ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
08 NOV 2025 11:20AM by PIB Hyderabad
హర హర మహాదేవ!
నమః పార్వతీ పతయే!
హర హర మహాదేవ!
పరిపాలన దక్షుడైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, వికసిత భారత నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తున్న అద్భుత సాంకేతిక ప్రగతికి సారథ్యం వహిస్తున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు.. టెక్నాలజీ సాయంతో ఎర్నాకులం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ గారు.. కేంద్రంలోని నా సహచరులు సురేశ్ గోపీ గారు, జార్జ్ కురియన్ గారు.. కేరళలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. కేంద్రంలో నా సహచరుడు, పంజాబ్ నాయకుడు, ఫిరోజ్‌పూర్ నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అక్కడి ప్రజా ప్రతినిధులు.. లక్నో నుంచి పాల్గొంటున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ గారు.. ఇతర విశిష్ట అతిథులు.. కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులారా!
బాబా విశ్వనాథుడు కొలువై ఉన్న ఈ పవిత్ర నగరంలో.. మీ అందరికీ, కాశీలోని ప్రతి కుటుంబానికి నా నమస్కారాలు. వైభవోపేతమైన దేవ్ దీపావళి వేడుకలను నేనిక్కడ చూశాను. నేడు కూడా శుభప్రదమైన రోజు. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు!
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో బలమైన మౌలిక సదుపాయాలే వారి ఆర్థిక పురోగతికి ప్రధాన కారణం. గణనీయమైన వికాసాన్ని, అభివృద్ధిని సాధించిన ప్రతి దేశంలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధే వారి పురోగతికి చోదక శక్తి. ఉదాహరణకు సంవత్సరాలుగా రైల్వే లైన్, ట్రాక్‌లు, రైళ్లు, స్టేషన్ లేని ఓ ప్రాంతాన్నే ఊహించండి.. అదెలా ఉంటుందో.. కానీ పట్టాలు వేసి, స్టేషన్ నిర్మించగానే, వెంటనే ఆ పట్టణం అభివృద్ధి మొదలవుతుంది. ఏళ్ల తరబడి సరైన రోడ్లు ఉండవు. గ్రామస్థులకు బురద రోడ్లే గతి. కానీ ఒక్కసారి చిన్న రోడ్డు నిర్మిస్తే రైతులు సులభంగా ప్రయాణించడానికి వీలవుతుంది. వారి ఉత్పత్తులు మార్కెట్లకు చేరుతాయి. మౌలిక వసతులంటే పెద్ద వంతెనలు, హైవేలు మాత్రమే కాదు. అలాంటి సదుపాయాలు అభివృద్ధి చెందితే ఆ ప్రాంత వికాసం మొదలవుతుంది. మన గ్రామాలు, చిన్న పట్టణాలు, దేశం మొత్తానికీ అది వర్తిస్తుంది. నిర్మిస్తున్న విమానాశ్రయాల సంఖ్య, నడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్య, భారత్‌ను ప్రపంచంతో అనుసంధానించే అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరగడం... ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధితో ముడిపడి ఉన్నాయి. నేడు భారత్ కూడా ఈ మార్గంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఇదే స్ఫూర్తితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నాం. కాశీ–ఖజురహో వందే భారత్‌తో పాటు.. ఫిరోజ్‌పూర్– ఢిల్లీ వందే భారత్, లక్నో – సహరాన్‌పూర్ వందే భారత్, ఎర్నాకుళం– బెంగళూరు వందే భారత్‌లు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ నాలుగు కొత్త రైళ్లతో ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 160 దాటింది. ఈ విజయం పట్ల కాశీ ప్రజలకు, దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
నేడు వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు తదుపరి తరం భారతీయ రైల్వేలకు పునాదిగా నిలుస్తున్నాయి. భారతీయ రైల్వేల్లో విప్లవాత్మక మార్పుల దిశగా ఇదొక సంపూర్ణ కార్యక్రమం. వందే భారత్ రైలు భారతీయుల కోసం, భారతదేశంలో భారతీయులు తయారు చేసినది. అది ప్రతి భారతీయుడికీ గర్వకారణం. “మనం నిజంగా ఇలా చేయగలమా? ఇది విదేశాల్లో మాత్రమే జరిగే విషయం కాదా? ఇక్కడ కూడా ఇలా జరుగుతుందా?” అని గతంలో ఆలోచించేవారు. ఇదిప్పుడు జరుగుతోంది. అవునా, కాదా? ఇది మన దేశంలోనే జరుగుతోందా, లేదా? మన దేశంలో, మన సొంత ప్రజలే దీన్ని తయారు చేస్తున్నారా, లేదా? ఇదే మన దేశ బలం. నేడు విదేశీ ప్రయాణికులు కూడా వందే భారత్ రైలును చూసి ఆశ్చర్యపోతున్నారు. వికసిత భారత్ లక్ష్యం దిశగా సామర్థ్యాల అభివృద్ధి కోసం భారత్ ప్రారంభించిన ప్రస్థానంలో ఈ రైళ్లు కీలక విజయం.
మిత్రులారా,
శతాబ్దాలుగా భారత్‌లో తీర్థయాత్రలను దేశ చేతనా మాధ్యమంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రయాణాలు కేవలం దైవ దర్శన మార్గాలు మాత్రమే కాదు.. భారతీయ ఆత్మను అనుసంధానించే పవిత్ర సంప్రదాయాలివి. ప్రయాగరాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్ర వంటి ప్రదేశాలు, అసంఖ్యాకంగా ఉన్న ఇతర తీర్థయాత్రా స్థలాలు మన ఆధ్యాత్మిక వారసత్వానికి కేంద్రాలు. నేడు ఈ పవిత్ర ప్రదేశాలను వందే భారత్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించడమంటే.. అది భారత సంస్కృతిని, విశ్వాసాన్ని, అభివృద్ధిని కూడా అనుసంధానించడమే. భారత వారసత్వ నగరాలను దేశ పురోగతికి చిహ్నాలుగా నిలిపే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.
మిత్రులారా,
ఈ తీర్థయాత్రల్లో ఆర్థిక కోణం కూడా ఉంది. దాన్ని చాలావరకూ అంతగా గుర్తించరు. గత పదకొండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి పనులు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పూర్తిగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. ఒక్క పోయిన ఏడాదిలోనే 11 కోట్ల మంది బాబా విశ్వనాథుని దర్శనం కోసం కాశీని సందర్శించారు. రామాలయం నిర్మించినప్పటి నుంచి 6 కోట్లకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు పొందారు. ఈ యాత్రికులు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయలను అందించారు. హోటళ్ళు, వ్యాపారులు, రవాణా సంస్థలు, స్థానిక కళాకారులు, పడవ నడిపేవారికి వారు ఎప్పటికప్పుడు ఆదాయ అవకాశాలను అందించారు. ఫలితంగా బనారస్‌లోని వందలాది మంది యువత రవాణా సేవల నుంచి బనారసి చీరల వరకు, అలాగే అనేక ఇతర కొత్త వ్యాపారాలను నేడు మొదలుపెడుతున్నారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్‌ను, ముఖ్యంగా కాశీని సుసంపన్నం చేస్తున్నాయి.
మిత్రులారా,
‘వికసిత భారత్ ద్వారా వికసిత కాశీ’ని సాకారం చేయడం లక్ష్యంగా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మేమిక్కడ చేపడుతున్నాం. నేడు కాశీలో ఆసుపత్రులు, రోడ్లు, గ్యాస్ పైప్లైన్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తరణ పెరుగుతున్నాయి. సంఖ్యలకే పరిమితం కాకుండా, అభివృద్ధి ద్వారా గుణాత్మక ఫలితాలూ వస్తున్నాయి. రోప్ వే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. గంజరి, సిగ్రా స్టేడియం వంటి క్రీడా మౌలిక సదుపాయాలూ అందుబాటులోకి వస్తున్నాయి. బనారస్ సందర్శన, బనారస్‌లో నివాసం, బనారస్‌లో సదుపాయాలను అనుభూతి చెందడం ప్రతి ఒక్కరికీ విశిష్టమైన, ప్రత్యేకమైన అనుభవాన్నివ్వాలన్న లక్ష్యంతో మేం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
కాశీలో ఆరోగ్య రక్షణ సేవలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఓ 10-11 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదంటే.. ప్రజలకు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తితే బనారస్ హిందూ విశ్వవిద్యాలయమే దిక్కుగా ఉండేది. రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో.. రాత్రంతా క్యూ లైన్లలో నిలబడినా చాలామంది చికిత్స పొందలేకపోయేవారు. ఎవరికైనా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే.. కుటుంబాలు తమ భూములను, పొలాలను అమ్ముకుని చికిత్స కోసం ముంబయికి వెళ్లాల్సి వచ్చేది. నేడు మా ప్రభుత్వం కాశీ ప్రజల ఈ ఆందోళనల పరిష్కారానికి కృషి చేసింది. క్యాన్సర్ చికిత్స కోసం మహామన క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పాం. కంటి సంరక్షణ కోసం శంకర్ నేత్రాలయ, బీహెచ్‌యూలో అత్యాధునిక ట్రామా సెంటర్, శతాబ్ది ఆసుపత్రి, అలాగే పాండేపూర్‌లో డివిజనల్ ఆసుపత్రి... ఇవన్నీ కాశీ, పూర్వాంచల్‌కే కాకుండా పొరుగు రాష్ట్రాలకూ వరంలా మారాయి. ఆయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్రాల కారణంగా.. లక్షలాది పేదలకు నేడు తమ వైద్య ఖర్చుల కోసం చేసే కోట్లాది రూపాయలు ఆదా అవుతున్నాయి. ఇది ఓ వైపు ప్రజల ఆందోళనలను తగ్గించడమే కాకుండా.. మరోవైపు కాశీ ఇప్పుడు ఈ ప్రాంత ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందుతోంది.
మిత్రులారా,
కాశీ అభివృద్ధిలో ఈ ఉత్తేజాన్ని, శక్తిని మనం తప్పక కొనసాగించాలి. తద్వారా ఈ గొప్ప, దివ్య నగరం అనతికాలంలోనే సుసంపన్నంగానూ మారుతుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరు కాశీని సందర్శించినా... బాబా విశ్వనాథుడి ఈ పవిత్ర నగరంలో ఓ విశిష్ట శక్తిని, ప్రత్యేక ఉత్సాహాన్ని, సాటిలేని ఆనందాన్ని వారు అనుభూతి చెందుతారు.
మిత్రులారా,
కొద్దిసేపటి కిందటే వందే భారత్ రైలులో నేను కొందరు విద్యార్థులతో మాట్లాడాను. అశ్వినీ వైష్ణవ్ గారిని నేను అభినందిస్తున్నాను. ఓ అద్భుత సంప్రదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఎక్కడ వందే భారత్ రైలును ప్రారంభించినా.. అభివృద్ధి, వందే భారత్, వికసిత భారత్ దార్శనికతకు సంబంధించి వివిధ ఇతివృత్తాలపై పాఠశాల పిల్లలకు చిత్రలేఖనం, కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. సాధన చేసేందుకు పిల్లలకు కొన్ని రోజులే ఉన్నప్పటికీ.. వారి సృజనాత్మకత నన్నెంతో ఆకట్టుకుంది. వికసిత కాశీ, వికసిత భారత్, సురక్షిత భారత్‌లను వర్ణించే చిత్రలేఖనాలను వారు వేశారు. 12 - 14 ఏళ్ల వయస్సున్న చిన్నారులు రాసిన కవితలను కూడా నేను విన్నాను. ఎంత అందమైన, ఆలోచనాత్మకమైన పద్యాలవి! ఇంత ప్రతిభావంతులైన పిల్లలు నా కాశీకి చెందినవారు కావడం ఇక్కడి పార్లమెంటు సభ్యుడిగా నాకు గర్వకారణం. నేను వారిలో కొంతమందిని ఇక్కడ కలిశాను. ఓ పిల్లవాడు చేయి లేకపోయినప్పటికీ అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. పిల్లలకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేసిన ఈ పాఠశాలల ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి ప్రతిభను, ఉత్సాహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలు. నిజానికి ఈ పిల్లల కోసం ఇక్కడ 'కవి సమ్మేళనం' నిర్వహించాలని, 8-10 మంది ఉత్తమ యువ కవులను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా వారి కవితలను పంచుకోవాలని నాకు ఆలోచన వచ్చింది. కాశీ ఎంపీగా ఈ రోజు నాకిది స్ఫూర్తిదాయకమైన అనుభవం. నిజంగా నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఈ పిల్లలకు నా హృదయపూర్వక ప్రశంసలు, అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా,
ఈ రోజు నేను అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. అందుకే ఇక్కడ ఓ చిన్న కార్యక్రమాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. నేను త్వరలోనే బయల్దేరాలి కూడా.. కానీ మీలో చాలా మంది ఉదయాన్నే ఇక్కడ సమావేశమవడం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. నేటి ఈ కార్యక్రమం సందర్భంగా, కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు!
హర హర మహాదేవ!
***
(Release ID: 2188161)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam