేసిందన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం మహామన క్యాన్సర్ ఆసుపత్రి, కంటికి సంబంధించి శంకర్ నేత్రాలయ, బీహెచ్‌యూ వద్ద అధునాతన ట్రామా కేంద్రం సెంటెనరీ ఆస్పత్రి, పాండేపూర్‌లోని డివిజనల్ ఆస్పత్రి వంటి సంస్థలు వారణాసి, పూర్వాంచల్, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వరంగా మారాయని తెలిపారు. ఈ ఆస్పత్రులలో ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాల కారణంగా లక్షలాది మంది పేద వ్యాధిగ్రస్థులు కోట్ల రూపాయలను ఆదా చేసుకుంటున్నారన్నారు. ఇది ప్రజలకు ఉన్న ఆందోళనను తగ్గించడమే కాకుండా వారణాసి మొత్తం ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందేందుకు దారితీసిందని వ్యాఖ్యానించారు.
వారణాసి అభివృద్ధి విషయంలో ఉత్తేజాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. తద్వారా నగర శ్రేయస్సు వేగంగా పెరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుని పవిత్ర నగరమైన వారణాసిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రతి సందర్శకుడు ఒక ప్రత్యేకమైన శక్తి, ఉత్సాహాం, ఆనందాన్ని పొందాలనే ఆలోచన ఉందని మోదీ అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులను కలిసిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ సమయంలో విద్యార్థుల మధ్య పోటీలు ఏర్పాటు చేసే పద్ధతిని ప్రవేశపెట్టినందుకు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ను ఆయన ప్రశంసించారు. వికసిత్ భారత్, వికసిత్ కాశీ, సురక్షిత్ భారత్ వంటి వివిధ ఇతివృత్తాల ఆధారంగా పోటీలో వచ్చిన చిత్రాలు, కవితలకు సంబంధించి ఆయన పిల్లలను మెచ్చుకున్నారు. పోటీల పాల్గొన్న వారికి అందించిన మద్దతు, మార్గదర్శకత్వం, ప్రోత్సాహానికి గాను ప్రధాని.. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలకు సాహిత్య పోటీలు నిర్వహించి, దీనిలో గెలిచిన 8-10 మందిని దేశవ్యాప్తంగా ఇతర పోటీల కోసం తీసుకెళ్లాలని ఆయన ప్రతిపాదించారు. ఇంత ప్రతిభావంతులైన పిల్లలు ఉన్న వారణాసి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్.. కేంద్ర మంత్రులు శ్రీ సురేష్ గోపి, శ్రీ జార్జ్ కురియన్, శ్రీ రవ్‌నీత్ సింగ్ బిట్టు.. ఇతర ప్రముఖులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం-
4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించటం అనేది ప్రజలకు ప్రపంచ స్థాయి రైల్వే సేవల ద్వారా సులభమైన, వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని సాకారం చేయడంలో మరో కీలక ముందడుగుగా ఉంటుంది. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బనారస్–ఖజురహో, లక్నో–సహారన్‌పూర్, ఫిరోజ్‌పూర్–ఢిల్లీ, ఎర్నాకులం–బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. ప్రధాన గమ్యస్థానాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ రైళ్లు ప్రాంతీయ రవాణాను పెంచుతాయి… పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి.. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయి.
బనారస్–ఖజురహో మార్గంలో వందే భారత్ రైలు ప్రత్యక్ష అనుసంధానానతను ఇస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే దాదాపు 2 గంటల 40 నిమిషాల సమయాన్ని ఇది ఆదా చేస్తుంది. బనారస్–ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని అత్యంత పూజ్యనీయమైన మత, సాంస్కృతిక కేంద్రాలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహోలను కలుపుతుంది. ఈ అనుసంధానత మత, సాంస్కృతిక పర్యాటకాన్ని బలోపేతం చేస్తుంది. దీనితో పాటు తీర్థయాత్రికులు, ప్రయాణికులకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ఆధునిక ప్రయాణాన్ని అందిస్తుంది.
లక్నో–సహారన్‌పూర్ వందే భారత్ రైలు.. ప్రయాణాన్ని సుమారు 7 గంటల 45 నిమిషాలలో పూర్తి చేస్తుంది. ఇది ఇతర రైళ్లతో పోల్చితే దాదాపు 1 గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. లక్నో–సహారన్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నూర్, సహారన్‌పూర్ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా రూర్కీ మీదుగా హరిద్వార్ పవిత్ర నగరానికి కూడా మెరుగైన అనుసంధానతను అందిస్తుంది. మధ్య, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సౌకర్యవంతమైన, వేగవంతమైన ఇంటర్‍సిటీ ప్రయాణాన్ని అందించటం ద్వారా ఇది.. అనుసంధానత, ప్రాంతీయ అభివృద్ధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఫిరోజ్‌పూర్–ఢిల్లీ మార్గంలో నడవనున్న వందే భారత్.. ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలుగా ఉంటుంది. ఇది ప్రయాణాన్ని కేవలం 6 గంటల 40 నిమిషాలలో పూర్తి చేస్తుంది. ఫిరోజ్‌పూర్–ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రాజధానిని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, బఠిండా, పాటియాల వంటి ముఖ్య నగరాలను కలుపుతూ ఆయ ప్రాంతాల మధ్య అనుసంధానతను బలోపేతం చేస్తుంది. ఈ రైలు వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలను పెంచటంతో పాటు సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని, జాతీయ మార్కెట్‌లతో మరింత ఏకీకరణను ప్రోత్సహిస్తుందన్న అంచనా ఉంది.
దక్షిణ భారతదేశంలో ఎర్నాకులం–బెంగళూరు వందే భారత్ రైలు ప్రయాణ సమయాన్ని 2 గంటలకు పైగా తగ్గిస్తుంది. ఇది ప్రయాణాన్ని కేవలం 8 గంటల 40 నిమిషాలలో పూర్తి చేస్తుంది. ఎర్నాకులం–బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను అనుసంధానిస్తుంది. నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ రైలు కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. దీనితో పాటు ఇది ప్రాంతీయ వృద్ధి, సహకారాన్ని మెరుగుపరుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2188170)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam