ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబరు 29న ముంబయిలో పర్యటించనున్న ప్రధానమంత్రి
ఇండియా మారిటైమ్ వీక్-2025లో భాగంగా మారిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి.. గ్లోబల్ మారిటైమ్ సీఈఓ ఫోరానికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
నీలి ఆర్థిక వ్యవస్థలలో అగ్రగామిగా, ప్రపంచ నౌకా వాణిజ్య కూడలిగా ఎదగాలన్న భారత్ వ్యూహాత్మక దృష్టికోణాన్ని
చాటనున్న ఇండియా మారిటైమ్ వీక్-2025
ఇండియా మారిటైమ్ వీక్-2025లో 85 కన్నా ఎక్కువ దేశాల భాగస్వామ్యం.. పాల్గొననున్న 1,00,000 మందికి పైగా ప్రతినిధులు.. 350 కన్నా ఎక్కువ మంది అంతర్జాతీయ వక్తలు
Posted On:
27 OCT 2025 10:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న సాయంత్రం ముంబయిలో పర్యటించనున్నారు. ముంబయిలోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇండియా మారిటైమ్ వీక్-2025లో సుమారు 4 గంటల వేళకు ఆయన మారిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గ్లోబల్ మారిటైమ్ సీఈఓ ఫోరానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు.
ఇండియా మారిటైమ్ వీక్-2025లో ప్రధాన కార్యక్రమమే ‘గ్లోబల్ మారిటైమ్ సీఈఓ ఫోరమ్’. ఈ కార్యక్రమంలో ప్రపంచ నౌకావాణిజ్య కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, ప్రముఖ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, నూతన ఆవిష్కర్తలతో పాటు అంతర్జాతీయ భాగస్వాములు కలిసి ప్రపంచ నౌకావాణిజ్య సంబంధిత వ్యవస్థ భవిష్యత్తుపై చర్చిస్తారు. దీర్ఘకాల ప్రాతిపదికన నౌకావాణిజ్యాభివృద్ధి, సుదృఢ సరఫరా వ్యవస్థ, పర్యావరణానుకూల నౌకారవాణా, అన్ని దేశాలనూ కలుపుకొనిపోయే నీలి ఆర్థిక వ్యవస్థ సంబంధిత వ్యూహాలపై చర్చకు ఈ ఫోరం ఓ ప్రధాన వేదికలా పని చేస్తుంది.
నౌకా వాణిజ్యానికి సంబంధించిన అమృత కాల దార్శనికత-2047కు అనుగుణంగా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నౌకా వాణిజ్యంలో తీసుకోదగిన మార్పుల పట్ల ప్రధానమంత్రికి గల తిరుగులేని నిబద్ధతే ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడానికి కారణం. ఈ దీర్ఘకాలిక దృష్టికోణం నాలుగు వ్యూహాత్మక అంశాలపై ఆధారపడింది. ఆ అంశాల్లో.. ఓడరేవులకు ప్రధాన పాత్రను కల్పిస్తూ అభివృద్ధి మార్గంలో దూసుకుపోవడం, నౌకా రవాణాతో పాటు నౌకానిర్మాణానికి పెద్దపీట వేయడం, నిరంతరాయ ఆధునిక వస్తు రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుకోవడం, నౌకావాణిజ్యం విషయంలో నైపుణ్యాలను పెంచుకోవడం.. భాగంగా ఉన్నాయి. ప్రపంచంలో నౌకావాణిజ్య రంగంలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలబెట్టడం ఈ కార్యక్రమం ధ్యేయం. ఈ దృష్టికోణాన్ని చురుకుగా ఆచరణలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రముఖ గ్లోబల్ వేదికగా ఇండియా మారిటైమ్ వీక్-2025 (ఐఎండబ్ల్యూ)ను నిర్వహించాలని సంకల్పించారు. ఈ వేదిక నౌకారవాణా, ఓడరేవులు, నౌకా నిర్మాణం, నౌకా విహార యాత్రల నిర్వహణ, నీలి ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించడం వంటి రంగాల్లో ఆసక్తిదారులు కలిసి చర్చించుకొనేందుకు అవకాశాన్ని అందిస్తోంది.
నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఐఎండబ్ల్యూలో ‘‘మహా సాగరాల ఏకీకరణ, ఒకే నౌకావాణిజ్య దృష్టికోణం’’ అంశం ఇతివృత్తంగా ఉంది. ప్రపంచ నౌకావాణిజ్య కూడలిగా, నీలి ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్ నిలిచేందుకు సిద్ధం చేసిన వ్యూహాత్మక మార్గదర్శకాలను ఐఎండబ్ల్యూలో ఆవిష్కరిస్తారు. ఐఎండబ్ల్యూ-2025లో 85 కన్నా ఎక్కువ దేశాలు భాగం పంచుకొంటున్నాయి. ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా ప్రతినిధులతో పాటు 350 కన్నా ఎక్కువ మంది అంతర్జాతీయ వక్తలు కూడా పాల్గొంటున్నారు.
***
(Release ID: 2183447)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam