సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ బజార్ సహకారంతో 12వ బిగ్ పిక్చర్ సమ్మిట్-2025లో అంతర్జాతీయ మీడియా - వినోద పెట్టుబడిదారుల సమావేశం: సీఐఐ ప్రకటన
· భారత మీడియా, వినోద రంగంలో సరికొత్త అవకాశాలకు నాంది పలకనున్న సీఐఐ, వేవ్స్ బజార్
Posted On:
07 NOV 2025 4:10PM by PIB Hyderabad
2025 డిసెంబరు 1-2 తేదీల్లో ముంబయిలో నిర్వహించనున్న 12వ వార్షిక బిగ్ పిక్చర్ సమ్మిట్‌లో ‘సీఐఐ అంతర్జాతీయ మీడియా - వినోద పెట్టుబడిదారుల సమావేశా’న్ని ప్రారంభించనున్నట్టు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రకటించింది. వేవ్స్ బజార్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పెట్టుబడులను కంపెనీలతో అనుసంధానించి ఈ రంగంలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారత మీడియా, వినోద రంగం సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం దీని లక్ష్యం.
ఈ సమావేశం కోసం ఎలారా క్యాపిటల్‌ను ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్‌గా, విట్రినాను గ్లోబల్ ఫైనాన్సింగ్ పార్టనర్‌గా సీఐఐ ప్రకటించింది. మీడియా, వినోద రంగంలో బిజినెస్ నెట్‌వర్కింగుతోపాటు పెట్టుబడిదారుల అన్వేషణ (ప్రాజెక్ట్ పిచింగ్)కు వేవ్స్ బజార్ ప్రధాన వేదికగా ఉంది. విజయవంతమైన తన వాణిజ్య సమావేశ (బి 2 బి) రీతులు, ప్రాజెక్టు ప్రదర్శనల (ప్రస్తుత ప్రాజెక్టులు, వేవ్స్ ఫిల్మ్ బజార్‌లోని కార్యక్రమాలు)ను సదస్సు సందర్భంగా సీఐఐ మార్కెట్ ప్లేస్‌తో అది అనుసంధానిస్తుంది.
సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ ఇతివృత్తం ‘ఏఐ శకం: సృజన, వాణిజ్యాల నడుమ వారధి (ది ఏఐ ఎరా: బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్).’ ఇది ప్రభుత్వ నేతలు, వాణిజ్యాధినేతలను ఒక్క చోట చేర్చి.. భారత మీడియా - వినోద రంగం అభివృద్ధి, ఈ రంగంలో గణనీయమైన మార్పుల దిశగా ప్రణాళికలు రూపొందిస్తారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ఎండీ, సీఈవో గౌరవ్ బెనర్జీతోపాటు జెట్ సింథసిస్ సీఈవో రాజన్ నవానీ, యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోనీ, (సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎం అండ్ ఈ ఆఫీస్ బేరర్లు) సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్‌కు అధ్యక్షత వహిస్తున్నారు.
సీఐఐ మీడియా - వినోద అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశంలో.. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, దేశంలోని అత్యంత లాభదాయక ప్రాజెక్టులకు మధ్య వ్యక్తిగత సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగంలోకి (చలనచిత్ర, స్ట్రీమింగ్, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్, ఇతర విభాగాలు) ఈ కార్యక్రమం ద్వారా.. అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులు వేగవంతం కానున్నాయి.
“భారత మీడియా, వినోద పరిశ్రమకు ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ.. అది ప్రధానంగా వ్యక్తిగత అభిరుచి, ప్రైవేటు పెట్టుబడిపైనే ఆధారపడి అభివృద్ధి చెందింది. ఆ పరిస్థితిలో మార్పు దిశగా సీఐఐ పెట్టుబడిదారుల సమావేశం ప్రధాన ముందడుగు’’ అని సీఐఐ అంతర్జాతీయ మీడియా, వినోద పెట్టుబడిదారుల సదస్సు చైర్మన్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఈవో, భారత నిర్మాతల సంఘం అధ్యక్షుడు శుభాషిశ్ సర్కార్ అన్నారు. “మొదటిసారిగా ప్రపంచ పెట్టుబడిదారులను, భారతీయ మీడియా, వినోద సంస్థలను ప్రత్యేక, మౌఖిక పద్ధతిలో ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం. ఇది సాధారణ ప్రదర్శన మాత్రమే కాదు... భారతీయ సంస్థలు ఆకర్షణీయమైన, లాభదాయకమైన పెట్టుబడులుగా నిలుస్తాయని నిరూపించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశ కార్యక్రమమిది. ఓ ప్రయాణానికి నాందిగా నేను దీన్ని చూస్తున్నాను.”
“సీఐఐ మీడియా, వినోద అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఎలారా క్యాపిటల్ భాగస్వామ్యం వహించడం సంతోషాన్నిస్తోంది. మీడియా, వినోద రంగంలోని పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలను ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా... ఈ రెండు పరిశ్రమల మధ్య అత్యుత్తమ సమన్వయ సహకాకారాలు సాధ్యమవుతాయని ఆశిస్తున్నాం” అని ఎలారా క్యాపిటల్ ఎండీ హరేంద్ర కుమార్ అన్నారు.
“ఈ కీలక కార్యక్రమం సందర్భంగా సీఐఐ, మీడియా – వినోద పెట్టుబడిదారుల సమావేశంలో భాగస్వామ్యం వహించడం విట్రినాకు గర్వకారణం” అని విట్రినా సీఈవో అతుల్ ఫడ్నిస్ అన్నారు. “భారత మీడియా, వినోద రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. సరైన పెట్టుబడిదారులను సరైన అవకాశాలతో అనుసంధానించడం ద్వారా.. అంతర్జాతీయ వేదికపై భారత సమర్థతను చాటడమే మా లక్ష్యం.”
‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్’ భారత మీడియా, వినోద పరిశ్రమ ప్రధాన వార్షిక సమావేశం. ఈ రంగంలో వృద్ధి, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా విధాన రూపకర్తలు, పరిశ్రమ మార్గనిర్దేశకులు, పెట్టుబడిదారులు, సృజనకారులను సమావేశపరుస్తుంది. సదస్సులో భాగంగా.. సీఐఐ మార్కెట్ ప్లేస్, వేవ్స్ బజార్ ప్రత్యేక వాణిజ్య సమావేశాలను (బి 2 బి) ఏర్పాటు చేస్తాయి. కో ప్రొడక్షన్ అవకాశాల కోసం పారిశ్రామిక ప్రముఖులు, కొనుగోలుదారులు, విక్రేతలు, కంటెంట్ సృజనకారులను ఒక్కచోట చేరుస్తుంది.
అంకుర సంస్థల మధ్య సహకారం, వ్యాపార అభివృద్ధి దిశగా ఓ క్రియాశీల వాతావరణం లక్ష్యంగా.. ఈ సదస్సులో వేవ్ ఎక్స్, వేవ్స్ క్రియేటోస్పియర్ కూడా భాగస్వామ్యం వహిస్తాయి.
ముఖ్యమైన లింకులు:
వేవ్స్ బజార్: https://wavesbazaar.com/
(Release ID: 2188169)
Visitor Counter : 3