ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులను జయించిన పిల్లలతో ప్రధానమంత్రి ముఖాముఖి


పిల్లల అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన ప్రధాని

యోగా, అలవాట్ల ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పిన ప్రధాని

భూమాతకు కృతజ్ఞతలు చెప్పేందుకు ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొనాలని పిల్లలను కోరిన ప్రధాని

Posted On: 01 NOV 2025 7:22PM by PIB Hyderabad

'దిల్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో జరిగిన ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుల నుంచి విజయవంతంగా కోలుకున్న 2500 మంది పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. 

ఒక యువ హాకీ ఛాంపియన్ అనుభవాన్ని పంచుకుంది. పాఠశాలలో చేసిన పరీక్షల్లో గుండె జబ్బు ఉన్నట్లు తెలియడానికి ముందే ఐదు పతకాలు గెలుచుకున్నట్లు ఆమె చెప్పింది. ఆరు నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపిన ఆమె.. ఇప్పుడు తిరిగి ఉత్సాహంగా హాకీ ఆడుతున్నట్లు తెలిపింది. ఆశయాల గురించి ప్రధానమంత్రి అడగ్గా.. డాక్టరునై పిల్లలందరికీ చికిత్స చేయాలని కోరుకుంటున్నట్లు బదులిచ్చింది. ప్రధానమంత్రి నవ్వుతూ పెద్దలకు కూడా వైద్యం చేస్తావా అని అడిగారు. దీనికి ఆమె ఆత్మవిశ్వాసంతో అవునని బదులిచ్చింది. ప్రధానమంత్రిని మొదటిసారి కలవడం పట్ల సంతోషంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. 

మరొక చిన్నారి తనకు శస్త్రచికిత్స సంవత్సరం క్రితం జరిగిందని తెలిపింది. డాక్టర్‌గా అందరికీ సేవ చేయాలనే ఆశయంతో ఉన్నట్లు చెప్పింది. చికిత్స సమయంలో ఏడవటం గురించి ప్రధానమంత్రి అడగగా.. ఏడవలేదని బదులిచ్చింది. అనంతరం ఆ చిన్నారి చెప్పిన స్ఫూర్తిదాయకమైన కవితను ప్రధానమంత్రి ప్రశంసించారు.

ఒక బాలుడు 2014లో కేవలం 14 నెలల వయసులోనే తనకు శస్త్రచికిత్స జరిగిందని చెప్పాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు, క్రికెట్ చురుకుగా ఆడుతున్నట్లు తెలిపాడు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు వెళ్తున్నవా? లేదా? అని ప్రధానమంత్రి అడగ్గా.. వెళ్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పాడు. దీనికి ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని దగ్గరగా కలవాలని కోరుకుంటున్నట్లు ఆ బాలుడు తెలపగా.. దీనికి ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. 

మరొక యువకుడితో మాట్లాడుతూ. ఆసుపత్రికి వెళ్లిన సమయంలో సూది మందు తీసుకున్నప్పుడు ఎలా అనిపిందని ప్రధానమంత్రి అడిగారు. దీనికి సమాధానంగా అతడు ఏమీ భయపడలేదని.. ఇదే త్వరగా కోలుకునేందుకు సహాయపడిందని అన్నాడు. అతడి గురించి ఉపాధ్యాయుల అభిప్రాయం ఏమిటని అడగ్గా.. చదువుల్లో తన ప్రతిభను వారు మెచ్చుకున్నారని చెప్పాడు. ఆ బాలుడి నిజాయితీని ప్రధానమంత్రి అభినందించారు.

మరొక చిన్నారి ఏడో తరగతి చదువుతున్నట్లు, ఉపాధ్యాయురాలిగా మారి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలన్న ఆశయంతో ఉన్నట్లు తెలిపింది. విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పింది. 

తదనంతరం ప్రధానమంత్రి ప్రస్తుతం ఎవరి శతజయంతి సంవత్సరం ప్రారంభమైందో తెలుసా అని అడిగి.. శ్రీ సత్యసాయి బాబా గారిది అని తెలిపారు. సత్యసాయి బాబా పుట్టపర్తి, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను పరిష్కరించారని, సుమారు 400 గ్రామాలకు తాగునీరు అందించారని వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. నీటి సంరక్షణ, మొక్కలు నాటటానికి ఉన్న ప్రాముఖ్యతను చెప్పారు. “తల్లి పేరు మీద ఒక చెట్టు” కార్యక్రమాన్ని వివరించిన ఆయన.. భూమాతతో పాటు సొంత మాతృమూర్తికి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని పిల్లలను కోరారు. 

ఫశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిక్ అనే చిన్నారి సొంత కలను ప్రధానితో పంచుకున్నాడు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆశయంతో ఉన్నట్లు తెలిపాడు. ఎందుకని ప్రధానమంత్రి అడగ్గా.. మన సైనికులు దేశాన్ని రక్షిస్తున్నట్లే దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నట్లు బదులిచ్చాడు. ఈ స్పూర్తిని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు.

ప్రధానమంత్రిని వార్తల్లో చూసి ఆయనను కలవాలనే కోరికతో చాలా కాలం నుంచి ఉన్నట్లు ఒక చిన్నారి తెలిపింది. ఈ కోరిక ఈ రోజు నెరవేరిందని, ఈ విషయంలో సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. 

పిల్లలతో మాట్లాడటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఏ మంచి పని చేయాలన్నా ఆరోగ్యకరమైన శరీరం చాలా అవసరమని అన్నారు. యోగా, క్రమశిక్షణతో కూడిన నిద్ర, అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారికి సలహా ఇచ్చారు. ఈ అలవాట్లను కొనసాగించాలని, సంపూర్ణ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. పిల్లలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ కార్యక్రమాన్ని ముగించారు. 

 

***


(Release ID: 2185491) Visitor Counter : 4