సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర కూడలి ‘టీ-హబ్‌’తో స్టార్టప్ యాక్సిలరేటర్ ‘వేవ్‌ఎక్స్’ భాగస్వామ్య ఒప్పందం


· దేశంలోని ‘మీడియా-టెక్’ పారిశ్రామికవేత్తల ఉజ్వల భవితకు రూపకల్పన లక్ష్యం

· టీ-హబ్ ప్రధాన సంస్థగా దేశీయ ‘ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌’ అంకురావరణ వ్యవస్థ బలోపేతానికి వేవ్‌ఎక్స్ ద్వారా దేశమంతటా 10 ఇన్నొవేషన్ హబ్‌ల ఏర్పాటు

· ఈ అవగాహన ఒప్పందంతో దేశంలోని ‘మీడియా-టెక్’ వ్యవస్థలో గల అంకురాలు.. సృష్టికర్తలు.. పెట్టుబడిదారుల అనుసంధానం సహా నవ్యావిష్కరణలకు వేదిక సిద్ధం

· ఇది దేశంలోని భావితరం సృష్టికర్తలు.. ఆవిష్కర్తలకు మార్గనిర్దేశం సహా ప్రపంచ మార్కెట్ సౌలభ్యం.. స్థాయిని పెంచగల వ్యవస్థకు సారథ్యం వహించే భాగస్వామ్యం

Posted On: 28 OCT 2025 7:44PM by PIB Hyderabad

కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టార్టప్ యాక్సిలరేటర్ ‘వేవ్‌ఎక్స్’ ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర కూడలి అయిన ‘టీ-హబ్’తో భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ సృజనాత్మక, కంటెంట్-మీడియా-టెక్నాలజీ రంగంలో అంకురావరణ వ్యవస్థకు ఉత్తేజమివ్వడం దీని లక్ష్యం.

సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతికత-ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ సహా ఆ శాఖలోని ఇతర అధికారుల సమక్షంలో ‘వేవ్‌ఎక్స్’, ‘టీ-హబ్’ ముఖ్య కార్యనిర్వహణాధికారులు అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ- దేశీయ ‘ఏవీజీసీ-ఎక్స్ఆర్’ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, అండ్‌ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగం వేగంగా పురోగమిస్తూ సృజనార్థిక వ్యవస్థకు ప్రధాన సారథిగా వృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఈ రంగంలో అంకుర సంస్థలు వర్ధిల్లేలా చూడటంతోపాటు మీడియా, వినోదం, తాదాత్మ్య సాంకేతికతల పరంగా సృష్టికర్తలకు సాధికారతనిచ్చే జాతీయ యాక్సిలరేటర్ వేదికగా ‘వేవ్‌ఎక్స్’ రూపొందిందని ఆయన వివరించారు.

అనంతరం శ్రీ సంజయ్‌ కుమార్‌ ప్రసంగిస్తూ- దేశవ్యాప్తంగా సృజనాత్మక రంగంలో పారిశ్రామికవేత్తల కోసం ఒక జాతీయావరణ వ్యవస్థను సృష్టించడంలో ‘వేవ్ఎక్స్’, ‘టి-హబ్’ భాగస్వామ్యం దోహదం చేస్తుందని చెప్పారు. యువ సృష్టికర్తలు వ్యక్తిగతంగా పాలుపంచుకునే స్థాయి నుంచి వ్యవస్థీకృత వ్యాపార సంస్థల స్థాపకులుగా రూపొందడంలో ఇది తనవంతు పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. తద్వారా వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయూతనిస్తుందని పేర్కొన్నారు.

దేశంలోని అంకుర సంస్థలకు నిర్మాణాత్మక సంపోషణ (ఇంక్యుబేషన్), మార్గదర్శకత్వం, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నెట్‌వర్క్‌ సౌలభ్య కల్పన ద్వారా ప్రయోజనం చేకూర్చడం ఈ భాగస్వామ్య లక్ష్యం. ఈ మేరకు టీ-హబ్ ప్రధాన సంస్థగా సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని  ‘వేవ్‌ఎక్స్’ దేశమంతటా 10 ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దేశీయ ‘ఏవీజీసీ-ఎక్స్ఆర్’ అంకురావరణ వ్యవస్థలోని సంస్థలు, సృష్టికర్తలకు ఇవి నవ్యావిష్కరణ కూడళ్లుగా తోడ్పాటునిస్తాయి.

వేవ్ఎక్స్

దేశీయ మీడియా-వినోద రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ స్టార్టప్ యాక్సిలరేటర్ వేదికగా ‘వేవ్ఎక్స్’ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2025 మే  నెలలో ముంబయిలో నిర్వహించిన ‘వేవ్స్’ శిఖరాగ్ర సదస్సులో 100కుపైగా వర్ధమాన అంకుర సంస్థలకు ప్రతిభా ప్రదర్శన, నెట్‌వర్కింగ్ అవకాశాలను ‘వేవ్ఎక్స్’ సమకూర్చింది. తదనుగుణంగా ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ అగ్రగాములతో ప్రత్యక్ష భాగస్వామ్యానికి వీలు కల్పించింది. అంతేకాకుండా లక్ష్యనిర్దేశిత హ్యాకథాన్‌ల నిర్వహణ సహా ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్ సౌలభ్య కల్పనతోపాటు జాతీయ వేదికలతో అనుసంధానం ద్వారా ప్రగతిశీల భావనలకు ‘వేవ్ఎక్స్’ చేయూతనిస్తోంది.

టీ-హబ్‌

తెలంగాణలోగల ‘టీ-హబ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర సంస్థల కూడలి. నిర్దిష్ట కార్యక్రమాలు, మార్కెట్ సౌలభ్యం, నిధుల సమీకరణ అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన వగైరాల ద్వారా 2,000కు పైగా అంకుర సంస్థలకు ఇది మద్దతిస్తోంది. అలాగే ‘ఏఐసీ’ (అటల్ ఇంక్యుబేషన్ సెంటర్), ‘మ్యాథ్‌’ (మెషీన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్) వంటి ఆతిథ్య, సంపోషక సంస్థలు సహా ‘ఐడెక్స్‌’ (ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్) వంటి కార్యక్రమాలకు చేయూతనిచ్చే సంపోషక సంస్థల ప్రధాన ఇంక్యుబేటర్‌గానూ ‘టీ-హబ్’ విశేష పాత్ర పోషిస్తోంది.

 

***


(Release ID: 2183595) Visitor Counter : 12