ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
రూ.14,260 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి
అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోన్న ఛత్తీస్‌గఢ్: ప్రధానమంత్రి
గిరిజన వర్గాల సహకారాన్ని ఎల్లప్పుడూ గర్వంగా జరుపుకునేలా చూసుకోవడమే మా నిరంతర ప్రయత్నం: ప్రధానమంత్రి
మన ఛత్తీస్‌గఢ్, మన దేశం మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదు: ప్రధానమంత్రి
Posted On:
01 NOV 2025 5:25PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నేడు నవ రాయ్‌పూర్‌లో జరిగిన ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ రజతోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు కాలాన్ని తాను పార్టీ కార్యకర్తగా చూశానని.. గత 25 సంవత్సరాల ప్రయాణానికి కూడా తాను సాక్షినని వ్యాఖ్యానించారు. ఈ గర్వించదగ్గ క్షణంలో భాగమవ్వడం చాలా భావోద్వేగాన్ని కలిగిస్తోందని అన్నారు.
‘‘ఇరవై అయిదు సంవత్సరాల క్రితం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం మీ కలల ఛత్తీస్‌గఢ్‌ను మీకు అప్పగించింది. అభివృద్ధిలో ఈ రాష్ట్రం కొత్త శిఖరాలను చేరుకోవాలనే సంకల్పంతో ఇది జరిగింది’’ అని శ్రీ మోదీ అన్నారు. గత 25 సంవత్సరాల ప్రయాణాన్ని తలుచుకుంటే గర్వంగా ఉందని, ప్రజల సహకారంతో ఛత్తీస్‌గఢ్ అనేక మైలురాళ్లను అధిగమించిందని ప్రశంసించారు. “ఇరవై అయిదు సంవత్సరాల క్రితం నాటిన విత్తనం నేడు అభివృద్ధి వృక్షంగా వికసించింది. ఛత్తీస్‌గఢ్ ప్రగతి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయంగా అభివర్ణిస్తూ.. రాష్ట్రానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించే అవకాశం తనకు లభించిందని తెలిపారు. ఇదే వేదికపై సుమారు రూ. 14,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
2000 సంవత్సరం నుంచి ఒక తరం పూర్తిగా మారిపోయిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అప్పట్లో గ్రామాలకు చేరుకోవడం ఒక సవాలుగా ఉండేదని, చాలా గ్రామాల్లో రోడ్లే ఉండేవి కాదని ఆయన గుర్తు చేశారు. కానీ నేటి కొత్త తరం యువతకు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ గ్రామాల్లో రోడ్డు వ్యవస్థ 40,000 కిలోమీటర్లకు విస్తరించిందని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో జాతీయ రహదారుల విస్తరణలో అపూర్వమైన పురోగతి సాధించామని, కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి చిహ్నాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. గతంలో రాయ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్‌కు ప్రయాణించడానికి గంటల సమయం పట్టేదని, కానీ ఇప్పుడు ఆ సమయం సగానికి తగ్గిందని ప్రదానమంత్రి శ్రీ మోదీ చెప్పారు. ఛత్తీస్‌గఢ్- జార్ఖండ్ మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచేలా కొత్త నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేసినట్లు ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్‌లో రైలు, విమాన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు విస్తృత కృషి జరిగిందని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. వందే భారత్ వంటి వేగమంతమైన రైళ్లు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నాయని, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జగదల్‌పూర్ వంటి నగరాలు నేడు నేరుగా విమాన సేవలతో అనుసంధానమయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రధానంగా ముడి పదార్థాల ఎగుమతికి ప్రసిద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్.. ఇప్పుడు పారిశ్రామిక రాష్ట్రంగా ఎదుగుతోందని అన్నారు. గత 25 సంవత్సరాల్లో రాష్ట్రం సాధించిన విజయాలకు ప్రతి ముఖ్యమంత్రిని, ప్రతి ప్రభుత్వాన్ని శ్రీ మోదీ అభినందించారు. క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని నడిపించిన డాక్టర్ రమణ్ సింగ్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ రమణ్ సింగ్ అసెంబ్లీ స్పీకర్‌గా భాధ్యతలు నిర్వర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. శ్రీ విష్ణు దేవ్ సాయి నేతృత్వంలోని ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు.
పేదరికాన్ని తాను దగ్గరగా చూశానని, పేదల బాధలు నిస్సహాయతను అర్థం చేసుకున్నానని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశం తనకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. పేదలకు ఆరోగ్యం, ఆదాయం, విద్య, సాగునీటి రంగాల్లో తమ ప్రభుత్వం విస్తృతంగా పనిచేసిందని తెలిపారు.
25 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో ఒకే ఒక వైద్య కళాశాల ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు, రాయ్‌పూర్‌లో ఎయిమ్స్ ఉన్నాయని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల స్థాపనకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన ప్రచారం ఛత్తీస్‌గఢ్ నుంచే మొదలైందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,500కి పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని తెలిపారు.
‘‘ప్రతి నిరుపేద పౌరుడు గౌరవంతో జీవించేలా చేయాలనేదే ప్రభుత్వం సంకల్పం’’ అని ప్రధానమంత్రి అన్నారు. మురికివాడల్లో, తాత్కాలిక నివసాల్లో జీవించడం పేదల్లో నిరాశను మరింత పెంచుతుందని, పేదరికంతో పోరాడాలనే సంకల్పాన్ని బలహీనపరుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందుకే ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహాన్ని కల్పించానే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధానమంత్రి తెలిపారు.
గత 11 ఏళ్లలో నాలుగు కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందదించామని, ప్రస్తుతం ప్రభుత్వం మరో మూడు కోట్ల కొత్త గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. నేడు రాష్ట్రంలో 3.5 లక్షల కుటుంబాలు తమ కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టాయని.. దాదాపు మూడు లక్షల కుటుంబాలకు రూ.1,200 కోట్ల నిధుల పంపిణీ జరిగిందని తెలిపారు. ఇది పేదల గృహ నిర్మాణం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని శ్రీ ప్రధాని అన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఏడు లక్షల పక్కా ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, ప్రతి ఇల్లు తమ కుటుంబం కలను నెరవేర్చి, వారి ఆనందానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ప్రజల జీవితాన్ని సులభతరం చేసేందుకు, వారి కష్టాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి విద్యుత్తు కనెక్షన్ ఉందని, గతంలో విద్యుత్ లేని ప్రాంతాలకు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం ఉందని చెప్పారు. ఒకప్పుడు సాధారణ కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్ ఒక సుదూర కల అని శ్రీ మోదీ గుర్తు చేశారు. నేడు ఛత్తీస్‌గఢ్‌లోని పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన వర్గాల గ్రామాలకు గ్యాస్ కనెక్షన్లు అందుతున్నాయని తెలిపారు. సిలిండర్లతో పాటు పైపులైన్ల ద్వారా సరసమైన గ్యాస్‌ను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నాగ్‌పూర్-ఝార్సుగూడ సహజ వాయు పైప్‌లైన్‌ను నేడు జాతికి అంకితం చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దక్కినందుకు ఛత్తీస్‌గఢ్ ప్రజలను అభినందించారు.
ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అతిపెద్ద గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. భారత వారసత్వానికి, అభివృద్ధికి గిరిజన సమాజం చేసిన అపార సేవలను దేశం, ప్రపంచం గుర్తించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధులకు మ్యూజియాలను ఏర్పాటు చేయడం, భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినంగా ప్రకటించడం వంటి చర్యలు ప్రభుత్వం గిరిజన సమాజ వారసత్వాన్ని గౌరవించేందుకు చేపట్టిన ప్రయత్నాలుగా పేర్కొన్నారు.
నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం ప్రారంభంతో ఈ దిశగా మరో కీలక అడుగు వేశామని ప్రధానమంత్రి తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు 150 సంవత్సరాలకు పైగా గిరిజన చరిత్రను ఈ మ్యూజియం ప్రదర్శిస్తుందని, గిరిజన సమాజం స్వాతంత్ర్య పోరాటంలో చేసిన సేవలు, త్యాగాలను వివరిస్తుందని చెప్పారు. ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
గిరిజన వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, వారి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఏకకాలంలో కృషి చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్.. దేశవ్యాప్తంగా వేలాది గిరిజన గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది రూ. 80,000 కోట్ల విలువైన ప్రాజెక్టని, స్వతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతాల కోసం చేపట్టిన అతి పెద్ద కార్యక్రమంగా అభివర్ణించారు. అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల అభివృద్ధి కోసం మొదటిసారిగా ఒక జాతీయ పథకాన్ని రూపొందించామని తెలిపారు. పీఎం-జన్‌మన్ పథకం ద్వారా వేలాది గిరిజన నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
గిరిజన సమాజాలు తరతరాలుగా అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వన్ ధన్ కేంద్రాలు స్థాపించడం ద్వారా వారికి అధిక ఆదాయానికి అవకాశాలను కల్పించిందని తెలిపారు. అలాగే టెండు ఆకుల కొనుగోలు కోసం మెరుగైన ఏర్పాట్ల వల్ల ఛత్తీస్‌గఢ్‌లో సేకరించేవారికి గణనీయంగా ఆదాయం లభించిందని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం సంకెళ్ల నుంచి విముక్తి పొందడంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నక్సలిజం కారణంగా గత 50, 55 సంవత్సరాలుగా ప్రజలు అనుభవించిన బాధలను మోదీ గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షకులమని నటిస్తూ.. సామాజిక న్యాయం పేరుతో మొసలి కన్నీళ్లు కారుస్తున్న వారిపై విమర్శలు గుప్పించారు. వారు తమ సొంత రాజకీయ లబ్ది కోసం దశాబ్దాలుగా ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలు సంవత్సరాల తరబడి రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు లేకుండా వెనుకబడి పోయాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారు సుఖంగా జీవిస్తూ.. ప్రజలను వారి దుర్గతికి వదిలేశారని శ్రీ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
తన గిరిజన సోదరులు, సోదరీమణులు హింసాకాండ ద్వారా నాశనం కావడానికి తాను అనుమతించలేనని, ఎంతోమంది తల్లులు తమ పిల్లల కోసం రోదించడాన్ని తాను భరించలేనని ప్రధానమంత్రి అన్నారు. 2014లో తనకు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు.. తమ ప్రభుత్వం దేశాన్ని మావోయిస్టు ఉగ్రవాదం నుంచి విముక్తి చేయాలని సంకల్పించిందని మోదీ వ్యాఖ్యానించారు. ఆనాటి సంకల్ప ఫలితాలు నేడు మొత్తం దేశంలో కనిపిస్తున్నాయన్నారు. 11 సంవత్సరాల క్రితం 125కి పైగా జిల్లాలు మావోయిస్టు ప్రభావంలో ఉండేవని, ఇప్పుడు కేవలం 3 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టు కార్యకలాపాల ఆనవాళ్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. ‘‘ఛత్తీస్‌గఢ్ మాత్రమే కాదు, మొత్తం దేశం మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఒకప్పుడు హింసా మార్గాన్ని ఎంచుకున్న చాలా మంది ఇప్పుడు వేగంగా లొంగిపోతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చెప్పారు. కొద్ది రోజుల క్రితం కాంకేర్‌లో ఇరవై మందికి పైగా నక్సలైట్లు, అక్టోబర్ 17న బస్తర్‌లో 200 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉగ్రవాదంతో సంబంధం ఉన్న డజన్ల కొద్దీ వ్యక్తులు ఆయుధాలు విడిచిపెట్టి సమాజంలో కలిసిపోయారని తెలిపారు. వీరిలో చాలా మంది లక్షల నుంచి కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఉన్నవారు ఉన్నారని అన్నారు. వీరంతా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్నారన్నారు.
మావోయిస్టు ఉగ్రవాద నిర్మూలనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు బాంబులు, తుపాకుల భయంతో వణికిన ప్రాంతాలు ఇప్పుడు మార్పు దిశగా సాగుతున్నాయని ఆయన అన్నారు. బీజాపూర్ జిల్లాలోని చిల్కపల్లి గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత తొలిసారి విద్యుత్ సరఫరా అందిందని, అబుజ్మద్‌లోని రేకవాయా గ్రామంలో స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా పాఠశాల నిర్మాణం ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి బలమైన స్థావరంగా భావించిన పువర్తీ గ్రామం ఇప్పుడు అభివృద్ధి పథంలో సాగుతోందని పేర్కొన్నారు. ఎర్ర జెండా స్థానంలో జాతీయ త్రివర్ణ పతాకం వచ్చిందని ఆయన గర్వంగా చెప్పారు. బస్తర్ వంటి ప్రాంతాలు నేడు వేడుకలతో నిండిపోయాయని బస్తర్ పాండుమ్, బస్తర్ ఒలింపిక్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆతిథ్యమిస్తోందని తెలిపారు.
నక్సలిజం సవాళ్ల మధ్య కూడా గత 25 సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్ ఎంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సవాలు పూర్తిగా తీరిన తర్వాత అభివృద్ధి వేగం ఇంకా పెరుగుతుందని, రాబోయే సంవత్సరాలు ఛత్తీస్‌గఢ్‌కు కీలకమని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలంటే ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి చెందడం చాలా అవసరమని చెప్పారు. రాష్ట్ర యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఇది మీ సమయం. మీరు సాధించలేని లక్ష్యం ఏదీ లేదు. మీ ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో ప్రభుత్వం తోడుగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి వారికి హామీ ఇచ్చారు. ‘‘మనమందరం కలిసి ఛత్తీస్‌గఢ్‌ను ముందుకు తీసుకెళ్దాం, మన దేశాన్ని మరింత ముందుకు నడిపిద్దాం, రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీలకునా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమేన్ డేకా, ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, కేంద్ర మంత్రులు శ్రీ జువాల్ ఓరం, శ్రీ దుర్గాదాస్ ఉయ్కే, శ్రీ టోకన్ సాహు తదితరులు హాజరయ్యారు.
నేపథ్యం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘‘ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవం’’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్యం, ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేసే లక్ష్యంతో, ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో 12 కొత్త “గ్రామ స్థాయి స్టార్టప్ వ్యాపార ప్రోత్సాహక కార్యక్రమం (స్టార్ట్-అప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ )” బ్లాకులను ప్రధానమంత్రి ప్రారంభించారు. 3.51 లక్షల పూర్తయిన ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 3 లక్షల లబ్ధిదారులకు విడతలవారీగా రూ.1,200 కోట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం, భద్రతను అందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
పతల్‌గావ్–కుంకురి నుంచి ఛత్తీస్‌గఢ్–జార్ఖండ్ సరిహద్దు వరకు నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారుల సంస్థ ద్వారా భారతమాల పరియోజన కింద సుమారు రూ.3,150 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యూహాత్మక మార్గం కొర్బా, రాయగఢ్, జశ్‌పూర్, రాంచీ, జంషెడ్‌పూర్‌లోని బొగ్గు గనులు, పారిశ్రామిక మండలాలు, ఉక్కు కర్మాగారాలను కలుపుతుంది. ఇది ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే మధ్య భారత్‌ను తూర్పుప్రాంతంతో అనుసంధానించే ప్రధాన ఆర్థిక ధమనిగా నిలుస్తుంది. దీని ద్వారా ప్రాంతీయ వాణిజ్య సంబంధాలు బలపడతాయి. రాష్ట్రంలో పరిశ్రమ, ఉపాధి, రవాణా రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
బస్తర్, నారాయణపూర్ జిల్లాలోని బహుళ విభాగాలను కలిపే ఎన్‌హెచ్–130డీ (నారాయణపూర్–కస్తూర్మేటా–కుటుల్–నీలాంగూర్–మహారాష్ట్ర సరిహద్దు) జాతీయ రహదారి నిర్మాణం, అభివృద్ధికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్‌హెచ్–130సీ (మదంగ్‌ముడా–దేవ్‌భోగ్–ఒడిశా సరిహద్దు) జాతీయ రహదారిని రెండు లైన్ల హైవేగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టును ప్రారంభించారు. వీటితో గిరిజన ప్రాంతాల్లో వాహన రాకపోకలు మెరుగుపడటంతో, ప్రజలకు ఆరోగ్య సేవలు, విద్య, మార్కెట్లకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.
విద్యుత్ రంగంలో ఇంటర్-రీజినల్ ఈఆర్–డబ్ల్యూఆర్ ఇంటర్‌కనెక్షన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు, పశ్చిమ విద్యుత్ గ్రిడ్‌ల మధ్య విద్యుత్ ప్రసార సామర్థ్యం 1,600 మెగావాట్ల వరకు పెరుగుతుంది. దీని ఫలితంగా గ్రిడ్ విశ్వసనీయత మెరుగవడమే కాకుండా మొత్తం ప్రాంతంలో స్థిరమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, ప్రసార సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా రూ. 3,750 కోట్లకు పైగా విలువైన బహుళ ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి అంకితం చేశారు.
పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) ద్వారా సుమారు రూ. 1,860 కోట్ల విలువైన పనులను ప్రధానమంత్రి అంకితం చేశారు. వీటిలో కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం, ఫీడర్ విభజన, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కండక్టర్ల మార్పు, లో-టెన్షన్ నెట్‌వర్క్ బలోపేతం వంటివి ఉన్నాయి. ఈ చర్యలు గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరాను మెరుగుపరచనున్నాయి. రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్, బెమెతారా, గరియాబంద్, బస్తర్ వంటి జిల్లాల్లో సుమారు రూ. 480 కోట్ల వ్యయంతో నిర్మించిన తొమ్మిది కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. స్థిరమైన వోల్టేజ్‌ను నిర్ధరించడం, అంతరాయాలను తగ్గించడం, మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా విశ్వసనీయ విద్యుత్‌ను అందించడం ద్వారా ఈ ఉపకేంద్రాలు 15 లక్షలకుపైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి. వీటితోపాటు సుమారు రూ.1,415 కోట్ల విలువైన కొత్త ఉపకేంద్రాలు, ప్రసార ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో కాంకేర్, బలోదబజార్–భటాపారా ప్రాంతాల్లో ప్రధాన సదుపాయాలు, పలు జిల్లాల్లో కొత్త ఆర్‌డీఎస్‌ఎస్ పనులు ఉన్నాయి. ఇవి ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిధి, నాణ్యత, స్థిరత్వాన్ని మరింతగా విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రాయ్‌పూర్‌లో రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అత్యాధునిక పెట్రోలియం ఆయిల్ డిపోను ప్రధానమంత్రి ప్రారంభించారు. దీనిని పెట్రోల్, డీజిల్, ఇథనాల్ కోసం 54,000 కిలోలీటర్ల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఈ డిపో ఛత్తీస్‌గఢ్, పొరుగు రాష్ట్రాల్లో నిరంతర ఇంధన సరఫరాను అందిస్తూ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇది 10,000 కిలోల ఇథనాల్ నిల్వ సామర్థ్యంతో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వచ్ఛమైన ఇంధన వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
దాదాపు రూ. 1,950 కోట్ల వ్యయంతో నిర్మించిన 489 కి.మీ పొడవైన నాగ్‌పూర్-ఝార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్‌ను ప్రధానమంత్రి అంకితం చేశారు. దేశ ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటాను 15 శాతానికి పెంచడంతోపాటు.. ‘‘ఒక దేశం, ఒక వాయు గ్రిడ్’’ లక్ష్యాన్ని సాధిండంలో కీలక ముందుడుగుగా నిలుస్తుంది. ఈ పైప్‌లైన్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని 11 జిల్లాలను జాతీయ గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానమవుతాయి. ఇది పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, ఈ ప్రాంతానికి స్వచ్ఛమైన, సరసమైన ఇంధనాన్ని అందిస్తుంది.
పరిశ్రమల అభివృద్ధి, ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రెండు స్మార్ట్ వ్యాపార సముదాయాల ఏర్పాటుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వాటిలో ఒకటి జంజ్‌గిర్-చంపా జిల్లాలోని సిలాదేహి-గట్వా-బిర్రాలోప్రాంతంలో.. మరొకటి రాజ్‌నందగావ్ జిల్లాలోని బిజ్‌లేతాలా ప్రాంతంలో నిర్మించనున్నారు. నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లోని సెక్టార్-22 వద్ద ఫార్మాస్యూటికల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ పార్క్ ఔషధ, ఆరోగ్య సంరక్షణ తయారీకి ప్రత్యేక పరిశ్రమల మండలంగా పనిచేయనుంది.
ఆరోగ్య సేవల రంగాన్ని బలోపేతం చేస్తూ అయిదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మనేంద్రగఢ్, కబీర్‌ధామ్, జంజ్‌గిర్-చంపా, గీడం (దంతేవాడ), బిలాస్‌పూర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆసుపత్రి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేయడ, ఆరోగ్య సేవలు విస్తరించడం, సాంప్రదాయ వైద్య విధానాలను (ఆయుర్వేదం) ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
****
(Release ID: 2185646)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam