ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 03 NOV 2025 12:37PM by PIB Hyderabad

మన మధ్య ఉన్న కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ గారు, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారులు అజయ్ కుమార్ సూద్ గారు, నోబెల్ బహుమతి గ్రహీత సర్ ఆండ్రీ గీమ్ గారు, హాజరైన అందరు శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, దేశవిదేశాల నుంచి వచ్చిన ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా!
ఈరోజు జరిగే కార్యక్రమం సైన్స్‌కు సంబంధించింది. అయితే ముందుగా నేను క్రికెట్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడతాను. యావత్ భారతం తమ క్రికెట్ జట్టు విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఇది భారత మహిళల జట్టుకు మొట్టమొదటి ప్రపంచ కప్. మన మహిళా క్రికెట్ జట్టును నేను అభినందిస్తున్నాను. మేం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం. మీ విజయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది.
మిత్రులారా,
నిన్న భారత శాస్త్ర సాంకేతిక రంగం విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఇప్పటివరకు భారత్ ప్రయోగించిన వాటిలోకెల్లా అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు నిన్న విజయవంతంగా ప్రయోగించారు. ఈ మిషన్‌తో అనుబంధం ఉన్న శాస్త్రవేత్తలందరిని, ఇస్రోనూ నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగానికి ఒక ముఖ్యమైన రోజు. ఈ 21వ శతాబ్దపు సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా కలిసి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌పై మేధోమథనం చేయాల్సిన అవసరముంది. వారంతా కలిసికట్టుగా ఈ విషయంలో మార్గదర్శనం చేయాలి. ఈ అవసరం ఒక ఆలోచనను రేకెత్తించింది. ఆ ఆలోచన నుంచే ఈ సదస్సు దార్శనికతకు బీజం పడింది. ఈ సదస్సు రూపంలో ఆ దార్శనికత రూపుదిద్దుకుంటున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. అనేక మంత్రిత్వ శాఖలు, ప్రైవేటు రంగం, అంకురసంస్థలు, విద్యార్థులు ఈ ప్రయత్నంలో ఐక్యంగా ఉన్నారు. ఈ రోజు మన మధ్య ఒక నోబెల్ గ్రహీత కూడా ఉండటం మనకు గౌరవప్రదమైన విషయం. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ సదస్సు విషయంగా మీ అందరికీ శుభాకాంక్షలు.
మిత్రులారా,
21వ శతాబ్దపు ఈ యుగం అత్యంత అపూర్వమైన మార్పుల కాలం. మనం ప్రపంచ క్రమంలో ఈ రోజు కొత్త మార్పును చూస్తున్నాం. ఈ మార్పు వేగం సరళంగా కాదు... ఘాతాంకాలుగా సాగుతోంది. ఈ ఆలోచన ద్వారానే భారత్ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌కు సంబంధించిన ఈ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తోంది.... దానిపై నిరంతరం దృష్టి సారిస్తోంది. పరిశోధన రంగానికి కేటాయిస్తున్న నిధులు దీనికి ఒక మంచి ఉదాహరణ. మీ అందరికీ చాలా కాలంగా 'జై జవాన్, జై కిసాన్' దార్శనికత బాగా తెలిసిందే. పరిశోధనపై దృష్టి సారిస్తూనే మేం దానికి జై విజ్ఞాన్-జై అనుసంధాన్‌లనూ జోడించాం. మన విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, ఆవిష్కరణలను విస్తరించడానికి మేం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. దీంతో పాటు పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల పథకాన్నీ మేం ప్రారంభించాం. దీని కోసం రూ. 1 లక్ష కోట్లు జమ చేశాం. ఈ రూ. 1 లక్ష కోట్లు మోదీజీ తోనే ఉంటాయని మీరు అనుకుంటున్నారేమో... అందుకే మీరు చప్పట్లు కొట్టడం లేదు.... ఈ లక్ష కోట్ల రూపాయలు మీ కోసం, మీ సామర్థ్యాలను పెంపొందించడం కోసం, మీకు కొత్త అవకాశాలను అందుబాటులో ఉంచడం కోసం. ప్రైవేటు రంగంలోనూ పరిశోధనాభివృద్ధిని ప్రోత్సహించడం మా లక్ష్యం. మొదటిసారిగా అధిక-ముప్పు, అధిక-ప్రభావం గల ప్రాజెక్టుల కోసమూ మూలధనం అందుబాటులో ఉంచాం.
మిత్రులారా,
దేశంలో ఆవిష్కరణల కోసం ఆధునిక వ్యవస్థను సృష్టించేందుకు మేం పరిశోధనలను సులభతరం చేయడంపై దృష్టి సారించాం. ఈ దిశగా మా ప్రభుత్వం ఆర్థిక నిబంధనలు, సేకరణ విధానాల్లో అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రోటోటైప్‌లను ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు సాధ్యమైనంత త్వరగా తరలించేలా నిబంధనలు, ప్రోత్సాహకాలు, సరఫరా వ్యవస్థల్లోనూ మేం సంస్కరణలు చేపట్టాం.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాలుగా దేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి అమలు చేసిన విధానాలు, నిర్ణయాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. నేను చాలా సంతృప్తితో మీ ముందు కొన్ని గణాంకాలను ఉంచాలనుకుంటున్నాను. నేను స్వభావరీత్యా సులభంగా సంతృప్తి చెందే వ్యక్తిని కాకపోయినా... నా ఈ సంతృప్తి గడిచిన కాలానికి సంబంధించినది... భవిష్యత్తు సందర్భంలోనూ నాకు ఇంకా చాలా సంతృప్తి మిగిలి ఉంది. నేను చాలా విజయాలను చూడాల్సి ఉంది. గత దశాబ్దంలో మా పరిశోధనాభివృద్ధి వ్యయం రెట్టింపయింది. దేశంలో నమోదైన పేటెంట్ల సంఖ్య 17 రెట్లు... ఏకంగా 17 రెట్లు పెరిగింది. అంకుర సంస్థల్లోనూ భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా మారింది. మా డీప్-టెక్ అంకుర సంస్థల్లో 6,000 కంటే ఎక్కువ సంస్థలు ప్రస్తుతం పరిశుద్ధ ఇంధనం, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. భారత సెమీ కండక్టర్ల రంగం కూడా ఇప్పుడు ఊపందుకుంది. బయో-ఎకానమీ గురించి చెప్పాలంటే... దీని విలువ 2014లో 10 బిలియన్ డాలర్లుగా ఉండగా... ఇప్పుడు అది దాదాపు 140 బిలియన్ డాలర్లకు చేరింది.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాలుగా మేం అనేక సన్‌రైజ్ డొమైన్‌లలోకీ ప్రవేశించాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటం కంప్యూటింగ్, డీప్ సీ రీసెర్చ్, క్రిటికల్ మినరల్స్ వంటి అన్ని డొమైన్‌లలో భారత్ తన 'ఆశాజనకమైన ఉనికిని' నమోదు చేసింది.
మిత్రులారా,
సైన్స్ స్థాయి మరింత విస్తృతమైనప్పుడు, ఆవిష్కరణలు మరింత సమ్మిళితంగా మారినప్పుడు, సాంకేతికత పరివర్తనను సాధించినప్పుడు... పెద్ద విజయాలకు బలమైన పునాది సిద్ధమవుతుంది. గత 10–11 సంవత్సరాలుగా భారత ప్రయాణం ఈ దార్శనికతకు ఒక ఉదాహరణ. భారత్ ఇకపై సాంకేతికతకు వినియోగదారుగా ఉండకుండా... సాంకేతికత ద్వారా సాధించే పరివర్తనకు మార్గదర్శనం చేస్తుంది. కోవిడ్ కాలంలో మేం రికార్డు సమయంలోనే స్వదేశీ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశాం.
మిత్రులారా,
ఇంత భారీ స్థాయిలో విధానాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? భారత్‌లో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే మొట్టమొదటి, అత్యంత విజయవంతమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్నది భారత్‌లో మాత్రమే. మేం 2 లక్షల గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించాం. మొబైల్ డేటానూ అందరికీ సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చాం.
మిత్రులారా,
కాలం గడిచేకొద్దీ మన అంతరిక్ష కార్యక్రమాలు చంద్రుడు, అంగారకుడిని చేరుకున్నాయి. అదే సమయంలో మేం మన రైతులు, మత్స్యకారులను కూడా అంతరిక్ష కార్యక్రమాల ప్రయోజనాలను అందించాం. ఈ విజయాలన్నింటిలో మీరందరూ భాగస్వాములయ్యారు.
మిత్రులారా,
ఆవిష్కరణ సమ్మిళితంగా ఉన్నప్పుడు వాటి ప్రధాన లబ్ధిదారులు కూడా నాయకులుగా మారుతారు. దీనికి భారతదేశ మహిళలే గొప్ప ఉదాహరణ. మీరు గమనించండి.. ప్రపంచంలో ఎప్పుడు భారత అంతరిక్ష మిషన్ల గురించి చర్చ వచ్చినా భారత మహిళా శాస్త్రవేత్తల గురించి చాలా చర్చ జరుగుతుంది. పేటెంట్ దాఖలును తీసుకున్నట్లయితే.. దశాబ్దం క్రితం దేశంలో సంవత్సరానికి మహిళలు దాఖలు చేసే పేటెంట్ల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడది ఏడాదికి 5 వేలకు పైగా చేరింది. స్టెమ్ విద్యలో కూడా మహిళల వాటా సుమారు 43 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ. నేను ఒక అభివృద్ధి చెందిన దేశ శాస్త్ర సాంకేతిక మంత్రితో లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో మేం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు..  ఆయన నన్ను "భారతదేశంలో బాలికలు శాస్త్ర సాంకేతికత విద్యను అభ్యసిస్తారా?" అని అడిగారు. అంటే.. ఆయన దృష్టిలో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన దేశంలో ఈ విద్యనభ్యసించే వారి సంఖ్య చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. “భారతదేశ ఆడపిల్లలు” దీనిని నిరూపించారు. ఈ రోజు కూడా మన కుమార్తెలు, సోదరీమణులు ఎంత మంది ఇక్కడ ఉన్నారో నాకు కనిపిస్తోంది. దేశంలో మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత వేగంగా పురోగమిస్తున్నారో ఈ గణాంకాలు మనకు చెబుతున్నాయి.
మిత్రులారా,
తరతరాలకు ప్రేరణ ఇచ్చే క్షణాలు చరిత్రలో కొన్ని ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం మన పిల్లలు చంద్రయాన్ ప్రయాణాన్ని వీక్షించారు. దాని విజయాన్ని కూడా చూశారు. ఆ విజయం వారిని శాస్త్ర విజ్ఞానం వైపు పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ఒక కారణం, ఒక అవకాశంగా మారింది. వారు వైఫల్యాన్ని, విజయాన్ని రెండింటినీ చూశారు. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఇటీవలి అంతరిక్ష కేంద్ర సందర్శన.. పిల్లల్లో ఒక కొత్త ఉత్సుకతను రేకెత్తించింది. ఈ కొత్త తరంలో వచ్చిన ఈ ఉత్సుకతను మనం సద్వినియోగం చేసుకోవాలి.
మిత్రులారా,
మనం ఎంత ఎక్కువ మంది ప్రతిభావంతులైన యువకులను శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణల వైపు మళ్లించగలిగితే అంత మంచిది. ఇదే లక్ష్యంతో దేశవ్యాప్తంగా దాదాపు 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. ఈ ల్యాబ్‌లలో ఒక కోటి మందికి పైగా పిల్లలు ఉత్సుకత, సృజనాత్మకతతో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లు సాధించిన విజయాల దృష్ట్యా మరో 25 వేల కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలుసుకోవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. గత కొన్నేళ్లలో దేశంలో వందలాది కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏడు కొత్త ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు కూడా వచ్చాయి. కొత్త విద్యా విధానంలో యువత ఇప్పుడు శాస్త్ర సాంకేతికత వంటి స్టెమ్ కోర్సులను స్థానిక భాషల్లో చదువుకునేలా కూడా మేం చూసుకున్నాం.
మిత్రురాలా,
మా ప్రభుత్వం ఇస్తోన్న ప్రధానమంత్రి పరిశోధనా ఫెలోషిప్ యువ పరిశోధకులు మంచి విజయాలు సాధించేలా చేసింది. ఈ పథకం కింద అందించే నిధులు యువతకు ఎంతో సహాయపడ్డాయి. ఇప్పుడు రాబోయే ఐదేళ్లలో 10,000 ఫెలోషిప్‌లను మంజూరు చేయడం ద్వారా దేశంలో పరిశోధన- అభివృద్ధిని మరింత బలోపేతం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం.
మిత్రులారా,
శాస్త్ర సాంకేతికతకు ఉన్న పరివర్తనాత్మక శక్తిని మనం అర్థం చేసుకోవడం.. వాటిని నైతిక, సమ్మిళిత వనరులుగా చేయటం చాలా ముఖ్యం. ఉదాహరణకు కృత్రిమ మేధస్సును తీసుకొండి. ఈ రోజుల్లో ఏఐని రిటైల్ నుంచి రవాణా వరకు, వినియోగదారు సేవల నుంచి పిల్లల హోంవర్క్ వరకు ప్రతిచోటా ఉపయోగిస్తున్నారు. అందుకే దేశంలో ఏఐ శక్తిని సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడేలా చేస్తున్నాం. ఏఐ మిషన్‌లో భారత్‌ రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబడుతోంది.
మిత్రులారా,
నేడు నైతిక, మానవ-కేంద్రీకృత ఏఐ కోసం ప్రపంచ ఫ్రేమ్‌వర్క్‌ను భారతదేశం రూపొందిస్తోంది. రాబోయే ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఈ దిశలో ఒక ముందడుగుగా ఉంటుంది. ఆవిష్కరణ, భద్రత రెండింటినీ కలిపి అభివృద్ధి చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ సదస్సును భారత్‌ నిర్వహించినప్పుడు.. సమ్మిళిత, నైతిక, మానవ-కేంద్రీకృత ఏఐ దిశగా ప్రయత్నాలు కొత్త వేగాన్ని అందుకుంటాయి.
మిత్రులారా,
ఇప్పుడు మనం వర్థమాన రంగాల్లో రెట్టింపు శక్తితో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది అభివృద్ధి చెందిన భారత్‌ అనే లక్ష్యాన్ని సాధించేందుకు కూడా చాలా కీలకం. ఈ సందర్భంగా నేను మీతో కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. మనం కేవలం ఆహార భద్రత నుంచి ముందుకు వెళ్లి పోషకాహార భద్రతపై దృష్టి సారించాలి. పోషకాహార లోపంపై పోరాటంలో ప్రపంచానికి సహాయపడే తర్వాతి తరం బయో-ఫోర్టిఫైడ్ పంటలను మనం అభివృద్ధి చేయగలమా?  తక్కువ ధరలో నేల ఆరోగ్యాన్ని పెంచే సాధనాలు, రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ఉంటూ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బయో-ఎరువుల విషయంలో మనం ఇలాంటి ఆవిష్కరణలను తీసుకురాగలమా? వ్యక్తిగత వైద్యం, వ్యాధులను అంచనా వేసేందుకు భారత జన్యు వైవిధ్యాన్ని మనం మరింత మెరుగ్గా మ్యాప్ చేయగలమా? బ్యాటరీలు తదితరాల విషయంలో హరిత ఇంధన నిల్వకు సంబంధించిన కొత్త, అందుబాటు ధరలో ఆవిష్కరణలను మనం చేయగలమా? ప్రతి రంగంలోనూ ఏయే కీలక వనరుల కోసం మనం ప్రపంచ దేశాలపై ఆధారపడి ఉన్నామో గుర్తించి.. వాటిలో స్వావలంబన ఎలా సాధించవచ్చో చూడాలి.
మిత్రులారా,
శాస్త్ర సాంకేతిక ప్రపంచంతో సంబంధం ఉన్న మీరందరూ ఈ ప్రశ్నలను దాటి వెళ్లి కొత్త అవకాశాలను కనుగొంటారని నేను విశ్వసిస్తున్నాను. మీకు ఆలోచనలు ఉంటే.. నేను మీతో ఉంటాను. పరిశోధనలకు నిధులు అందించేందుకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ సదస్సులో ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సదస్సు భారతదేశ ఆవిష్కరణల ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు.

 

జై విజ్ఞాన్, జై అనుసంధాన్
 

ధన్యవాదాలు.

 

***


(Release ID: 2186107) Visitor Counter : 7