ప్రధాన మంత్రి కార్యాలయం
ఏడాది పొడవునా సాగే ‘వందే మాతరం’ 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని నవంబరు 7న ప్రారంభించనున్న ప్రధాని
· దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం పూర్తి గేయాలాపన
· ఈ సందర్భంగా స్మారక స్టాంపు, నాణేలను విడుదల చేయనున్న ప్రధాని
Posted On:
06 NOV 2025 2:47PM by PIB Hyderabad
ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ గేయం ‘వందేమాతరం’ సంస్మరణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 నవంబర్ 7న ఉదయం 9:30 గంటల సమయంలో ప్రారంభిస్తారు.
ఒక స్మారక స్టాంపును, నాణేన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా విడుదల చేస్తారు. స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి.. నేటికీ దేశ కీర్తిని, ఐక్యతను పెంపొందిస్తున్న చిరతరమైన ఈ గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా... 2025 నవంబరు 7 నుంచి 2026 నవంబరు 7 వరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించే సంస్మరణోత్సవానికి అధికారిక ప్రారంభంగా ఈ కార్యక్రమం నిలవనుంది.
ఈ ఉత్సవాల్లో భాగంగా, ప్రధాన కార్యక్రమంతోపాటే ఉదయం 9:50 గంటల సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో.. బహిరంగ ప్రదేశాల్లో ‘వందే మాతరం’ పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
2025తో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. మన జాతీయ గేయం ‘వందే మాతరా’న్ని 1875 నవంబరు 7న అక్షయ నవమి శుభ వేళ బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఆయన నవల ఆనందమఠ్‌లో భాగంగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారి కనిపించింది. బలానికి, శ్రేయస్సుకు, దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం.. దేశ ఐక్యత, ఆత్మగౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ. అనతికాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచింది.
***
(Release ID: 2186998)
Visitor Counter : 28
Read this release in:
Assamese
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam